కొత్తగా ఏర్పడిన ఏర్గట్ల మండలంలో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కారణంగా కేవలం ఐదు ఎంపీటీసీ స్థానాలే వచ్చాయి. దీంతో ఇక్కడ కేవలం ఇద్దరంటే ఇద్దరు ఎంపీటీసీల మద్దతు కూడగడితే చాలు ఎం పీపీ పదవి దక్కించుకోవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలో 18,554 జనాభా ఉండగా, ప్రతి 3,500 జనాభాకు ఒకటి చొప్పున ఎంపీటీసీ స్థానాలను పునర్విభజన చేసిన అధికార యంత్రాంగం ఈ మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది.
కామారెడ్డి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మద్దతిస్తే సరిపోతుంది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో ఈ మండలంలో కేవలం ఆరు స్థానాలు మాత్రమే మిగిలాయి. కామారెడ్డి మండలంలో 22,232 జనాభా ఉండగా.. ప్రతి 3,500 జనాభాకు ఒకటి చొప్పున పునర్విభజన చేసిన అధికారులు ఈ మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాలను ప్రకటించారు.ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ఏమో కానీ ఎంపీపీ పదవి సులువుగా దక్కించుకునే అవకాశం లభించ నుంది. ఇద్దరు, ముగ్గురు ఎంపీటీసీల మద్దతుంటే చాలు మండల పీఠం అధిష్టించే చాన్స్ దక్కనుంది. పునర్విభ జనలో భాగంగా అధికారులు 3,500 జనాభాకు ఒకటి చొప్పున ఎంపీటీసీ స్థానాలను ప్రకటించారు. ఫలితంగా కొన్ని మండలాల్లో అత్యల్పంగా ఐదు, ఆరు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే మిగిలాయి.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) పునర్విభజన జిల్లాలో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఎంపీపీ పదవి దక్కాలంటే తక్కువలో తక్కువ పది నుంచి 15 మంది ఎంపీటీసీల మద్దతు కూడగట్టాల్సి వచ్చేది. ఆయా మండలాల్లో çకనీసం 20కి పైగా ఎంపీటీసీ స్థానాలుండేవి. వారిని ప్రత్యేక వాహనాల్లో క్యాంపులకు తరలించడం.. పెద్ద ఎత్తున నజరానాలు ముట్టజెప్పడం.. అందులో నుంచి ఒకరిద్దరు సభ్యులు ప్రత్యర్థి క్యాంపులోకి వెళ్లడం వంటి పరిణామాలు చోటు చేసుకునేవి. కానీ ఇకపై ఈ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. చిన్న మండలాల్లో ఇద్దరు, ముగ్గురు ఎంపీటీసీల మద్దతుతో మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యే రోజులు వచ్చేశాయి.
25న తుది జాబితా విడుదల..
ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై కసరత్తు పూర్తి చేసిన జిల్లా, మండల పరిషత్ అధికారులు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 327 ఎంపీటీసీ స్థానాలుండగా, పునర్విభనతో ఈ సంఖ్య 299కి తగ్గింది. అంటే 28 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. అలాగే, కామారెడ్డి పరిధిలో గతంలో 256 ఎంపీటీసీ స్థానాలుండగా 20 స్థానాలు తగ్గి 236కు చేరింది. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లను అధికారులు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ పునర్విభజనపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆయా మండలాల ఎంపీడీవోలు శుక్రవారం స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 23, 24 తేదీల్లో పరిశీలించి, 25న తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ పునర్విభజనతో నాలుగైదు గ్రామాలకు కలిసి ఒక ఎంపీటీసీ స్థానం కేటాయించడం విశేషం.
ఎమ్మెల్యేల ఆరా..
పునర్విభజన ప్రక్రియపై జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ఆరా తీశారు. ఈ పునర్విభజనతో వారి నియోజకవర్గాల పరిధిలోని మండల పరిషత్‌ల స్థానాలు ఏ విధంగా మారాయనే అంశాన్ని కొందరు ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించారు. కాగా జూన్ 13న ఎంపీపీల పదవీ కాలం ముగియనుంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తులో భాగంగా పునర్విభజన ప్రక్రియను చేపట్టిన విషయం విదితమే. ఈ నెల 25 తర్వాత ఎంపీటీసీ స్థానాలపై స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment