కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్‌కేసర్‌ కేసులో విస్తుపోయే విషయాలు | Ex MPTC Gaddam Mahesh Brutally Murdered | Sakshi
Sakshi News home page

కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్‌కేసర్‌ కేసులో విస్తుపోయే విషయాలు

Published Tue, Jun 25 2024 7:11 AM | Last Updated on Tue, Jun 25 2024 7:40 AM

Ex MPTC Gaddam Mahesh Brutally Murdered

కళ్లల్లో కారంపొడి చల్లి కర్రలతో దాడి 

జేసీబీతో డంపింగ్‌ యార్డులో మృతదేహం పూడ్చివేత  

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు  

నిందితుల ఇళ్లపై బాధితుల రాళ్ల దాడి 

మేడ్చల్ జిల్లా: ఘట్‌కేసర్‌లో ఈ నెల 15న అదృశ్యమైన కాంగ్రెస్‌ నేత, ఘట్‌కేసర్‌ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్‌(45) హత్యకు గురయ్యాడు. ప్లాటు వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయతిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేశ్‌ను దారుణంగా హత్య చేసి డంపింగ్‌ యార్డులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన వివరాలను సీఐ సైదులు సోమవారం వెల్లడించారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన గడ్డం మహేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. 

కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,(36), కడుపొల్ల ప్రవీణ్‌(27)తో ప్లాటు విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌పై మహేశ్‌ క్రిమినల్‌ కేసు పెట్టాడు. దీంతో అతడిని చంపాలని ప్రవీణ్‌ను శ్రీనివాస్‌ సంప్రదించాడు. మహేశ్‌ తమ బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్‌ ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు.  

రాజీ చేసుకుందామని పిలిచి అంతమొందించారు.... 
ఘట్‌కేసర్‌ పట్టణంలోని బైపాస్‌ రోడ్డు వద్ద గల మహేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంలో ఈ నెల 14 రాత్రి రాజీ చేసుకుందామని చెప్పి ఆఫీసుకు రావాలని కోరారు. అందుబాటులో లేనని మహేశ్‌ చెప్పడంతో తిరిగి 15న ఉదయం రావాలని కోరారు. మహేశ్‌ తన ఆఫీసుకు చేరుకోగానే కళ్లల్లో కారం పొడి చల్లి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆఫీస్‌ షెటర్‌ మూసి వెళ్లిపోయారు. రాత్రివేళ మహేశ్‌ కారులోనే అతడి శవాన్ని శ్రీరాములు, రాజు అనే వ్యక్తుల సాయంతో కొండాపూర్‌ డంపింగ్‌ యార్డుకు తరలించి జేసీబీతో పూడ్చిపెట్టారు. 

అందుకు జేసీబీ ఓనర్‌ నరేశ్, డ్రైవర్‌ సోహాన్‌ కూడా సహకరించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా మహేశ్‌ కనిపించకపోవడంతో అతడి సోదరుడు విఠల్‌ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్, నరేశ్, సోహాన్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చడానికి సహకరించిన ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన శ్రీరాములు, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాజు పరారీలో ఉన్నారు. 

సోమవారం నాయబ్‌ తహసీల్దార్‌ సందీప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో శవ పంచనామా, గాంధీ ఆస్పత్రి వైద్యాధికారి మహేందర్‌రెడ్డి బృందం పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుడి బంధువులు నిందితుడు ప్రవీణ్‌ ఇంటిపై రాళ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని మహేశ్‌కు సంబంధించిన కారు, ఇతర వివరాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement