విశాఖ రూరల్/పాడేరు, న్యూస్‌లైన్: మావోయిస్టుల చర్యలు, భారీ వర్షాలు కారణంగా ఏజెన్సీ మూడు మండలాల్లో వాయిదా పడిన పంచాయతీలకు శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈమేరకు అధికారులు పక్కా ఏర్పాట్లు పూర్తి చేశారు. వాస్తవానికి 13 పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. జీకే వీధి మండలంలో నామినేషన్లు దాఖలు కాలేదు.
పెదబయలు మండలం ఇంజరి పంచాయతీకి మూడు నామినేషన్లు వచ్చినా, ఒకరు ఉపసంహరించుకోగా ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గుర య్యాయి. దీంతో ఈ రెండు పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం లేకుండాపోయింది. చింతపల్లి మండలం బలపం, జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీలు ఏకగ్రీవమాయ్యాయి. ఫలితంగా శనివారం 9 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల్లో సర్పంచ్ పదవికి 34 మంది పోటీ పడుతున్నారు.
226 వార్డులకు 111వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 93 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 22 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి కి 44 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలకు 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 17600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై సాయంత్రానికి పూర్తవుతుంది. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
భారీ బందోబస్తు
ఈ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కూంబింగ్ పార్టీలు కూడా మారుమూల గ్రామాలకు చేరుకొని ఇప్పటికే జల్లెడ పడుతున్నాయి. గతంలో మాదిరి మావోయిస్టులు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా గట్టి భద్రత చర్యలు చేపట్టారు.
ప్రధానంగా జర్రెల, మొండిగెడ్డ, వంచుల, లోతుగెడ్డ, కుడుముసారి, తమ్మెంగుల, బొంగరం, లింగేటి, గుల్లెలు పంచాయతీలు మావోయిస్టు ప్రాబల్యం ప్రాంతాలు కావడంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. 153 మంది ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక బందోబస్తును కల్పిస్తున్నారు. ఈ ఎన్నికలకు మావోయిస్టుల నుంచి ఎటువంటి హెచ్చరికలు లేనప్పటికీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
9 పంచాయతీలకు ఎన్నిక నేడు
Published Sat, Jan 18 2014 5:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement