పకడ్బందీగా కౌంటింగ్ ఏర్పాట్లు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక సంగ్రామంలో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. బుధవారం ఆమె, జేసీ శరత్‌తో కలిసి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వివిధ శాఖ అధికారులతో కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈనెల 16న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కోసం 700 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వీరందరికీ ఈనెల 12న శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు.
సంగారెడ్డి సమీపంలోని గీతం విశ్వవిద్యాల యం, ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాల, డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలను ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోని ప్రతి టేబుల్ వద్ద ఒక పరిశీలకుడిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో పంపించేందుకు ప్రతి అసెం బ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక సమన్వయ అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలోనూ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ వారీగా మీడియా సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని స్మితా సబర్వాల్ తెలిపారు.
నిర్లక్ష్యం తగదు
కౌంటింగ్ ఏర్పాట్లలో ఏ మాత్రం నిర్లక్ష్యంచే యవద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో బారికేడ్లు, ఏజెంట్లు కూర్చునేందుకు కుర్చీలు, ఈవీఎంలను ఉంచేందుకు టేబుళ్లు సిద్ధం చేయాలన్నారు. అంతేకాకుండా రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల కార్యాలయ వసతితో సహా ఏర్పాట్లన్నీ ఈ నెల 10లోపు పూర్తి చేయాలని స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు.
ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు, గదులను తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాల్లో అదనంగా ఉన్న ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌కు తరలించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ దయానంద్, హౌసింగ్ పీడీ బాల్‌రెడ్డి, ఏఓ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.