- చక్రం తిప్పిన ఎమ్మెల్యే
- ఎంపీపీగా ఎన్నికైన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు మురళీకృష్ణ
- మండల ఉపాధ్యక్షురాలిగా సుమిత్ర
పలమనేరు: అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెద్దపంజాణి మండల ఎంపీపీ కుర్చీ వైఎస్‌ఆర్ సీపీ ఖాతాలో చేరింది. దీంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు టీడీపీ, ఆరు వైఎస్‌ఆర్ సీపీ, నలుగురు స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల మద్దతుతో ఎంపీపీ పీఠం దక్కించుకోవాలని టీడీపీ ఎత్తుగడ వేసింది. వారికి సారధ్యం వహించిన స్వతంత్ర అభ్యర్థి, ఎంఎల్‌సీ సోదరుడు విజయభాస్కర్‌రెడ్డి సహకారం తీసుకోవాలని భావించారు.
ఇటీవలి పరిణామాలతో సీన్ పూర్తిగా మారిపోయింది. విజయభాస్కర్ రెడ్డి ఎంపీపీ అభ్యర్థిత్వాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకించినట్లు సమాచారం. ఏడుగురు టీడీపీ సభ్యుల్లో ఇద్దరు ఎంపీపీ కుర్చీపై కన్నేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పార్టీ నాయకులు చెంగారెడ్డి, రోజారెడ్డి చక్రం తిప్పడంతో అనూహ్యంగా ముగ్గురు స్వతంత్ర ఎంపీటీసీ సభ్యులు వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు పలికారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ బలం తొమ్మిదికి చేరుకుంది. టీడీపీ నుంచి ఎంపీపీగా నామినేషన్ వేసిన రామచంద్రకు ఏడుగురు సభ్యులు మద్దతు తెలిపినప్పటికీ లాభం లేకుండా పోయింది.
దీంతో కోగిలేరు ఎంపీటీసీ సభ్యుడు మురళీకృష్ణ వైఎస్‌ఆర్‌సీపీ తరపున ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు పలికిన ఇండిపెండెంట్ల ప్యానెల్ నుంచి అమ్మరాజుపల్లె ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర మండల ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఓటింగ్‌కు స్వతంత్రుల ప్యానల్ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ కంగుతినింది.
పెద్దపంజాణిలో వైఎస్సార్‌సీపీ కేతనం
Published Sat, Jul 5 2014 4:55 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement