రైలులో ఓ మగశిశువు లభ్యమైంది. ఈ సంఘటన సోమవారం ఘట్‌కేసర్‌లో వెలుగుచూసింది.
ఘట్‌కేసర్: రైలులో ఓ మగశిశువు లభ్యమైంది. ఈ సంఘటన సోమవారం ఘట్‌కేసర్‌లో వెలుగుచూసింది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి కాచిగూడ నుంచి తెనాలి-కాచిగూడ ప్యాసింజర్ తెనాలికి బయలుదేరింది. 11 గంటల సమయంలో ఓ బోగీలోని బాత్రూమ్ సమీపంలో సంచిలోంచి శిశువు రోదనలు వినిపించాయి. రైలు చర్లపల్లి దాటిన తర్వాత ప్రయాణికులు గమనించారు. సంచిలో చూడగా దుస్తువులో చుట్టి ఓ మగశిశువు ఉన్నాడు.
అప్పటికే రైలు ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు రైలు చైన్ లాగి స్టేషన్ మాస్టర్‌కు విషయం తెలిపారు. స్టేషన్‌మాస్టర్ సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. శిశువును వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ అస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
పసికందు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. శిశువు జన్మించి దాదాపు 15 రోజులు అవుతుండొచ్చని డాక్టర్లు పేర్కొన్నారు. అనంతరం 108 సిబ్బంది ఈఎమ్‌టీ నాగరాజ్, పెలైట్ బద్రూలు పసికందును తీసుకెళ్లి యూసుఫ్‌గూలోని శిశువిహార్‌లో పసికందును అప్పగించారు. ఏతల్లి కన్న బిడ్డో.. ఇలా కర్కషంగా పడేసి వెళ్లారని ప్రయాణికులు శాపనార్థాలు పెట్టారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా శిశువును రైలులో వదిలేసి వెళ్లిపోయారని స్థానికులు చెప్పారు.