పది రోజులుగా ప్రసూతి విభాగంలోనే మకాం
పక్కా ప్రణాళికతో మగ శిశువు అపహరణ
సెక్యూరిటీ వైఫల్యంపై రాజకీయ పక్షాల మండిపాటు
సబ్‌కలెక్టర్‌ను ఘెరావ్ చేసిన మహిళా సంఘాలు
ఐదు గంటల పాటు ఆస్పత్రిలోనే బైఠాయించిన వంగవీటి రాధాకృష్ణ
ఆస్పత్రి సిబ్బందిని ‘బావ..’ అని పిలుస్తూ పరిచయం చేసుకుంది.. అప్పుడే పుట్టిన చిన్నారులను ముద్దాడుతూ పండంటి బిడ్డ పుట్టాడనే పొగడ్తలతో రోగులకు దగ్గరైంది.. ఇలా పది రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటూ తన మాయమాటలతో సిబ్బంది, రోగులను పరిచయం చేసుకుంది.. అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ పరిశీలించింది. అదును చూసి ప్రజలు, సందర్శకుల నిషేధిత ప్రాంతమైన ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న చిన్నారిని అందరి కళ్లుగప్పి అపహరించుకుపోయింది.. 30 నుంచి 35 ఏళ్ల వయసున్న ఆ మహిళ ఎవరనే దానిపై ఇప్పుడు పోలీసులతో పాటు అందరూ దృష్టి సారించారు.
విజయవాడ (లబ్బీపేట) : విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలోని పోతిన వారి వీధికి చెందిన ఐతా సుబ్రహ్మణ్యం, కళ్యాణి దంపతుల ఐదు రోజుల మగ శిశువు అపహరణ పక్కా ప్లాన్‌తో జరిగినట్లు ప్రభుత్వాస్పత్రి సిబ్బందే చెపుతున్నారు. అప్పుడే శిశువుకు పాలు పట్టించి, టిఫిన్ చేసేందుకు వెళ్లిన కళ్యాణిని గమనించిన ఆ కిలాడీ లేడీ అదును చూసి శిశువును అపహరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఎస్‌ఎన్‌సీయూ వద్ద సెక్యూరిటీ గార్డు కూడా లేడని సమాచారం. టిఫిన్ చేసి పది నిమిషాల్లో ఎన్‌ఐసీయూలోకి వెళ్లిన కళ్యాణికి తన బిడ్డ కనిపించలేదు.
నిషేధిత ప్రాంతంలో అపహరణ ఎలా...
ప్రత్యేక నవజాత శిశు చికిత్సా విభాగం నిషేధిత ప్రాంతంగా ఉంది. అక్కడ శిశువులకు చికిత్స చేసే వైద్యులు, సిబ్బంది మినహా ఇతరులను అనుమతించారు. రోజులో ఒక్కసారి మాత్రమే తల్లిని అనుమతిస్తారు. అలాంటి వార్డులో శిశువు అపహరణకు గురవడాన్ని పలు రాజకీయ పక్షాలకు చెందిన ప్రతినిధులతో పాటు, సబ్‌కలెక్టర్ కూడా తప్పుబట్టారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వాస్పత్రిలో భద్రత ఎలా ఉందో అర్థమవుతుందని ఆరోపిస్తున్నారు.
సబ్ కలెక్టర్ ఘెరావ్
ప్రభుత్వాస్పత్రిలో ఘటన జరిగిన వెంటనే ప్రాథమిక విచారణకు వచ్చిన సబ్‌కలెక్టర్‌ను మహిళా సంఘాలు ఘెరావ్ చేశాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సృజన వారితో మాట్లాడుతూ అపహరణకు గురైన బిడ్డను తిరిగి అప్పగిస్తామని, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సిబ్బందిని విచారించిన పోలీసులు
శిశువు అపహరణకు గురైన సమయంలో ఎస్‌ఎన్‌సీయూలో ఉన్న సిబ్బందితో పాటు, సెక్యురిటీ గార్డులను పోలీసులు ఆస్పత్రిలోనే విచారించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎన్‌సీయూ వద్ద ఉన్న సెక్యురిటీ గార్డులో ఆ కిలాడీ లేడీ సన్నిహితంగా ఉండేదని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శిశువు తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ ఆచూకీ ఎప్పటికి లభిస్తుందా అని ఎదురు చూస్తూ ఆస్పత్రిలోనే ఉండిపోయారు. తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో తమ బిడ్డ ఆచూకీ చెప్పండంటూ కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేస్తోంది. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ సుబ్బారావు ఆస్పత్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : పూనం మాలకొండయ్య
ప్రభుత్వాస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో శిశువు అపహరణ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పూనమ్ మాలకొండయ్య అన్నారు. ఆమె గురువారం రాత్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చి శిశువు తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్లు పేర్కొన్నారు. బిడ్డ క్లూ తమకు దొరికిందని ఆమె వివరించారు.
ఎవరా లేడీ కిలాడీ!
Published Fri, Jul 15 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM
Advertisement