సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని.. ఆ దిశగా తీవ్రంగా శ్రమించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు సానుకూలత కనిపిస్తోందని.. తెలంగాణలోనూ పరిస్థితి అనుకూలంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు నెలల పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధికారమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించారు.
తొలిరోజు సీడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలతో సోనియా కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎన్నికల కోణంలో చర్చ జరిగిందని.. తెలంగాణలో ఈసారి గెలుపే ధ్యేయంగా ముందుకెళ్లాలని టీపీసీసీ నేతలకు సోనియా దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో గ్యారంటీ కార్డు స్కీమ్‌ల హామీ బాగా పనిచేసిందని.. ఆదివారం ఇక్కడి సభలో ప్రకటించబోయే గ్యారంటీ కార్డు స్కీమ్‌లను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు సమాచారం.
హామీలివ్వడమే కాదు, అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ప్రజల్లో భరోసా కల్పించాలని.. కర్ణాటకలో ఇప్పటికే నాలుగు గ్యారంటీ కార్డు స్కీమ్‌ల అమలు, హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం పునరుద్ధరణ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ కోసం తాను తగిన సమయం ఇస్తానని.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంకల సేవలను వినియోగించుకోవాలని సూచించినట్టు సమాచారం.
రాష్ట్రమిచ్చాం.. ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలి
పీసీసీ నేతలతో మాట్లాడిన సందర్భంగా సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘మనం తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేశాం. ఆ వాగ్దానానికి అనుగుణంగా 2014లో తెలంగాణ ఏర్పాటు చేశాం. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి, శ్రేయోపథంలోకి తీసుకెళ్లాలి. సీడబ్ల్యూసీ సమావేశాల సాక్షిగా తెలంగాణలో నూతన అధ్యాయం ప్రారంభం కావాలి. అభివృద్ధితోపాటు ఆత్మగౌరవంతో బతికేలా తెలంగాణను, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి..’’ అని సోనియా పేర్కొన్నారని వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment