మాట్లాడుతున్న ఎమ్మెల్యే డీకే అరుణ
నిరంజన్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకో!
Published Fri, Sep 2 2016 10:52 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
⇒ ఎమ్మెల్యే డీకే అరుణ హెచ్చరిక
గద్వాల(మహబూబ్ నగర్) : ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరస్కరించిన నాయకుడు నిరంజన్‌రెడ్డి.. అలాంటి వ్యక్తి నడిగడ్డ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఊరుకోమని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బావుంటుందని ఎమ్మెల్యే డీకే అరుణ హెచ్చరించారు. గురువారం స్థానిక టీఎన్‌జీఓ భవనంలో జేఏసీ నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. ప్రతిపాదిత వనపర్తి జిల్లా కోసం 21 మండలాల్లో 18 మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు లేఖలు ఇచ్చి సంబరాల్లో పాల్గొన్నారని నిరంజన్‌రెడ్డి పేర్కొనడం పట్ల డీకే అరుణ మండిపడ్డారు.
వనపర్తి జిల్లా కోసం లేఖలు ఇచ్చిన వారిలో నడిగడ్డ ప్రాంతానికి చెందిన వారి పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు మారే జెడ్పీటీసీల లేఖలకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే.. రెండు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు గద్వాల జిల్లా కోసం ఇచ్చిన లేఖలపై సమాధానం చెప్పాలని, ఆ లేఖలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జెడ్పీటీసీలు ఇచ్చిన లేఖలకు ప్రాధాన్యం ఉంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు తీసుకోవడం ఎందుకని నిలదీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్‌ల సమయాన్ని ఎందుకు వృ«థా చేస్తున్నారని ప్రశ్నించారు. నిరంజన్‌రెడ్డిని గెలిపిస్తే వనపర్తి జిల్లా వస్తుందని సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
జిల్లా ఇస్తామన్నా వనపర్తి ప్రజలు నిరంజన్‌రెడ్డిని ఓడగొట్టారని, టీఆర్‌ఎస్ పార్టీకి విశ్వసించలేదని చెప్పారు. ఈ ప్రజాతీర్పు చాలదా అని నిలదీశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికైనా విధి విధానాలు ప్రకటించి, ఏ ప్రాతిపదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 3,4వ తేదీలలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో చేపట్టే నిరాహార దీక్షకు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలపాలని డీకే అరుణ కోరారు.
Advertisement
Advertisement