ఎంపీటీసీ సభ్యురాలి బలవన్మరణం | Mptc Commited Suicide In Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ సభ్యురాలి బలవన్మరణం

Published Thu, Jul 11 2019 8:31 AM | Last Updated on Thu, Jul 11 2019 8:31 AM

Mptc Commited Suicide  In Mahabubnagar - Sakshi

మృతదేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి తదితరులు

సాక్షి, పెబ్బేరు (కొత్తకోట): ఉన్నత విద్యావంతురాలైన ఓ యువ ప్రజాప్రతినిధి కుటుంబ కలహాలతో అకాలంగా మృత్యుఒడికి చేరింది. గెలుపును పూర్తిగా ఆస్వాదించకుండా.. గ్రామాభివృద్ధికి తనవంతుగా సహాయపడకుండానే అనంతవాయువులో కలిసిపోయింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని గుమ్మడంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య కూతురు రజిత(23) ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందింది.

అయితే సోమవారం సాయంత్రం ఇంట్లో తల్లిదండ్రులతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి రజిత వ్యవసాయం కోసం తెచ్చిన పురుగు (గడ్డి) మందు తాగి అస్వస్థతకు గురైంది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే పెబ్బేరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ వెంకటేశ్వరరావు, శ్రీరంగాపురం ఎస్‌ఐ ఎండీ షఫీ, ఏఎస్‌ఐ జయన్న అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహానికి వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఉన్నత విద్యావంతురాలు 
గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య టీఆర్‌ఎస్‌ నాయకుడు. ఈయన కూతురు రజిత చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. ఎంఫార్మసీ పూర్తిచేసింది. ఈ క్రమంలో ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామం నుంచి ఉన్నత విద్యావంతురాలైన రజిత టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీలో నిలిచి 18 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈ నెల 4న పెబ్బేరు మండల పరిషత్‌ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, అధికారుల సమక్షంలో ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసింది. అయితే ఉన్నత విద్యావంతురాలైన రజిత గ్రామాభివృద్ధికి బాటలు వేస్తారని ఊహించిన గ్రామస్తులకు తీరని విషాదం మిగిల్చి అనంతలోకాలకు వెళ్లిపోయింది. రజిత అకాల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మంత్రి నివాళి..
ఎంపీటీసీ సభ్యురాలు రజిత మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ, ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

జెడ్పీచైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కౌన్సిలర్‌ శ్రీధర్, పెబ్బేరు జెడ్పీటీసీ సభ్యురాలు పద్మ, ఎంపీపీ ఆవుల శైలజ, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బుచ్చారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్రెస్వామి, మాజీ ఎంపీపీ పద్మావతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు హరిశంకర్‌నాయుడు, నాయకులు సంతోష్, బాల్‌రాం, రాములు, గోపాల్, బీచుపల్లి, శాంతన్న, భారతి, అక్కమ్మ, జ్యోతి, ఎల్లయ్య, ఎల్లారెడ్డి, శివశంకర్‌గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు రజిత భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement