Counting arrangements
-
భారీ భద్రతతో కౌంటింగ్ పై నిఘా
-
తెలంగాణలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి..
-
ఓట్ల లెక్కింపునకు 4 వేల మంది సిబ్బంది
ఐజ్వాల్: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. డిసెంబర్ 3న జరిగే మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో దాదాపు 4000 మంది సిబ్బంది పాల్గొంటారని మిజోరం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మధుప్ వ్యాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల విభాగం సర్వం సిద్ధం చేసింది. కౌంటింగ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని, రాష్ట్రవ్యాప్తంగా 13 కౌంటింగ్ కేంద్రాలు, 40 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశామని సీఈవో పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలను భద్రంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 కౌంటింగ్ హాళ్లలో 399 ఈవీఎం టేబుల్స్, 56 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయని మిజోరం అదనపు సీఈవో హెచ్ లియాంజెలా తెలిపారు. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరగ్గా 80.66 శాతం ఓటింగ్ నమోదైంది. పటిష్ట భద్రత రాష్ట్రంలో డిసెంబర్ 3న జరిగే ఓట్ల కౌంటింగ్‌కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మిజోరాం డీజీపీ అనిల్ శుక్లా చెప్పారు. అన్ని ఓటింగ్ యంత్రాలు వివిధ జిల్లాల్లో భద్రంగా ఉన్నాయని, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. భద్రత కోసం సీఏపీఎఫ్, ఇతర కేంద్ర బలగాలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నాయి. అదనంగా ఐఆర్‌బీఎన్, మిజోరం సాయుధ పోలీసులను కూడా మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు. -
తూర్పుగోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు
-
జార్ఖండ్ ఫలితాలు నేడే
రాంచి: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 81 శాసనసభ స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు అయిదు దశల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తొలి ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష జేఎంఎం–కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది. రెండు పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి హోరాహోరీగా తలపడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఒక్కొక్కరు తొమ్మిదేసి ర్యాలీల్లో పాల్గొంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయిదు, ప్రియాంక గాంధీ ఒక్క ర్యాలీలో పాల్గొన్నారు. జేఎంఎం నేత ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్ సోరెన్ కీలకంగా మారారు. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ పోటీ చేసిన జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గంపైనే అందరి దృష్టీ ఉంది. 1995 నుంచి ఆయన ఈ స్థానం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. అయితే రఘుబర్ దాస్ సహచరుడు, మాజీ మంత్రి సరయూ రాయ్ బీజేపీ రెబెల్ అభ్యర్థిగా ఈ స్థానంలో నిలబడడంతో పోటీ రసవత్తరంగా మారింది. మెజార్టీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేస్తుంటే, బీజేపీ తామే తిరిగి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని ధీమాతో ఉంది. ఎవరి అంచనాలు నిజం కానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. సీసీ కెమెరాలతో లైవ్ కౌంటింగ్
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ గోదాముల్లో ఈ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా, కేంద్ర పారామిలటరీ బలగాలు పహారా కాస్తున్నాయి. అలాగే వీటి పరిసరాలన్నీ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ ఫుటేజీ మొత్తం అభ్యర్థులు లైవ్‌లో 24 గంటలు చూసుకునేలా సౌకర్యం కల్పించారు. సీసీ కెమెరాల ద్వారా ప్రసారం రేపు(గురువారం) జరగబోయే కౌంటింగ్‌లో మైక్రో అబ్జార్వర్, సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్తో పాటు మరో ముగ్గురు సహాయకులు ఉండనున్నారు. అలాగే రిటర్నింగ్ అధికారితోపాటు జిల్లా కలెక్టర్, కేంద్రం నుంచి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ సాగనుంది. ఈ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల ద్వారా ప్రసారం చేసే వెసులుబాటును ఎన్నికల అధికారులు కల్పించారు. రేపు ఉదయం 6 గంటలలోపు అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియను పూర్తి చేసుకొని 8 గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ రోజు అభ్యర్థులు, ఏజెంట్ల సమావేశంలో మాక్ కౌంటింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు రోజు ప్రత్యేకంగా జారీ చేసిన పాస్‌లు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు. పోలైన 2 లక్షల 754 ఓట్లను, అదే విధంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్‌లో ఉన్న ఓట్లను కూడా అధికారులు లెక్కించనున్నారు. ఈ కౌంటింగ్ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌తోపాటు పోలీసు యాక్ట్ 30ని అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. -
రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
డిచ్పల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మరో 24 గంటల్లో ఫలితం తేలనుంది. మరోవైపు, తమ పరిస్థితి ఏమవుతుందోనని అభ్యర్థుల్లో గుబులు నెలకొంది. ఇటీవల వెల్లడైన లోక్‌సభ ఫలితాలు అభ్యర్థులను మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారోననే ఉత్కంఠ అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ నెలకొంది. జిల్లాలో మూడు విడతలుగా పరిషత్ ఎన్నికలు జరిగాయి. మొదటి విడత నిజామాబాద్ డివిజన్, రెండో విడతలో బోధన్, మూడో విడతలో ఆర్మూర్ డివిజన్‌కు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు, జూన్ 7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఏర్పాట్లు పూర్తి.. జిల్లాలో 27 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, మాక్లూర్ జెడ్పీటీసీ ఏకగ్రీవమైంది. ఇక్కడ ప్రత్యర్థులు లేకపోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇక, మిగిలిన 26 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే జిల్లాలోని 299 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 27వ తేదీనే ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే, ప్రస్తుత ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం నెలకు పైగా ఉండడం, అప్పటివరకు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎంపికకు సాంకేతికంగా కొన్ని అడ్డంకులు ఉండడంతో కౌంటింగ్ వాయిదా పడింది. చివరకు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమమైంది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ డివిజన్‌కు సంబంధించి జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ పాఠశాలలో, బోధన్ డివిజన్‌కు సంబంధించి బోధన్‌లోని విద్యావికాస్ పాఠశాలలో, ఆర్మూర్ డివిజన్‌కు సంబంధించి మునిపల్లి శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. లోక్‌సభ ఫలితాలతో అభ్యర్థుల్లో టెన్షన్.. ఇటీవల నిజామాబాద్ ఎంపీ ఎన్నికల ఫలితాల్లో జిల్లా ఓటర్లు అనూహ్య తీర్పునివ్వడం ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారోననే ఆసక్తి నెలకొంది. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించి గులాబీ జెండా ఎగురవేశారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో అధికార టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల్లోనూ టెన్షన్ పెరిగింది. ఓటర్లు ఎవరిని కరుణించారోనని అందోళన చెందుతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా.. ఎన్నడూ లేనంతగా ఈ సారి గతంలో పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. అధికార టీఆర్ఎస్లోనే అశావహుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో టికెట్ దక్కని వారు చాలా చోట్ల రెబెల్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు గెలుపు కోసం డబ్బును వెదజల్లారు. కొన్ని మండలాల్లో ఎంపీపీ పదవిని ఆశించిన అభ్యర్థులు తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు డబ్బులు సమకూర్చాల్సి వచ్చింది. దీనికి తోడు ఎంపీపీ పదవి ఆశిస్తున్న వారిలో చాలా మంది ముందుగా తాము ఏకగ్రీవం అయితే ఏ సమస్య ఉండదని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు, గ్రామాభివృద్ధికి కమిటీలకు ఎంతో కొంత ముట్టజెప్పి ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యేందుకు తిప్పలు పడ్డారు. ఇక జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు తమ మండలంలోని సొంత పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు భరించాల్సి వచ్చింది. లేదంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయం వారిలో నెలకొంది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసినా అసలు గెలుస్తామా లేదా అనే అందోళన ప్రస్తుతం అభ్యర్థుల్లో నెలకొంది. ఓటరు ఎటువైపు మొగ్గు చూపాడో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం, ఆ పార్టీ ఓటు బ్యాంకు పెరగడం టీఆర్ఎస్ నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. లోక్‌సభ ఫలితాలకు ముందు కచ్చితంగా పరిషత్ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్న అధికార పార్టీ అభ్యర్థులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. పలు చోట్ల అసమ్మతి.. టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు అనేక మంది ఉత్సాహం చూపారు. అయితే వీరిలో కొంత మందికే టికెట్లు లభించాయి. టికెట్ దక్కని వారిలో కొందరు నిరాశలో మునిగి పోగా, మరి కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. కొంతమంది సొంత పార్టీలోనే ఉంటూ తమ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు యత్నించారు. దీంతో అధికార పార్టీలోనే అసమ్మతి సెగలు ఎక్కువ కావడంతో క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. మరోవైపు, ఎంపీపీ పదవిపై కన్నేసిన పలువురు ఆశావహులు తమకు పోటీ వస్తారని భావించిన సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కృషి చేసినట్లు తెలిసింది. ప్రతి మండలంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఎంపీపీ పదవిని ఆశిస్తుండటంతో ఈ అంశం నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుంది. -
‘ప్రాదేశిక’ లెక్కింపునకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్‌క్రైం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిçష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కమిషనరేట్‌లోని చొప్పదంగి మండలం రుక్మాపూర్, మానకొండూరు మండలంలోని దేవంపల్లిలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాల, తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాల వద్ద లెక్కింపు జరుగుతుందని వివరించారు. ఓట్ల లెక్కింపు పరిసర ప్రాంతాల్లో డాగ్, బాంబ్‌డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏజెంట్లు, లెక్కింపు విధులకు హజరయ్యే అధికారులు, సిబ్బంది డోర్‌ప్రేమ్ మెటల్ డిటెక్టర్ ద్వారా వెళ్లాలని తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా జారీ చేసిన గుర్తింపుకార్డులు ఉన్నవారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రం పరిసర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు, మూడు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామన్నారు. లెక్కింపు కేంద్రాల్లో మొబైల్‌ఫొన్లు వినియోగం నిషేదించడం జరిగిందని, అగ్గిపెట్టెలు, లైటర్లు, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లొద్దని సూచించారు. కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. బాణాసంచ కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. భారీ బందోబస్తు భద్రత కోసం వివిధ స్థాయిల పోలీసులను వినియోగిస్తున్నారని సమాచారం. వీరిలో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 10 మంది ఏసీపీలు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 75 మంది ఎస్సై స్థాయి అధికారులతో పాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీసులు బందోబస్తు విదులు నిర్వహిస్తారని తెలిసింది. -
ఏర్పాట్లు ముమ్మరం
డిచ్పల్లి: రేపు నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ కౌంటింగ్ కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆయా నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు, కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో కౌంటింగ్ కేంద్రానికి రానున్నారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. కేంద్రం ఆవరణలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు, అధికారుల రాకపోకలకు, వాహనాల పార్కింగ్ లకు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కెటాయించిన మార్గంలోనే కౌంటింగ్ కేంద్రంలోని రాకపోకలు సాగించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి 185 అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో కౌంటింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సిబ్బందికి, ఏజెంట్లకు, బందోబస్తు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ కమిషనర్ కార్తికేయ, అడిషనల్ ఎస్పీ శ్రీధర్‌రెడ్డి సమన్వయంలో నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాసకుమార్, ఎన్ఐబీ ఏసీపీ రాజారత్నం, సీసీఎస్ ఏసీపీ స్వామి, ఆర్మూర్ ఏసీపీ రాములు, ఏఆర్ ఏసీపీ మహేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. సుమారు 900 మంది సిబ్బంది బందోబస్తు విధులు పాల్గొంటున్నారు. -
మరో.. 24 గంటలు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తే చాలు.. విజేతలు ఎవరో తేలిపోతుంది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, నల్లగొండ లోకసభ స్థానాల ఫలితాలు 23వ తేదీన వెలువడనున్నాయి. గెలుపు తమదే అంటే.. తమదే అన్న ధీమాను ఇరు పార్టీల నేతలూ వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర శాసన సభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి అధికార టీఆర్ఎస్ రెండు స్థానాల్లో తమ అభ్యర్థుల విజయంపై విశ్వాసంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అవుతుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. దీంతో టీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానంగా ఉన్న భువనగిరితో పాటు, గత ఎన్నికల్లో తమకు దక్కకుండా పోయిన నల్లగొండనూ ఈ సారి కైవసం చేసుకుంటామని ప్రకటిస్తున్నారు. మరోవైపు శాసనసభ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు సంబంధమే ఉండదని, కేంద్రంలో ఏ ప్రభుత్వం కావాలన్న ఎజెండాతో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పూర్తి అవకాశాలు ఉంటాయని, తమ సిట్టింగ్ స్థానమైన నల్లగొండను నిలబెట్టుకోవడంతో పాటు, గతెన్నికల్లో స్వల్ప తేడాతో కోల్పోయిన భువనగిరిపై జెండా ఎగురేస్తామన్నది కాంగ్రెస్ నేతల ధీమా. మొత్తానికి ఇరు పార్టీల నాయకులు, శ్రేణులు రెండు స్థానాల్లో గెలుపై భారీ అంచనాల్లో ఉన్నారు. రెండు పార్టీల నేతల ప్రకటలు ఎలా ఉన్నా.. ఎవరి విశ్వాసం మాటెలా ఉన్నా.. ఇంతకూ ఇక్కడ గెలిచేదెవరన్న ప్రశ్న అంతకంతకూ ఉత్కంఠ రేపుతోంది. ఫలితాల కోసం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడితో పెరిగిన రాజకీయ వేడి నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల విజయంపై ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీలకు ఉన్నా.. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొత్త చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నల్లగొండనుంచి టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయడం వల్ల కూడా ఈ రెండు నియోజకవర్గాల గురించి కాంగ్రెస్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఆయా సంస్థలు, జాతీయ మీడియా చానళ్లు వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్‌కు దక్కనున్న స్థానాలపై వచ్చిన వార్తలతో ఆ పార్టీ వర్గాల్లో గెలుపై ధీమా పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలతో అటు టీఆర్ఎస్ నాయకత్వమూ ఆత్మవిశ్వాసంతో ఉంది. రెండు నియోజకవర్గాల్లో ఫలితాలు ఏకపక్షం కాదని, ఇరు పార్టీల మధ్య çలోక్‌సభ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగిందని తేల్చడంతో ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలతో విశ్లేషణ మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాల మాటెలా ఉన్నా.. డిసెంబర్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు, మెజారిటీ తదితర గణాంకాలను ముందేసుకుని విశ్లేషిస్తున్నారు. ఈ ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం.. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్కే అనుకూల ఫలితాలు రావాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో హుజూర్నగర్ సెగ్మెంట్ మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో చేరింది. అది కూడా స్వల్ప మెజారిటీతో మాత్రమే. ఇక్కడినుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలుగా ఉన్న కోదాడ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, నల్లగొండలను కోల్పోయింది. ఓట్ల మెజారిటీ కూడా భారీగానే ఉంది. ఈ ఫలితాలను బట్టి లోక్‌సభ ఫలితమూ తమకే అనుకూలంగా వస్తుందని, తమ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి విజయం సాధిస్తారని టీఆర్ఎస్ అంటోంది. ఇక, భువనగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఐదు చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. అయితే.. తుంగతుర్తి, ఇబ్రహీంపట్న (రంగారెడ్డి జిల్లా) అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్కు స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ తక్కువ మెజారిటీతో ఓడిపోయింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇక్కడినుంచి తమ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది కాంగ్రెస్ విశ్లేషణ. ఇక్కడినుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బూర నర్సయ్య గౌడ్ రెండోసారీ పార్లమెంట్లో అడుగుపెట్టడం ఖాయమన్నది టీఆర్ఎస్ అభిప్రాయం. మొత్తంగా ఇరు పార్టీ లెక్కలు, సమీకరణలు, విశ్లేషణలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు లోక్‌సభ ఫలితాలపై మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. -
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్భందీగా సాగాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్హాల్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ఏజెంట్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్లకు వేర్వేరుగా దారులు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతీ లెక్కింపు కేంద్రంలో 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నందున.. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 5.45 గంటలలోగా కౌంటింగ్ కేంద్రానికి రావాలని సూచించారు. ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్‌రూంలు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరువబడుతాయని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని అన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి తెలపాలని అన్నారు. ఏజెంట్ల సెల్ఫోన్లు లోనికి అనుమతించబడవు... ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్ల సెల్ఫోన్లు లెక్కింపు కేంద్రాల్లోనికి అనుమతించడం లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కౌంటింగ్ కేంద్ర వద్ద ఏజెంట్లు సెల్ఫోన్లు డిపాజిట్ చేసుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తమ సెల్ఫోన్లను తీసుకురావద్దని సూచించారు. లెక్కింపు కేంద్రాల సందర్శనలో సీపీ కమలాసన్‌రెడ్డి, ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, ఎన్నికల పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, జిల్లా పరిషత్ సీఈవో వెంకటమాధవరావు, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, హుజూరాబాద్ ఆర్డీవో చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు. -
‘ఫలితం’ ఎవరికో!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ ఎంపీలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎన్నికలు జరిగిన 42 రోజుల తర్వాత ఫలితాలు వెలువడనుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. గతంలో లాగే టీఆర్ఎస్ జోరు కొనసాగిస్తుందా.. కాంగ్రెస్ పు నర్వైభవం సాధిస్తుందా? బీజేపీ బోణీ కొడుతుం దా?.. ఏం జరగబోతుందో మరికొన్ని గంటల్లో తెలి యనుంది. మరో 24 గంటలు గడిస్తే కౌంటింగ్ ఉండడంతో గెలుపోటములపై ఇప్పటికే జోరుగా చర్చ సా గుతోంది. ఏప్రిల్ 11న ఈవీఎంలలో ఓటు నిక్షిప్తమైం ది. అటు దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఇటు రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది అందరిని తొలు స్తుంది. ఆ ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమైంది. 42 రోజుల తర్వాత.. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బరిలో టీఆర్ఎస్ నుంచి గోడం నగేశ్, కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేశ్, బీజేపీ నుంచి సోయం బాపురావులు తలపడ్డారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బొర్లకుంట వెంకటేశ్‌నేత, కాంగ్రెస్ నుంచి చంద్రశేఖర్, బీజేపీ నుంచి కుమార్ పోటీ పడ్డారు. దేశంలో ఏడు విడతల్లో ఎన్నికలు జరగగా, తెలంగాణలో మొదటి విడతలోనే అన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 42 రోజుల తర్వాత ఫలితాలు వెలబడనుండడంతో ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ సభ్యులుగా ఎవరు గెలుస్తారోననే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. 2014లో కారు జోరు.. 2014 సాధారణ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. అప్పుడు ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ సభ్యులుగా గోడం నగేశ్, బాల్క సుమన్ గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి నగేశ్ మరోసారి బరిలో నిలిచారు. బాల్క సుమన్ గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి పెద్దపల్లి నుంచి వెంకటేశ్ నేతకాని బరిలో నిలిచారు. డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వెంకటేశ్ నేతకాని కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల వేళా టీఆర్ఎస్లో చేరి పెద్దపల్లి అభ్యర్థిగా ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. అన్ని నియోజకవర్గాల్లో.. లోక్‌సభ 2014 ఎన్నికల్లో అభ్యర్థుల పరంగా టీఆర్ఎస్ ముథోల్ మినహా అన్ని నియోజకవర్గాల్లో జోరు కనబర్చింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గోడం నగేశ్‌కు ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన నరేశ్ జాదవ్‌పై మెజార్టీ లభించింది. ఒక్క ముథోల్‌లో మాత్రం నరేశ్ జాదవ్‌దే పైచేయి అయింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బాల్క సుమన్‌కు పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథనితోపాటు ఉమ్మడి జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో అధిక ఓట్ల ఆధిక్యం సాధించారు. దీంతో కారు స్పీడ్‌ను హస్తం, సైకిల్ అందుకోలేక బొర్ల పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి మరోసారి గోడం నగేశ్, రాథోడ్ రమేశ్ బరిలో నిలిచారు. రాథోడ్ రమేశ్ కిందటి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి బరిలో నిలిచిన సోయం బాపురావు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు గట్టి పోటీనిచ్చారు. ఇక పెద్దపల్లిలో మూడు పార్టీల నుంచి అభ్యర్థులు మారారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజార్టీ సాధించారు. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రభావం.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొదట్లో సోషలిస్ట్ పార్టీ ఒకసారి గెలుపొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ తన విజయ పరంపరను కొనసాగిస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా తన ప్రభావం చాటుకుంది. 2004లో టీఆర్ఎస్ బోణి కొట్టింది. 2014లో మరోసారి గెలుపొందింది. ఇక పెద్దపల్లిలో 1962 నుంచి కాంగ్రెస్ గట్టి పట్టు కలిగి ఉంది. మధ్యలో తెలంగాణ ప్రజాసమితి, తెలుగుదేశం పార్టీలే వేర్వేరు సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి 2014లో టీఆర్ఎస్ బోణి కొట్టింది. ఇక ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ ఇప్పటి వరకు బోణి చేయలేదు. -
పకడ్బందీగా కౌంటింగ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌ను ఈ నెల 23వ తేదీన పకడ్బందీగా చేపట్టనున్నట్లు ఖమ్మం పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వాటిలో ఖమ్మం మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఈవీఎంల కౌంటింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుందన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఖమ్మం నియోజకవర్గానికి 23 రౌండ్స్, పాలేరుకు 20, మధిర 19, వైరా 17, సత్తుపల్లి 20, కొత్తగూడెం 18, అశ్వారావుపేట నియోజకవర్గానికి 14 రౌండ్లుగా నిర్ణయించామని చెప్పారు. ఒక్కో టేబుల్‌కు అభ్యర్థికొకరు చొప్పున ఏజెంట్ కూడా లెక్కింపులో ఉంటారని, లెక్కింపు కోసం 127 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు 128 మంది, మైక్రో అబ్జర్వర్లు 128 మంది ఉంటారని తెలిపారు. ఈవీఎంల కౌంటింగ్ అనంతరం ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించనున్నట్లు వివరించారు. ఒక వేళ ఏమైనా తేడా వస్తే చివరిగా వీవీ ప్యాట్ల స్లిప్పుల ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1683 ఉండగా.. 830 మంది ఓట్లు వేశారని, సర్వీస్ ఓటర్లు 715కి 431మంది ఓట్లు వేశారని పేర్కొన్నారు. కాగా, కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులకు సంబంధించిన ఫోన్ల అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 15,13,094 మంది ఓటర్లు ఉండగా 11,38,130 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 75.22 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఫలితాలను రౌండ్ల వారీగా తెలియజేస్తామని, అంతిమ ఫలితం మాత్రం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఐదు వీవీ ప్యాట్ స్లిప్‌ల లెక్కింపు అనంతరం మాత్రమే ప్రకటించనున్నట్లు వివరించారు. సువిధ వెబ్ సర్వీస్ ద్వారా ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపును పటిష్టంగా చేపట్టనుండగా భారీ బందోబస్తును నిర్వహిస్తున్నామని, 400 మంది పోలీస్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తుగా ఉంటారని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం ప్రాంగణాన్ని 6 సెక్టార్లుగా విభజించి మూడంచెల భద్రత కల్పించామని, కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ఫోన్లు, బ్లూటూత్స్, స్మార్ట్ చేతి గడియారాలు వంటి వస్తువులు అనుమతించబోమని సీపీ తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో షామియానాలు, మైకులు, వాహనాలను అనుమతించేది లేదని, కౌంటింగ్ కేంద్రంలో ప్రవేశించే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను తప్పనిసరిగా పాటించి ప్రతిఒక్కరూ సహకరించాలని సీపీ కోరారు. -
కౌంట్ డౌన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీల నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఓట్ల లెక్కింపునకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మరోసారి సర్వే అంచనాలు దగ్గర పెట్టుకుని ఫలితాలపై విశ్లేషిస్తున్నారు. ప్రతిష్టాత్మక చేవెళ్ల లోక్‌సభలో గెలుపుపై మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ, విపక్ష కాంగ్రెస్ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క కాషాయదళం కూడా విజయంపై గట్టి నమ్మకంతో ఉంది. ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తుండడంతో పార్టీలు, అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. చేవెళ్ల స్థానానికి పోలింగ్ శాతం మరీ తక్కువగా నమోదైన విషయం తెలిసిందే. 55 శాతం మించకపోవడంతో ఆ ప్రభావం ఏ పార్టీపైన పడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ముగ్గురిలోనూ గెలుపు ధీమా చేవెళ్ల లోక్‌సభకు 23 మంది పోటీ చేశారు. ఇందులో ప్రధాన, చిన్నాచితక పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులూ బరిలో నిలిచారు. అధికార పార్టీ తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డి విజయంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లోక్‌సభ ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన.. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నిక ఒకరకంగా ఆయన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జిల్లాకు చెందిన నేతలను కాదని స్థానికేతరుడునైన రంజిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. ఈయన గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి పార్టీ అప్పగించింది. ఒకరకంగా మహేందర్‌రెడ్డి రాజకీయ పరపతి.. రంజిత్‌రెడ్డి విజయంపై ఆధారపడి ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆయన మంత్రి పదవి రేసులో ఉన్నట్లే. రంజిత్‌రెడ్డి గెలిస్తే పార్టీలో మహేందర్‌రెడ్డి స్థానం పదిలమే. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మూడు నాలుగు నియోజకవర్గాలు.. కొండాకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాండూరు, చేవెళ్ల, వికారాబాద్ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు అధికంగా ఓట్లు దక్కే వీలుందని నేతలు భావిస్తున్నారు. మిగతా పార్టీల్లో కంటే ఈయన అభ్యర్థిత్వం ముందే ఖరారు కావడం వల్ల పకడ్బందీ ప్రణాళికతో ప్రజాక్షేత్రంలో దిగారు. ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునే సమయం దక్కింది. అలాగే బీజేపీ అభ్యర్థి బెక్కరి జనార్దన్‌రెడ్డి గెలుపు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గంలో ఈ పార్టీకి మంచి పట్టుంది. దీనికి తోడు పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, శంషాబాద్‌కు ఆ పార్టీ చీఫ్ అమిత్‌షా రావడం మరింత కలిసి వస్తోందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తం మీద ఏ అభ్యర్థి.. ఏ మేరకు ఓటర్లకు దగ్గరయ్యారన్నది 23న తేలనుంది. ఎమ్మెల్యేల్లో ఆందోళన చేవెళ్ల లోక్‌సభ ఫలితాలు అందరిలో ఉత్కంఠను రేపుతుండగా.. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్‌ను పుట్టిస్తున్నాయి. ఈ ఫలితాలు ఒకరకంగా తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని భావిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాల్లో మెజార్టీ సాధిస్తేనే.. సదరు ఎమ్మెల్యేలపై సీఎం దృష్టిలో సదాభిప్రాయం ఉంటుంది. ఒకవేళ ఆయా సెగ్మెంట్లలో మెజార్టీ తగ్గితే గులాబీ దళపతికి తాము ఏం సమాధానం చెప్పుకోవాలోనని కలవరపడుతున్నారు. ముఖ్యంగా వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైనట్లు వినికిడి. ప్రధానంగా మహేశ్వరంలో కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్కు దగ్గరైన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల సమయంలో ‘మన పార్టీ అభ్యర్థిని గెలిపించుకురండి’ అని వీరికి సీఎం చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ ఓటర్లు ఎటు వైపు ఉంటారోనని సర్వత్రా ఆసక్తి రేపుతోంది. -
‘ప్రాదేశిక’ కౌంటింగ్‌కు ఏర్పాట్లు
పాలమూరు: స్థానిక సంస్థల సమరంలో మొదటి అంకం ముగిసింది. ఇక ఓట్లను లెక్కించే ప్రక్రియకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. గ్రామాన్ని యూనిట్‌గా ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు, మండలం యూనిట్‌గా జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే అవసరమైన సిబ్బందిని గుర్తించారు. వారికి శనివారం నుంచి ఆయా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు కూడా ఇస్తున్నారు. మొత్తంగా ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు. అదృష్టం ఎవరికి వరించెనో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు విజయబావుటా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేశారు. మొదటి దశలో 24 జెడ్పీటీసీ స్థానాలకు 106 మంది, 294 ఎంపీటీసీ స్థానాలకు 949 మంది, రెండో దశలో 26 జెడ్పీటీసీ స్థానాలకు 102 మంది, 287 ఎంపీటీసీ స్థానాలకు 906 మంది పోటీ పడ్డారు. ఈనెల 14న నిర్వహించిన మూడో దశ ఎన్నికల్లో 21 జెడ్పీటీసీ స్థానాల్లో 88మంది, 209ఎంపీటీసీ స్థానాల్లో 647మంది పోటీ పడ్డారు. మిగిలింది లెక్కింపే.. పోలింగ్ ప్రక్రియ మూడు దశల్లో పూర్తవ్వగా ఇక ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలింది. ఈ మేరకు మండలం యూనిట్‌గా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎంపీటీసీ స్థానాలను బట్టి టేబుళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు ఒక మండలంలో పది స్థానాలుంటే 20 టేబుళ్లుంటాయి. మొదట పెట్టెల్లోని బ్యాలెట్ పత్రాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా వేరుచేసి 25 చొప్పున కట్టలు కడతారు. జెడ్పీటీసీ పత్రాలన్నీ ఒక చోటుకు చేరుస్తారు. మొదట ఎంపీటీసీ ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. తర్వాత అన్ని టేబుళ్ల వారు జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును ఆర్వోలు పరిశీలిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేవనుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటించి విజేతకు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. కలెక్టర్ ఆదేశాల మేరకు.. పోలైన ఓట్లతో నిండిన బ్యాలెట్ పెట్టెలు స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వాటికి అనుసంధానంగానే లెక్కింపు కేంద్రాలు ఉండేలా ఐదు జిల్లాల పరిధిలో కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి వద్ద అవసరమైన బారికేడ్లు, టేబుళ్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. వీటిని ఐదు జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో లైజనింగ్ అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు ఈ పనులు సాగుతున్నాయి. మొదలైన శిక్షణ తరగతులు ఇప్పటికే అన్ని జిల్లాల్లో లెక్కింపు సిబ్బంది గుర్తింపు ముగిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రక్రియ పరిశీలించే ఆర్వోలు, ఎంపీడీఓలు ఇప్పటికే విధుల్లో ఉన్నారు. వారితోపాటు లెక్కింపును పర్యవేక్షించేందుకు సూపర్వైజర్లు, అసిస్టెంట్లను నియమించారు. వీరందరికి శనివారం నుంచి ఆయా రెవెన్యూ డివిజన్లల్లో శిక్షణ ప్రారంభించారు. దీనిపై ఇదివరకే రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ నాగిరెడ్డి జిల్లా అధికారులతో ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శిక్షణలో చెప్పాల్సిన అంశాలు, లెక్కింపు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన కల్పించారు. -
ఇక నాలుగు రోజులే..
జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నిజామాబాద్ ఎంపీ స్థానం ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నాలుగు రోజుల్లో తెరపడనుంది. మరోవైపు బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఏయే వర్గాలు ఎవరిని ఆదరించాయి.. గ్రామీణ , అర్బన్ ప్రాంత ఓటర్లు ఎవరికి బాసటగా నిలిచారు.. మైనారిటీలు ఎవరికి మద్దతు పలికారు..యువత ఎటువైపు ఉంది, పింఛనుదారుల ఓట్లు ఎవరికి పడ్డాయి.. తదితర అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ షురువైంది. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడింది. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నిజామాబాద్ ఎంపీ స్థానం ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నాలుగు రోజుల్లో తెరపడనుంది. ఎవరు విజయం సాధిస్తారనేది బుధవారం ఓట్ల లెక్కింపు అనంతరం తేలనుంది. బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉండగా, విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై ఇటు రాజకీయవర్గాల్లో సర్వత్రా చర్చ సాగుతోంది. ఏయే వర్గాలు ఎవరిని ఆదరించాయి... గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు.. పట్టణ, నగర ఓటర్లు ఎవరికి బాసటగా నిలిచారు. మైనారిటీలు ఎవరికి మద్దతు పలికారు..యువత ఏ అభ్యర్థికి బాసటగా నిలిచింది. పింఛనుదారుల మద్దతు ఎవరికి దక్కింది.. ఇలా ఎవరివారే లెక్కలేసుకుంటున్నారు. రాజకీయ వర్గాలతో పాటు, సామాన్య ఓటర్లు సైతం అభ్యర్థుల గెలుపు, ఓటములపై చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనే మాట్లాడుకుంటున్నారు. మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. దీంతో ఈ నియోజకవర్గం ఫలితంపై స్థానిక ఓటర్లతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిం చేం దుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలోని ఓట్లను డిచ్పల్లిలోని సీఎంసీ మెడికల్ కళాశాలలో లెక్కించనున్నారు. అలాగే కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలోని ఓట్ల కౌంటింగ్ కోసం జగిత్యాలలో వీఆర్కే సొసైటీ భవనం లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఫలితం వెల్లడించడానికి ఎక్కువ సమయం పట్టనుంది. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి రౌండ్లోనూ ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు టేబుళ్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా వీలైనంత తొందరగా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపగా, నిర్ణయం రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. -
మొదటి రౌండ్‌కు రెండు గంటలు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కంపులో మొదటి రౌండ్ ఫలితం రావడానికి రెండు గంటలకు పైగా పట్టవచ్చని కలెక్టర్ రామ్మోహన్ రావు పేర్కొన్నారు. రెండో రౌండ్ నుంచి సమయం తగ్గుతుందన్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు 16 రౌండ్లు, జగిత్యాల, కోరుట్లకు 15 రౌండ్లు, బాల్కొండ, బోధన్‌లకు 14 రౌండ్లు, ఆర్మూర్‌కు 13 రౌండ్లు ఉంటాయన్నారు. కాగా కౌంటింగ్ ఏజెంట్ల నియామకం కోసం అభ్యర్థులు మూడు రోజుల ముందుగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 23న కౌటింగ్ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్‌లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు డిచ్పల్లిలోని సీఎంసీలో, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు జగిత్యాలలో లెక్కింపు జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తామని, అదనంగా మరో టేబుల్ ఆర్వో కోసం ఉంటుందన్నారు. ఇందుకు గాను పోటీ చేసే అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. ఇందుకు ఫారం–18 ద్వారా ఏఆర్వోకు దరఖాస్తు చేయాలన్నారు. నిజామాబాద్‌కు ప్రత్యేకంగా 36 టేబుళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించామని, అనుమతి వస్తే ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ రహస్యాన్ని పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్ హాల్ లోనికి సెల్‌ఫోన్ తనుమతి లేదన్నారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తరువాత ప్రతి నియోజకవర్గం పరిధిలో ర్యాండంగా ఐదు వీవీ ప్యాట్లను ఒక దాని తరువాత ఒకటి లెక్కించనున్నట్లు తెలిపారు. మొదట కౌటింగ్‌కు, వీవీప్యాట్ కౌటింగ్లో తేడా వస్తే, వీవీప్యాట్ ఓట్లనే ప్రమాణికంగా తీసుకుంటాన్నా రు. అయితే 2013 నుంచి ఇప్పటి వరకు కౌంటింగ్‌లో ఎలాంటి తేడాలు రాలేదన్నారు. పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలు అందించాలి– కలెక్టర్ రామ్మోహన్ రావు ఇటీవల నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ రోజు వారి ఖర్చుల వివరాలను వచ్చే జూన్ 21వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్ రామ్మోహన్ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖర్చుల వివరాలను సమర్పించడంలో సందేహాలు, సలహాలు తీసుకోవడానికి ఎన్నికల వ్యయ నోడల్ అధికారి(జిల్లా సహకార) కార్యాలయంలో ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పోటీ చేసిన అభ్యర్థులకు ఈ–ఫైలింగ్‌పై అవగాహన కల్పించడానికి జూన్ 15 అవగాహన కార్యక్రమం, 18న ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున అభ్యర్థులందరూ తప్పక హాజరు కావాలన్నారు. -
లోక్‌సభ ఓట్ల కౌంటింగ్‌కు చకచకా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 23వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. దీంతో అటు అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సూపర్ వైజర్లకు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వడం పూర్తయ్యింది. ఎలాంటి వివాదాలకు తావులేకుండా కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డు చేయనున్నారు. ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందితే వెబ్ కాస్టింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ లో క్‌సభ స్థానానికి ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగగా 15,85,433 మంది ఓటర్లకు గాను.. 11,75,129 మంది ఓ టర్లు (74.12 శాతం )తమ ఓట్లు హక్కు వినియోగించుకున్నారు.మిర్యాలగూడ రోడ్డులోని దుప్పలపల్లిలోని వేర్‌హౌస్ గోదాముల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. పార్టీల ఏజెంట్లు అంతా 6.30 గంటల వరకే కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటారు. వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్‌ల సీల్‌ను తీస్తారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తీసుకొస్తారు. అదంతా వీడియో రికార్డింగ్ జరుగుతుంది. కాగా, 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఒక్కో ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆర్ఓ టేబుల్ వద్దనే లెక్కిస్తారు. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల వారీగా 14 టేబుళ్లలో ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్తో పాటు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. వీడియో రికార్డింగ్‌తో పాటు మైక్రో అబ్జర్వర్ కూడా ఓట్ల లెక్కింపు వద్ద ఉండి పరిశీలిస్తారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 1990 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలైన ఓట్లను మొత్తంగా 144రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ స్టేషన్ల ఆధారంగా కౌంటింగ్ కొనసాగుతుంది. దేవరకొండ నియోజకవర్గంలో 308 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుండగా, నాగార్జున సాగర్‌లో 293 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అవి 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో 256 పోలింగ్ స్టేషన్లు 19 రౌండ్లలో, హజూర్‌నగర్ నియోజకవర్గంలోని 302 పోలింగ్ స్టేషన్లు 22 రౌండ్లలో, కోదాడలోని 286 పోలింగ్ స్టేషన్లు 21 రౌండ్లలో, సూర్యాపేటలో 264 పోలింగ్ స్టేషన్లు 19 రౌండ్లలో పూర్తవుతుండగా నల్లగొండ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా 20 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. అంటే ఒక గంటలో 3 నుంచి 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తయినా.. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈవీఎంల తర్వాత వీవీప్యాట్ల లెక్కింపు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించనున్నారు. అవి కూడా డ్రా పద్ధతిన ఎంపిక చేసి వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తారు. ఆతర్వాత కౌంటింగ్ పూర్తవుతుంది. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. శనివారం దుప్పలపల్లి గోదామును జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్‌తో కలిసి సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. ఈనెల 23న కౌంటింగ్ నిర్వహించనున్నందున సత్వరం ఏర్పాట్లు చేయాలని, ఈ నెల 21న ఈసీఐ డ్రెస్ రిహార్సల్స్ నాటికి కౌంటింగ్ హాల్లలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారి గదిలో పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్, సర్వీస్ ఓటర్ల లెక్కింపు ఏర్పాట్లపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ హాల్లు పర్యటించి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చిస్తూ, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి వేర్వేరుగా దారులు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌం టింగ్ సెంటర్ పెయిడ్ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పారి శుద్ధ్యం, పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ హాల్ వారీగా ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని, మౌలిక వసతులు రిపోర్టింగ్, ఇతరత్రా జిల్లా రెవెన్యూ అధికా రి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారివెంట డీఆర్ఓ రవీంద్రనాథ్, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, సర్వే ఏడీ శ్రీనివాసులు, పంచాయతీ రాజ్ డీఈ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షించాలి నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల కౌం టింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలా సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కా ర్యాలయంలో ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్ ప్రక్రియపై పరిశీలనకు నియమించిన 140మంది సూక్ష్మ పరిశీలకులకు నియమించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు ధనంజయ్ దేవాంగన్ నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, ఎల్ఎస్కెన్ అదనపు పరిశీలకులు నల్లగొండ, కోదా డ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ పరిశీలిస్తారని వివరించారు. ఎన్నికల పరిశీలకుల తరఫున సూక్ష్మ పరిశీలకులుగా నియమించిన బ్యాంక్, ఎల్ఐసీ, ఇతర ఉద్యోగులు కౌం టింగ్ రోజున బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ రవీంద్రనాథ్, నల్లగొం డ ఎల్డీఎం సూర్యం, సూర్యాపేట ఎల్డీఎం శ్రీనివాస్, జేడీఏ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద విజిటింగ్ సంతకం చేస్తున్న కలెక్టర్ -
గెలిచేదెవరు.. ఓడేదెవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఓ వైపు లోక్‌సభ... మరోవైపు ప్రాదేశిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం సమీపిస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. 43 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా జరిగిన విషయం విదితమే. ఇందులో వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఆ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జెడ్పీలు లక్ష్యంగా టీఆర్ఎస్ సర్వశక్తులొడ్డగా.. 27న వెలువడే ఫలితాలతో ఎవరి ఆశలు ఎంత మేరకు ఫలించాయనేది బయటపడనుంది. మూడు రోజుల వ్యవధిలో అటు పార్లమెంట్, ఇటు ప్రాదేశిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీల నాయకులతో పాటు ఇటు ఓటర్లలో చర్చలు మొదలయ్యాయి. బరిలో 3,166 మంది వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ పార్లమెంట్ స్థానాల్లో పార్టీలు, స్వతంత్రులు కలిపి 29మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఆరు జిల్లాల పరిధిలోని 70 జెడ్పీటీసీ స్థానాలకు 403 మంది, 780 ఎంపీటీసీ స్థానాలకు 2,734 మంది రంగంలో ఉన్నారు. అంటే మొత్తంగా విజయం కోసం 3,166 మంది నిరీక్షిస్తున్నారు. ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాల్లో ఇద్దరు మాత్రమే విజేతలుగా నిలవనున్నారు. ఈ రెండు స్థానాల్లో ఫలితం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భారీగానే ఆశల్ని పెట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల జోరును ఇక్కడ కూడా చూపిస్తామనే ధీమాతో గులాబీ దళంలో ఉండగా.. ఫలితం తమకు అనుకూలంగా వస్తుందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెబుతున్నాయి. ఇక వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగాం, భూపాలపల్లి జయశంకర్, ములుగు జిల్లాల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరులో 18 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోగా 70 జెడ్పీటీసీ, 762 ఎంపీటీసీ స్థానాల్లో తామే గెలుస్తామంటూ 3,137 మంది అభ్యర్థులు ఎవరికి వారు చెబుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ ఉన్నా.. అక్కడక్కడా స్వతంత్రులు గెలుపు బాటలో పయనించే అవకాశముందనే ప్రచారంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అందరిలోనూ ఆశలే ఈనెల 23, 27.. ఈ రెండు తేదీలపైనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బోలెడు ఆశల్ని పెట్టుకున్నారు. అటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు ఇటు ప్రాదేశిక సమరంలో తలపడిన అభ్యర్థులంతా గెలుపు తమదేనన్న ఆశల లోకంలో విహరిస్తున్నారు. పనిలో పనిగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయి.. మెజార్టీ ఎంత రావొచ్చంటూ లెక్కలేసుకుంటున్నారు. పార్టీల ఉనికిని కీలకంగా పరిగణించే ఈ ఫలితాల తీరుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమనే చెబుతున్నారు. కాగా రాబోయే ఐదేళ్లపాటు జిల్లాలో తమదైన ఉనికి సాగించాలనుకునే పార్టీలకు ఈ రెండు ఎన్నికల ఫలితాలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ జోరుకు అనుకున్న స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్, బీజేపీ శక్తివంచన లేకుండా చేసిన కృషి ఏ మేరకు ఫలితమిస్తుందోననేది వేచిచూడాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో గులాబీ పార్టీలో సరికొత్త ఉత్సాహం నెలకొనగా.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపు కోసం ప్రయత్నించింది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వచ్చే సరికి అన్ని పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపాయి. చకచకా ఏర్పాట్లు అభ్యర్థుల అంచనాలను పక్కన పెడితే.. ఇంకోపక్క అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఏనుమాముల మార్కెట్లో, మహబూబాబాద్ లోక్‌సభ స్థానం ఈవీఎంలను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో భద్రపరిచారు. ఆయా కేంద్రాల్లో 24 గంటల భద్రత కొనసాగుతుండగా.. 23వ తేదీన జరిగే లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా శుక్రవారం ఏనుమాములలో వరంగల్ లోక్‌సభ రిటర్నింగ్ అధికారి, అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మహబూబాబాద్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శివలింగయ్య ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని సూచించిన వారు.. కౌంటింగ్ హాళ్లలో బారికేడ్లు, ఫెన్సింగ్‌ను పరిశీలించారు అధికారులకు సూచనలు చేశారు. -
కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు శుక్రవారం జగిత్యాలలో పర్యటించారు. అక్కడి కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా, జాయింట్ కలెక్టర్ రాజేశం స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వీఆర్కే కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూంలను, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూం నుంచి నేరుగా కౌంటింగ్ హాలుకు వచ్చే దారిని పరిశీలించారు. అలాగే ఒక హాలులో 18 టేబుళ్లు చొప్పున జగిత్యాలకు రెండు హాళ్లను, కోరుట్లకు రెండు హాళ్లను పరిశీలించారు. కౌంటింగ్ వివరాలు ఏజెంట్లకు తెలుపడానికి ఏర్పాటు చేసిన టీవీలు, ఏర్పాట్లను చూసి సంతృప్తి చెందారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఎస్పీ సిందూశర్మ, సబ్ కలెక్టర్ గౌతమ్, డీఆర్వో అరుణ, ఇతర అధికారులున్నారు. -
భారీ ఏర్పాట్లు
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా అధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి పోలింగ్‌బూత్‌లో ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అభ్యర్థులందరి పోలింగ్ ఏజెంట్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇలామొత్తం 1,788 పోలింగ్ కేంద్రాల్లో 185 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి రౌండ్‌కు సమయం పడుతుంది. సాధారణంగా అన్ని ఎంపీ స్థానాలకు పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి 14 నుంచి 18 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించనున్నారు. నిజామాబాద్‌లో రెట్టింపు ఏర్పాట్ల కోసం అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. సాధారణంగా అన్ని ఎంపీ స్థానాలకు పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి 14 నుంచి 18 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించనున్నారు. నిజామాబాద్ స్థానం విషయానికి వస్తే 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో 18 టేబుళ్ల ద్వారా లెక్కిస్తే ఫలితాలు వెల్లడించడానికి అధిక సమయం పడుతుంది. టేబుళ్ల సంఖ్యను పెంచడం ద్వారా వీలైనంత తొందరగా ఫలితాలను ప్రకటించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం 36 టేబుళ్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఒకటీ రెండు రోజుల్లో ఈ అంశంపై ఎన్నికల సంఘం నుంచి నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి 18 టేబుళ్ల ద్వారానే కౌంటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈసీఐ అనుమతిస్తే టేబుళ్ల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ని జామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ స్థానానికి దేశంలో ఎక్కడా లేనివిధం గా 185మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి పోలింగ్‌బూత్‌లో ఒక్కో అభ్యర్థి కి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అభ్యర్థులం దరి పోలింగ్ ఏజెంట్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈవీఎంలోని కంట్రోల్ యూ నిట్‌లో వచ్చే డిస్ప్లేను అందరు ఏజెంట్లు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలామొత్తం 1,788 పోలింగ్ కేంద్రాల్లో 185 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి రౌండ్‌కు సమయం పడుతుంది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఫలితం రావడం ఆలస్యమవుతుంది. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఓట్ల లెక్కింపు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థా నాల పరిధిలోని ఓట్ల లెక్కింపు డిచ్పల్లి లోని సీఎంసీలో ఏర్పాటు చేశారు. మొత్తం 15.53 లక్షల మంది ఓటర్లు ఉండగా, 10.61 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు ముమ్మరం
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని గుంటూరు-ఈస్ట్, గుంటూరు-వెస్ట్, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, తెనాలి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగనుంది. సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లు మినహా ఇతరులు లోపలికి ప్రవేశించకుండా ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం, దూరవిద్యాకేంద్రం నుంచి బాలికల వసతి గృహం మీదుగా జాతీయ రహదారి వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ అతిథిగృహం వద్ద జాతీయ రహదారి పక్కనున్న రోడ్డును మూసివేశారు. కౌంటింగ్ జరిగే ఇంజనీరింగ్ కళాశాల పరిసరాల్లో రాకపోకలను నిలిపివేశారు. ఏర్పాట్లను జిల్లా స్థాయి అధికారులు పర్యవే క్షించి తగు సూచనలిస్తున్నారు. గుంటూరు ఆర్డీవో రామమూర్తి, తెనాలి ఆర్డీవో శ్రీనివాస్ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. స్థానిక సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆదివారం రాత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు సమయానికి గంటముందే పోటీచేసే అభ్యర్థులు, వారి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని చెప్పామన్నారు. లెక్కింపునకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఒక్కో కౌంటింగ్ హాలులో 10 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఆయా పురపాలక సంఘాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రతి కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంటుందని సిద్ధార్థజైన్ చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సక్రమంగా, సజావుగా నిర్వహించడానికి ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించామన్నారు. ఎప్పటికప్పుడు ఫలితాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయడానికి ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో మీడియాకు ప్రత్యేక రూము ఏర్పాటు చేశామని అక్కడ టీవీ, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు టెలిఫోన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ కేఈ సాధన, ఎస్ఈ యోహన్ తదితరులు పాల్గొన్నారు. -
చురుగ్గా కౌంటింగ్ ఏర్పాట్లు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: కౌంటింగ్‌కు చురుగ్గా ఏర్పా ట్లు చేస్తున్నట్లు వివరించిన కలెక్టర్ వీరరాఘవరావు ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయాలని అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి ఏప్రిల్ 24న ఏన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను తిరువళ్లూరు సమీపంలోని శ్రీరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచి మూడెంచల భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 16 శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌటింగ్‌కు సంబందించిన ఏర్పాట్లను కలెక్టర్ వీరరాఘవరావు పరిశీలించారు. ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మీడియా రూమ్‌ను ఆయన పరిశీలించారు. కంప్యూటర్ ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆయన ఆదేశించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. పలువురు అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. -
కౌంటింగ్ ఏర్పాట్లు అస్తవ్యస్తం
పటాన్చెరు,న్యూస్‌లైన్: పటాన్చెరు మండలం పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తొలుత సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తారని అధికారులు తెలిపారు. కానీ అక్కడ వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో కౌంటింగ్ కేంద్రాన్ని సంగారెడ్డిలోని పాత వెలుగు (డీఆర్డీఏ) కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం కేటాయించిన గది చిన్నగా ఉండ టంతో 11 టేబుళ్లకు బదులుగా 8 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల సంఖ్యకు అనుగుణంగా 14 టేబుళ్లు వేసినా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగదని అలాంటిది ఎనిమిది టేబుళ్లపై కౌంటింగ్ చేయడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో కూడా అమీన్పూర్ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు అర్థరాత్రి దాటిన తర్వాతే వెల్లడయ్యాయి. ప్రతి ఓటు వివాదస్పదమయ్యే ఉత్కంఠ పరిస్థితులు పటాన్చెరు మండలం పరిధిలోని అన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఉంటుంది. నాలుగు టేబుళ్ల వద్ద మాత్రమే ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. మిగతా నాలుగు టేబుళ్లపై జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు. తొలుత బాక్స్‌లను తెరిచి బ్యాలెట్ పత్రాలను వేర్వేరుగా చేసి జెడ్పీటీసీ ఓట్లను ఓ పెద్ద డబ్బాలో వేస్తారు. బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున కట్టలు కట్టి లెక్కింపు ప్రారంభిస్తారు. దాదాపు ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఒంటి గంట తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అధికార వర్గాలు అంచనా. ఒక్కో రౌండు పుర్తయ్యేందుకు కనీసం రెండు గంటల సమయం తీసుకుంటుందని వారు వివరిస్తున్నారు. ఆ లెక్కన ఏడు రౌండ్ల లెక్కింపు జరిగే సరికి 14 గంటల సమయం పడుతుంది. అంటే రాత్రి ఓంటి గంట వరకు ఫలితాలు వెల్లడయ్యే పరిస్థితి లేదు. ప్రతి రెండు గంటలకోసారి ఎంపీటీసీ ఫలితాలు వెల్లడవుతాయి. తక్కువ ఓట్లు ఉన్న పాటి, ఘనపూర్ వంటి వాటి ఫలితాలు త్వరగానే పూర్తవుతాయి. అయినా అర్థరాత్రి దాటితేనే కాని జెడ్పీటిసీ ఇతర ఎంపీటీసీల ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తి కాదని అనుభవజ్ఙులు పేర్కొంటున్నారు. ఇది కూడా శాంతియుతంగానే కౌంటింగ్ జరిగితేనే సాధ్యపడుతుందని అంచనా. కాని ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తక్కువ ఓట్లతో నెగ్గే పరిస్థితుల్లో రీకౌంటింగ్ వంటివి జరిగితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.