niranjanreddy
-
రాజ్యాంగంపై చర్చ.. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కీలక ప్రసంగం
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 81,82 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం(డిసెంబర్16) రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో నిరంజన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తగిన ప్రోత్సాహం ఉండాలి. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో మా రాష్ట్రాల అభిప్రాయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నికల సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోజురోజుకి ఎన్నికల ఖర్చు భారీగా పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీకి దిగాలంటే ఖర్చును చూసి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తగిన చట్టాలు రావాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టాలలో తగిన మార్పులు రావాలి. నాణ్యమైన విద్య,వైద్యం తమ పిల్లలకు అందించే క్రమంలో తల్లిదండ్రులు పేదరికంలోకి జారుకుంటున్నారు. పేదరికానికి ప్రధాన కారణాలు విద్య,వైద్యం ఖర్చు పెరగడమే. దేశంలో ఆర్థిక అసమానతలు,ఆదాయ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి.రాజ్యాంగ ఉద్దేశాలు ఇంకా పరిపూర్ణంగా సాధించలేదు. రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కనుక రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి.సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పని భారం పెరుగుతోంది.141 కోట్ల జనాభాకు కేవలం 35 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులున్నారు. ట్రిబ్యునల్స్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకే అప్పీల్‌కు వెళ్లకుండా, హైకోర్టులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి’అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోంది: ఎంపీ విజయసాయిరెడ్డి -
నెక్స్ట్ ఏంటి
-
అదొక్కటే కరోనా నియంత్రణకు మూలం
సాక్షి, నాగర్ కర్నూల్ : గృహ నిర్బంధమే కరోనా నియంత్రణకు మూలమని, ప్రజలు ఎవరికి వారుగా సామాజిక దూరం పాటించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా స్థాయి సమీక్షాసమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరోనా కట్టడికి జిల్లాలో ఏర్పాట్లు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసర సరుకులు బ్లాక్ మార్కెట్ చేసి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూరగాయల మార్కెట్, కిరాణం షాపు వద్ద శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. మామిడి ఇతర ప్రాంతాలకు ఎగుమతి లేని దృష్ట్యా మామిడి మాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అనాథలు, బిచ్చగాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భోజన వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. -
ఎంపీటీసీ సభ్యురాలి బలవన్మరణం
సాక్షి, పెబ్బేరు (కొత్తకోట): ఉన్నత విద్యావంతురాలైన ఓ యువ ప్రజాప్రతినిధి కుటుంబ కలహాలతో అకాలంగా మృత్యుఒడికి చేరింది. గెలుపును పూర్తిగా ఆస్వాదించకుండా.. గ్రామాభివృద్ధికి తనవంతుగా సహాయపడకుండానే అనంతవాయువులో కలిసిపోయింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని గుమ్మడంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య కూతురు రజిత(23) ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందింది. అయితే సోమవారం సాయంత్రం ఇంట్లో తల్లిదండ్రులతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి రజిత వ్యవసాయం కోసం తెచ్చిన పురుగు (గడ్డి) మందు తాగి అస్వస్థతకు గురైంది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ వెంకటేశ్వరరావు, శ్రీరంగాపురం ఎస్ఐ ఎండీ షఫీ, ఏఎస్ఐ జయన్న అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహానికి వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఉన్నత విద్యావంతురాలు గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య టీఆర్ఎస్ నాయకుడు. ఈయన కూతురు రజిత చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. ఎంఫార్మసీ పూర్తిచేసింది. ఈ క్రమంలో ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామం నుంచి ఉన్నత విద్యావంతురాలైన రజిత టీఆర్ఎస్ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీలో నిలిచి 18 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈ నెల 4న పెబ్బేరు మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, అధికారుల సమక్షంలో ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసింది. అయితే ఉన్నత విద్యావంతురాలైన రజిత గ్రామాభివృద్ధికి బాటలు వేస్తారని ఊహించిన గ్రామస్తులకు తీరని విషాదం మిగిల్చి అనంతలోకాలకు వెళ్లిపోయింది. రజిత అకాల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంత్రి నివాళి.. ఎంపీటీసీ సభ్యురాలు రజిత మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ, ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జెడ్పీచైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్, పెబ్బేరు జెడ్పీటీసీ సభ్యురాలు పద్మ, ఎంపీపీ ఆవుల శైలజ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్రెస్వామి, మాజీ ఎంపీపీ పద్మావతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హరిశంకర్‌నాయుడు, నాయకులు సంతోష్, బాల్‌రాం, రాములు, గోపాల్, బీచుపల్లి, శాంతన్న, భారతి, అక్కమ్మ, జ్యోతి, ఎల్లయ్య, ఎల్లారెడ్డి, శివశంకర్‌గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు రజిత భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
రంగస్థలం రెడీ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల రణరంగం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారం ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు సైతం ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇలా దాదాపు అన్ని చోట్ల కూడా రెబెల్స్ బెడద తప్పేలా లేదు. అలాగే మహాకూటమి పొత్తులో భాగంగా కేటాయించిన స్థానాల్లో సైతం స్నేహపూర్వక పోటీతో బరిలో నిలుస్తుండడంతో ఆసక్తి నెలకొంది. అంతేకాక ఎన్నికల పోరులో హేమాహేమీలు, దాదాపు అన్ని పార్టీల నుంచి అందరూ పాత కాపులే బరిలోకి దిగడంతో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. మొత్తం మీద ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయనే చెప్పాలి. అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెబెల్స్‌తో ఉక్కిరిబిక్కిరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులను రెబెల్స్ బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చాలాచోట్ల టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు సైతం బరిలోకి దిగారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ రెబెల్‌గా మక్తల్ నియోజకవర్గం నుంచి ఎం.జలందర్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఒక్క స్థానం మినహా ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు పెద్దగా రెబెల్స్ బెడద లేదు. అయితే మహాకూటమి నుంచి మాత్రం చాలా చోట్ల రెబెల్స్ బెడద పట్టి పీడిస్తోంది. ఒక్క మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉంది.కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ కార్యదర్శలు మారేపల్లి సురేందర్‌రెడ్డి ఎన్సీపీ నుంచి సయ్యద్ ఇబ్రహీం బీఎస్పీ నుంచి నామినేషన్లు వేశారు. అలాగే తెలంగాణ ఇంటి పార్టీనేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. వీరితో పాటు మహాకూటమిలో భాగస్వామ్యమైన తెలంగాణ జన సమితి నుంచి జి.రాజేందర్‌రెడ్డి పార్టీ బీ–ఫాంతో మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా నారాయణపేటలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన కుంభం శివకుమార్‌రెడ్డి... రూటు మార్చి బీఎల్ఎఫ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దేవరకద్రలో కాంగ్రెస్ టికెట్ ఆశించిన న్యాయవాది జి.మధుసూదర్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇలా మొత్తం మీద రెబెల్స్ అభ్యర్థులు ప్రధాన పోటీదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. - మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యనేతలందరూ బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, మహాకూటమి తరఫున మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎర్రశేఖర్, టీజేఎస్ నుంచి జి.రాజేందర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు టిక్కెట్ ఆశించి భంగపడిన వారిలో టీపీసీసీ కార్యదర్శులు మారేపల్లి సురేందర్‌రెడ్డి, సయ్యద్ ఇబ్రహీం సైతం పోరులో నిలుస్తున్నారు. సురేందర్‌రెడ్డి ఎన్సీపీ నుంచి, పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలవుతున్న సయ్యద్ ఇబ్రహీం బీఎస్పీ బీ–ఫాం తెచ్చుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వీరితో పాటు బీజేపీ తరఫున జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి కూడా పోటీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలా అందరూ హేమాహేమీలు బరిలో నిలవడంతో మహబూబ్‌నగర్ అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. - జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డితో పాటు కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే మల్లు రవి మధ్య పోరు ఉండే అవకాశం ఉంది. వీరితో పాటు బీజేపీ తరఫున మధుసూదన్‌యాదవ్ తదితరులతో పాటు స్వతంత్రులు బరిలో ఉన్నారు. అయితే, ఇక్కడ రెబెల్స్ బెడద లేకపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డికి సౌమ్యుడిగా మంచి పేరు ఉండటంతో విపక్ష పార్టీల అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని చెబుతున్నారు. - దేవరకద్ర నియోజకవర్గంలో పోరు కాస్త హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. అయితే మహాకూటమి నుంచి కాంగ్రెస్ నేత డోకూరు పవన్‌కుమార్‌కు టిక్కెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో కూడా ఇద్దరు తలపడటం... ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో కేడర్‌కు అందుబాటులో ఉండటంతో పవన్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించి భంగపడిన హైకోర్టు న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో దేవరకద్రలో సైతం పోరు ఆసక్తికరంగా మారింది. - మక్తల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు రెబెల్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బరిలో ఉన్నారు. అయితే చిట్టెం అభ్యర్థిత్వంపై తిరుగుబాటు చేసిన టీఆర్ఎస్ నేతలు... రెబెల్‌గా ఎం.జలందర్‌రెడ్డిని బరిలో నిలిపారు. అలాగే మహాకూటమి తరఫున టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ తరఫున కూడా బలమైన నేత కొండయ్య బరిలో ఉన్నారు. ఇలా మొత్తం మీద మక్తల్ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. - నారాయణపేట నియోజవర్గంలో ఎన్నికల పోరు కొత్త రూపం సంతరించుకుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన కుంభం శివకుమార్‌రెడ్డి బీఎల్ఎఫ్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి టీఆర్ఎస్ తరఫున మరోసారి బరిలో నిలిచారు. వీరితో పాటు కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన సరాఫ్ కృష్ణ సైతం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే నియోజకవర్గంలో కాస్త బలంగా ఉన్న బీజేపీ తరఫున కె.రతంగ్‌పాండు రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇలా మొత్తం మీద పేట నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొన్నట్లయింది. - రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కొడంగల్ పోరు సైతం ఉత్కంఠ భరితంగా మారింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున ఎనుముల రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తంగా మారింది. ఇరువురు నేతలు నిత్యం బలప్రదర్శనతో యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. అలాగే బీజేపీ తరఫున సీనియర్‌నేత నాగూరావ్ నామాజీ పోటీ చేస్తున్నారు. - నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉద్దండులు తలపడుతున్నారు. ఇక్కడి నుంచి ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బరిలో నిలిచారు. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి అత్యంత సీనియర్‌నేత నాగం జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా బలమైన నేతలు కావడంతో పోరు రసవత్తరంగా మారింది. అలాగే బీజేపీ తరఫున దిలీప్ ఆచారి కూడా కాస్త ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. - కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పోరు రణరంగాన్ని తలపిస్తోంది. ఇక్కడి నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన జూపల్లి కృష్ణారావుకు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రతీసారి జూపల్లికి తన ఎన్నికల ప్రత్యర్థి మారుతుండటంతో సులువుగా గెలుపొందే వారు. కానీ ఈసారి మాత్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తే.. మళ్లీ బరిలోకి దిగడంతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బీజేపీ తరఫున ఎల్లేటి సుధాకర్‌రావు కూడా కాస్త ప్రభావం చూపుతారని తెలుస్తోంది. - అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు మరోసారి బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున మల్లేశ్వర్ ఇలా ఇతర పక్షాల నేతలు బరిలో నిలిచినప్పటికీ పోరు మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉండనుంది. ఇక్కడి నుంచి గెలుపొందే అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుందనే సెంటిమెంట్ ఉండటంతో ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. - రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న కల్వకుర్తి నియోజకవర్గ పోరు కూడా త్రిముఖంగా మారింది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి టి.ఆచారి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కృషిచేస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, కాంగ్రెస్ తరఫున చల్లా వంశీచంద్‌రెడ్డి బరిలో ఉన్నారు. - వనపర్తి నియోజకవర్గం నుంచి ఈసారి ఉద్దండులు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండగా.. ఈసారి మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి మధ్య గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈసారి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో పోరు ఆసక్తికరంగా మారింది. - అలంపూర్ నియోజకవర్గంలో కూడా రెండు పార్టీల మధ్య పోరు నువ్వా – నేనా అన్నట్లుగా మారింది. కాంగ్రెస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే అబ్రహం పోటీలో ఉన్నారు. ఇరువురు కూడా గట్టిగా తలపడుతుండడంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది. - రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాలలో గద్వాల ఒకటి. ఇక్క డి నుంచి మాజీ మంత్రి డీకే.అరుణ కాంగ్రెస్ తర ఫునే పోటీలో ఉండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఇప్పటికే మూడు సార్లు వరుసగా విజయం సాధిస్తున్న డీకే అరుణ... మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూసిన టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి తలపడేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా మొత్తం మీద గద్వాల్ నియోజకవర్గం పోరు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
పైచేయి సాధనకే అరుణ డ్రామాలు
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి వనపర్తిటౌన్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అధిపత్య, వర్గపోరులో తనది పైచేయిగా సాధించాలనే తాపత్రయంలో భాగంగానే అరుణమ్మ దీక్షల పేరిట డ్రామాలు చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో సకల జనులు పోరులో ఉంటే సొంత ఎజెండాతో దొంగలా తప్పించుకు తిరిగారని శనివారం పట్టణంలో నిరంజ¯Œæరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు వ్యతిరేకంగా వెకిలి మాటలు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటులో భాగంగా అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు గద్వాలపై ఎందుకు మాట్లాడలేదని అన్నారు. గద్వాల జిల్లాకు కనీసం 12మండలాల మద్దతు లేదని, అరుణమ్మ పాదయాత్ర చేస్తే అలంపూర్‌కు చెందిన సురవరంను ఎమ్మెల్యేగా చేసిన వనపర్తిలో ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. మంచి వ్యక్తిఅయిన ఎమ్మెల్యే సంపత్‌ను వెంటబెట్టుకొని పాటలు, ఫ్లెక్సీలు పెట్టుకుంటుందని, వెట్టి చేసే కాడా అందరూ కావాలనే అరుణమ్మ కీర్తి మాత్రం తనొక్కతే వీరవనిత పాటలు వేసుకోవడం దారుణమని, ఎమ్మెల్యే సంపత్‌కు గౌరవం ఇవ్వారా అని ప్రశ్నించారు. అరుణమ్మను నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. గద్వాల, అలంపూర్ ప్రజలు వనపర్తి జిల్లా కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గౌని బుచ్చారెడ్డి, లక్ష్మారెడ్డి, గట్టుయాదవ్, బి. లక్ష్మయ్య, సర్దార్‌ఖాన్, భీమ్‌రెడ్డి, రాజేశ్వరమ్మ, వాకిటి శ్రీధర్, సతీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిరంజన్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకో!
⇒ ఎమ్మెల్యే డీకే అరుణ హెచ్చరిక గద్వాల(మహబూబ్ నగర్) : ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరస్కరించిన నాయకుడు నిరంజన్‌రెడ్డి.. అలాంటి వ్యక్తి నడిగడ్డ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఊరుకోమని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బావుంటుందని ఎమ్మెల్యే డీకే అరుణ హెచ్చరించారు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవనంలో జేఏసీ నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. ప్రతిపాదిత వనపర్తి జిల్లా కోసం 21 మండలాల్లో 18 మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు లేఖలు ఇచ్చి సంబరాల్లో పాల్గొన్నారని నిరంజన్‌రెడ్డి పేర్కొనడం పట్ల డీకే అరుణ మండిపడ్డారు. వనపర్తి జిల్లా కోసం లేఖలు ఇచ్చిన వారిలో నడిగడ్డ ప్రాంతానికి చెందిన వారి పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు మారే జెడ్పీటీసీల లేఖలకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే.. రెండు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు గద్వాల జిల్లా కోసం ఇచ్చిన లేఖలపై సమాధానం చెప్పాలని, ఆ లేఖలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జెడ్పీటీసీలు ఇచ్చిన లేఖలకు ప్రాధాన్యం ఉంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు తీసుకోవడం ఎందుకని నిలదీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్‌ల సమయాన్ని ఎందుకు వృ«థా చేస్తున్నారని ప్రశ్నించారు. నిరంజన్‌రెడ్డిని గెలిపిస్తే వనపర్తి జిల్లా వస్తుందని సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జిల్లా ఇస్తామన్నా వనపర్తి ప్రజలు నిరంజన్‌రెడ్డిని ఓడగొట్టారని, టీఆర్ఎస్ పార్టీకి విశ్వసించలేదని చెప్పారు. ఈ ప్రజాతీర్పు చాలదా అని నిలదీశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికైనా విధి విధానాలు ప్రకటించి, ఏ ప్రాతిపదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 3,4వ తేదీలలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో చేపట్టే నిరాహార దీక్షకు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలపాలని డీకే అరుణ కోరారు. -
పుష్కరాలకు రూ.860 కోట్లు
మునగమాన్‌దిన్నె ఘాట్ : కష్ణా పుష్కరాలకు ప్రభుత్వం రూ.860 కోట్లు కేటాయించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ నిధులతో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్లలో అన్ని వసతులు కల్పించామన్నారు. శుక్రవారం పుష్కరాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మునగమాన్‌దిన్నె ఘాట్‌ను సందర్శించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తదుపరి ప్రజలు మొదటిసారి పుష్కరాల్లో సంతోషంగా పాల్గొంటున్నారన్నారు. సుమారు 500మంది ఉద్యోగులను ఇక్కడ నియమించి ప్రజలకు ఎలాంటి లోటులేకుండా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో వ్యవసాయ పనులు సాగుతున్నందున రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గోవిందునాయుడు, పీఎసీఎస్ అధ్యక్షుడు కోదండరామిరెడ్డి, వనపర్తి కౌన్సిలర్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ నాయకుడు బీచుపల్లియాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
'దేవి మృతిపై ఇంకా అనుమానాలున్నాయి'
హైదరాబాద్: తన కూతురి మృతిపై ఇంకా అనుమానాలున్నాయని రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి తండ్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఘటన పై పోలీసులు చక్కగా వివరించారన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్‌ను నమ్ముతున్నానని నిరంజన్ రెడ్డి తెలిపారు. కానీ, ఓ ఆటో మొబైల్ ఇంజినీర్‌గా ప్రమాదంపై తనకు ఇంకా కొన్ని అనుమానాలున్నాయన్నారు. అన్ని కోణాల్లో విచారించాక దేవి మృతికి ప్రమాదమే కారణమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.