breaking news
Medchal Malkajgiri District News
-
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో యథేచ్ఛగా భూ దందా
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూ దందా యథేచ్ఛగా సాగుతోంది. కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు, రాజకీయ పెద్దలే దళారులుగా మారి అందినకాడికి దోచుకుంటున్నారు. చిన్న స్థలంలో పేదలు గుడిసె వేసుకుంటేనే నానా హంగామా చేసే అధికారులు.. ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో మాత్రం నిసిగ్గుగా వహిస్తున్నారు. బడాబాబులు, రాజకీయ నేతల అనుచరులు ఏకంగా ఎకరాల కొద్దీ భూములు ఆక్రమిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా అధికారి అడ్డుకుంటే నాయకులే వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూముల పరిస్థితి. జిల్లాలో అధికారులు ప్రైవేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టటం.. వారి వెంచర్ల కోసం ప్రభుత్వ, అసైన్డ్ భూములు, చెరువు, కుంటల బఫర్ జోన్, శిఖం భూములను ఫణంగా పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై అధికార యంత్రాంగ ఉదాసీనత భూ కబ్జాదారులకు వరంగా మారుతోంది.దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో బౌరంపేట రెవెన్యూలో సిల్వర్ ఓక్స్ స్కూల్ నుంచి ప్రైవేట్ పట్టా ,అసైన్డ్ భూములలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆదేశాలను లెక్క చేయకుండా ప్రైవేటు వెంచర్ కోసం ప్రభుత్వ నిధులతో రోడ్డు వెడల్పు పనులు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు రోడ్డులో ప్రైవేట్ ,అసైన్డ్ భూములను కలిగి ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించడంతో పాటు రోడ్డు పనులకు అయ్యే వ్యయాన్ని వెంచర్ నిర్వాహకులే భరించేలా దళారులు ఒప్పందం కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత బిల్లులను సంబంధిత అధికారులు డ్రా చేసుకునేలా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించినట్లు సమాచారం. బండ్ల బాట విస్తరణ.. బౌరంపేట సర్వే నంబరు 166లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సిల్వర్ ఓక్స్ స్కూల్ నుంచి గతంలో బండ్ల బాట ఉండేది. ఈ రోడ్డు సిల్వర్ ఓక్స్ స్కూల్ నుంచి కుడి వైపు వెళ్లే దారిలో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో (HMDA Master Plan) 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన ఉంది. కానీ ఎడమ వైపు వ్యవసాయ పొలాలకు వెళ్లే బండ్ల బాటను మాస్టర్ ప్లాన్‌లో ఉన్నట్లుగా చూపించి 40 ఫీట్ల రోడ్డు వేస్తున్నారు. దాదాపు అరకిలో మీటరు పైగా రోడ్డు పనుల కోసం ఇరు వైపులా ఉన్న చెట్లను తొలగించారు.నిర్మాణ సంస్థ కోసమేనా..రోడ్డు వేస్తే మంచిదేనని కొందరు వాదిస్తుండగా.. దాని వెనుక ఓ పెద్ద మతలబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రోడ్డులో కొంత భాగం పట్టా భూమి, మరి కొంత అసైన్డ్ భూమి ఉంది. ఈ రోడ్డు ద్వారానే ఓ బడా నిర్మాణ సంస్థ రైతుల నుంచి సుమారు 50 ఎకరాలు కొనుగోలు చేసి వెంచర్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సదరు నిర్మాణ సంస్థ హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందటానికి 40 ఫీట్ల రోడ్డును చూపించాల్సి ఉండటంతో ప్రభుత్వ స్థలం నుంచి రోడ్డు వేసేలా సంబంధిత అధికారులతో బేరం కుదుర్చున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.కలెక్టర్‌కు ఫిర్యాదు.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేట్ వెంచర్ కోసం, పంట పొలాలు, ప్రభుత్వ భూముల నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంపై విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల కలెక్టరేట్ ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్ మల్కాజిగిరి ఆర్గీఓను విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన ఆర్డీఓ సదరు స్థలం పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)కు కేటాయించినట్లుగా పేర్కొంటూ జిల్లా అధికార యంత్రాంగానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పురపాలికల్లో ఆక్రమణలు ఇలా..పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెములలోని సర్వే నెం.739 నుంచి 749 వరకూ 147 ఎకరాల్లో 1985లో ఏకశిలానగర్ పేరుతో లే ఔట్ చేశారు. అందులోని 47 ఎకరాలను 2006లో వ్యవసాయ భూమిగా మార్చేసిన ఓ వ్యక్తి లే ఔట్ స్వరూపాన్నే మార్చారని ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇదే లే ఔట్లో రెండు బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంతమేర కబ్జా చేశారని పేర్కొన్నారు. అన్నోజిగూడలోని సర్వే నెంబర్లు 9,10లోని పదెక రాల లే ఔట్లో ఎకరం విస్తీర్ణంలో ఉన్న పార్కును ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అన్నోజిగూడ సర్వే నెంబర్ 14లో రెండెకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి విక్రయించగా, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి వదలివేశారు.దమ్మాయిగూడ మున్సిపాలిటీ, కీసరలోని సర్వేనంబర్ 131లో 105.26 ఎకరాల ఫారెస్టు భూమి ఉండగా, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 2 ఎకరాల స్థలంలో బండరాళ్లను పగులగొట్టి స్థలాన్ని చదును చేసి, భవన నిర్మాణ పనులు పారంభించారు. చీర్యాల గ్రామంలోని సర్వేనంబర్ 7,8లలో 12.5 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారు. ఇదే రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 152/2లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి విక్రయించారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని అల్వాల్ మండలం జొన్న బండలోని వజ్ర ఎన్ క్లేవ్లో 900 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని, దీంతో 236 ప్లాట్లకు పార్కు లేకుండా అవుతోందని స్థానికులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రా సర్కిల్ పరిధిలోని సర్వేనంబర్199/1 జమ్మిగడ్డలోని స్టేడియానికి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఫ్లాట్లు చేసి ఇళ్లు నిర్మించి, విక్రయిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. -
అసెస్మెంట్ లెక్కింపులో తప్పిదాలు
సాక్షి, హైదరాబాద్: టౌన్ ప్లానింగ్ కాదు, అది అవినీతి ప్లానింగ్.. అక్రమ నిర్మాణాలకు అడ్డులేదు.. సిబ్బంది చేతివాటానికి అదుపులేదు.. ప్రభుత్వం పురపాలికల్లో టీజీ–బీపాస్ (TG-bPASS) అమల్లోకి తెచ్చినా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇంటి నిర్మాణాలు, స్థలమార్పిడి కోసం ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించకుండానే అధికారులు అనుమతులిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఏడు పురపాలక సంఘాల్లో విలీనమైన పంచాయతీల్లోని నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార వాణిజ్య సదుపాయాలకు సంబంధించిన కట్టడాల్లో అక్రమాలకు అంతులేదనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తద్వారా ఆస్తిపన్ను అసెస్మెంట్ లెక్కింపులో తప్పిదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని 16 పుర పాలికల్లో జనవరి నుంచి ఇప్పటి వరకు 6,947 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ పురపాలక సంఘంలోనూ నెలకు 20 నుంచి 45 ఇంటి నిర్మాణాలు, స్థలమార్పిడి కోసం దరఖాస్తులు వస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కనుసన్నల్లో... గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఉండే దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించేవారు. అయితే బీపాస్ ద్వారా అన్ని దరఖాస్తులు సులువుగా పరిష్కారం అవుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెస్మెంట్ లెక్కింపులో కొందరు ఉద్యోగులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించని ఇళ్లకూ కొందరు పర్యవేక్షణాధికారులు ఆమోదం తెలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. భారీ భవనాలు, వాణిజ్య సముదాయాలకు కొలతలు తక్కువ చేసి అనుమతులు మంజూరు చేస్తున్నారనే వాదనలు వినవస్తున్నాయి.పురపాలక సంఘాల్లోని పలు కాలనీల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య కేంద్రాల భవనాలకు కూడా రెసిడెన్షియల్ అసెస్మెంట్ చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రధానంగా పీర్జాదిగూడ, బోడుప్పల్, నిజాంపేట, జవహర్‌నగర్, కొంపెల్లి, దుండిగల్, దమ్మాయిగూడ, నాగారం (Nagaram), తూముకుంట, మేడ్చల్, పోచారం, ఎల్లంపేట్, అలియాబాద్, ఎంసీ పల్లి, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి పురపాలక సంఘాల్లో ఇష్టారీతిన ఆక్రమణల పరంపర కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.చేతివాటం ప్రదర్శిస్తున్న పుర సిబ్బంది... 75 నుంచి 120 గజాల్లోపు ఇళ్ల పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ వ్యవహారాన్ని పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షించాలి. ఆ తర్వాత ఇంటి కొలతల ఆధారంగా అసెస్మెంట్ లెక్కింపునకు యజమానులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్ వదలాలి. నిర్దేశించిన కొలతల ఆధారంగా ఇళ్ల నిర్మాణాలు జరగాలి. భవన నిర్మాణదారులు అవేమీ పట్టించుకోకుండా ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా..జిల్లాలో నాలుగు పురపాలక సంఘాలకు ఒక టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినా సరిపడా ఉద్యోగులను నియమించలేదు. కనీసంగా మంజూరు పోస్టులు భర్తీ చేయలేకపోతోంది. దీంతో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది పైనే అదనపు భారం పడుతోంది. నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ టీపీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్ మేడ్చల్ జిల్లాలోని తూముకుంట, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్ (Aliabad) మున్సిపాలిటీలకు ఇన్చార్జ్ టీపీఓగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: నిన్న గాజుల రామారం.. రేపు బోరబండఒక్కరే ఐదు మున్సిపాలిటీల్లో టీపీఓగా పనిచేయటం వల్ల, దేనికి న్యాయం చేయలేకపోతున్నారు. జిల్లాలోని మిగతా 15 పురపాలక సంఘాల్లో కూడా ఇదే విధానం ఉంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని స్థానికులు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పురపాలక సంఘాల్లో పెరుగుతున్న అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడకుండా జిల్లా అదనపు కలెక్టర్(లోకల్‌బాడీ) ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తప్పిదాలపై.. పురపాలికల్లో అసెస్మెంట్ లెక్కింపులో తప్పిదాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. బీపాస్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని టీపీఓలకు సూచిస్తున్నామని.. చెబుతున్నప్పటికీ, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా ఉంది. అన్నీ సక్రమంగా ఉంటేనే భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే పురపాలక చట్టం ప్రకారం సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పలువురు పుర కమిషనర్లు పేర్కొంటున్నారు. -
Malkajgiri: మిగిలేది మూడే!
మేడ్చల్: హైదరాబాద్ మహనగర విస్తరణలో భాగంగా మేడ్చల్ జిల్లాలో స్థానిక సంస్థలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. మేడ్చల్ జిల్లా దేశంలోనే విభిన్న జిల్లాగా ఉండేది. ప్రస్తుతం మారుతున్న సమీకరణాలతో జిల్లా స్వరూపం మొత్తంగా మారనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ మహానగర విస్తరణ చేయాలనే ఆలోచనలు చేయడంతో హైదరాబాద్‌కు శివారులో ఉన్న మేడ్చల్–మల్కాజ్గిరిజిల్లా రూపురేఖలు మారుతున్నాయి.3 మినహా.. అంతా జీహెచ్ఎంసీనే.. ప్రభుత్వం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న మూడు నూతన మున్సిపాలిటీలను నూతనంగా ఏర్పాటు చేసి, 61 గ్రామాల్లో మిగిలిన గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశాయి. తాజాగా ప్రభుత్వం నూతన మున్సిపాలిటీలలో వార్డుల విభజనపై దృష్టి పెట్టగా.. విలీన గ్రామాలపై ఎలాంటి విభజన చేయడం లేదు. మున్సిపాలిటీలలో గ్రామాలు ఇప్పటికే విలీనంకావడంతో వార్డు సంఖ్య మారాల్సి ఉండగా.. కేవలం మూడు చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్‌లలో మత్రమే వార్డుల విభజన చేస్తున్నారు. మిగతా 7 మున్సిపాలిటీలలో ఎలాంటి వార్డుల విభజన చేయడం లేదు. నూతన మున్సిపాలిటీల్లో మాత్రమే వార్డు కుదింపు చేస్తూ.. మిగతా మున్సిపాలిటీలలో చేయకపోవడంతో 3 మున్సిపాలిటీలు మినహా అన్ని జీహెచ్ఎంసీలో విలీనం అవుతున్నట్లు స్పష్టమౌతుంది.గతంలో అన్ని పాలనలు.. మేడ్చల్ జిల్లా పదేళ్ల క్రితం ఏర్పడిన సమయంలో జిల్లాలో 61 గ్రామపంచాయతీలు, 5 మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్, 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 9మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడం, నూతనంగా 3 మున్సిపాటీలను ఏర్పాటు చేయడంతో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు కనుమరుగయ్యాయి. దీంతో మేడ్చల్ అర్బన్ జిల్లాగా మారిపోయింది. 12 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు.. నియోజకవర్గంలో మేడ్చల్, తూంకుంట, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలు జవహర్‌నగర్, బోడుప్పల్, పిర్జాదిగూడ, కార్పొరేషన్లు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలు, నిజాంపేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 12 మున్సిపాలిటీలు 4 మున్సిపల్ కార్పొరేషన్లు ప్రస్తుతానికి ఉన్నాయి.చదవండి: హైదరాబాద్ కోర్ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం..పట్టణాల స్థాయికి.. మేడ్చల్, తూంకుంట, ఘట్కేసర్, మున్సిపాలిటీలు మాత్రమే నగరానికి కొద్ది దూరంగా ఉండగా.. మిగతా మున్సిపాలిటీలు రాజధాని నగరంలో అంతర్భాగంగా ఉన్నాయి. పట్టణ వాతావరణంలోనే ఉన్నాయి. పోచారం, కొంపల్లి, దుండిగల్ గుండ్లపోచంపల్లి, నాగారం, దమ్మాయిగూడ పూర్తిగా పట్టణాలుగా ఉన్నాయి. బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్, జవహర్‌నగర్‌లు నగర స్థాయికి ఎప్పుడో వెళ్లిపోయాయి. భవిష్యత్తులో మేడ్చల్ కేవలం అర్బన్ జిల్లాగానే ఉండిపోనుంది. కేవలం రెవెన్యూ మండలాలకే పరిమితం కానుంది. -
కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్లో ఈ నెల 15న అదృశ్యమైన కాంగ్రెస్ నేత, ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్(45) హత్యకు గురయ్యాడు. ప్లాటు వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయతిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేశ్‌ను దారుణంగా హత్య చేసి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన వివరాలను సీఐ సైదులు సోమవారం వెల్లడించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన గడ్డం మహేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,(36), కడుపొల్ల ప్రవీణ్(27)తో ప్లాటు విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌పై మహేశ్ క్రిమినల్ కేసు పెట్టాడు. దీంతో అతడిని చంపాలని ప్రవీణ్‌ను శ్రీనివాస్ సంప్రదించాడు. మహేశ్ తమ బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. రాజీ చేసుకుందామని పిలిచి అంతమొందించారు.... ఘట్కేసర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల మహేశ్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఈ నెల 14 రాత్రి రాజీ చేసుకుందామని చెప్పి ఆఫీసుకు రావాలని కోరారు. అందుబాటులో లేనని మహేశ్ చెప్పడంతో తిరిగి 15న ఉదయం రావాలని కోరారు. మహేశ్ తన ఆఫీసుకు చేరుకోగానే కళ్లల్లో కారం పొడి చల్లి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆఫీస్ షెటర్ మూసి వెళ్లిపోయారు. రాత్రివేళ మహేశ్ కారులోనే అతడి శవాన్ని శ్రీరాములు, రాజు అనే వ్యక్తుల సాయంతో కొండాపూర్ డంపింగ్ యార్డుకు తరలించి జేసీబీతో పూడ్చిపెట్టారు. అందుకు జేసీబీ ఓనర్ నరేశ్, డ్రైవర్ సోహాన్ కూడా సహకరించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా మహేశ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు విఠల్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్, నరేశ్, సోహాన్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చడానికి సహకరించిన ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన శ్రీరాములు, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాజు పరారీలో ఉన్నారు. సోమవారం నాయబ్ తహసీల్దార్ సందీప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో శవ పంచనామా, గాంధీ ఆస్పత్రి వైద్యాధికారి మహేందర్‌రెడ్డి బృందం పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుడి బంధువులు నిందితుడు ప్రవీణ్ ఇంటిపై రాళ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని మహేశ్‌కు సంబంధించిన కారు, ఇతర వివరాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభకు పోటీ చేస్తా: మల్లారెడ్డి
సాక్షి, మేడ్చల్: బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మల్లారెడ్డి.గురువారం తెలంగాణ భవన్లో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో మల్కాజిగిరి ఎంపీ గా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తరహలో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తారన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని దీమాను వ్యక్తం చేశారు. లోక్‌సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. తాను పోటీ చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశం ఈ నెల 21 తెలంగాణ భవన్లో పార్లమెంట్పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో అదిష్టానం నిర్వహిస్తుందని మల్లారెడ్డి తెలిపారు. చదవండి: CM Revanth: అమిత్‌షాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ -
సమావేశానికి పిలవాల్సిన అవసరమేంటి? వారే రావాలి: మంత్రి మల్లారెడ్డి
సాక్షి, మేడ్చల్ జిల్లా: రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు కాస్తా.. నేతల మధ్య చాపకింద నీరులా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు బహిర్గతమవడంతో కేడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. మంగళవారం దేవరయాంజల్లో జరిగిన మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన తనయుడు జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి దూరంగా ఉండటంపై కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం.. సమ్మేళనానికి ఆహ్వానం లేకపోవటం వల్లే హాజరు కాలేదని సుధీర్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి పేర్కొంటుండగా, వారిని పిలవాల్సిన అవసరమేంటి..? వారే రావాలని మంత్రి మల్లారెడ్డి వాదిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో అందరూ పాల్గొనాలని అధిష్టానమే ఆదేశించిందని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డిని తాను పిలవడం ఏంటని.. వారే రావాలి కదా అని మంత్రి మల్లారెడ్డి పేర్కొంటున్నారు. గతంలో మండల, పురపాలక స్థాయి సమావేశాల్లో పాల్గొన్న వారిని.. ఎవరు పిలిస్తే వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ఆ సమావేశాలకు ఆహ్వానం ఉండటం వల్లే పాల్గొన్నామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహారాన్ని, ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానించని విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు ఇలా.. మేడ్చల్ జిల్లాలో దాదాపు నెల రోజులుగా మండల, పురపాలక సంఘాలు, అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. ఆతీ్మయ సమ్మేళనాల విజయవంతం కోసం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు పార్టీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. మార్చి 24 నుంచి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతుండగా, మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రం 10 పురపాలక సంఘాలు, 5 మండలాల సమావేశాలకు 6 పురపాలికలు, 4 మండలాల్లో మాత్రమే జరిగాయి. ఇంకా పీర్జాదిగూడ, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ పురపాలక సంఘాలతోపాటు ఎంసీపల్లి మండలంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉంది. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు.. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గంగా కొనసాగుతున్న విభేదాలు ఆత్మీయ సమ్మేళనాలతో పోతాయని భావించినా.. మరింత ముదురుతుండటంతో పరిస్థితి ఎక్కడి దారి తీస్తుందోనని పార్టీ కేడర్ ఆందోళన చెందుతోంది. గతంలోనే మంత్రి మల్లారెడ్డిపై జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇంత వరకు ఇది ఓ కొలిక్కివచ్చిన దాఖలాలు లేవు. గతంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత హన్మంతరావు ఇంట్లో సమావేశమైన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యాన్ని తప్పుబట్టారు. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్న విషయం తేల్సిందే. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతర్ చేయకుండా నామినేటెడ్ పదవులను కూడా మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఆ సందర్భంలో ఎమ్మెల్యేలు ఆరోపించిన విషయం తేల్సిందే. ఈ వ్యవహారం ఇంకా చక్కబడకపోగా, నివురుగప్పిన నిప్పులా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా.. జిల్లాలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. కూకట్‌పల్లిలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ తమ గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ కేడర్‌లో గుసగుసలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని 13 పురపాలక సంఘాలోŠల్ అధికార పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉన్నప్పటికీ వారి మధ్యనే విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లతో సహా పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. మూడింటిలో తారస్థాయిలో.. మేడ్చల్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ మినహాయించి మిగతా కూకట్పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు సాఫీగానే కొనసాగుతున్నాయి. ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో చాపకింద నీరులా నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నా.. ఆత్మీయ సమ్మేళనాలు మాత్రం సజావుగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆత్మీయ సమ్మేళనాల తీరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తోంది. ఇటీవల బోడుప్పల్ పురపాలక సంఘంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం దీనికి నిదర్శంగా నిలుస్తోంది. బోడుప్పల్ సమ్మేళనంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా సమన్వయకర్త, పార్టీ ఇన్చార్జి ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. వాగ్వాదాలకు దిగడం పార్టీ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేసింది. -
BRS Party: మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య అంతర్గత విభేదాలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలందర్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుడుతోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే సమ్మేళనాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రచారం కల్పించడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులను సమన్వయ పరిచేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజుతో కలిసి జిల్లాకు సమన్వయకర్తగా అధిష్టానం నియమించిన ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను ప్రజల్లోకి పంపించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో కార్యకర్తలందరిని భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన పథకాల వివరాలను ప్రజలకు వివరించాలని అధిష్టానం ఆదేశించింది. ఇందు కోసం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పేరిట గ్రామాల్లో, పురపాలక సంఘాల్లో డివిజన్లు/వార్డుల్లో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు, రైతుబంధు కన్వీనర్, సింగిల్ విండో చైర్మన్లతో పాటు జడ్పీటీసీ, ఎంపీపీ, మండల పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరితో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సంబంధిత నియోజకవర్గ ఇన్చార్జి ఉండే ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, ఇతర పదవులున్న నేతలందరినీ ఆహా్వనిస్తారు. పురపాలక సంఘాల్లో కార్పొరేటర్/కౌన్సిలర్, పార్టీ వార్డు అధ్యక్షుడు ఇతర కార్యవర్గాన్ని భాగస్వామ్యం చేస్తారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్లు సమావేశాల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. నెల రోజుల పాటు బీఆర్ఎస్ సమ్మేళనాలు గ్రామ కార్యకర్తల సమ్మేళనం ఏ తేదీన నిర్వహిస్తారో నియోజకవర్గ ఎమ్మెల్యే నిర్ణయించాల్సి ఉంటుంది. వివరాలను పార్టీ జిల్లా ఇన్చార్జి లేదా సమన్వయకర్తకు అందజేస్తే అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 24వ తేదీలోగా ఈ సమ్మేళనాలు పూర్తిచేయాలి. అనంతరం 25న గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగురవేసి పండగ వాతావరణం తలపించేలా కార్యక్రమం చేపట్టాలని సూచనలు ఉన్నాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సచివాలయం ఎదుట 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనుండటంతో జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ఉత్సవాలు నిర్వహించనున్నారు. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల విజయవంతం కోసం పార్టీ జిల్లా సమన్వయ కర్త ఇక్కడకు చేరుకుని నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం పటిష్టపరచడం పైనా దృష్టిపెడుతారు. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ఇందులో చేర్పించనున్నారు. ప్రస్తుతం పరీక్షల కాలం కావడంతో జూన్ నెలలోనే విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విభేదాలు సమసి.. సమన్వయం జరిగేనా..! మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ నేతల మ ధ్య అంతర్గంగా కొనసాగుతున్న విభేధాలు.. త్వర లో జరిగే విస్కృత సమ్మేళనాలతో సమసి పోగలవా .. లేక మరింత ముదురుతాయన్న చర్చ పార్టీ వర్గాలను వేధిస్తోంది. మంత్రి మల్లారెడ్డిపై జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇంత వరకు ఇది ఓ కొలిక్కివచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. కొద్ది రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లా పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యాన్ని తప్పుపట్టారు. ఈ వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తుమని, 5 ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా ప్రకటించారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతర్ చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ వ్యవహారం ఇంకా చక్కబడకపోవడంతో విభేదాలు కొనసాగుతూనే.. ఉన్నాయి. అలాగే మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డి, మాజీ మేయరు బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్లు కేడర్‌లో చర్చ సాగుతోంది. కూకట్‌పల్లిలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు తమ వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 13 పురపాలక సంఘాలోకల్ అధికార పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఉన్నప్పటికీ వారి మధ్యనే ఉన్న విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లతో సహా పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. అయితే.. పార్టీ విస్తృత సమ్మేళనాలతో బీఆర్ఎస్ నేతల మధ్య నెలకొని ఉన్న విభేదాలు సమసిపోతాయా.. లేక భగ్గుమంటాయా.. అన్న ఆందోళన కేడర్ నుంచి వ్యక్తమవుతుండగా, దీన్ని జిల్లా సమన్వయకర్త, పార్టీ యంత్రాంగం ఎలా ఎదుర్కొని చల్ల బర్చగలదో వేచి చాడాల్సిందే మరి. సమ్మేళనాలు ఇలా... పది గ్రా మాలను కలిపి ఒక సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. పట్టణాల్లో 3 నుంచి 4 వార్డులను కలిపి ఓ సమ్మేళనం ఉంటుంది. గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తలకు అక్కడ చేపట్టిన అభివృద్ధిని గణాంకాలతో సహా వి వరిస్తారు. పథకాలతో లబ్దిపొందిన వారి జాబితాను అందిస్తారు. ఆ వివరాలతో కార్యకర్తలు కలసికట్టుగా పర్యటిస్తూ.. ప్రభుత్వం గ్రామానికి ఏం చేసింది? ఎన్ని నిధులతో పనులు జరిగాయి? ఎందరు లబ్ధి పొందారో వివరించి ప్రజలను ఆకట్టుకునేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. -
కట్నం సరిపోలేదని వరుడికి షాకిచ్చిన వధువు.. పెళ్లికి గంట ముందు..
సాక్షి, మేడ్చల్ జిల్లా: జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని ఓ వధువు ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకుంది. హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్కేసర్లోని ఓ ఫంక్షన్హాల్లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. చదవండి: మహిళతో బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు!.. నీ భర్త బతికే ఉన్నాడు కదా అంటూ..