ఇంటికి వెళ్లి మరీ దాడి చేసిన టీడీపీ నాయకులు
అడ్డుకున్న భార్య దుస్తులు చింపేసి దురాగతం
కాశీబుగ్గ: పలాస మండలం లక్ష్మీపురం ఎంపీటీసీ గండు మోహనరావుపై శుక్రవారం రాత్రి కిష్టుపురం గ్రామంలో హత్యాయత్నం జరిగింది. టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఎన్నికల ఫలితాల అనంతరం వారు హెచ్చరించారని, శుక్రవారం దాడికి తెగబడ్డారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫలితాలు వచ్చాక కిష్టుపురంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరకూడదంటూ సిమ్మెంట్ దిమ్మను తోసేశారు.
ఎంపీటీసీ ఇంటిపైకి బాంబులు కూడా విసిరారు. అప్పటి నుంచి మోహనరావు ఇంటికే పరిమితమైపోయారు. శుక్రవారం పొలం వైపు వెళ్దామని బయటకు రాగా అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఇనుప రాడ్డుతో ఆయన తలపై కొట్టారు. అడ్డుకున్న మేనల్లుడు సురేష్‌ను కూడా గాయపరిచారు. మోహనరావు భార్య రేణుక జాకెట్ చింపేయడంతో ఆమె ప్రాణభయంతో కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ పారినాయుడు తక్షణమే మోహనరావును ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం దాడి జరిగిన తీరుపై వివరాలు నమోదు చేసుకుని చేసుకున్నారు.
అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పలాస ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రజలు గెలిపించింది ఇందుకేనా అని ప్రశ్నించారు. దాడులు ఆపకుంటే ఈ క్షణం నుంచే రోడ్డుపైకి వస్తామని, ఓడిపోయి ఉండవచ్చు కానీ తాము బలహీనులం కాదని అన్నారు. బుధ, గురువారం ఇద్దరు వైశ్య కుటుంబాల ఇంటికి వెళ్లి బెదిరించారని, మందస మండలంలో అభిరాం అనే బూత్ ఏజెంట్‌ను భయపెట్టి వెంటాడారని ఆయన పోలీసులను ఆశ్రయించాడని, ఇప్పుడు మరో దాడి జరగడం ఘోరమన్నారు. 2014 నుంచి 2019 వరకు ఇలానే చేశారని గుర్తు చేశారు. హత్యానేరం కింద చర్యలు చేపట్టాలని లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో రోడ్డెక్కుతామని అన్నారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.
శ్రీకాకుళంలో..
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బైరివానిపేట గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శిమ్మ అప్పన్న, బగ్గు రామారావులపై టీడీపీ కార్యకర్తలు శుక్రవారం రాత్రి కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రామంలో స్వల్ప వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇదే అదనుగా భావించిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేశారు. దీంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. దీనిపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను రిమ్స్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment