ధైర్యం కూడదీసుకుని వర్షంలోనే తిరుగుముఖం
రుషికేశ్‌లో కొందరు..హరిద్వార్‌కు మరికొందరు
బుధవారం నాటికి హైదరాబాద్చేరుకునే అవకాశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై యాత్రికుల ధ్వజం
విజయవాడ బ్యూరో: భారీ వర్షాల కారణంగా బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు ఎట్టకేలకు బయటపడ్డారు. నాలు గు రోజులపాటు నరకయాతన అనుభవించిన 38 మంది యాత్రికులు ఆదివారం ఉదయం ధైర్యం కూడదీసుకుని ప్రైవేటు వాహనాల్లో హరిద్వార్ బయలుదేరారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రాణ భయంతో ఇంటి ముఖం పట్టారు. 50 కిలోమీటర్లు ప్రయాణించి కొందరు రుషికేశ్‌లో ఆగిపోగా.. మిగిలిన వారు అవే వాహనాల్లో హరిద్వార్ వరకూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి వీరు హరిద్వార్ చేరుకుంటారు. అక్కడి నుంచి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ చేరతారు. ఆదివారం కూడా బద్రీనాథ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో చినజీయర్ ఆశ్రమంలో ఉన్న తెలుగు యాత్రికుల్లో ఆందోళన పెరిగిం ది. నాలుగు రోజులుగా నానా ఇక్కట్లు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సాయం చేయకపోగా, అక్కడి నుంచి బయటకు చేర్చే ప్రయత్నాలు చేయకపోవడంతో యాత్రికులు మరింత కుంగిపోయారు. మరో రెండు రోజులు అక్కడే ఉంటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని భావించి వర్షంలోనే తిరుగుముఖం పట్టారు. మొదట వాహనాలు తీయడానికి విముఖత వ్యక్తం చేసిన అక్కడి డ్రైవర్లు కొందరు.. అధిక మొత్తంలో కిరాయి చెల్లిస్తామని చెప్పడంతో ప్రయాణానికి అంగీకరించారు.
దీంతో 3 ప్రైవేటు వాహనాల్లో 38 మంది యాత్రికులు బయలుదేరారు. కృష్ణా జిల్లా వేకనూరు గ్రామానికి చెందిన తుంగల భాస్కరరావు కుటుంబీకులు మొత్తం 11 మంది రుషికేశ్ వరకూ ప్రయాణించి ఆదివారం రాత్రి అక్కడే ఆగిపోయారు. హైదరాబాద్, విశాఖ, చిత్తూరు, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన మిగతా వారు రెండు వాహనాల్లో హరిద్వార్ వరకూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. రాత్రి 7 గంటలకు తుకులి ప్రాంతానికి చేరుకున్న వీరు సోమవారం మధ్యాహ్నానికి హరిద్వార్ చేరతారు. మార్గమధ్యంలో కొండలు ఎక్కి దిగే క్రమంలో రోడ్లకు అడ్డుపడిన పెద్ద పెద్ద రాళ్లను తామే తొలగించి ప్రయాణం సాగిస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన సోమయాజులు ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్‌లో తెలిపారు. హరిద్వార్‌లో దక్షిణ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఢిల్లీ చేరుకుంటామనీ, అక్కడి నుంచి బుధవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరతామని ఆయన వివరించారు.
ఒక్కరన్నా పట్టించుకున్న పాపాన పోలేదు..
నాలుగు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నా.. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నా కేంద్రంగానీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వంగానీ పట్టించుకున్న పాపాన పోలేదని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంపై వీరు ఆవేదన వ్యక్తం చేశారు. చార్‌ధామ్ యాత్ర తమకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని యాత్రికులు పేర్కొన్నారు.
బయటపడ్డ బద్రీనాథ్ యాత్రికులు
Published Mon, Jul 21 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM
Advertisement
Advertisement