రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు | Tomorrow Telangana MPTC And MPTC Results | Sakshi
Sakshi News home page

రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Published Mon, Jun 3 2019 10:21 AM | Last Updated on Mon, Jun 3 2019 10:21 AM

Tomorrow Telangana MPTC And MPTC Results - Sakshi

డిచ్‌పల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మరో 24 గంటల్లో ఫలితం తేలనుంది. మరోవైపు, తమ పరిస్థితి ఏమవుతుందోనని అభ్యర్థుల్లో గుబులు నెలకొంది. ఇటీవల వెల్లడైన లోక్‌సభ ఫలితాలు అభ్యర్థులను మరింత టెన్షన్‌ పెడుతున్నాయి. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారోననే ఉత్కంఠ అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ నెలకొంది. జిల్లాలో మూడు విడతలుగా పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. మొదటి విడత నిజామాబాద్‌ డివిజన్, రెండో విడతలో బోధన్, మూడో విడతలో ఆర్మూర్‌ డివిజన్‌కు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు, జూన్‌ 7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి.. 
జిల్లాలో 27 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, మాక్లూర్‌ జెడ్పీటీసీ ఏకగ్రీవమైంది. ఇక్కడ ప్రత్యర్థులు లేకపోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇక, మిగిలిన 26 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే జిల్లాలోని 299 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం గత నెల 27వ తేదీనే ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే, ప్రస్తుత ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం నెలకు పైగా ఉండడం, అప్పటివరకు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎంపికకు సాంకేతికంగా కొన్ని అడ్డంకులు ఉండడంతో కౌంటింగ్‌ వాయిదా పడింది. చివరకు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమమైంది. జూన్‌ 4న కౌంటింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్‌ డివిజన్‌కు సంబంధించి జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ పాఠశాలలో, బోధన్‌ డివిజన్‌కు సంబంధించి బోధన్‌లోని విద్యావికాస్‌ పాఠశాలలో, ఆర్మూర్‌ డివిజన్‌కు సంబంధించి మునిపల్లి శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

లోక్‌సభ ఫలితాలతో అభ్యర్థుల్లో టెన్షన్‌.. 
ఇటీవల నిజామాబాద్‌ ఎంపీ ఎన్నికల ఫలితాల్లో జిల్లా ఓటర్లు అనూహ్య తీర్పునివ్వడం ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారోననే ఆసక్తి నెలకొంది. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించి గులాబీ జెండా ఎగురవేశారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల్లోనూ టెన్షన్‌ పెరిగింది. ఓటర్లు ఎవరిని కరుణించారోనని అందోళన చెందుతున్నారు.

రూ.లక్షలు ఖర్చు చేసినా.. 
ఎన్నడూ లేనంతగా ఈ సారి గతంలో పరిషత్‌ ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. అధికార టీఆర్‌ఎస్‌లోనే అశావహుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో టికెట్‌ దక్కని వారు చాలా చోట్ల రెబెల్‌ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు గెలుపు కోసం డబ్బును వెదజల్లారు. కొన్ని మండలాల్లో ఎంపీపీ పదవిని ఆశించిన అభ్యర్థులు తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు డబ్బులు సమకూర్చాల్సి వచ్చింది. దీనికి తోడు ఎంపీపీ పదవి ఆశిస్తున్న వారిలో చాలా మంది ముందుగా తాము ఏకగ్రీవం అయితే ఏ సమస్య ఉండదని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు, గ్రామాభివృద్ధికి కమిటీలకు ఎంతో కొంత ముట్టజెప్పి ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యేందుకు తిప్పలు పడ్డారు.

ఇక జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు తమ మండలంలోని సొంత పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు భరించాల్సి వచ్చింది. లేదంటే క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందనే భయం వారిలో నెలకొంది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసినా అసలు గెలుస్తామా లేదా అనే అందోళన ప్రస్తుతం అభ్యర్థుల్లో నెలకొంది. ఓటరు ఎటువైపు మొగ్గు చూపాడో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం, ఆ పార్టీ ఓటు బ్యాంకు పెరగడం టీఆర్‌ఎస్‌ నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. లోక్‌సభ ఫలితాలకు ముందు కచ్చితంగా పరిషత్‌ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్న అధికార పార్టీ అభ్యర్థులు ఇప్పుడు టెన్షన్‌ పడుతున్నారు.
 
పలు చోట్ల అసమ్మతి..  
టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండటంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు అనేక మంది ఉత్సాహం చూపారు. అయితే వీరిలో కొంత మందికే టికెట్లు లభించాయి. టికెట్‌ దక్కని వారిలో కొందరు నిరాశలో మునిగి పోగా, మరి కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. కొంతమంది సొంత పార్టీలోనే ఉంటూ తమ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు యత్నించారు. దీంతో అధికార పార్టీలోనే అసమ్మతి సెగలు ఎక్కువ కావడంతో క్రాస్‌ ఓటింగ్‌ జరిగి ఉంటుందనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. మరోవైపు, ఎంపీపీ పదవిపై కన్నేసిన పలువురు ఆశావహులు తమకు పోటీ వస్తారని భావించిన సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కృషి చేసినట్లు తెలిసింది. ప్రతి మండలంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఎంపీపీ పదవిని ఆశిస్తుండటంతో ఈ అంశం నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement