'ఆంధ్రప్రదేశ్లో అడ్రసు లేకుండా పోయింది'
హైదరాబాద్ :కొట్టారు. కొట్టారు. కసిదీరా కొట్టారు. ఏకపక్షంగా తెలుగుజాతిని విడదీసిన కాంగ్రెస్‌ను ఏకపక్షంగా తరిమి తరిమి కొట్టారు. సీమాంధ్రుడు కన్నెర్ర జేయడంతో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. 130 ఏళ్ల కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్ర విభజన వద్దని బతిమాలారు. తెలుగుజాతిని చీల్చవద్దని వేడుకున్నారు. భాషాప్రయుక్త తొలి రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని ముక్తకంఠంతో నినదించారు. 13 జిల్లాల ప్రజలు సమైక్యవాదనను ఢిల్లీ దాకా వినిపించారు. అయినా ఢిల్లీ పెద్దలకు తెలుగు వాళ్ల గోడు పట్టలేదు.
దాంతో తెలుగుజాతిని చీల్చేస్తుంటే తెలుగోడు కుంగిపోయాడు. కసితో రగిలిపోయాడు. ఎరుపెక్కిన కళ్లతో....బిగపట్టిన పిడికిలితో పంటిబిగువున దాచిపెట్టిన కోపంతో సమయం కోసం ఎదురుచూశాడు. ఆ సమయం రానే వచ్చింది. పోలింగ్‌రోజు సీమాంధ్రుడు పోటెత్తాడు. కాంగ్రెస్ మీద ఉన్న కోపం, ద్వేషం, అసహ్యం, ఆక్రోషం,ఆవేదన, ఆక్రందన, కసి కలిసి ఒక్కసారి తన్నుకొచ్చాయి.
ఒక్క ఓటుతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నేతలపై వేటు వేశాడు. కేంద్ర మంత్రులుగా వెలగబెట్టిన కిల్లి కృపారాణి, కిశోర్ చంద్రదేవ్, పురందేశ్వరి, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ తాజా చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణలను కసిదీరా ఓడించారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ సహా రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, అహ్మదుల్లా, కొండ్రు మురళీ, డొక్కా మాణిక్య వరప్రసాద్, శైలజానాథ్‌తో పాటు కాంగ్రెస్ ప్రముఖులు, సీనియర్లను కసిదీరా ఓడించారు.
ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్, రాష్ట్ర విభజన, ఓటు, ఎన్నికలు 2014, andhra pradesh, congress, state bifurcation, vote, counting, elections 2014