
మురికి కాల్వ శుభ్రం చేస్తున్న జయపాల్‌రెడ్డి
నంగునూరు(సిద్దిపేట) : గ్రామంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని చూసి చలించిన ఎంపీటీసీ సభ్యుడు శుక్రవారం మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటన నంగునూరులో చోటు చేసుకుంది. మండల కేంద్రం నంగునూరులోని పలు కాలనీల్లో మురికి కాలువలు అపరిశుభ్రంగా మారాయి. కొన్ని నెలలుగా శుభ్రం చేయకపోవడంతో చెత్త, చెదారం నిండిపోయి అపరిశుభ్రంగా మారడంతో దోమలు వ్యాప్తి చెందాయి.
వాటిని శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్నా స్పందించలేదు. విసుగెత్తిన గ్రామస్తులు ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు సౌడిచర్ల జయపాల్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. స్పందించిన జయపాల్‌రెడ్డి శుక్రవారం గ్రామ యువకులతో కలిసి ఒకటవ వార్డులో మురికి కాలువలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఆరు నెలలుగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. శ్రమదానం చేసేందుకు యువకులు ముందుకురావడంతో వీధులను శుభ్రం చేశామని చెప్పారు. పదిరోజులపాటు శ్రమదానం చేసి అన్ని మురికి కాలువలను శుభ్రం చేస్తామన్నారు. ఎంపీటీసీ సభ్యుడు చూపిన చొరవతో కాలనీ పరిశుభ్రంగా మారిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment