ఒక దేవత వెలిసింది.. | medaram jathara | Sakshi
Sakshi News home page

ఒక దేవత వెలిసింది..

Published Thu, Feb 13 2014 1:29 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM

ఒక దేవత వెలిసింది.. - Sakshi

ఒక దేవత వెలిసింది..

  •     రాత్రి 9.40కి జనప్రవేశం
  •      పరవశించిన భక్తజనం
  •      తెల్లవార్లూ మొక్కుల చెల్లింపు
  •  మేడారం, న్యూస్‌లైన్ : దండాలు సారక్క తల్లే.. అంటూ జాతర ప్రాంగణం తల్లి నామస్మరణలో మునిగితేలింది. నాలుగు రోజులపాటు జరిగే మహా జాతరలో బుధవారం సారలమ్మ మేడారంలోని గద్దెకు చేరడంతో మహాఘట్టానికి తెరలేచింది. కుంకుమ భరణె రూపంలో ఉన్న తల్లి దర్శనం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న భక్తుల్లో ఆ తల్లి గద్దెపైకి చేరగానే భక్తి భావం ఉప్పొంగింది.

    బుధవారం సాయంత్రం 6.18 నిమిషాలకు కన్నెపల్లిలో బయలుదేరిన సారలమ్మ 7.20 గంటలకు జంపన్నవాగు వద్దకు, అక్కడి నుంచి సమ్మక్క గుడికి చేరుకుంది. అప్పటికే అక్కడికి ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి వచ్చిన గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి వచ్చిన పగిడిద్దరాజులున్నారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 9.40గంటలకు మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠించారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడన సారక్కను ఆద్యంతం భక్తి పారవశ్యంలో ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు పూజారులు గద్దెకు చేర్చారు.

    సారలమ్మ గద్దెను చేరనున్న క్రమంలో బుధవారం ఉదయం నుం చే సాలరమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో గిరిజన పూజారులు కన్నెపల్లిలోని సారక్క ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు ఆరంభించారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పూజలు జోరందుకున్నాయి. సాయంత్రం అక్కడి నుంచి బయలు దేరిన సారలమ్మ భారీ పోలీస్ బందోబస్తు మధ్య భక్తుల జయజయధ్వానాల నడుమ మేడారంలోని గద్దెలను చేరింది.
     
    ఉదయం నుంచే..

     
    కన్నెపల్లి వెన్నెలమ్మ మేడారం గద్దెలను చేరనుండడంతో బుధవారం ఉదయం నుంచే కన్నెపల్లి సారక్క ఆలయంలో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. ప్రధాన వడ్డె కాక సారయ్యతో పాటు కోరె ముత్యంబాయి, కాక లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక  వెంకన్న, కాక భుజంగరావు, కాక కనకమ్మ  అత్యంత భక్తి శ్రద్ధలతో తల్లికి  పూజలు చేశారు. ఈ క్రమంలో కన్నెపల్లిలోని సారలమ్మ గుడికి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమ ఆడపడుచును తల్లి ఒడికి చేర్చేందుకు గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు.
     
    దారిపొడవునా దండాలు
     
    సారలమ్మను గద్దెకు చేర్చే క్రమంలో దారి పొడవునా భక్తుల దండాలు పెడుతూ భక్తి ప్రపత్తులు చాటారు. సారక్క జై.. అంటూ నినాదాలు చేశారు. కన్నెపల్లి వాసులందరూ మంగళహారతులతో స్వాగతం పలికారు. దారి పొడవునా నీళ్లు పోస్తూ కొబ్బరికాయలు కొట్టి తమ బిడ్డను మేడారానికి సాగనంపారు. కన్నెపల్లి నుంచి మేడారం చేరే ముందు సారలమ్మ తమ్ముడు జంపన్నను ముద్దాడుకుంటూ వెళ్లింది. సంపెంగవాగులో కొలువైన జంపన్న క్షేమ సమాచారం తెలుసుకుని తల్లి ఒడికి చేరింది. తమ్ముడు జంపన్నను పలకరిస్తుండగా శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. గుడారాల్లో ఉన్న భక్తులు కూడా ఒక్కసారిగా సారక్కను చూసేందుకు రోడ్డు పైకి చేరడంతో పరిసరాలు కిటకిటలాడాయి. సారక్క మహిమలతో శివసత్తులు శివాలూగారు.
     
    పోలీసుల అత్యుత్సాహం
     
    కన్నెపల్లి వెన్నెలమ్మను మేడారం గద్దెకు చేర్చేక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బందోబస్తు పేరుతో గిరిజనులను ఇబ్బందులు పెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వెన్నెలమ్మను వడివడిగా సమ్మక్క గుడికి చేర్చారు. అయితే సారలమ్మకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు.. అధికారుల సేవలో తరించారు. జేసీ పౌసుమిబసు, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా, కరీంనగర్ జేసీ సర్ఫరాజ్ అహ్మద్‌లకు ఏకంగా రోప్ సౌకర్యం కల్పించి ఔరా అన్పించుకున్నారు. దాదాపుగా సారలమ్మకు రోప్ ఇచ్చినట్టుగా హడావుడి చేస్తూ దారిపొడవునా భక్తులను ఇక్కట్లకు గురిచేశారు. వారి తీరుపై భక్తులు మండిపడ్డారు.
     
     వరం పట్టిన మహిళలు

     సంతానం కోసం పలువురు మహిళలు కన్నెపల్లి ఆయలం వద్ద వరం ప ట్టారు. అంతకుముందు జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేశారు. తడిబట్టలతోనే సారలమ్మ గుడికి చేరుకు ని పొర్లుదండాలు పెట్టారు. సారక్క ను గద్దెలపైకి చేర్చే క్రమంలో పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ రాకను సూచిస్తూ పూజారులు కొమ్ము బూరలు పూరించారు.
     
     స్వాగతం పలికిన అధికారులు

     సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెపైకి తీసుకువచ్చేందుకు జిల్లా అధికారులు, ప్రముఖులు తరలివచ్చి స్వాగతం పలికా రు. క లెక్టర్ కిషన్, స్థానిక ఎమ్మెల్యే ధనసరి సీతక్క, జేసీ పౌసుమిబసు, ఏజేసీ, ఐటీడీఏ పీఓ సంజీవయ్య, కరీంనగర్ జేసీ సర్ఫరాజ్ అహ్మద్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మి శ్రా, ములుగు ఆర్డీఓ సభావట్ మోతీలాల్, డీఎస్పీ కటకం మురళీధర్, సీఆర్‌పీఎఫ్ ఐజీ అశ్వనీ వర్మ, డీఎస్పీ అరవింద్ కుమార్ అమ్మవారికి స్వాగతం పలికారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement