BRS Party: మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకుల  మధ్య అంతర్గత  విభేదాలు | Atmiya Sammelanam BRS Party Medchal Malkajgiri | Sakshi
Sakshi News home page

BRS Party: మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకుల  మధ్య అంతర్గత  విభేదాలు

Published Sat, Mar 25 2023 12:01 PM | Last Updated on Sat, Mar 25 2023 12:07 PM

Atmiya Sammelanam BRS Party Medchal Malkajgiri - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యకర్తలందర్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుడుతోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే సమ్మేళనాల్లో  ప్రభుత్వ పథకాలపై ప్రచారం కల్పించడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది.

ఇందుకోసం పార్టీ శ్రేణులను సమన్వయ పరిచేందుకు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ శంభీపూర్‌ రాజుతో కలిసి జిల్లాకు సమన్వయకర్తగా అధిష్టానం నియమించిన ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను ప్రజల్లోకి పంపించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో కార్యకర్తలందరిని భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన పథకాల వివరాలను ప్రజలకు వివరించాలని అధిష్టానం ఆదేశించింది. ఇందు కోసం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పేరిట గ్రామాల్లో, పురపాలక సంఘాల్లో డివిజన్లు/వార్డుల్లో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు, రైతుబంధు కన్వీనర్, సింగిల్‌ విండో చైర్మన్లతో పాటు జడ్పీటీసీ, ఎంపీపీ, మండల పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాలు, కార్పొరేషన్‌ చైర్మన్లు అందరితో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

సంబంధిత నియోజకవర్గ ఇన్‌చార్జి ఉండే ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, ఇతర పదవులున్న నేతలందరినీ ఆహా్వనిస్తారు. పురపాలక సంఘాల్లో కార్పొరేటర్‌/కౌన్సిలర్, పార్టీ వార్డు అధ్యక్షుడు ఇతర కార్యవర్గాన్ని భాగస్వామ్యం చేస్తారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌చైర్మన్లు సమావేశాల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

నెల రోజుల పాటు బీఆర్‌ఎస్‌ సమ్మేళనాలు 
గ్రామ కార్యకర్తల సమ్మేళనం ఏ తేదీన నిర్వహిస్తారో నియోజకవర్గ ఎమ్మెల్యే నిర్ణయించాల్సి ఉంటుంది. వివరాలను పార్టీ జిల్లా ఇన్‌చార్జి లేదా సమన్వయకర్తకు అందజేస్తే అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి ఏప్రిల్‌ 24వ తేదీలోగా ఈ సమ్మేళనాలు పూర్తిచేయాలి. అనంతరం 25న గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగురవేసి పండగ వాతావరణం తలపించేలా కార్యక్రమం చేపట్టాలని సూచనలు ఉన్నాయి.

ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సచివాలయం ఎదుట 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనుండటంతో జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ఉత్సవాలు నిర్వహించనున్నారు. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల విజయవంతం కోసం పార్టీ జిల్లా సమన్వయ కర్త ఇక్కడకు చేరుకుని నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం పటిష్టపరచడం పైనా దృష్టిపెడుతారు. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ఇందులో చేర్పించనున్నారు. ప్రస్తుతం పరీక్షల కాలం కావడంతో జూన్‌ నెలలోనే విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

విభేదాలు సమసి.. సమన్వయం జరిగేనా..! 
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతల మ ధ్య అంతర్గంగా కొనసాగుతున్న విభేధాలు.. త్వర లో జరిగే విస్కృత సమ్మేళనాలతో సమసి పోగలవా .. లేక మరింత ముదురుతాయన్న చర్చ పార్టీ వర్గాలను వేధిస్తోంది. మంత్రి మల్లారెడ్డిపై జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇంత వరకు ఇది ఓ కొలిక్కివచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. కొద్ది రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లా పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యాన్ని తప్పుపట్టారు.

ఈ వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తుమని, 5 ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా ప్రకటించారు. అలాగే, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలను ఖాతర్‌ చేయకుండా నామినేటెడ్‌ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ వ్యవహారం ఇంకా చక్కబడకపోవడంతో విభేదాలు కొనసాగుతూనే.. ఉన్నాయి. అలాగే మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డి, మాజీ మేయరు బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ శంభీపూర్‌ రాజు మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్లు కేడర్‌లో చర్చ సాగుతోంది.

కూకట్‌పల్లిలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు తమ వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 13 పురపాలక సంఘాలోకల్‌ అధికార పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఉన్నప్పటికీ వారి మధ్యనే ఉన్న విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని డివిజన్లతో సహా పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. అయితే.. పార్టీ విస్తృత సమ్మేళనాలతో బీఆర్‌ఎస్‌ నేతల మధ్య నెలకొని ఉన్న విభేదాలు సమసిపోతాయా.. లేక భగ్గుమంటాయా.. అన్న ఆందోళన కేడర్‌ నుంచి వ్యక్తమవుతుండగా, దీన్ని జిల్లా సమన్వయకర్త, పార్టీ యంత్రాంగం ఎలా ఎదుర్కొని చల్ల బర్చగలదో వేచి చాడాల్సిందే మరి. 

సమ్మేళనాలు ఇలా...  
పది గ్రా మాలను కలిపి ఒక సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. పట్టణాల్లో 3 నుంచి 4 వార్డులను కలిపి ఓ సమ్మేళనం ఉంటుంది. గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తలకు అక్కడ చేపట్టిన అభివృద్ధిని గణాంకాలతో సహా వి వరిస్తారు. పథకాలతో లబ్దిపొందిన వారి జాబితాను అందిస్తారు. ఆ వివరాలతో కార్యకర్తలు కలసికట్టుగా పర్యటిస్తూ.. ప్రభుత్వం గ్రామానికి ఏం చేసింది? ఎన్ని నిధులతో పనులు జరిగాయి? ఎందరు లబ్ధి పొందారో వివరించి ప్రజలను ఆకట్టుకునేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement