TNGO office
-
మెగా రక్తదాన శిబిరం ప్రారంభం
నాంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఎన్జీఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేన్(ముజీబ్) ఆధ్వర్యంలో గురువారం నాంపల్లి, గృహకల్ప భవన సముదాయంలో 6వ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రక్త దానం చేశారు. అనంతరం మాట్లాడుతూ టీఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. టీఎన్జీఓ ఉద్యోగులు భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా 730 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఉమాదేవి, తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నిరంజన్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకో!
⇒ ఎమ్మెల్యే డీకే అరుణ హెచ్చరిక గద్వాల(మహబూబ్ నగర్) : ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరస్కరించిన నాయకుడు నిరంజన్‌రెడ్డి.. అలాంటి వ్యక్తి నడిగడ్డ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఊరుకోమని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బావుంటుందని ఎమ్మెల్యే డీకే అరుణ హెచ్చరించారు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవనంలో జేఏసీ నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. ప్రతిపాదిత వనపర్తి జిల్లా కోసం 21 మండలాల్లో 18 మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు లేఖలు ఇచ్చి సంబరాల్లో పాల్గొన్నారని నిరంజన్‌రెడ్డి పేర్కొనడం పట్ల డీకే అరుణ మండిపడ్డారు. వనపర్తి జిల్లా కోసం లేఖలు ఇచ్చిన వారిలో నడిగడ్డ ప్రాంతానికి చెందిన వారి పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు మారే జెడ్పీటీసీల లేఖలకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే.. రెండు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు గద్వాల జిల్లా కోసం ఇచ్చిన లేఖలపై సమాధానం చెప్పాలని, ఆ లేఖలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జెడ్పీటీసీలు ఇచ్చిన లేఖలకు ప్రాధాన్యం ఉంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు తీసుకోవడం ఎందుకని నిలదీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్‌ల సమయాన్ని ఎందుకు వృ«థా చేస్తున్నారని ప్రశ్నించారు. నిరంజన్‌రెడ్డిని గెలిపిస్తే వనపర్తి జిల్లా వస్తుందని సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జిల్లా ఇస్తామన్నా వనపర్తి ప్రజలు నిరంజన్‌రెడ్డిని ఓడగొట్టారని, టీఆర్ఎస్ పార్టీకి విశ్వసించలేదని చెప్పారు. ఈ ప్రజాతీర్పు చాలదా అని నిలదీశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికైనా విధి విధానాలు ప్రకటించి, ఏ ప్రాతిపదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 3,4వ తేదీలలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో చేపట్టే నిరాహార దీక్షకు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలపాలని డీకే అరుణ కోరారు. -
హైదరాబాద్ సిర్ఫ్ హమారా
సంగారెడ్డి/హైదరాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్‌ను వదులుకునే ప్రసక్తేలేదని టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కలెక్టరేట్, హైదరాబాద్‌లోని టీఎన్జీవో కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం కొనసాగేందుకు కేంద్రం నాన్చుడు ధోరణే కారణమన్నారు. ఏపీఎన్జీవోల నేత ‘అబద్ధాల అశోక్‌బాబు’ అని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను కూడా ఉద్యమంలో పాల్గొంటున్నట్టుగా ప్రభుత్వం అధిష్టానానికి నివేదిక అందిస్తోందని ఆయన ఆరోపించారు. సకల జనుల సమ్మెలో ప్రభుత్వం అనుసరించే విధానాన్నే సీమాంధ్ర ఉద్యమానికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అనే నినాదాన్ని సభ విజయవంతం ద్వారా సీమాంధ్రులకు తెలియజేయాలన్నారు. 29న నిర్వహించే సకలజన భేరిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 26న వరంగల్, 27న నల్లగొండలో భారీ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సకల జనభేరి పోస్టర్‌ను దేవీప్రసాద్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అశోక్ బాబూ.. జాగ్రత్త : శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్: తెలంగాణ ఉద్యమంపై.. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడి అవమానపరిస్తే సహించేదిలేదని తెలంగాణ జేఏసీ రాష్ట్ర కో-చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లోని టీఎన్జీవో భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎన్జీవోలది ముమ్మాటికీ ప్రభుత్వం చేయిస్తున్న ఉద్యమమే అని పేర్కొన్నారు. సీమాంధ్రుల గురించి మాట్లాడితే తమ గౌరవాన్ని కించపరుచుకున్న వారమవుతామని చెప్పారు. తెలంగాణ ప్రకటించి 53 రోజులు అవుతున్నా.. ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కాంగ్రెస్ మరోసారి మోసం చేసే అవకాశాలున్నందున, కాంగ్రెస్ నేతలు మేల్కొని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.