
సాక్షి, మేడ్చల్ జిల్లా: జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని ఓ వధువు ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకుంది. హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు.
అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు.
ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.
చదవండి: మహిళతో బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు!.. నీ భర్త బతికే ఉన్నాడు కదా అంటూ..
Comments
Please login to add a commentAdd a comment