Heavy police security
-
నిఘా నీడలో భైంసా
- శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి - ఎస్పీ తరుణ్‌జోషి ఆదిలాబాద్‌క్రైం : భైంసాలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగే ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్పీ తరుణ్‌జోషి అన్ని చర్యలు తీసుకున్నారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో భైంసా గణేష్ నిమజ్జన శోభాయాత్రపై బందోబస్తు అంశాలను చర్చించారు. డివిజన్లో అదనపు బలగాలు మొహరించాలని తెలిపారు. గణేష్ శోభాయాత్ర, బక్రీద్ పండుగలు ప్రశాంతంగా నిర్వహించుకుని తెలంగాణ రాష్ట్రానికి శాంతి సందేశాన్ని పంపి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎటువంటి పేలుడు పదార్థాలు, ఆయుధాలు కలిగి ఉండకూడదని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, పూర్తిగా నిషేధించామని తెలిపారు. మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు కలిగితే డయల్ 100కు లేదా, భైంసా డీఎస్పీ రాములు సెల్ 9440795076లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పనసారెడ్డి, జీఆర్ రాధిక, స్పెషల్ బ్రాంచ్‌ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, ఎస్సైలు టీడీ నందన్, కరీం, వెంకటస్వామి, అన్వర్, మల్లేష్, సురేష్ పాల్గొన్నారు. బందోబస్తు వివరాలు.. అదనపు ఎస్పీలు ముగ్గురు, డీఎస్పీలు ఎనిమిది మంది, సీఐలు 20 మంది, ఎస్సైలు 50 మంది, ఏఎస్సైలు 40, హెడ్‌కానిస్టేబుళ్లు 210, కానిస్టేబుళ్లు 300 మంది, సాయుధ బలగాలు 110, హోంగార్డులు 200 మంది, మహిళా పోలీసులు 40, నిఘా వర్గాలు 25, డాగ్‌స్క్వాడ్ 3, బాంబు నిర్వీర్య బృందాలు 8, లైట్ డిటెక్టివ్ బృందాలు 12 పాల్గొంటాయి. -
పురపాలకులు తేలేది నేడే
ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీ స్థానాల ఫలితాలు వెల్లడి - 210 వార్డులకు 1311మంది అభ్యర్థులు పోటీ - మధ్యాహ్నం వరకు ఓట్ల లెక్కింపు పూర్తి - గెలుపు సంబరాలు, ర్యాలీలు నిషేధం - కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు - మద్యం దుకాణాలు బంద్ నల్లగొండ, న్యూస్‌లైన్, పురపాలకుల భవితవ్యం సోమవారం తేలనుంది. ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణ నేటితో తెరపడనుంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. మొత్తం 210 వార్డులకు ఒక్కో వార్డుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 1311 మంది పోటీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన చాలా వ్యవధి తర్వాత ఫలితాలు వెల్లడవుతుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏడు స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ శివారు ప్రాంతంలోని డాన్‌బోస్కో స్కూల్లో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 7.30 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆ తర్వాత 8 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్ల కౌటింగ్ సజావుగా సాగేందుకు కౌంటింగ్ కేంద్రంలో టేబుళ్లు 37 ఏర్పాటు చేశారు. సిబ్బంది 148మందిని నియమించారు. నల్లగొండ మున్సిపాలిటీకి 7, మిగతా ఆరు స్థానాలకు ఐదు చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డు ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లలో పూర్తి చేస్తారు. మొత్తం అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో పూర్తవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితాలు వెల్లడిస్తారు. భారీ బందోబస్తు... ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రం వెలుపల, బయట పోలీస్ బలగాలతో పాటు, ప్రత్యేక పోలీస్ ఫోర్సు ఏర్పాటు చేశారు. ఏడుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, ఎస్ఐలు 69 మంది, ఏఎస్ఐలు 89 మంది, కానిస్టేబుళ్లు 248, హోంగార్డులు 179 మందిని నియమించారు. వీరితోపాటు స్పెషల్ పార్టీ, ఆర్మ్డ్ రిజర్వు పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలను కూడా మోహరించారు. మద్యం దుకాణాలు బంద్ గెలుపు సంబరాలతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరిటెండెంట్ దత్తురాజు గౌడ్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. -
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఏలూరు, న్యూస్‌లైన్ : ఏలూరు నగరపాలక సంస్థ, 7 ముని సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నిర్వహించే పోలింగ్ కోసం విసృ్తత ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికలలో మొత్తం 5,72,115 మంది ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు 608 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశామన్నారు. 135 సమస్యాత్మక, 128 అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. 193 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని, 121 పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 34 కేంద్రాలలో వీడియో షూటిం గ్‌కు చర్యలు తీసుకున్నామని వెల్లడిం చారు. 595 మంది పోలింగ్ అధికారులను, మరో 595 మంది సహాయ పోలింగ్ అధికారుల, 1,785 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రచారం ఖర్చు రూ.93 లక్షలు అభ్యర్థులు ప్రచారం నిమిత్తం రూ.93 లక్షలు ఖర్చు చేసినట్టు ఇప్పటివరకూ లెక్కలు చూపారని కలెక్టర్ చెప్పారు. మద్యం నియంత్రణకు జిల్లా అంతటా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గట్టి నిఘా పెట్టామని పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్, ఫ్రీ సర్టిఫికేషన్ కింద ఇంతవరకూ రూ.12 లక్షల ఖర్చును నమోదు చేశామన్నారు. పెయిడ్ న్యూస్‌కు సంబంధించి రెండు పార్టీలకు నోటీసులు జారీ చేశామన్నారు. పోలింగ్ రోజున అభ్యర్థి వాహనంలో తిరిగితే దానికి ప్రత్యేకంగా వాహన అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్భయంగా ఓటు వేయండి ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తున్నామని.. ప్రతి ఓటరు తమ ఓటుహక్కును నిర్భయం గా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఉదాసీనత, నిర్లిప్తంగా వ్యవహరించే సిబ్బందిపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో, మద్దతు పలికే కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవన్నారు. భారీ పోలీసు బందోబస్తు పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా జరిపించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సిద్ధార్థజైన్ తెలిపారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 19 షాడో టీములు ప్రస్తుతం పనిచేస్తున్నాయన్నారు. 10 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 94 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 96 మంది ఏఎస్సైలు, 109 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 1,230 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 493 మంది హోంగార్డ్స్, 32 సెక్షన్ల సాయుధ బలగాలు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నాయని వివరించారు. 56 మొబైల్ పార్టీలు, 10 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 25 స్ట్రైకింగ్ పోర్స్ బృందాలు పని చేస్తున్నాయన్నారు. ఓటరు స్లిప్పులు అందకపోతే... ఓటర్ల వివరాలతో కూడిన స్లిప్పులను సిబ్బంది శనివారం కూడా ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేస్తారని తెలిపారు. ఎవరికైనా అందకపోతే సమీపంలోని పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వీటిని అందించే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
ఒక దేవత వెలిసింది..
రాత్రి 9.40కి జనప్రవేశం పరవశించిన భక్తజనం తెల్లవార్లూ మొక్కుల చెల్లింపు మేడారం, న్యూస్‌లైన్ : దండాలు సారక్క తల్లే.. అంటూ జాతర ప్రాంగణం తల్లి నామస్మరణలో మునిగితేలింది. నాలుగు రోజులపాటు జరిగే మహా జాతరలో బుధవారం సారలమ్మ మేడారంలోని గద్దెకు చేరడంతో మహాఘట్టానికి తెరలేచింది. కుంకుమ భరణె రూపంలో ఉన్న తల్లి దర్శనం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న భక్తుల్లో ఆ తల్లి గద్దెపైకి చేరగానే భక్తి భావం ఉప్పొంగింది. బుధవారం సాయంత్రం 6.18 నిమిషాలకు కన్నెపల్లిలో బయలుదేరిన సారలమ్మ 7.20 గంటలకు జంపన్నవాగు వద్దకు, అక్కడి నుంచి సమ్మక్క గుడికి చేరుకుంది. అప్పటికే అక్కడికి ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి వచ్చిన గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి వచ్చిన పగిడిద్దరాజులున్నారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 9.40గంటలకు మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠించారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడన సారక్కను ఆద్యంతం భక్తి పారవశ్యంలో ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు పూజారులు గద్దెకు చేర్చారు. సారలమ్మ గద్దెను చేరనున్న క్రమంలో బుధవారం ఉదయం నుం చే సాలరమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో గిరిజన పూజారులు కన్నెపల్లిలోని సారక్క ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు ఆరంభించారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పూజలు జోరందుకున్నాయి. సాయంత్రం అక్కడి నుంచి బయలు దేరిన సారలమ్మ భారీ పోలీస్ బందోబస్తు మధ్య భక్తుల జయజయధ్వానాల నడుమ మేడారంలోని గద్దెలను చేరింది. ఉదయం నుంచే.. కన్నెపల్లి వెన్నెలమ్మ మేడారం గద్దెలను చేరనుండడంతో బుధవారం ఉదయం నుంచే కన్నెపల్లి సారక్క ఆలయంలో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. ప్రధాన వడ్డె కాక సారయ్యతో పాటు కోరె ముత్యంబాయి, కాక లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకన్న, కాక భుజంగరావు, కాక కనకమ్మ అత్యంత భక్తి శ్రద్ధలతో తల్లికి పూజలు చేశారు. ఈ క్రమంలో కన్నెపల్లిలోని సారలమ్మ గుడికి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమ ఆడపడుచును తల్లి ఒడికి చేర్చేందుకు గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు. దారిపొడవునా దండాలు సారలమ్మను గద్దెకు చేర్చే క్రమంలో దారి పొడవునా భక్తుల దండాలు పెడుతూ భక్తి ప్రపత్తులు చాటారు. సారక్క జై.. అంటూ నినాదాలు చేశారు. కన్నెపల్లి వాసులందరూ మంగళహారతులతో స్వాగతం పలికారు. దారి పొడవునా నీళ్లు పోస్తూ కొబ్బరికాయలు కొట్టి తమ బిడ్డను మేడారానికి సాగనంపారు. కన్నెపల్లి నుంచి మేడారం చేరే ముందు సారలమ్మ తమ్ముడు జంపన్నను ముద్దాడుకుంటూ వెళ్లింది. సంపెంగవాగులో కొలువైన జంపన్న క్షేమ సమాచారం తెలుసుకుని తల్లి ఒడికి చేరింది. తమ్ముడు జంపన్నను పలకరిస్తుండగా శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. గుడారాల్లో ఉన్న భక్తులు కూడా ఒక్కసారిగా సారక్కను చూసేందుకు రోడ్డు పైకి చేరడంతో పరిసరాలు కిటకిటలాడాయి. సారక్క మహిమలతో శివసత్తులు శివాలూగారు. పోలీసుల అత్యుత్సాహం కన్నెపల్లి వెన్నెలమ్మను మేడారం గద్దెకు చేర్చేక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బందోబస్తు పేరుతో గిరిజనులను ఇబ్బందులు పెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వెన్నెలమ్మను వడివడిగా సమ్మక్క గుడికి చేర్చారు. అయితే సారలమ్మకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు.. అధికారుల సేవలో తరించారు. జేసీ పౌసుమిబసు, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా, కరీంనగర్ జేసీ సర్ఫరాజ్ అహ్మద్‌లకు ఏకంగా రోప్ సౌకర్యం కల్పించి ఔరా అన్పించుకున్నారు. దాదాపుగా సారలమ్మకు రోప్ ఇచ్చినట్టుగా హడావుడి చేస్తూ దారిపొడవునా భక్తులను ఇక్కట్లకు గురిచేశారు. వారి తీరుపై భక్తులు మండిపడ్డారు. వరం పట్టిన మహిళలు సంతానం కోసం పలువురు మహిళలు కన్నెపల్లి ఆయలం వద్ద వరం ప ట్టారు. అంతకుముందు జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేశారు. తడిబట్టలతోనే సారలమ్మ గుడికి చేరుకు ని పొర్లుదండాలు పెట్టారు. సారక్క ను గద్దెలపైకి చేర్చే క్రమంలో పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ రాకను సూచిస్తూ పూజారులు కొమ్ము బూరలు పూరించారు. స్వాగతం పలికిన అధికారులు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెపైకి తీసుకువచ్చేందుకు జిల్లా అధికారులు, ప్రముఖులు తరలివచ్చి స్వాగతం పలికా రు. క లెక్టర్ కిషన్, స్థానిక ఎమ్మెల్యే ధనసరి సీతక్క, జేసీ పౌసుమిబసు, ఏజేసీ, ఐటీడీఏ పీఓ సంజీవయ్య, కరీంనగర్ జేసీ సర్ఫరాజ్ అహ్మద్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మి శ్రా, ములుగు ఆర్డీఓ సభావట్ మోతీలాల్, డీఎస్పీ కటకం మురళీధర్, సీఆర్పీఎఫ్ ఐజీ అశ్వనీ వర్మ, డీఎస్పీ అరవింద్ కుమార్ అమ్మవారికి స్వాగతం పలికారు. -
9 పంచాయతీలకు ఎన్నిక నేడు
విశాఖ రూరల్/పాడేరు, న్యూస్‌లైన్: మావోయిస్టుల చర్యలు, భారీ వర్షాలు కారణంగా ఏజెన్సీ మూడు మండలాల్లో వాయిదా పడిన పంచాయతీలకు శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈమేరకు అధికారులు పక్కా ఏర్పాట్లు పూర్తి చేశారు. వాస్తవానికి 13 పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. జీకే వీధి మండలంలో నామినేషన్లు దాఖలు కాలేదు. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీకి మూడు నామినేషన్లు వచ్చినా, ఒకరు ఉపసంహరించుకోగా ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గుర య్యాయి. దీంతో ఈ రెండు పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం లేకుండాపోయింది. చింతపల్లి మండలం బలపం, జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీలు ఏకగ్రీవమాయ్యాయి. ఫలితంగా శనివారం 9 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల్లో సర్పంచ్ పదవికి 34 మంది పోటీ పడుతున్నారు. 226 వార్డులకు 111వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 93 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 22 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి కి 44 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలకు 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 17600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై సాయంత్రానికి పూర్తవుతుంది. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. భారీ బందోబస్తు ఈ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కూంబింగ్ పార్టీలు కూడా మారుమూల గ్రామాలకు చేరుకొని ఇప్పటికే జల్లెడ పడుతున్నాయి. గతంలో మాదిరి మావోయిస్టులు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ప్రధానంగా జర్రెల, మొండిగెడ్డ, వంచుల, లోతుగెడ్డ, కుడుముసారి, తమ్మెంగుల, బొంగరం, లింగేటి, గుల్లెలు పంచాయతీలు మావోయిస్టు ప్రాబల్యం ప్రాంతాలు కావడంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. 153 మంది ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక బందోబస్తును కల్పిస్తున్నారు. ఈ ఎన్నికలకు మావోయిస్టుల నుంచి ఎటువంటి హెచ్చరికలు లేనప్పటికీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.