సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగిన రైతు రుణమాఫీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ‘సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. టీవీ ముందు కూర్చున్న రాష్ట్ర ప్రజలు కూడా తలదించుకులే ఉంది. హరీష్ రావు గురించి కూడా ఏదేదో మాట్లాడారు. రుణమాఫీపై హరీష్ రావు ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఇప్పుడు రెండు లక్షల రుణం మాఫీ కాలేదు.. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి ముక్కు నేలకు రాయాలి. మీరిచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటాం. హరీష్ రావు పైన కూడా వాడకూడని భాషతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేరు తీయకుండా రేవంత్‌రెడ్డికి నిద్ర పట్టదు.
సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే..
భద్రాద్రి రాముడి సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ‘బహిరంగ సభలో పచ్చి భూతులు మాట్లాడారు.. కాంగ్రెస్‌లో ఉన్న మంత్రులు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 30 వేల ఉద్యోగాలు కాదు.. 30 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రాజెక్ట్ కట్టింది మేమే అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉంది. ఒక మంత్రి నీళ్ళు జల్లుకోవడం, మరో మంత్రి పూలు జల్లడం. ఇదంతా కేసిఆర్ ప్రాజెక్ట్ నిర్మించటం వల్లే. కష్టపడి నీళ్ళు తెచ్చామని చెప్పుకోవడానికి వారికి సిగ్గుండాలి. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితం చేసింది మీరు కాదా?. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి..
సీఎం రేవంత్‌రెడ్డి ఏమాత్రం సిగ్గు లేకుండా హరీష్ రావుపై అసభ్య విమర్శలు చేశాని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ‘దేవుళ్ళను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. సూటిగా చెప్పు రూ. 31 వేల కోట్ల రుణ మాఫీ చేశావా లేదా?. కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే అకౌంట్లలో వేశావ్. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలి. 2018లో రేవంత్‌ను కొడంగల్‌లో హరీష్ రావు చిత్తు చిత్తుగా ఓడించారు. హరీష్ రావును విమర్శలు చేసే స్థాయి రేవంత్‌కు లేదు. మూసి కంటే కంపు రేవంత్ నోరు. ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి’అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment