mptc Member
-
కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్లో ఈ నెల 15న అదృశ్యమైన కాంగ్రెస్ నేత, ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్(45) హత్యకు గురయ్యాడు. ప్లాటు వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయతిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేశ్‌ను దారుణంగా హత్య చేసి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన వివరాలను సీఐ సైదులు సోమవారం వెల్లడించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన గడ్డం మహేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,(36), కడుపొల్ల ప్రవీణ్(27)తో ప్లాటు విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌పై మహేశ్ క్రిమినల్ కేసు పెట్టాడు. దీంతో అతడిని చంపాలని ప్రవీణ్‌ను శ్రీనివాస్ సంప్రదించాడు. మహేశ్ తమ బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. రాజీ చేసుకుందామని పిలిచి అంతమొందించారు.... ఘట్కేసర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల మహేశ్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఈ నెల 14 రాత్రి రాజీ చేసుకుందామని చెప్పి ఆఫీసుకు రావాలని కోరారు. అందుబాటులో లేనని మహేశ్ చెప్పడంతో తిరిగి 15న ఉదయం రావాలని కోరారు. మహేశ్ తన ఆఫీసుకు చేరుకోగానే కళ్లల్లో కారం పొడి చల్లి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆఫీస్ షెటర్ మూసి వెళ్లిపోయారు. రాత్రివేళ మహేశ్ కారులోనే అతడి శవాన్ని శ్రీరాములు, రాజు అనే వ్యక్తుల సాయంతో కొండాపూర్ డంపింగ్ యార్డుకు తరలించి జేసీబీతో పూడ్చిపెట్టారు. అందుకు జేసీబీ ఓనర్ నరేశ్, డ్రైవర్ సోహాన్ కూడా సహకరించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా మహేశ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు విఠల్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్, నరేశ్, సోహాన్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చడానికి సహకరించిన ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన శ్రీరాములు, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాజు పరారీలో ఉన్నారు. సోమవారం నాయబ్ తహసీల్దార్ సందీప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో శవ పంచనామా, గాంధీ ఆస్పత్రి వైద్యాధికారి మహేందర్‌రెడ్డి బృందం పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుడి బంధువులు నిందితుడు ప్రవీణ్ ఇంటిపై రాళ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని మహేశ్‌కు సంబంధించిన కారు, ఇతర వివరాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో సంచలనం
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్‌ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా. గడ్డం మహేష్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జేసీబీ సాయంతో ఘట్కేసర్ డంపింగ్ యార్డ్‌లో కారును పాతి పెట్టినట్లు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎంపీటీసీపై హత్యాయత్నం
కాశీబుగ్గ: పలాస మండలం లక్ష్మీపురం ఎంపీటీసీ గండు మోహనరావుపై శుక్రవారం రాత్రి కిష్టుపురం గ్రామంలో హత్యాయత్నం జరిగింది. టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఎన్నికల ఫలితాల అనంతరం వారు హెచ్చరించారని, శుక్రవారం దాడికి తెగబడ్డారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫలితాలు వచ్చాక కిష్టుపురంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరకూడదంటూ సిమ్మెంట్ దిమ్మను తోసేశారు. ఎంపీటీసీ ఇంటిపైకి బాంబులు కూడా విసిరారు. అప్పటి నుంచి మోహనరావు ఇంటికే పరిమితమైపోయారు. శుక్రవారం పొలం వైపు వెళ్దామని బయటకు రాగా అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఇనుప రాడ్డుతో ఆయన తలపై కొట్టారు. అడ్డుకున్న మేనల్లుడు సురేష్‌ను కూడా గాయపరిచారు. మోహనరావు భార్య రేణుక జాకెట్ చింపేయడంతో ఆమె ప్రాణభయంతో కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ పారినాయుడు తక్షణమే మోహనరావును ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం దాడి జరిగిన తీరుపై వివరాలు నమోదు చేసుకుని చేసుకున్నారు.అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పలాస ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రజలు గెలిపించింది ఇందుకేనా అని ప్రశ్నించారు. దాడులు ఆపకుంటే ఈ క్షణం నుంచే రోడ్డుపైకి వస్తామని, ఓడిపోయి ఉండవచ్చు కానీ తాము బలహీనులం కాదని అన్నారు. బుధ, గురువారం ఇద్దరు వైశ్య కుటుంబాల ఇంటికి వెళ్లి బెదిరించారని, మందస మండలంలో అభిరాం అనే బూత్ ఏజెంట్‌ను భయపెట్టి వెంటాడారని ఆయన పోలీసులను ఆశ్రయించాడని, ఇప్పుడు మరో దాడి జరగడం ఘోరమన్నారు. 2014 నుంచి 2019 వరకు ఇలానే చేశారని గుర్తు చేశారు. హత్యానేరం కింద చర్యలు చేపట్టాలని లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో రోడ్డెక్కుతామని అన్నారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.శ్రీకాకుళంలో..శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బైరివానిపేట గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శిమ్మ అప్పన్న, బగ్గు రామారావులపై టీడీపీ కార్యకర్తలు శుక్రవారం రాత్రి కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రామంలో స్వల్ప వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇదే అదనుగా భావించిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేశారు. దీంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. దీనిపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను రిమ్స్‌కు తరలించారు. -
ప్రెటోల్, పురుగు మందుతో..
చివ్వెంల (సూర్యాపేట): తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యురాలు ధరావతు బుచ్చమ్మ కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఐలాపురం గ్రామ ఆవాసం అంగోతు తండాకు చెందిన ధరావతు లచ్చిరాం, బుచ్చమ్మ భార్యాభర్తలు. 2013లో లచ్చిరాం కుమారుడు హరిసింగ్ 3 ఎకరాల భూమిని రఫీ అనే వ్యక్తికి విక్రయించాడు. అలాగే 2016లో తన బాబాయ్ కుమారుడు వెంకన్న వద్ద హరిసింగ్ 22 గుంటలను కొనుగోలు చేసి డబ్బులు కూడా చెల్లించాడు. అయితే ఆ భూమిని వెంకన్న ఇంతవరకు హరిసింగ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించలేదని చెపుతున్నారు. ఇటీవల ఆ భూమిని వెంకన్న అదే తండాకు చెందిన మరొకరికి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో హరిసింగ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వెంకన్నకు తమకు మధ్య జరిగిన విక్రయ దస్తావేజులు చూపించి సంబంధిత భూమిని వేరే ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయవద్దని కోరాడు. అయితే అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని, దీనికి తోడు గతంలో తాము విక్రయించిన 3 ఎకరాల భూమి తక్కువగా ఉందని, రఫీ పక్కనే ఉన్న తమ భూమిలో సుమారు 20 గుంటల్లో హద్దురాళ్లు పాతి ఆక్రమించాడని హరిసింగ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు హరిసింగ్ భార్య ఆమని పురుగు మందు తాగి, కూతురు శకుంతల పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పక్కన ఉన్నవారు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమని సొమ్మసిల్లిపోవడంతో ఆమెను సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా తాను కొన్న భూమిలో 11 గుంటలు తక్కువ ఉందని, ఈ విషయాన్ని లచ్చిరాం కుటుంబ సభ్యులకు తెలపగా, పెట్రోల్ పోసుకుని తనను బెదిరిస్తున్నారని రఫీ మీడియాకు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
పశువులపై విష ప్రయోగం
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): రాజకీయ కక్షలతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని వీరవల్లి–1 సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యురాలు దూసరి నిర్మల (వైఎస్సార్ సీపీ)కు చెందిన పశువులపై విషప్రయోగం జరిగింది. ఈ ఘటనలో ఓ గేదె దూడ మృతి చెందగా, మరో మూడు గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. గ్రామంలో ఆదివారం ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన దూసరి నిర్మల, జోజి దంపతులు పాడి పశువులను పెంచుకుంటూ కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రాజకీయంగా వారిద్దరూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో కొందరు పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని వారిపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇటీవల నిర్మల దంపతులు కౌలుకు సాగు చేసిన 16 ఎకరాల వరి కుప్పలను ప్రత్యర్థులు దహనం చేశారు. కాగా, శనివారం అర్ధరాత్రి నిర్మల ఇంటి ప్రాంగణంలోని గేదెలపై విషప్రయోగం జరగగా.. సంఘటనాస్థలంలోని ఆనవాళ్లును బట్టి చూస్తే దోసకాయ, వంకాయలలో గుళికల మందు కలిపి గేదెలకు పెట్టినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలంలో పడి ఉన్న గుళికలు కలిపి పెట్టిన కూరగాయలు ఆదివారం తెల్లవారుజామున నిర్మల యథావిధిగా పశువులకు మేత వేసేందుకు వెళ్లినపుడు పశువులన్నీ అపస్మారక స్థితిలో కనిపించాయి. స్థానికులు వీరవల్లి ప్రభుత్వ వైద్యశాల, సంచార పశువైద్యశాల సిబ్బందికి సమాచారం అందించటంతో వారు హుటాహుటిన పశువులకు వైద్యం అందించారు. దీంతో గేదెలకు ప్రాణాపాయం తప్పినట్లేనని పశు వైద్యులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వీరవల్లి ఎస్ఐ ఎం.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేశారు. గతంలో వరి కుప్పలు దహనం చేసిన వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడా? లేక వేరేఎవరైనా విష ప్రయోగం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న మరో సినిమా
దేవరాజ్, సోనాక్షీ వర్మ జంటగా మదుగోపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్ సత్యం’. లక్ష్మీ నారాయణ సమర్పణలో సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దేవరాజ్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ–‘‘దేవరాజ్‌కు ఇది మొదటి సినిమా అయినా హీరోగా, నిర్మాతగా చక్కగా చేశాడు. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యం ఉన్న పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘మా సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది. యాజమాన్య మంచి సంగీతం అందించారు’’ అన్నారు హీరో, నిర్మాత దేవరాజ్. ‘‘ఒక ఎంపీటీసీ స్థానం కోసం ఎలా పరితపిస్తారు? ఆ పదవి కోసం హీరో జీవితంలో ఏం కోల్పోయాడు? ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే చిత్రకథ’’ అన్నారు మధు గోపు. -
అయ్యో గిట్లాయె..!
సాక్షి, వరంగల్ : పరిషత్‌ల్లో పైసలు లేక ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదవీ ప్రమాణస్వీకారం చేసి 45 రోజులవుతున్నా ఇంతవరకూ చిల్లగవ్వ కూడా రాకపోవడంతో ఏదైనా అభివృద్ధి పనులు చేపడుతామన్నా చేతిలో డబ్బులు లేకపోవడంతో గ్రామాల్లో పర్యటించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. పరిషత్ పాలకవర్గాలకు నుంచి 45 రోజులు దాటింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నిధులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎంపీటీసీ సభ్యులు అయోమయంలో ఉన్నారు. అయ్యో గిట్లాఝెను.. అని చర్చించుకుంటున్నారు. నిధులు కేటాయింపు లేక పాలకవర్గాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. జిల్లాలో 16 మండల పరిషత్‌లు ఉన్నాయి. 178 ఎంపీటీసీలు ఉన్నారు. ఇటీవల నూతన పురపాలక చట్టం ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఆదాయాలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నిధులు సమకూర్చే బాధ్యత ఉందని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం కేటాయించే మొత్తానికి తాము సమానంగా ఇవ్వనున్నటుŠల్ వెల్లడించారు. పల్లె మునిసిపాలిటీలను పట్టించుకున్న మాధిరిగానే మండల జిల్లా పరిషత్‌లపై దృష్టి సారిస్తే వాటికి పూర్వవైభవం రానుంది. మూడేళ్లుగా అందని నిధులు గతంలో కేంద్రం బీఆర్జీఎఫ్ పేరిట ప్రత్యేక నిధులు కేటాయించేవారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రణాళిక సంఘం స్థానంలో తీసుకొచ్చిన నీతి అయోగ్ చేసిన సిఫార్సులతో రద్దు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఏడాదిలో రెండుసార్లు మంజూరవుతాయి. మండలాలకు బట్టి రూ 50 వేల నుంచి రూ 2 లక్షల మేర కేటాయిస్తారు. గత మూడేళ్లుగా జాడలేదు. మండల పరిషత్‌లకు కేటాయించే సీనరేజ్ చార్జీలు మొత్తాన్ని సంబంధిత శాఖ నేరుగా పంచాయతీలు కేటాయిస్తున్నాయి. దీంతో మొత్తం కేటాయింపులు లేకుండా పోయాయి. గతంలోఅరకొర నిధులే.. గతంలో వచ్చింది అరకొరే. గత ఐదేళ్లలో అరకొర నిధులు మంజూరయ్యాయి. మండలం జనాభా తలసరి ఆదాయాన్ని అనుసరించి మండల పరిషత్‌లకు ప్రభుత్వం నుంచి మూడు నెలలకు ఒకసారి ఏడాదిలో నాలుగు సార్లు నిధులు మంజూరవుతుంటాయి. గత మూడేళ్లుగా మండల పరిషత్‌లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ సారైనా నిధులు ఏమైనా కేటాయిస్తారోనని ఎంపీటీసీలు ఎదురుచూస్తున్నారు. నిలిచిన ఇంటర్నెట్ సేవలు జిల్లాలో మండల పరిషత్‌ల్లో డబ్బులు లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కార్యాలయల్లో పేపర్, ప్రింటింగ్లు, ఇతర అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో దామెర, నడికూడ రెండు కొత్తగా మండల పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. వాటి పరిస్థితి ఇంకా అద్వానంగా ఉంది. పరిషత్‌లకు నిధులు లేకపోవడంతో అధికారులు తమ దగ్గర డబ్బులు ప్రస్తుతానికి పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించిన తరువాత బిల్లులు పెట్టి తీసకుంటామని అంటున్నారు. భారం కూడా మోసేవరకు మోస్తాం తరువాత మా వల్ల కాదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎంపీటీసీ సభ్యురాలి బలవన్మరణం
సాక్షి, పెబ్బేరు (కొత్తకోట): ఉన్నత విద్యావంతురాలైన ఓ యువ ప్రజాప్రతినిధి కుటుంబ కలహాలతో అకాలంగా మృత్యుఒడికి చేరింది. గెలుపును పూర్తిగా ఆస్వాదించకుండా.. గ్రామాభివృద్ధికి తనవంతుగా సహాయపడకుండానే అనంతవాయువులో కలిసిపోయింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని గుమ్మడంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య కూతురు రజిత(23) ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందింది. అయితే సోమవారం సాయంత్రం ఇంట్లో తల్లిదండ్రులతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి రజిత వ్యవసాయం కోసం తెచ్చిన పురుగు (గడ్డి) మందు తాగి అస్వస్థతకు గురైంది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ వెంకటేశ్వరరావు, శ్రీరంగాపురం ఎస్ఐ ఎండీ షఫీ, ఏఎస్ఐ జయన్న అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహానికి వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఉన్నత విద్యావంతురాలు గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య టీఆర్ఎస్ నాయకుడు. ఈయన కూతురు రజిత చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. ఎంఫార్మసీ పూర్తిచేసింది. ఈ క్రమంలో ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామం నుంచి ఉన్నత విద్యావంతురాలైన రజిత టీఆర్ఎస్ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీలో నిలిచి 18 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈ నెల 4న పెబ్బేరు మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, అధికారుల సమక్షంలో ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసింది. అయితే ఉన్నత విద్యావంతురాలైన రజిత గ్రామాభివృద్ధికి బాటలు వేస్తారని ఊహించిన గ్రామస్తులకు తీరని విషాదం మిగిల్చి అనంతలోకాలకు వెళ్లిపోయింది. రజిత అకాల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంత్రి నివాళి.. ఎంపీటీసీ సభ్యురాలు రజిత మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ, ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జెడ్పీచైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్, పెబ్బేరు జెడ్పీటీసీ సభ్యురాలు పద్మ, ఎంపీపీ ఆవుల శైలజ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్రెస్వామి, మాజీ ఎంపీపీ పద్మావతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హరిశంకర్‌నాయుడు, నాయకులు సంతోష్, బాల్‌రాం, రాములు, గోపాల్, బీచుపల్లి, శాంతన్న, భారతి, అక్కమ్మ, జ్యోతి, ఎల్లయ్య, ఎల్లారెడ్డి, శివశంకర్‌గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు రజిత భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
అధికారం లేని ఐదేళ్ల పాలన!
ఐదేళ్లు అధికారంలో ఉన్నారు.. కానీ అధికారం లేదు.. విచిత్రంగా ఉంది కదూ.. కానీ వాస్తవం ఇదే. మండల కార్యాలయాల్లోని ఎంపీటీసీ సభ్యులు కేవలం సంతకాలు పెట్టడానికి మాత్రమే పరిమితమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకానికి ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో.. ప్రజలచేత ఎన్నుకోబడిన వీరు అంతే అవస్థలు పడ్డారు. ప్రజలకు ఏదో చేద్దామని వచ్చిన వారికి నిధులు ఇవ్వలేదు సరికదా.. కనీసం వీరికి ప్రతినెలా ఇచ్చే గౌరవ వేతనం కూడా సక్రమంగా అందివ్వని పరిస్థితి. నేటితో వారి పదవీకాలం కూడా ముగుస్తోంది. సాక్షి, పెనుగంచిప్రోలు (కృష్ణా): టీడీపీ ప్రభుత్వ పాలనలో జన్మభూమి కమిటీల పుణ్యమా అని పంచాయతీ రాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పోయింది. సొంత అజెండాతో ముందుకు సాగాల్సిన ఎంపీటీసీ సభ్యులు.. జన్మభూమి కమిటీల పెత్తనంతో ఉత్సవ విగ్రహాలుగా మారారు. దీంతో వారు కేవలం మండల సమావేశాలకే పరిమితం అయ్యారు. దీనికి తోడు ప్రతి నెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా సరిగా ఇవ్వక ఇబ్బందులకు గురి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ పరంగా ప్రజలు తమను ఓట్లు వేసి ఎన్నుకున్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తమ గౌరవానికి ఆటంకం కలిగించిందంటూ విమర్శిస్తున్నారు. అధికారం పేరుకే.. నిధులన్నీ వారికే.. ప్రజలు ఎన్నుకోబడిన వీరు పేరుకే తప్ప టీడీపీ ప్రభుత్వం వచ్చిన అరకొర నిధులన్నీ వారి నాయకులకే కట్టబెట్టింది. దీంతో వారు గ్రామాల్లో రెచ్చిపోయారు. ప్రతిపక్ష ఎంపీటీసీ సభ్యులపై వివక్ష చూపుతూ నిధులు కేటాయింపులో సక్రమంగా జరగలేదు. దీంతో అభివృద్ధి కుంటు పడింది. ఎంపీటీసీ సభ్యులకు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. ప్రజలకు ఏమీ చేయకుండానే పదవీకాలం ముగించాల్సిన పరిస్థితి. నియోజకవర్గంలో మండలాలు 3 గ్రామ పంచాయతీలు 58 ఎంపీటీసీ స్థానాలు 52 జెడ్పీటీసీ స్థానాలు 3 అందని గౌరవ వేతనం.. స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలకు ప్రభుత్వం ప్రతి నెలా గౌరవ వేతనం కింద రూ.3 వేలు అందించాల్సి ఉంది. అయిదే ఎనిమిది నెలలుగా గౌరవ వేతనం మంజూరు కావటం లేదని పలువురు ఎంపీటీసీ సభ్యులు వాపోతున్నారు. ఐదేళ్లలో ప్రతి సారీ గౌరవ వేతనం సక్రమంగా ఇచ్చిన పాపాన పోలేదని అంటున్నారు. గుర్తింపు కరువు.. గత ఐదేళ్లలో జన్మభూమి కమిటీల పెత్తనంతో ఎంపీటీసీ సభ్యులు ఉన్నారనే సంగతిని ప్రజలు మర్చి పోయారంటే అతిశయోక్తి కాదు. ఎంపీటీసీ సభ్యులు కేవలం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరు కావటం.. సంతకాలు పెట్టటానికే పరిమితం అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు జన్మభూమి కమిటీలే చూశాయి. దీంతో సమావేశాల్లో ఎంపీటీసీ సభ్యులు మాట్లాడినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ప్రజాస్వామ్యం ఖూనీ.. జన్మభూమి కమిటీ సభ్యులను రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసి టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా ప్రతిపక్ష సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విలువలను తుంగలో తొక్కేసింది. –కుంటముక్కల భద్రమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు, వెంకటాపురం సమావేశాలకే పరిమితమయ్యాం.. ప్రజల చేత ఎన్నుకున్న మమ్మల్ని గత ప్రభుత్వం కేవలం సమావేశాలకే పరిమితం చేసింది. కేవలం సంతకాలు పెట్టటానికే మమ్మల్ని ఉపయోగించుకున్నారు. ఎటువంటి నిధులు, విధులు లేకుండా చేశారు. ఇంకా ఐదు నెలల గౌరవ వేతనం అందాల్సి ఉంది. –అంగడాల సాంబశివరావు, ఎంపీటీసీ సభ్యుడు, శనగపాడు -
గెలుపెవరిదో..!
సాక్షి, కొత్తగూడెం: నాలుగు మండలాల్లో శనివారం మండల పరిషత్ కో ఆప్షన్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన 20 మండలాలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 16 మండలాల్లోనే ఎన్నికలు జరిగాయి. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, ఆళ్లపల్లి మండలాల్లో ఎన్నికలు వాయిదా పడ్డ విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల పరిధిలోని 18 మండలాల్లో ఎన్నికలు వాయిదా పడగా, అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యధికంగా నాలుగు మండలాలు ఉన్నాయి. వాటిలో నేడు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆళ్లపల్లి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలే ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోగా.. గెలిచిన నలుగురు ఎంపీటీసీలూ ఎంపీపీ పదవి ఆశిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాలకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో శిబిరాలు పెట్టారు. నేరుగా ఎన్నిక సమయానికి ఎంపీటీసీలు రానున్నారు. ములకలపల్లిలో కూడా క్యాంప్ రాజకీయం జోరుగా సాగుతోంది. ములకలపల్లి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ 2, టీడీపీ 3, న్యూడెమోక్రసీ 2, సీపీఐ 1, సీపీఎం 1 దక్కించుకోగా, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. ఇక్కడ టీఆర్ఎస్కు సీపీఐ, స్వతంత్ర ఎంపీటీసీలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఈ ప్యానెల్‌కు 4 సీట్లు ఉన్నాయి. టీడీపీకి సీపీఎం మద్దతు తెలుపుతోంది. దీంతో ఈ ప్యానెల్‌కు సైతం 4 స్థానాలు ఉన్నాయి. ఈ మేరకు టీఆర్ఎస్, టీడీపీలు విడివిడిగా క్యాంప్‌లు పెట్టుకున్నాయి. న్యూడెమోక్రసీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎంపీటీసీలు మాత్రం ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నారు. మరోవైపు సీపీఎం మద్దతు కోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. తమకు మద్దతు ఇస్తే వైస్ ఎంపీపీ ఇస్తామని టీడీపీ.. టీఆర్ఎస్లో ఒక ఎంపీటీసీకి ఆఫర్ చేస్తోంది. దీంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి రెండు ప్యానల్స్‌కు నులుగురి చొప్పున ఉండడంతో చివరకు లాటరీ తీయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఆళ్లపల్లి మండలంలో మొత్తం 4 సీట్లు ఉండగా, ఇక్కడ టీఆర్ఎస్ 2, సీపీఐ 1, కాంగ్రెస్ 1 గెలుచుకున్నాయి. ఇక్కడ గత 7వ తేదీన నలుగురు సభ్యులు వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఎవరికీ రాలేదు. గెలిచిన ప్రతి ఎంపీటీసీ ఎంపీపీఈ పదవి ఆశించడంతో ఎన్నిక సాధ్యపడలేదు. దీంతో నేడు జరుగనున్న ఎన్నికకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరు కానున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో 11 సీట్లకు టీఆర్ఎస్కు 5, సీపీఐ 3, స్వతంత్ర 3 గెలిచారు. దీంతో ఈ ఎంపీపీ గెలుచుకునేందుకు టీఆర్ఎస్ జాగ్రత్తగా పావులు కదుపుతోంది. సుజాతనగర్ మండలంలో 8 సీట్లకు గాను టీఆర్ఎస్ 3, సీపీఐ 2, కాంగ్రెస్ 2, స్వతంత్ర 1 గెలిచారు. దీంతో ఇక్కడ కూడా ఆసక్తి నెలకొంది. ఎంపిక షెడ్యూల్ ఇలా... 15వ తేదీన ఉదయం 9 గంటలకు కో–ఆప్షన్ సభ్యులు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో నామినేషన్లు స్క్రూట్నీ చేయనున్నారు. 12 గంటలకు అర్హులైన అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 1 గంటకు కో–ఆప్షన్ మెంబర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఎంపికైన కో–ఆప్షన్ మెంబర్ల పేర్లు ప్రకటించి, తరువాత మధ్యాహ్నం 3 గంటలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. -
తేలిన లెక్క!
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లాలో ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీల సంఖ్య లెక్క తేలింది. గతంలో 64 జెడ్పీటీసీ, 982 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం ఆ సంక్య 71 జెడ్పీటీసీలు, 804 ఎంపీటీసీ స్థానాలకు చేరింది. ఈనెల 20వ తేదీన ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చేందుకు మండలాల్లో పునర్ విభజన డ్రాఫ్ట్ నోటిపికేషన్ జారీ చేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీ పదవీ కాలం జులై 4వ తేదీతో ముగుస్తుంది. ఈ మేరకు జూన్‌లో ఈ ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ప్రతిపాదనలు పంపింది. పూర్తయిన అభ్యర్థనల ప్రక్రియ కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ అవ్వగా ఆ రోజు నుంచి 22వ తేదీ వరకు అభ్యర్థనలు స్వీకరించారు. 23 నుంచి 24వ తేదీ వరకు అభ్యర్థలను పరిశీలించి సోమవారం తుది జాబితాను ప్రచురించారు. ఈ ఎన్నికల్లో 2019 జరవరి 1 నాటికి ఓటర్ల జాబితాల్లో ఉన్న వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లజాబితాకు అనుగుణంగా ఓటర్ జాబితాను సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారును వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీలకు అమలు చేసినట్లు రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేన్ల విధానం ఖరారు చేయనున్నారు. 804 ఎంపీటీసీ స్థానాలు ఎట్టకేలకు ఎంపీటీసీల లెక్క తేలింది. ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా 982 స్థానాలు ఉండేవి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 6 జిల్లాల వ్యాప్తం గా 804 స్థానాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసి అభ్యర్థలను స్వీకరించారు. వాటిని పరిశీలించి మొత్తంగా ఎంపీటీసీల స్థానాలను గుర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,80,971 జనాభా ఉంది. దీని ఆధారంగానే ఎంపీటీసీల స్థానాలను అధికారులు గు ర్తించారు. ప్రతి ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఎన్నిల నిబంధనల ప్రకారం 3500 జనాబా ఉండేలా జాగ్రత్త పడ్డారు. దానికి అనుగుణంగానే ఎంపీ టీసీ స్థానాలను గుర్తించారు. 2014లో ఎన్నికలు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు మినహా గ్రామాల్లో 33,07,170 జనాభా ఉంది. దీని ప్రకారం ఎంపీటీసీ స్థానాలను నిర్ధారించా రు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 982 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. గత 2014లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల 982 స్థానాలకు, 64 జె డ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో కలిశాయి. ప్రస్తుత ఉమ్మడి జిల్లాలో 27,80, 971 జనాభా ఉంది. దాని ప్రకారం ఎంపీటీ సీ స్థానాలను గుర్తించగా దాని అనుగుణం గా 804 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాడ్డాయి. 71 జెడ్పీటీసీలు స్తానాలు... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 20 జెడ్పీటీసీ స్థానాలు పెరగనున్నాయి. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి మండల ప్రాదేశీక నియోజకవర్గానికి ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటుచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ముసాపేట్, రాజాపూర్, గండీడ్ (రంగారెడ్డి నుంచి జిల్లాలో కలిసింది), గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోలీ, కేటీ దొడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలో పెంట్లవెల్లి, ఊ ర్కొండ, చారకొండ, పదర, నారాయణ పేట్ జిల్లాలో కృష్ణ, మరికల్, వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అమరచింత మండలాలు కొత్తగా ఏర్పాడ్డాయి. వీటికి అధికారులు జెడ్పీటీసీ స్థానాలుగా గుర్తించి వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. నివేదికలోని ప్రధాన అంశాలు.. జెడ్పీటీసీ, ఎంపీసీటీ పునర్ విభజన స్థానా ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయగా 71 జెడ్పీటీసీ, 804 ఎంపీటీసీ స్థానాలుగా అధికారులు గుర్తించారు. ఇలా గుర్తించిన పూర్తి స్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్ అప్రొవల్తో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించిన తదుపరి ఆదేశాల మేరకు అధికారులు ఎన్నికల కసరత్తు ప్రారంభిస్తారు. ఏప్రిల్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేసన్లను ఖరా రు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండలాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అధికారులు మండలాల వారీగా ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నియోజకవర్గాల వారీగా ఓటరుజాబితాను సిద్ధం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడిచింది. ఈ జాబితా పూర్తి కాగానే పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తారు. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రకియను మొదలు పెడతారు. -
ఇద్దరి మద్దతుంటే చాలు ఎంపీపీ కావొచ్చు!
కొత్తగా ఏర్పడిన ఏర్గట్ల మండలంలో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కారణంగా కేవలం ఐదు ఎంపీటీసీ స్థానాలే వచ్చాయి. దీంతో ఇక్కడ కేవలం ఇద్దరంటే ఇద్దరు ఎంపీటీసీల మద్దతు కూడగడితే చాలు ఎం పీపీ పదవి దక్కించుకోవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలో 18,554 జనాభా ఉండగా, ప్రతి 3,500 జనాభాకు ఒకటి చొప్పున ఎంపీటీసీ స్థానాలను పునర్విభజన చేసిన అధికార యంత్రాంగం ఈ మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. కామారెడ్డి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మద్దతిస్తే సరిపోతుంది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో ఈ మండలంలో కేవలం ఆరు స్థానాలు మాత్రమే మిగిలాయి. కామారెడ్డి మండలంలో 22,232 జనాభా ఉండగా.. ప్రతి 3,500 జనాభాకు ఒకటి చొప్పున పునర్విభజన చేసిన అధికారులు ఈ మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాలను ప్రకటించారు.ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ఏమో కానీ ఎంపీపీ పదవి సులువుగా దక్కించుకునే అవకాశం లభించ నుంది. ఇద్దరు, ముగ్గురు ఎంపీటీసీల మద్దతుంటే చాలు మండల పీఠం అధిష్టించే చాన్స్ దక్కనుంది. పునర్విభ జనలో భాగంగా అధికారులు 3,500 జనాభాకు ఒకటి చొప్పున ఎంపీటీసీ స్థానాలను ప్రకటించారు. ఫలితంగా కొన్ని మండలాల్లో అత్యల్పంగా ఐదు, ఆరు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే మిగిలాయి. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) పునర్విభజన జిల్లాలో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఎంపీపీ పదవి దక్కాలంటే తక్కువలో తక్కువ పది నుంచి 15 మంది ఎంపీటీసీల మద్దతు కూడగట్టాల్సి వచ్చేది. ఆయా మండలాల్లో çకనీసం 20కి పైగా ఎంపీటీసీ స్థానాలుండేవి. వారిని ప్రత్యేక వాహనాల్లో క్యాంపులకు తరలించడం.. పెద్ద ఎత్తున నజరానాలు ముట్టజెప్పడం.. అందులో నుంచి ఒకరిద్దరు సభ్యులు ప్రత్యర్థి క్యాంపులోకి వెళ్లడం వంటి పరిణామాలు చోటు చేసుకునేవి. కానీ ఇకపై ఈ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. చిన్న మండలాల్లో ఇద్దరు, ముగ్గురు ఎంపీటీసీల మద్దతుతో మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యే రోజులు వచ్చేశాయి. 25న తుది జాబితా విడుదల.. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై కసరత్తు పూర్తి చేసిన జిల్లా, మండల పరిషత్ అధికారులు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 327 ఎంపీటీసీ స్థానాలుండగా, పునర్విభనతో ఈ సంఖ్య 299కి తగ్గింది. అంటే 28 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. అలాగే, కామారెడ్డి పరిధిలో గతంలో 256 ఎంపీటీసీ స్థానాలుండగా 20 స్థానాలు తగ్గి 236కు చేరింది. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లను అధికారులు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ పునర్విభజనపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆయా మండలాల ఎంపీడీవోలు శుక్రవారం స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 23, 24 తేదీల్లో పరిశీలించి, 25న తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ పునర్విభజనతో నాలుగైదు గ్రామాలకు కలిసి ఒక ఎంపీటీసీ స్థానం కేటాయించడం విశేషం. ఎమ్మెల్యేల ఆరా.. పునర్విభజన ప్రక్రియపై జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ఆరా తీశారు. ఈ పునర్విభజనతో వారి నియోజకవర్గాల పరిధిలోని మండల పరిషత్‌ల స్థానాలు ఏ విధంగా మారాయనే అంశాన్ని కొందరు ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించారు. కాగా జూన్ 13న ఎంపీపీల పదవీ కాలం ముగియనుంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తులో భాగంగా పునర్విభజన ప్రక్రియను చేపట్టిన విషయం విదితమే. ఈ నెల 25 తర్వాత ఎంపీటీసీ స్థానాలపై స్పష్టత రానుంది. -
మురుగు కాలువలు శుభ్రం చేసిన ఎంపీటీసీ సభ్యుడు
నంగునూరు(సిద్దిపేట) : గ్రామంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని చూసి చలించిన ఎంపీటీసీ సభ్యుడు శుక్రవారం మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటన నంగునూరులో చోటు చేసుకుంది. మండల కేంద్రం నంగునూరులోని పలు కాలనీల్లో మురికి కాలువలు అపరిశుభ్రంగా మారాయి. కొన్ని నెలలుగా శుభ్రం చేయకపోవడంతో చెత్త, చెదారం నిండిపోయి అపరిశుభ్రంగా మారడంతో దోమలు వ్యాప్తి చెందాయి. వాటిని శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్నా స్పందించలేదు. విసుగెత్తిన గ్రామస్తులు ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు సౌడిచర్ల జయపాల్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. స్పందించిన జయపాల్‌రెడ్డి శుక్రవారం గ్రామ యువకులతో కలిసి ఒకటవ వార్డులో మురికి కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఆరు నెలలుగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. శ్రమదానం చేసేందుకు యువకులు ముందుకురావడంతో వీధులను శుభ్రం చేశామని చెప్పారు. పదిరోజులపాటు శ్రమదానం చేసి అన్ని మురికి కాలువలను శుభ్రం చేస్తామన్నారు. ఎంపీటీసీ సభ్యుడు చూపిన చొరవతో కాలనీ పరిశుభ్రంగా మారిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఆ ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు
నాగర్ కర్నూలు : తాడూరు ఎంపీటీసి విజయలక్ష్మీ ఎన్నిక చెల్లదంటూ నాగర్ కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి శుక్రవారం తీర్పుచెప్పారు. మళ్లీ కొత్తగా ఎన్నికల నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు కోర్టు సూచించింది. 2014 సంవత్సరంలో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు, కౌటింగ్ ఓట్లకు నాలుగు ఓట్లు తేడా రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి న్యాయం కోసం కోర్టుకు వెళ్లింది. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ లక్ష్మీ పై 2 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి రేణుక ఓడిపోయింది. స్వల్పతేడాతో ఓడిపోవడం, ఆ ఓట్లకు ప్రాధాన్యత ఉండటంతో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
పెద్దపంజాణిలో వైఎస్సార్సీపీ కేతనం
- చక్రం తిప్పిన ఎమ్మెల్యే - ఎంపీపీగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుడు మురళీకృష్ణ - మండల ఉపాధ్యక్షురాలిగా సుమిత్ర పలమనేరు: అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెద్దపంజాణి మండల ఎంపీపీ కుర్చీ వైఎస్ఆర్ సీపీ ఖాతాలో చేరింది. దీంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు టీడీపీ, ఆరు వైఎస్ఆర్ సీపీ, నలుగురు స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల మద్దతుతో ఎంపీపీ పీఠం దక్కించుకోవాలని టీడీపీ ఎత్తుగడ వేసింది. వారికి సారధ్యం వహించిన స్వతంత్ర అభ్యర్థి, ఎంఎల్సీ సోదరుడు విజయభాస్కర్‌రెడ్డి సహకారం తీసుకోవాలని భావించారు. ఇటీవలి పరిణామాలతో సీన్ పూర్తిగా మారిపోయింది. విజయభాస్కర్ రెడ్డి ఎంపీపీ అభ్యర్థిత్వాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకించినట్లు సమాచారం. ఏడుగురు టీడీపీ సభ్యుల్లో ఇద్దరు ఎంపీపీ కుర్చీపై కన్నేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పార్టీ నాయకులు చెంగారెడ్డి, రోజారెడ్డి చక్రం తిప్పడంతో అనూహ్యంగా ముగ్గురు స్వతంత్ర ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు. దీంతో వైఎస్ఆర్సీపీ బలం తొమ్మిదికి చేరుకుంది. టీడీపీ నుంచి ఎంపీపీగా నామినేషన్ వేసిన రామచంద్రకు ఏడుగురు సభ్యులు మద్దతు తెలిపినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో కోగిలేరు ఎంపీటీసీ సభ్యుడు మురళీకృష్ణ వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికిన ఇండిపెండెంట్ల ప్యానెల్ నుంచి అమ్మరాజుపల్లె ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర మండల ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఓటింగ్‌కు స్వతంత్రుల ప్యానల్ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ కంగుతినింది.