
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 81,82 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం(డిసెంబర్16) రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో నిరంజన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తగిన ప్రోత్సాహం ఉండాలి. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో మా రాష్ట్రాల అభిప్రాయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి.
ఎన్నికల సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోజురోజుకి ఎన్నికల ఖర్చు భారీగా పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీకి దిగాలంటే ఖర్చును చూసి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తగిన చట్టాలు రావాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టాలలో తగిన మార్పులు రావాలి. నాణ్యమైన విద్య,వైద్యం తమ పిల్లలకు అందించే క్రమంలో తల్లిదండ్రులు పేదరికంలోకి జారుకుంటున్నారు. పేదరికానికి ప్రధాన కారణాలు విద్య,వైద్యం ఖర్చు పెరగడమే.
దేశంలో ఆర్థిక అసమానతలు,ఆదాయ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి.రాజ్యాంగ ఉద్దేశాలు ఇంకా పరిపూర్ణంగా సాధించలేదు. రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కనుక రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి.సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పని భారం పెరుగుతోంది.141 కోట్ల జనాభాకు కేవలం 35 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులున్నారు. ట్రిబ్యునల్స్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకే అప్పీల్‌కు వెళ్లకుండా, హైకోర్టులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి’అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోంది: ఎంపీ విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment