పురపాలకులు తేలేది నేడే
ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీ స్థానాల ఫలితాలు వెల్లడి
- 210 వార్డులకు 1311మంది అభ్యర్థులు పోటీ
- మధ్యాహ్నం వరకు ఓట్ల లెక్కింపు పూర్తి
- గెలుపు సంబరాలు, ర్యాలీలు నిషేధం
- కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు
- మద్యం దుకాణాలు బంద్
నల్లగొండ, న్యూస్‌లైన్, పురపాలకుల భవితవ్యం సోమవారం తేలనుంది. ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణ నేటితో తెరపడనుంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. మొత్తం 210 వార్డులకు ఒక్కో వార్డుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 1311 మంది పోటీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన చాలా వ్యవధి తర్వాత ఫలితాలు వెల్లడవుతుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏడు స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ శివారు ప్రాంతంలోని డాన్‌బోస్కో స్కూల్‌లో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఉదయం 7.30 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆ తర్వాత 8 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్ల కౌటింగ్ సజావుగా సాగేందుకు కౌంటింగ్ కేంద్రంలో టేబుళ్లు 37 ఏర్పాటు చేశారు. సిబ్బంది 148మందిని నియమించారు. నల్లగొండ మున్సిపాలిటీకి 7, మిగతా ఆరు స్థానాలకు ఐదు చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డు ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లలో పూర్తి చేస్తారు. మొత్తం అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో పూర్తవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితాలు వెల్లడిస్తారు.
భారీ బందోబస్తు...
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రం వెలుపల, బయట పోలీస్ బలగాలతో పాటు, ప్రత్యేక పోలీస్ ఫోర్సు ఏర్పాటు చేశారు. ఏడుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, ఎస్‌ఐలు 69 మంది, ఏఎస్‌ఐలు 89 మంది, కానిస్టేబుళ్లు 248, హోంగార్డులు 179 మందిని నియమించారు. వీరితోపాటు స్పెషల్ పార్టీ, ఆర్మ్‌డ్ రిజర్వు పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాలను కూడా మోహరించారు.
మద్యం దుకాణాలు బంద్
గెలుపు సంబరాలతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరిటెండెంట్ దత్తురాజు గౌడ్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.