తెలుగువాళ్లు కాంగ్రెస్ ను ఏకగ్రీవంగా ఛీ కొట్టారు. ముందునుంచే మండిపడుతున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా విదల్చలేదు. బొత్స తో మొదలుపెట్టి మొత్తం నేతలందరూ మట్టి కారిచారు. మరో వైపు ఎంతో కొంత ఆశలు ఉన్న తెలంగాణలోనూ కాంగ్రెస్ పరిస్థితి కడు దయనీయంగా తయారైంది. అంచనాలకు మించి తెలుగుదేశం - బిజెపి కూటమి రెండో స్థానానికి రావడంతో కాంగ్రెస్ కి కనీసం ప్రధాన విపక్షం హోదా కూడా దక్కని పరిస్థితి దాపురించింది.
నిజానికి కాంగ్రెస్ ఎప్పుడు కష్టకాలంలో ఉన్నా తెలుగు ప్రజలు దానికి వెన్నుదన్నుగా నిలిచారు. 1977 లో దేశమంతా కాంగ్రెస్ ను తిరస్కరించినా, తెలుగు ప్రజలు 42 లో 41 సీట్లు ఇచ్చి కడుపులో పెట్టుకున్నారు. రాయబరేలీలో ఓడిన ఇందిరా గాంధీని మెదక్ నుంచి గెలిపించుకున్నారు. 2009 లో ఢిల్లీలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే అది ఆంధ్రప్రదేశ్ బంగారు పళ్లెంలో పెట్టి అందించిన 35 సీట్లే కారణం.
వైఎస్ఆర్ హఠాన్మరణంతో పరిస్థితులు మారిపోయాయి. సీల్డు కవర్ సీఎంలు ఒక్కొక్కరూ వచ్చి పరిస్థితిని మరింత దిగజార్చారు. పార్టీ దశ, దిశ లేకుండా పోయింది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన హైకమాండ్ మరింత కలగాపులగం చేసింది.
రాష్ట్రాన్ని విభజించినందువల్ల పట్టరాని కోపం తో ఉన్న ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ ను భయంకరంగా శిక్షించారు. ఆంధ్రలో కాంగ్రెస్ తలెత్తడానికి దశాబ్దాలు పట్టొచ్చు. తెలంగాణ తెచ్చినందుకు, ఇచ్చినందుకు కూడా అక్కడ ప్రజలు దయదలచలేదు. కాంగ్రెస్ పరిస్థితి, అన్ని రకాలుగా ప్రతికూలతలు ఎదుర్కొన్న టీడీపీ పరిస్థితి సరిసమానంగా ఉంది. అంతే కాదు. పీసీసీ చీఫ్ పొన్నాల, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ సహా దిగ్గజాలంతా ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసుకోవాల్సింది ఆత్మపరిశీలన!
కాంగ్రెస్ ను ఛీ కొట్టిన తెలుగు జనం
Published Fri, May 16 2014 12:19 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement