ఇక సోనియాయే కాపాడాలంటున్న టీ కాంగ్
* ఇంతకు ముందరి సభలు తుస్
* తమతమ సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ నేతలు
* అందరూ ఆటగాళ్లే, కాప్టెన్ ఎవరు?
* కారులో కేసీఆర్, కంగారులో కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల గండం గట్టెక్కేందకు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ సభలనే నమ్ముకున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన ఇచ్చిన క్రెడిట్‌ను ఓట్ల రూపంలో దక్కించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో సోనియా, రాహుల్ సభలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు ప్రధాని మన్మోహన్ సభను కూడా ఖరారు చేశారు.
ఇటీవలి సోనియా, రాహుల్ సభలు ఆశించిన స్ధాయిలో సక్సెస్ కాకపోవడం తెలంగాణ కాంగ్రెస్ నేతలను కాసింత నిరాశ పరిచాయి. అయితే ఇకపై జరిగే సభలను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.
శుక్రవారం నుంచి సభలే సభలు: రాహుల్ గాంధీ సభలు శుక్రవారం మధ్యాహ్నం వరంగల్‌లో సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో నిర్వహిస్తుండగా... ప్రధాని మన్మోహన్ సభను శనివారం నల్గొండలో, సోనియా ఆదివారం మెదక్‌లో సభలను నిర్వహిస్తున్నారు. ఈ సభలను సక్సెస్ చేయడమే అజెండాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆదివారం వరకు తెలంగాణలోనే మకాం వేస్తున్నారు. ఇంతకు ముందరి సభలు ఆశించిన ఫలితాలివ్వకపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. లీడర్లను ఉత్సాహ పరుస్తూ రాబోయే సభలనైనా సక్సెస్ చేయమని కోరుతున్నారు.
ఎవరి గోల వారిదే: మరో వైపు టీ కాంగ్ నేతలందరూ తమ తమ నియోజకవర్గాలకే పరిమితం కావడం కూడా అధిష్ఠానానికి మింగుడు పడటం లేదు. అందరూ ఆటగాళ్లే అయితే క్యాప్టెన్ ఎవరన్న ప్రశ్న వేస్తోంది అధిష్టానం. అసలు తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్సే అన్న క్రెడిట్‌ను దక్కించుకోవడంలో తమ సీనియర్లు విఫలమయ్యారంటూ నేతలు మండిపడుతోంది. సిఎం సీటుపై కన్నేసిన సీనియర్లు పార్టీ అభ్యర్ధుల గెలుపుపై దృష్టి సారించడం లేదని ఆరోపిస్తున్నారు.
దుమ్ము రేపుతున్న కేసీఆర్: మరో వైపు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రతిరోజు పది అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు. నామినేషన్ల ఘట్టానికి ముందే నాలుగైదు జిల్లా సభలను నిర్వహించారు. ప్రచార గడువు ముగిసే లోపు కేసీఆర్ 80 సభల్లో మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇపుడిక పార్టీని గట్టెక్కించడానికి సోనియా, రాహుల్ సభలు మినహా మరో మార్గం లేదంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు.