Due to heavy rains
-
బయటపడ్డ బద్రీనాథ్ యాత్రికులు
ధైర్యం కూడదీసుకుని వర్షంలోనే తిరుగుముఖం రుషికేశ్‌లో కొందరు..హరిద్వార్‌కు మరికొందరు బుధవారం నాటికి హైదరాబాద్చేరుకునే అవకాశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై యాత్రికుల ధ్వజం విజయవాడ బ్యూరో: భారీ వర్షాల కారణంగా బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు ఎట్టకేలకు బయటపడ్డారు. నాలు గు రోజులపాటు నరకయాతన అనుభవించిన 38 మంది యాత్రికులు ఆదివారం ఉదయం ధైర్యం కూడదీసుకుని ప్రైవేటు వాహనాల్లో హరిద్వార్ బయలుదేరారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రాణ భయంతో ఇంటి ముఖం పట్టారు. 50 కిలోమీటర్లు ప్రయాణించి కొందరు రుషికేశ్‌లో ఆగిపోగా.. మిగిలిన వారు అవే వాహనాల్లో హరిద్వార్ వరకూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి వీరు హరిద్వార్ చేరుకుంటారు. అక్కడి నుంచి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ చేరతారు. ఆదివారం కూడా బద్రీనాథ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో చినజీయర్ ఆశ్రమంలో ఉన్న తెలుగు యాత్రికుల్లో ఆందోళన పెరిగిం ది. నాలుగు రోజులుగా నానా ఇక్కట్లు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సాయం చేయకపోగా, అక్కడి నుంచి బయటకు చేర్చే ప్రయత్నాలు చేయకపోవడంతో యాత్రికులు మరింత కుంగిపోయారు. మరో రెండు రోజులు అక్కడే ఉంటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని భావించి వర్షంలోనే తిరుగుముఖం పట్టారు. మొదట వాహనాలు తీయడానికి విముఖత వ్యక్తం చేసిన అక్కడి డ్రైవర్లు కొందరు.. అధిక మొత్తంలో కిరాయి చెల్లిస్తామని చెప్పడంతో ప్రయాణానికి అంగీకరించారు. దీంతో 3 ప్రైవేటు వాహనాల్లో 38 మంది యాత్రికులు బయలుదేరారు. కృష్ణా జిల్లా వేకనూరు గ్రామానికి చెందిన తుంగల భాస్కరరావు కుటుంబీకులు మొత్తం 11 మంది రుషికేశ్ వరకూ ప్రయాణించి ఆదివారం రాత్రి అక్కడే ఆగిపోయారు. హైదరాబాద్, విశాఖ, చిత్తూరు, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన మిగతా వారు రెండు వాహనాల్లో హరిద్వార్ వరకూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. రాత్రి 7 గంటలకు తుకులి ప్రాంతానికి చేరుకున్న వీరు సోమవారం మధ్యాహ్నానికి హరిద్వార్ చేరతారు. మార్గమధ్యంలో కొండలు ఎక్కి దిగే క్రమంలో రోడ్లకు అడ్డుపడిన పెద్ద పెద్ద రాళ్లను తామే తొలగించి ప్రయాణం సాగిస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన సోమయాజులు ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్లో తెలిపారు. హరిద్వార్‌లో దక్షిణ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఢిల్లీ చేరుకుంటామనీ, అక్కడి నుంచి బుధవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరతామని ఆయన వివరించారు. ఒక్కరన్నా పట్టించుకున్న పాపాన పోలేదు.. నాలుగు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నా.. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నా కేంద్రంగానీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వంగానీ పట్టించుకున్న పాపాన పోలేదని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంపై వీరు ఆవేదన వ్యక్తం చేశారు. చార్ధామ్ యాత్ర తమకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని యాత్రికులు పేర్కొన్నారు. -
బద్రీనాథ్‌లో యాత్రికులకు జ్వరాలు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చినజీయర్ ఆశ్రమంలోతెలుగు భక్తులకు ఆశ్రయం చలిగాలుల తీవ్రతకు ఆస్తమా రోగులకు అస్వస్థత నీటి ఉధృతికి కొట్టుకు పోయిన రోడ్లు విజయవాడ బ్యూరో: చార్ధామ్ యాత్రకు వెళ్లి భారీ వర్షాలతో బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన పలువురు తెలుగు యాత్రికులకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. బద్రీనాథ్‌లోని చినజీయర్ ఆశ్రమంలో తలదాచుకుంటున్న యాత్రికుల్లో 10 మందికి పైగా జ్వరాలు సోకాయి. కొందరు జలుబు, దగ్గు సమస్యలతో బాధ పడుతుండగా నలుగురు ఆస్తమా రోగులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలుల తీవ్రత పెరిగి వాతావరణం బాగా చల్లబడటంతో శ్వాస పీల్చుకోవడం కష్టమవుతోందని ఆశ్రమంలోని యాత్రికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఒక వైద్యుడు వీరికి చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఆరోగ్య సమస్యలు తీవ్రం కావడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. వీరి పరిస్థితిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధి శనివారం సాయంత్రం ఫోన్ చేయగా పలువురు యాత్రికులు తమ దయనీయ పరిస్థితిని వివరించారు. ఉత్తరాఖండ్ సీఎం ఫోన్ చేసినా... ‘వర్షాలు మరింత పెరిగాయి. ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడుతూనే ఉంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్ ఫోన్ చేసి ఎవరూ కంగారు పడొద్దని ధైర్యం చెప్పారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే లైన్లోకి రావటంతో ప్రభుత్వం నుంచి తప్పకుండా సాయం అందుతుందని ఆశ పడ్డాం. కానీ శనివారం సాయంత్రం వరకూ ఎవరూ రాలేదు. ఒకరిద్దరు పోలీసు ఇన్స్పెక్టర్లు వచ్చి ఎలా ఉన్నారని పలకరించి వెళ్లారు’ యాత్రికులు పేర్కొన్నారు. ఆశ్రమంలో ఉన్న సాంబశివరావు, శివయ్య, సుమంత్(డ్రైవర్), సూర్యనారాయణ, రజని, సోమయాజులు జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారు. వృద్ధులైన యల్లప్ప, సాయమ్మ, సోమయాజులు ఆస్తమాతో ఊపిరి ఆడక అవస్థ పడుతున్నారు. హృద్రోగంతో బాధపడుతున్న సూర్యనారాయణకు జ్వరం రావడంతో ఆయన బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆశ్రమ నిర్వాహకులు ఇచ్చిన దుప్పట్లు కప్పుకుని మునగదీసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోవటంతో ఏం చేయాలో పాలు పోవడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్ ఎస్వీఎస్ రావు చెప్పారు. రుషికేశ్ మార్గంలో కొట్టుకు పోయిన రోడ్డు నదీ ప్రవాహ వేగానికి బద్రీనాథ్ నుంచి రుషికేశ్కు వెళ్లే మార్గంలో 35వ కి.మీ. దగ్గర రోడ్డు 100 గజాల మేర కొట్టుకు పోయింది. దీంతో బద్రీనాథ్ పోలీసులు అక్కడ ఉన్న భక్తుల్ని అప్రమత్తం చేస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ప్రయాణం చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. బద్రీనాథ్ నుంచి జోషిమఠం వెళ్లే రోడ్డు కూడా బాగా దెబ్బతినటంతో యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ సుమారు 7 సెంటీమీటర్ల వర్షం కురిసి ఉండవచ్చని చెబుతున్నారు. ఆకాశమంతా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో బద్రీనాథ్ వాతావరణం ప్రమాదకరంగా మారిందని యాత్రికులు ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రికుల కుటుంబీకుల్లో ఆందోళన యాత్రికులు మూడు రోజులుగా బద్రీనాథ్‌లో చిక్కుకుపోవటంతో వారి బంధువుల్లో ఆందోళన చెందుతున్నారు. కృష్ణాజిల్లా వేకనూరు గ్రామానికి చెందిన 11 మంది బద్రీనాథ్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. చెన్నైలో ఉన్న తుంగల భాస్కరరావు కుమారుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులు, అక్కబావల క్షేమ సమాచారాలను ఫోన్ ద్వారా తెలుసుకుని ధైర్యం చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన సోమయాజులు, రజని బంధువులు, హరిబాబు కుటుంబీకులు ఆందోళనతో టీవీలో వార్తలు తెలుసుకుంటున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని వారిని తమ దగ్గరకు చేర్చాలని కోరుతున్నారు. చార్ధామ్ యాత్ర నాలుగో రోజూ బంద్ ప్రతికూల పరిస్థితులతో వరుసగా నాలుగో రోజు చార్ధామ్ యాత్రను రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో శనివారం కూడా యాత్ర రద్దయింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యాత్రను శనివారం నిలిపివేసినట్లు ఉత్తరకాశి కలెక్టర్ రవిశంకర్ తెలిపారు. యాత్ర ఆదివారం తిరిగి ప్రారంభం కావచ్చని అయితే వాతావరణం, రహదారుల పరిస్థితిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. చంపావట్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 150 వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి. -
అఫ్ఘాన్ మృతులు 500!
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్లోని బదక్షాన్ రాష్ట్రం ఆబ్ బరీక్ గ్రామంపై శుక్రవారం భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన ఘటన లో మృతుల సంఖ్య 500కు పెరగొచ్చని అధికారులు చెప్పారు. శనివారం నాటికి 300 మంది మృతిచెందినట్లు ధ్రువీకరించామన్నారు. ఈ విపత్తులో 2,500 మంది మృతిచెందారని అంతకు ముందు ప్రకటించారు. అయితే సాంకేతిక బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగా కాకుండా స్థానికులు ఇచ్చిన సమాచారాన్నిబట్టి అలా ప్రకటించినట్లు వివరణ ఇచ్చారు. మృతుల సంఖ్య 500 దాటకపోవచ్చన్నారు. 300కుపైగా ఇళ్లు కొన్ని మీటర్ల ఎత్తు బురదలో కూరుకుని పోవడంతో సహాయక చర్యలు నిలిపివేశామన్నారు. ఈ విపత్తుపై భారత ప్రధాని మన్మోహన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో సాయం చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. -
9 పంచాయతీలకు ఎన్నిక నేడు
విశాఖ రూరల్/పాడేరు, న్యూస్‌లైన్: మావోయిస్టుల చర్యలు, భారీ వర్షాలు కారణంగా ఏజెన్సీ మూడు మండలాల్లో వాయిదా పడిన పంచాయతీలకు శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈమేరకు అధికారులు పక్కా ఏర్పాట్లు పూర్తి చేశారు. వాస్తవానికి 13 పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. జీకే వీధి మండలంలో నామినేషన్లు దాఖలు కాలేదు. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీకి మూడు నామినేషన్లు వచ్చినా, ఒకరు ఉపసంహరించుకోగా ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గుర య్యాయి. దీంతో ఈ రెండు పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం లేకుండాపోయింది. చింతపల్లి మండలం బలపం, జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీలు ఏకగ్రీవమాయ్యాయి. ఫలితంగా శనివారం 9 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల్లో సర్పంచ్ పదవికి 34 మంది పోటీ పడుతున్నారు. 226 వార్డులకు 111వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 93 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 22 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి కి 44 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలకు 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 17600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై సాయంత్రానికి పూర్తవుతుంది. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. భారీ బందోబస్తు ఈ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కూంబింగ్ పార్టీలు కూడా మారుమూల గ్రామాలకు చేరుకొని ఇప్పటికే జల్లెడ పడుతున్నాయి. గతంలో మాదిరి మావోయిస్టులు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ప్రధానంగా జర్రెల, మొండిగెడ్డ, వంచుల, లోతుగెడ్డ, కుడుముసారి, తమ్మెంగుల, బొంగరం, లింగేటి, గుల్లెలు పంచాయతీలు మావోయిస్టు ప్రాబల్యం ప్రాంతాలు కావడంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. 153 మంది ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక బందోబస్తును కల్పిస్తున్నారు. ఈ ఎన్నికలకు మావోయిస్టుల నుంచి ఎటువంటి హెచ్చరికలు లేనప్పటికీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.