సాక్షి ప్రతినిధి, వరంగల్: రానున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం రోజున గద్దెలపైకి సారలమ్మ చేరుకునే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో గ్రహణం వీడిన తర్వాత సారలమ్మను గద్దెలపైకి తీసుకు రానున్నారు. ఈ మేరకు సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం, దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మేడారం జాతర జరుగుతుంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతరను ఈసారి 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో నిర్వహిస్తామని సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం 2017 ఏప్రిల్‌లో తేదీలు ప్రకటించింది. 2018 జనవరి 31 జాతర తొలిరోజున కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించి, సాయంత్రం వేళ కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకువస్తారు. ఇదే సమయంలో సాయంత్రం 6:04 నుంచి రాత్రి 8:40 వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో గ్రహణ సమయంలో ఏం చేయాలనే అంశంపై సందిగ్ధం ఏర్పడింది.
గ్రహణం తర్వాత: చంద్రగ్రహణం వీడిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో సారలమ్మను మేడారం గద్దెలపైకి తీసుకురావాలని సమ్మక్క–సారలమ్మ పూజా రుల సంఘం నిర్ణయించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గ్రహ ణం విడిచిన తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తీసుకొ స్తామని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు చెప్పారు.
పూజారుల సంఘం నిర్ణయం ప్రకారమే
మేడారం జాతర విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం నిర్ణయం ప్రకారం ఏర్పాట్లు చేస్తాం. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గ్రహణం విషయంలో పట్టింపులు లేవని పూజారులు చెప్పారు. కాబట్టి ముందుగా నిర్ణయించినట్లుగానే 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జాతర జరుగుతుంది.
–రమేశ్‌బాబు, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, వరంగల్