Ministry of Endowments
-
'క్లియరెన్స్ రాగానే భక్తులను అనుమతిస్తాం'
సాక్షి, విజయవాడ : లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆలయాలకు సడలింపునివ్వడంతో భక్తులను దర్శనాలకు అనుమతించే అవకాశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆలయాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలను ఏపీ దేవాదాయశాఖ హెల్త్ డిపార్ట్మెంట్కు లేఖను పంపించింది. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... కేంద్రం ఆలయాలకు సడలింపులు ప్రకటించడంతో ఎపిలో భక్తులను అనుమతించే అంశంపై రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఆలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఆలయాల్లో ధర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత మాత్రమే భక్తులను దేవాలయాలకు అనుమతిస్తామని తెలిపారు. వ్యక్తికి వ్యక్తి మధ్య భౌతిక దూరం, శానిటైజర్, మాస్క్ లు తప్పనిసరి చేశామన్నారు. ఏపీలోని అన్ని దేవాలయాలలో ఒకటే మార్గదర్శకాలు ఉంటాయని, తిరుమలలో ఇప్పటికే వర్తింపచేస్తున్నామని పేర్కొన్నారు. టైం స్లాట్ ద్వారానే గంటకు 300 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని వెల్లడించారు. కరోనా తీవ్రత దృష్ట్యా దేవాలయాల్లో తీసుకున్న జాగ్రత్తలను లేఖ రూపంలో ఇప్పటికే హెల్త్ డిపార్ట్మెంట్కు పంపామని, వారి నుంచి క్లియరెన్స్ రాగానే మరిన్ని గైడ్‌లైన్స్‌తో భక్తులను అనుమతిస్తామని తెలిపారు. -
దేవుడి శాఖలో మరో వింత నిబంధన
సాక్షి, హైదరాబాద్: ఆయన దేవాదాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా 35 ఏళ్ల క్రితం చేరాడు. ఏడాదిక్రితం కార్యనిర్వహణాధికారి (ఈఓ)గా పదవీ విరమణ పొందారు. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకోగా, దేవాదాయశాఖలో చేరిన నాటి నుంచి ఏయే దేవాలయాల్లో పనిచేశారో, ఆయా దేవాలయాల ఈఓల నుంచి ‘నో అబ్జెక్షన్’సర్టిఫికెట్స్ తెచ్చి దాఖలు చేయాలని హుకుం జారీ చేశారు. ఆయా దేవాలయాల్లో ఆయన పనిచేసి బదిలీ అయినప్పుడు అన్ని బాధ్యతలు సవ్యంగానే అప్పగించారని, ఎక్కడా ఎలాంటి తప్పులు జరగలేదని ఈఓ సర్టిఫై చేస్తేనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అప్పగిస్తామని మెలిక పెట్టారు. ఆయా దేవాలయాలకు వెళ్లి సర్టిఫికెట్ కోసం అడిగితే, ‘ఆ సమయంలో మేం లేం కదా, నో అబ్జక్షన్ సర్టిఫికెట్ మేమెలా ఇస్తాం’అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో పదవీ విమరణ పొంది ఏడాది దాటుతున్నా బెనిఫిట్స్ అందటం లేదు, పింఛనూ రావటం లేదు. ఇది ఒక్క అధికారికే పరిమితం కాలేదు. ఇటీవల పదవీ విరమణ పొందిన కార్యనిర్వహణాధికారులు ఎదుర్కొంటున్న సమస్య. ఓ పద్ధతి లేకుండా కొందరు అధికారుల ఇష్టారాజ్యంగా మారిన దేవాదాయశాఖలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారమిది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆ మాజీ అధికారులు, గతంలో తాము పనిచేసిన ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదీ సంగతి... ఏ విభాగంలో అయినా సిబ్బంది పదవీ విరమణ పొందిన వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతాయి. ఆ వెంటనే పింఛను మంజూరవుతుంది. కానీ, కొందరు అధికారుల ఇష్టారాజ్యానికి చిరునామాగా మారిన దేవాదాయశాఖలో ఇప్పుడు వింత వ్యవహారం చోటు చేసుకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో ప్రమేయం లేకుండా నేరుగా నియామకాలు జరిగే ఏౖకైక ప్రభుత్వ విభాగం దేవాదాయశాఖ. ఆలయ ట్రస్టీలు, కమిషనరేట్‌లోని కొందరు అధికారులు కూడబలుక్కుంటే అర్హతలతో సంబంధం లేకుండా క్లర్క్‌లుగా నియమించే విధానం ఇందులో ఉంది. అలా క్లర్కులుగా నియమితులై ఆ తర్వాత వేర్వేరు ఆలయాలకు బదిలీ అవుతూ పదోన్నతులు పొందుతుంటారు. సీనియారిటీ ప్రకారం కార్యనిర్వహణాధికారులుగా ప్రమోట్ అయి ఆ తర్వాత సర్వీసు ఉంటే అసిస్టెంట్ కమిషనర్, ఆ పై పోస్టులకు కూడా పదోన్నతులు పొందుతారు. కొందరు ఈఓ స్థాయిలోనే రిటైర్ అవుతారు. గత ఏడాదిన్నరగా రిటైర్ అయిన వారికి కొత్త చిక్కొచ్చిపడింది. సాధారణంగా ఈఓగా పదోన్నతి పొందిన తర్వాత దేవాలయాల బాధ్యత పూర్తిగా వారి చేతిలో ఉంటుంది. మరో దేవాలయానికి బదిలీ అయినప్పుడు ఆ ఆలయ దేవరుల నగలు మొదలు, ఇతర అన్ని లెక్కలను తదుపరి ఈఓకు అప్పగించాలి. ఇప్పుడు ఆ అప్పగింతల తాలూకు ఆరోపణలు, ఫిర్యాదులు ఏమీ లేవన్నట్టుగా ఆయా దేవాలయాల ఈఓల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు కోరారు. కానీ విచిత్రంగా... ఈఓలుగా పదోన్నతి పొందిన నాటి నుంచే కాకుండా, క్లర్క్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి ఈ సర్టిఫికెట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అయితే ప్రారంభం నుంచి పరిశీలిస్తే ఒక్కో అధికారి 20 నుంచి 30 వరకు ఆలయాల్లో పనిచేసి ఉంటారు. అన్ని ఆలయాల నుంచి సర్టిఫికెట్లు తేవటం వారికి సవాల్‌గా మారింది. వారు బదిలీ అయినప్పుడు తాము ఆ దేవాలయంలో లేనందున, ఇప్పుడు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇస్తే, గతంలో జరిగిన లోపాల వివరాలు భవిష్యత్తులో వెలుగు చూస్తే తాము ఇబ్బందుల్లో పడతామని, అందువల్ల తాము సర్టిఫై చేయలేమని వారు చేతులెత్తేస్తున్నారు. దీంతో అన్ని దేవాలయాల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు రాక వీరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ జారీ కొలిక్కి రావటం లేదు. పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసే ఉద్దేశంతోనే ఇలా వేధిస్తున్నారంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. తాను ఏడాదిన్నర నుంచి బెనిఫిట్స్ కోసం తిరుగుతున్నా అధికారులు కనికరించటం లేదని, తనకు అటు జీతం లేక ఇటు పింఛను రాక ఇబ్బందిగా మారిందని ఓ రిటైర్డ్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. -
సెంటిమెంట్ బ్రేక్ చేశా..
సాక్షి, మంచిర్యాల: దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న వాళ్లు మళ్లీ గెలవరనే సెంటిమెంట్‌ను తాను బ్రేక్ చేశానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ఐకే రెడ్డి మంత్రిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ మంత్రిగా కేసీఆర్ రెండోసారి బాధ్యతలు అప్పగించడం ఎంతగానో సంతృప్తి నిచ్చిందన్నారు. మే 1వ తేదీ నుంచి అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే అటవీచట్టంలో సమూల మార్పులు తీసుకువస్తామని, అడవుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. జంగల్ బచావో, జంగల్ బడావో అనే నినాదంతో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. రెండోసారి మంత్రిగా... రాష్ట్ర మంత్రిగా ఇంద్రకరణ్‌రెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అల్లోల దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా కొనసాగారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మరోసారి మంత్రిగా అవకాశం వచ్చింది. ఈసారి గతంలో ఉన్న దేవాదాయ, న్యాయశాఖతో పాటు అటవీ, పర్యావరణ శాఖలను అప్పగించారు. గతంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రులుగా ఉండగా, ఈ సారి ఒక్క అల్లోలకే అవకాశం దక్కింది. అడవులకు పెట్టింది పేరైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే మరోసారి అటవీశాఖ దక్కడం విశేషం. మంత్రికి పలువురి శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐకే రెడ్డికి పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్‌రెడ్డి, రాథోడ్ బాపురావు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విఠల్‌రావు, సత్యనారాయణగౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
మే 1 నుంచి ఆన్లైన్
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రముఖ దేవాలయాల్లో వచ్చే మే 1 నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు మరింత కృషి చేస్తామన్నారు. 3,645 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద ప్రతి నెల రూ.2.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. న్యాయశాఖకు సంబంధించి సీఎం కేసీఆర్ కృషితో హైకోర్టు విభజన సమస్య తీరిపోయిందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం సచివాలయం డీ బ్లాక్‌లోని తన చాంబర్లో మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ రెండోసారి తనను మంత్రిగా నియమించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడతానన్నారు. దేవాదాయ మంత్రిగా ఉన్నవారు మళ్లీ ఎన్నికల్లో గెలవరనే సెంటిమెంట్‌ను బ్రేక్ చేశా నని, అదే శాఖకు మంత్రిగా బాధ్య తలను అప్పగించడం సంతృప్తినిచ్చిందన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అరణ్య భవన్లో ఉన్నతాధికారులతో ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అటవీ చట్టం మరింత కఠినతరం... అడవుల సంరక్షణకు అటవీ చట్టంలో సమూల మార్పులు తీసుకొచ్చి, వాటిని మరింత కఠినతరం చేస్తామని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. అటవీ శాఖపై కేసీఆర్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారని... జంగల్ బచావో, జంగల్ బడావో పేరుతో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. అడవులను కాపాడటం, పర్యావరణ సమతుల్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, ఈ.ఎఫ్.ఎస్–టీ స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. -
మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది
సాక్షి, హైదరాబాద్: ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. శబరిమలలో మాదిరిగా ఇక్కడి దేవస్థానాల్లో కూడా ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దీనికిగాను పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఉన్న అధికారాలను ఉపయోగించాలని సూచించింది. ఉల్లంఘనలను ప్రాసిక్యూట్ చేయడం, భారీ జరిమానాలు విధించడం వంటి చర్యలకు ఉపక్రమించాలని తేల్చి చెప్పింది. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. నిబంధనలు సరళంగా, సూటిగా ఉండాలని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ నిషేధంపై స్థానికసంస్థలకు, దేవాదాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంది. మనిషి వంటి క్రూర జంతువు నిస్సందేహంగా ఈ భూగ్రహం మీదే లేదని, మనిషన్న ఓ జంతువు తాను అడుగుపెట్టిన ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవస్థానాల్లో ప్లాస్టిక్ నిషేధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో స్పష్టంగా వివరించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల ఇబ్బందులను, నిర్వహణ లోటుపాట్లను సరిదిద్దే దిశగా సుప్రీం తీర్పు అమలులో భాగంగా నిజామాబాద్, వరంగల్ జిల్లాల ప్రధాన న్యాయాధికారులు స్థానిక దేవస్థానాల్లోని పరిస్థితులపై హైకోర్టుకు నివేదికలు పంపారు. ఈ నివేదికలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలచిన వాటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ధర్మాసనం స్పందిస్తూ ఢిల్లీలో ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లో ఉందని తెలిపింది. శబరిమలలో 100% ప్లాస్టిక్ నిషేధం... శబరిమలలో ప్లాస్టిక్‌పై 100 శాతం నిషేధం అమల్లో ఉందని ధర్మాసనం తెలిపింది. న్యాయస్థానాలు ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే అక్కడ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలు చేస్తుండటం విశేషమని పేర్కొంది. కర్పూరం, పసుపు, మిరియాలు వంటివి కూడా ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లడం లేదంది. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులే రావాలని పేర్కొంది. 90 శాతం నాలాలు ప్లాస్టిక్ కారణంగా మూసుకుపోతున్నాయని తెలిపింది. జంతువులు కూడా ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువాత పడుతున్నాయంది. మనిషి వంటి క్రూరమృగం ఈ భూగ్రహంపైనే లేదన్న ధర్మాసనం, అభివృద్ధి పేరుతో జంతు ఆవాసాలను కూడా మనిషి ధ్వంసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల అడవుల్లో అనేక జంతువులు ఆకస్మికంగా మృతి చెందుతున్నాయని, వీటిని మనుషులే చంపుతున్నారా? అవే చనిపోతున్నాయా? అన్నది మిస్టరీగా మారిందని పేర్కొంది. ప్లాస్టిక్ కాగితాలు, కవర్లు తిని జంతువులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని, ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమంది. జీవ మనుగడకు ప్లాస్టిక్ నిషేధమవసరం.. ఈ భూమి మీద మనిషితోపాటు ఇతర జంతుజాలాలు బతికి బట్టకట్టాలంటే, ప్లాస్టిక్ నిషేధం జరిగి తీరాలని హైకోర్టు చెప్పింది. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఉన్న అధికారాలను ఎందుకు ఉపయోగించడం లేదని ప్రభుత్వాలను ప్రశ్నించింది. నిబంధనల అమలులో చూపాల్సింది చిత్తశుద్ధేనని గుర్తు చేసింది. దేవస్థానాల్లో ప్లాస్టిక్ నిషేధంపై స్థానిక సంస్థలకు, దేవాలయాలకు ఆదేశాలు జారీ చేయాలని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిని ప్రాసిక్యూట్ చేయడం, భారీ జరిమానాలు విధించడం వంటివి చేపట్టాలంది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారో తెలియచేయాలని ఉభయ రాష ్ట్రప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
దేవుడి భూములకు పంగనామాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో దేవుడి భూములకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామాలు పెడుతోంది. ఆ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పులతో పాటు తాను చేసిన చట్టాలను, జారీచేసిన మెమోలను సైతం లెక్క చేయడంలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న దేవాలయాల భూములకు ఎటువంటి రైతువారీ పట్టాలు చెల్లబోవని, గతంలో రైతు వారీ పట్టాలు ఇచ్చినప్పటికీ అవి పనికిరావని స్పష్టం చేస్తూ సీఆర్డీఏ 2015 సంవత్సరంలో మెమో జారీ చేసింది. ఆ భూమలన్నీ కూడా ధార్మిక సంస్థలకే చెందుతాయని ఆ మెమోలో స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న ఆలయాల భూములకు కేవలం పరిహారం మాత్రమే సదరు ధార్మిక సంస్థలకు చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు మాత్రం ఆక్రమణదారుల పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో దేవుడి భూములపై గతంలో హైకోర్టుకు సీఆర్డీఏ ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి చట్టానికి విరుద్ధంగా రైతు వారీ పట్టాల సాకుతో ఈనాం భూముల ఆక్రమణదారులకు కోట్ల రూపాయల విలువైన ప్లాట్లను కట్టబెడుతుండటంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్లాట్లు, పరిహారం కూడా ఆలయాలకే రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా వివిధ దేవాలయాలకు చెందిన 843.87 ఎకరాలను సీఆర్డీఏ సేకరించింది. మరో 173.22 ఎకరాలకు సంబంధించి దేవాదాయ శాఖతో పాటు రైతులు కూడా ఆ భూములు తమవంటూ క్లెయిమ్ చేయడంతో ఆ భూములపై సీఆర్డీఏ నిర్ణయం తీసుకోలేదు. రాజధానిలోని ఆలయాలకు, చారిటబుల్ సంస్థలకు చెందిన భూములన్నీ ఆయా సంస్థలకే చెందాలని, ఎటువంటి రైతు వారీ పట్టాదారులకు ఆ భూములపై హక్కు లేదని దేవాదాయ శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులతో ఆ భూములను సీఆర్డీఏకు బదిలీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలకు చెందిన భూములకు సంబంధించి పూర్తి పరిహారంతో పాటు అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా ఆయా ఆలయాల వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లకు జమ చేయాల్సిందిగా ఆ షరతుల్లో హైకోర్టు పేర్కొంది. దీనిపై హైకోర్టుకు సీఆర్డీఏ లిఖితపూర్వక అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగానే సీఆర్డీఏ మెమో జారీ చేసింది. ఆ మెమోలో.. ఎటువంటి రైతు వారీ పట్టాలు జారీ చేయడానికి వీల్లేదని, ఇప్పటికే జారీ చేసి ఉంటే అవి చెల్లుబాటు కావని, ఆ భూములపై పూర్తి హక్కులు ఆయా సంస్థలకే చెందుతాయని మెమోలో స్పష్టం చేసింది. రైతువారీ పట్టాలు చెల్లవు.. ఈనాం భూములకు ఇచ్చిన పట్టాలపై 2015లో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వింజమూరి రాజగోపాలచారి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసుల్లో హైకోర్టు గతంలో స్పష్టంగా పేర్కొంది. ఈనాం భూములకు సంబంధించి 1956 చట్టం ప్రకారం రైతు వారీ పట్టాలు ఇవ్వడానికి ఆస్కారం లేదని, ఒక వేళ రైతు వారీ పట్టాలు ఇచ్చినా అవి చెల్లుబాటు కావని, ఈనాం భూములన్నీ కూడా ఆయా ఆలయాలకు మాత్రమే చెందుతాయని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రైతువారీ పట్టాలు జారీ చెల్లబోవని 2013లో చేసిన చట్టసవరణను ఈ తీర్పు ద్వారా హైకోర్టు సమర్థించినట్లు అయిందని న్యాయశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈనాం భూములను ఆక్రమించుకున్న రైతులు తమకే పరిహారం చెల్లించాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో దేవుని భూములకు పరిహారాన్ని ఆయా ఆలయాలకు చెల్లించాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లను మాత్రం ఆక్రమణదారులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పునకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడించిందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
దేవుడి శాఖలో దొంగల పెత్తనం!
సాక్షి, హైదరాబాద్: ఆయన సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ దేవాలయానికి కార్యనిర్వహణాధికారి. గతంలో ఉత్తర తెలంగాణలోని ఓ దేవాలయంలో అక్రమాలకు పాల్పడ్డందుకు సస్పెండ్ కూడా అయ్యారు. కానీ పైరవీలు, మామూళ్లతో తిరిగి ఉద్యోగంలో చేరి.. అనతికాలంలో పెద్ద దేవాలయంలో ఈవోగా చేరారు. దేవాలయానికి దాతలు ఇచ్చే విరాళాలను నొక్కేయడమే కాకుండా ప్రసాదం సామగ్రి కొనుగోళ్లలోనూ చేతివాటం చూపి విజిలెన్స్‌కు చిక్కారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ మంత్రి ఆదేశించినా అమలుకాలేదు. ఇప్పుడాయనను ఏకంగా డిప్యూటీ కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఉత్తర తెలంగాణలోని ఓ ప్రముఖ శైవక్షేత్రం కార్యనిర్వహణాధికారి ఆయన. నిబంధనల ప్రకారమైతే 2011లో గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి వచ్చి.. అసిస్టెంట్ కమిషనర్ హోదాలో రిటైర్ కావాల్సి ఉంది. కానీ 2003లోనే గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి పొంది.. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ హోదాకు వచ్చారు. తీవ్ర అవినీతి ఆరోపణలున్న ఆ అధికారి తాజాగా రిటైర్ కావాల్సి ఉంది. కానీ ఆయనను మరో రెండేళ్లపాటు కొనసాగించాలంటూ ఇద్దరు ఉన్నతాధికారులు ఫైలును సీఎం కార్యాలయానికి పంపారు. దేవాదాయశాఖ మంత్రి వ్యతిరేకించినా ఆ ఫైలు ముందుకు కదలడం గమనార్హం. ...దేవాదాయ శాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. ఆ శాఖ మంత్రి మాటను కూడా లెక్కచేయకుండా.. ఓ ఉన్నతాధికారి, సచివాలయంలోని మరో ఉన్నతాధికారి కలసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనమిది. కాసుల కోసం అవినీతి అధికారులతో కుమ్మక్కవుతున్న సదరు ఉన్నతాధికారులు.. అడ్డగోలుగా పదోన్నతులు ఇచ్చేస్తున్నారు. పదవీ విరమణ పొందాల్సిన వారినీ మరింత కాలం కొనసాగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఇతర అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అడ్డగోలు పదోన్నతులు, కొనసాగింపుల కారణంగా కింది అధికారులకు పదోన్నతుల్లో జాప్యం జరిగే పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విచ్చలవిడిగా అక్రమాలు ఉత్తర తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం ఈవోగా పనిచేస్తున్న అధికారి ఈ నెలాఖరుకు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఆయన రిటైరైతే ఆ స్థానంలో మరో అధికారికి, ఆ అధికారి ఖాళీ చేసే అసిస్టెంట్ కమిషనర్ స్థానంలోకి కింది అధికారికి పదోన్నతి లభిస్తుంది. కానీ ఇప్పుడున్న అధికారికే మరో రెండేళ్లు పదవీకాలం పొడిగించే దిశగా రం గం సిద్ధమైంది. వాస్తవానికి ఆ అధికారి అక్రమంగా పదోన్నతి పొందారంటూ ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. 2011లో గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి పొందాల్సిన ఆయన 2003లోనే పొందారు. దీంతో అర్హత లేకున్నా డిప్యూటీ కమిషనర్ స్థాయికి వచ్చా రు. దీన్ని సరిచేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా శాఖ కమిషనర్ 2016లో ప్రభుత్వాన్ని కోరగా.. 2017లో అనుమతి వచ్చింది. కానీ దానిని అమలు చేయకుండా ఇప్పటికీ పెండింగ్‌లో పెట్టడంతోపాటు తాజాగా మరో రెండేళ్లు కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది. ఇక దేవాదాయ శాఖలో తీవ్ర అవినీతి ఆరోపణలు మూటగట్టుకుని, ఇప్పటికే ఓసారి సస్పెండైన అధికారికి తాజాగా డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఆ అధికారి అవినీతిపై ఇటీవల కొందరు భక్తులు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించినా అధికారులు బేఖాతరు చేశారు. పైగా కీలక పదవిని కట్టబెట్టారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్‌కు ఈ అవకతవకలన్నీ తెలిసినా.. నిస్సహాయంగా ఉండిపోయే పరిస్థితి ఉందని దేవాదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆలయ ఉద్యోగుల ‘స్వామి’ భక్తి
హైదరాబాద్ నగరంలో అదో ప్రముఖ దేవాలయం. నిత్యం వేల మంది భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అక్కడ దాదాపు పదేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగిదే ఇష్టారాజ్యం. ప్రసాదాల తయారీకి సంబంధించిన బాధ్యత అతనిది. స్టోర్స్ నిర్వహణ తప్ప మరో పని చేయడు. సరుకుల కొనుగోలు పేరుతో రూ.లక్షలు స్వాహా చేస్తున్నాడు. అతనిపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా ఈగవాలనీయకుండా స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఉన్నతాధికారి అతన్ని ఆ విధుల నుంచి తప్పించారు. అతని అక్రమాలపై కమిషనర్ కార్యాలయానికి నివేదిక సమర్పించాడు. కానీ, ఇన్ని రోజులు ఏం చేశావంటూ అనూహ్యంగా ఆ ఉన్నతాధికారికే మెమో జారీ చేశారు. అతనో సీనియర్ అసిస్టెంట్. రెడ్‌హిల్స్‌లోని వేణుగోపాలస్వామి దేవాలయంలో నియమితుడయ్యాడు. ఇది 6సి కేడర్ దేవాలయం, కానీ నిబంధనలకు విరుద్ధంగా కొద్దిరోజుల్లోనే ఏకంగా 6ఏ కేడర్‌లోని పెద్ద దేవాలయంలోకి మారిపోయాడు. ఇంకేముంది, ఆలయ ఆదాయాన్ని దొంగబిల్లులతో కొల్లగొట్టడమే కాకుండా, తనలాంటి కొందరు ఉద్యోగులతో ముఠా ఏర్పాటుచేసి అక్రమ నియామకాలు, పెద్ద దేవాలయాలకు బదిలీలు, అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన వారికి తిరిగి పోస్టింగ్స్ ఇప్పించటం.. ఒకటేమిటి, ఉన్నతాధికారులనే బెదిరించే స్థాయికి ఎదిగాడు. సాక్షి, హైదరాబాద్: అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన దేవాదాయ శాఖలో కొందరు కిందిస్థాయి ఉద్యోగుల ఆగడాలు తీవ్రమయ్యాయి. ఏళ్లుగా అదే దేవాలయంలో పాతుకుపోయి స్థానిక ఎమ్మెల్యే, పలుకుబడి కలిగిన నేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దేవాలయాల సొమ్ము యథేచ్ఛగా స్వాహా చేస్తున్నారు. దేవాదాయ శాఖలో ఆలయ సిబ్బంది బదిలీలు జరిగి 12 ఏళ్లు గడిచింది. దీంతో కొందరు 12 ఏళ్లుగా ఒకే దేవాలయంలో పనిచేస్తున్నారు. స్థానిక నేతలతో పరిచయాలు పెంచుకుని వారి అండతో రెచ్చిపోతున్నారు. ఇటీవల వేములవాడ, బాసర, సికింద్రాబాద్ గణేశ్ దేవాలయం, విజయనగర్ కాలనీ హనుమాన్ దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, కాళేశ్వరం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం... ఇలా చాలా చోట్ల సిబ్బంది వ్యవహారం దేవాదాయశాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ సత్రంలో ఓ ఉద్యోగి తాగుబోతుల సేవలో తరించి ఆలయానికే తలవంపులు తెచ్చాడు. వేములవాడలో స్టోర్స్ బాధ్యత చూసే ఓ ఉద్యోగి నెయ్యి కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డట్టు వెలుగు చూసింది. సికింద్రాబాద్‌లోని ఓ పెద్ద దేవాలయంలో సరుకులు ఖాళీ అయినట్టు తప్పుడు రిపోర్టులు తయారు చేసి, మళ్లీ సరుకులు కొన్నట్టు తప్పుడు బిల్లులు పెట్టి డబ్బులు దండు కున్న తీరును విజిలెన్సు అధికారులు గుర్తించారు. సిబ్బందిపై చర్యలకు సిఫారసు చేయగా స్థానిక నేతలు అడ్డుకుని వారిపై ఈగవాలనీయకుండా చేశారు. పాతనగరంలోని ఓ దేవాలయంలో ఉద్యోగి అక్రమాలను గుర్తించిన ఉన్నతాధికారి అతడిని మరో దేవాలయానికి ఉన్నఫళంగా మార్చి అతనిపై చర్యలకు సిఫారసు చేశారు. సిబ్బంది అక్రమాలపై ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ అధికారికే మెమో జారీ చేశారు. అమీర్‌పేట్‌లోని ఓ దేవాలయంలో ఓ ఉద్యోగి స్వామివారి వస్త్రాలను గల్లం తు చేస్తూ దుకాణాలకు అమ్ముతున్నట్టు తేలింది. కానీ చర్యలు మాత్రం తీసుకోలేదు. వరంగల్‌లోని ఓ ప్రముఖ దేవాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ జూనియర్ ఆర్టిస్టుకు సాయంత్రం చీకటిపడ్డాక పూర్ణకుంభం స్వాగతం ఇప్పించారు. నగరంలో దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న దుకాణాల అద్దెలను ఇష్టారాజ్యంగా కాజేస్తున్నారు. లెక్కలేనన్ని అక్రమాలు.. ఏ కేడర్ ఆలయంలో ఉద్యోగి విధుల్లో చేరాడో తిరిగి అదే కేడర్ ఆలయానికే బదిలీ చేయాలనేది నిబంధన. పోస్టింగ్ పొందిన ఆలయంలో ఖాళీల ఆధారంగా మాత్రమే పదోన్నతి కల్పించాలని కూడా చట్టం చెబుతోంది. కానీ, చిన్న దేవాలయంలో ఉద్యోగంలో చేరి, స్వల్ప సమయంలోనే పెద్ద దేవాలయాలకు అక్రమంగా బదిలీ చేయించుకుని పదోన్నతులు పొందుతున్న పైరవీకారులైన ఉద్యోగుల సంఖ్య దేవాదాయ శాఖలో చాంతాడంత ఉంది. ఖాళీలలో సంబంధం లేకుండా అక్రమంగా పదోన్నతులు పొంది సహాయ కమిషనర్లు అయినవారూ ఉండడం ఇక్కడ విడ్డూరం. నిబంధనలు ఏం చెబుతున్నాయి ఇతర ప్రభుత్వ విభాగాల తరహాలో దేవాదాయశాఖలో కూడా సిబ్బంది బదిలీలపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దేవాదాయ చట్టం సెక్షన్ 35 ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేయాలి. 6సీ కేడర్ దేవాలయం ఉద్యోగులను సంబంధిత సహాయ కమిషనర్, 6బి కేడర్ ఆలయాల్లో ఉప కమిషనర్, 6ఏ కేడర్ పెద్ద దేవాలయాల్లో ఉద్యోగులను కమిషనర్ బదిలీ చేయొచ్చు. 2006లో అప్పటి ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని పెద్ద సంఖ్యలో బదిలీ చేసింది. కానీ విధివిధానాలు స్పష్టంగా లేవని, బదిలీ సరికాదని కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించి వాటిని నిలుపుదల చేయించుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత బదిలీ సక్రమమేనన్న తీర్పు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు బదిలీ ఊసే లేకుండా పోయింది. -
‘రాములోరి భూముల’పై కలెక్టర్ ఆరా
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేవరయాంజాల్ శ్రీరామచంద్రస్వామి ఆలయ భూముల వ్యవహారంపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ‘రాములోరి భూములు.. రాబందుల పాలు’అనే శీర్షికతో ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంతో జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ భూముల వ్యవహారంపై రెవెన్యూ శాఖ నుంచి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి వివరాలు కోరారు. దీంతో శామీర్‌పేట్ ఇన్చార్జి తహసీల్దార్, లా అధికారి ధర్మారామచంద్రారెడ్డి శ్రీరామచంద్రస్వామి ఆలయ భూముల వివాదంపై కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. ఈ భూముల వ్యవహారం దేవాదాయ శాఖకు, కొంతమంది రైతులకు మధ్య నెలకొన్న వివాదంగా నివేదికలో జిల్లా రెవెన్యూ శాఖ పేర్కొన్నట్లు సమాచారం. దేవరయాంజాల్‌లోని ఓ సర్వే నంబర్లో ఉన్న 1,521.13 ఎకరాల భూమిపై ఇరు వర్గాలు కోర్టుకు వెళ్లాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివాదంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ, భూపరిపాలన శాఖ కార్యదర్శి ఎ.రఘోత్తమరావును ప్రభుత్వం విచారణాధికారిగా నియమించినట్లు నివేదికలో ప్రస్తావించాయి. ఈ భూముల వివాద అంశాలతో కూడిన నివేదికను అప్పట్లో సీసీఎల్ఏ ప్రభుత్వానికి(1,425.17 ఎకరాలకు సబంధించి) నివేదించినట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది. ఈ భూములపై తుది నిర్ణయం ప్రకటించే అధికారం ప్రభుత్వానికే ఉందని కలెక్టర్‌కు రెవెన్యూ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వెలువడేంత వరకు ఈ భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపేస్తూ అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చినట్లు నివేదికలో ప్రస్తావించారు. దీంతో దేవరయాంజాల్ భూముల సమస్య అప్పటి నుంచి అపరిష్కృతంగా ఉండిపోయిందని వెల్లడించినట్టు సమాచారం. ఈ భూముల విషయంలో దేవాదాయ శాఖకు రెవెన్యూ శాఖ అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో ఆ శాఖ వర్గాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. -
రాములోరి భూములు.. రాబందులపాలు!
సాక్షి, హైదరాబాద్ : అది హైదరాబాద్ శివారు దేవరయాంజాల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం... నిజాం హయాంలో ఆ ఆలయానికి దాతలు ఇచ్చిన భూమి 1,531 ఎకరాలు.. భూముల నుంచి వచ్చే ఆదాయంతో దేవాలయం వర్ధిల్లాలనే ఆలోచనతో జరిగిన ఏర్పాటు అది.. ఇప్పుడు ఆలయం అలాగే ఉంది.. కానీ ఆ భూముల నుంచి నయా పైసా ఆదాయం రావటం లేదు.. అలాగని భూములు ఖాళీగా లేవు.. పదుల సంఖ్యలో పరిశ్రమలు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, ఇళ్లు, దుకాణాలు ఉన్నాయి. అందులోనే 130 ఎకరాల్లో హకీంపేట ఎయిర్‌బేస్ ఉంది. 800 ఎకరాల భూమి వ్యవసాయం పేరుతో ఖాళీగా ఉంది. మరి వాటి రూపంలో రావాల్సిన ఆదాయం ఎటుపోతోంది, ఎవరి జేబుల్లోకి వెళుతోంది, అసలా భూములన్నీ దేవుడి మాన్యమేనని పాత రెవెన్యూ రికార్డులు స్పష్టంగా చెబుతున్నా ఇన్ని నిర్మాణాలు ఎలా వెలిశాయి?... వీటన్నింటికీ జవాబు ఒకటే... పలువురు నేతలు, అధికారులు కుమ్మక్కై దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు. ఇప్పుడు ఆ భూములను శాశ్వతంగా కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లోకాయుక్తలో నమోదైన కేసు, దానికి సమాధానంగా దేవాదాయ శాఖ కమిషనర్ స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌తో ఈ భూముల బాగోతం కళ్లకు కడుతోంది. సీతారామస్వామి.. సీతారామరెడ్డి అయ్యాడు! దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్ర స్వామి మందిరం చాలా పురాతన ఆలయం. నిజాం పాలనా హయాంలోనే ఓ భక్తుడు ఈ ఆలయానికి 1,531 ఎకరాల భూమిని ఇనామ్‌గా ఇచ్చారు. దానిని ఆలయ భూమిగా రికార్డుల్లో చేర్చారు. ఇప్పటివరకు కచ్చితమైన భూరికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూ రికార్డుల్లో.. ఈ 1,531 ఎకరాల భూమి సీతారామచంద్రస్వామి ఆలయం పేరిటే ఉంది. కానీ తర్వాత ఆ భూమి కబ్జాల పాలైంది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం పేరు కాస్తా.. సీతారామరెడ్డిగా, సీతారామారావుగా, సీతారామయ్యగా, సీతారాములుగా.. రకరకాల పేర్లతో మారిపోయి చివరికి కబ్జాదారుల పేర్లు రికార్డుల్లోకెక్కాయి. ఆ భూముల్లో రిసార్టులు, పరిశ్రమలు, నివాసాలు, వాణిజ్య సముదాయాలు వచ్చాయి. అనధికార సమాచారం ప్రకారం వాటి నుంచి ప్రతినెలా రూ.5 కోట్ల మేర అద్దెలు, లీజుల పేరుతో వసూలవుతున్నట్లు అంచనా. కబ్జాదారులకే భూములు! ఈ భూములను ‘కబ్జా’లో ఉన్న వారికే ఇచ్చి డబ్బులు వసూలు చేయాలంటూ కొంతకాలం కింద దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ దీనిపై ఏర్పడ్డ జస్టిస్ వెంకటరామిరెడ్డి కమిషన్ ఈ వ్యవహారంలో అక్రమాలను నిగ్గుతేల్చి.. దేవాలయ మేనేజర్ చంద్రమోహన్, సహాయ కమిషనర్ రాఘవాచార్యులు, మాజీ డిప్యూటీ కమిషనర్ జ్యోతిలపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది. విజిలెన్స్, ఏసీబీలు కూడా విచారణ జరిపి ఈ ముగ్గురితోపాటు నాటి దేవాదాయ కమిషనర్ వెంకటేశ్వర్లు, ముఖ్య కార్యదర్శిగా ఉన్న జేపీ మూర్తి, సంయుక్త కమిషనర్ రామకృష్ణకుమార్, ఉప కమిషనర్ మోహనాచారిలను కూడా బాధ్యులను చేస్తూ చర్యలకు సిఫారసు చేశాయి. కానీ వీరిలో ఎవరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. చివరికి వారికి క్లీన్చిట్ ఇవ్వటమేకాకుండా పదవీ విరమణ చేసిన వారు పోగా మిగతావారికి పదోన్నతులు కూడా కల్పించేశారు. తాజాగా ఆలయ భూముల వ్యవహారంపై లోకాయుక్తలో కేసు దాఖలైంది. దీనిపై దేవాదాయ శాఖ వివరణ ఇస్తూ.. ఈ వ్యవహారాన్ని గతంలోనే దేవాదాయ శాఖ, ప్రభుత్వం పరిశీలించి ఉన్నందున.. ఈ కేసునుకొట్టివేయాలని కోరడం గమనార్హం. ప్రతి నెలా రూ. 5 కోట్లకుపైనే ప్రస్తుతం ఈ ఆలయ భూములను తమ అధీనంలో ఉంచుకున్నవారి నుంచి ప్రతినెలా రూ.5 కోట్ల మేర అద్దె/లీజు పేరిట వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం ఈ బృందం పనిచేస్తోందని.. ఆ సొమ్మును నేతలు, అధికారులు పంచుకుంటున్నారని చెబుతున్నారు. ఇక ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు లేని భూములు దాదాపు 800 ఎకరాల వరకు ఉన్నాయి. వీటిని తిరిగి దేవాలయం అధీనంలోకి తెచ్చి.. వాటి నుంచి ఆదాయం పొందే వీలున్నా దేవాదాయ శాఖ అందుకు సిద్ధపడకపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికే ఎసరు పెట్టే యత్నం అధికారులపై చర్యల సంగతేమోగానీ ఆ భూమి మొత్తాన్నీ కాజేసేందుకు తెరవెనుక కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా దేవాలయ భూములను అమ్మేందుకు వీలు లేదు. 1924–25 రికార్డుల ప్రకారం అవి స్పష్టంగా దేవుడి భూములే. అంటే చట్టపరంగా ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అవకాశముంది. అయినా నేతల జోక్యం, అవినీతి అధికారుల కారణంగా ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేవు. దేవాదాయశాఖ చట్టం సెక్షన్–83 ప్రకారం ‘యూజ్ అండ్ ఆక్యుపేషన్ చార్జీల’వసూలుకు కేసులు దాఖలు చేయవచ్చు. దీనితో ఆ భూముల యాజమాన్య వివాదం తేలేవరకు వాటిని అనుభవిస్తున్న ‘కబ్జాదారులు’మార్కెట్ విలువ దామాషా మేరకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఈ భూముల సంగతి తేల్చాల్సి ఉండగా.. అవినీతి కారణంగా అడుగు ముందుకు పడటం లేదు. -
చెంఘిజ్‌ఖాన్‌పేట.. అంతస్తులు లేవిక్కడ!
సాక్షి, అమరావతి: మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ గ్రామంలోని ఏ ఒక్క ఇంటికీ తలుపులు ఉండవు. అయినప్పటికీ అక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒక్కటీ లేకపోవడం విశేషం! ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడి శనిదేవుడు... శని రూపంలో ఆ దొంగను శిక్షిస్తాడని ప్రజల నమ్మకం. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని చెంఘిజ్‌ఖాన్ పేట గ్రామానికీ ఓ ప్రత్యేకత ఉంది. రెండో అంతస్తు కలిగిన భవనాన్ని అక్కడి ప్రజలెవరూ నిర్మించుకోరు!! శతాబ్దాల నుంచి... కొండవీడు కొండల పాదాల చెంతన ఉన్న చెంఘిజ్‌ఖాన్ పేట గ్రామ జనాభా 3,500. దాదాపు 500 వరకు ఇళ్లు ఉన్నాయి. వ్యవసాయం ఇక్కడి ప్రజల జీవనాధారం. పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. ఆర్థ్ధికంగా స్ధితిమంతులైన ఆ గ్రామ ప్రజలు మంచి మంచి ఇళ్లను నిర్మించుకునే అవకాశం ఉన్నా.. ఏ ఒక్కరూ రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకోవడం లేదు. పెద్ద కుటుంబమైనా మొదటి అంత స్తుతోనే సరిపెట్టుకుంటున్నారు. శతాబ్దాల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. చిల కలూరిపేట సమీపంలోని ఈ గ్రామంలో విద్యావంతులు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. అయినా ఎవరూ రెండు అంతస్తుల భవనం నిర్మించేందుకు సాహసించడం లేదు. ఆలయ శిఖరం, గాలిగోపుర నిర్మాణం జరగకపోవడంతోనే.. ప్రఖ్యాతిగాంచిన వెన్నముద్దల బాలకృష్ణుని ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. ఎక్కడా కానరాని అరుదైన విగ్రహం ఈ స్వామి వారిది. ఆయన కొలువై ఉన్న ఈ ఆలయానికి శిఖరం, గాలిగోపుర నిర్మాణం జరగలేదు. స్వామివారి ఆలయం ఎత్తు 10 అడుగులలోపే ఉండటంతో ఆ ఎత్తుకు మించి ఇంటిని నిర్మించకూడదని, ఒకవేళ నిర్మిస్తే గ్రామానికి తప్పక ఏదో కీడు జరుగుతుందని వారి నమ్మకం. ప్రజల విశ్వాసం.. మా గ్రామంలో ఇప్పటికీ రెండంతస్తుల ఇంటి నిర్మాణం జరగకపోవడానికి ప్రజల విశ్వాసం, భయమే కారణం. వెన్నముద్దల బాలకృష్ణుని ఆలయం ఎత్తుకు మించి ఇంటిని నిర్మించకూడదని మా పూర్వీకుల నుంచి వినపడుతోంది. దాన్నే మేమూ ఆచరిస్తున్నాం. ఒకరిద్దరు రెండు అంతస్తుల ఇంటిని నిర్మించినా, అనతికాలంలోనే కూల్చేశారు. ఆలయానికి శిఖరం, గాలిగోపురం నిర్మించిన తరువాతనే రెండంతస్తుల ఇంటిని నిర్మించుకునే ఆలోచనలో ప్రజలున్నారు. – కొసల శ్రీదేవి, చెంఘిజ్‌ఖాన్‌పేట ఆచారాన్ని గౌరవిస్తున్నాం.. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మా గ్రామ ప్రజలు మొదటి అంతస్తు వరకే ఇంటిని నిర్మించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం గ్రామంలో కొత్తగా శివాలయాన్ని నిర్మించారు. ఆ ఆలయానికి శిఖరం, గాలిగోపురం ఉన్నాయి. – సత్యనారాయణాచార్యులు, ఆలయ పూజారి దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు.. దేవాలయానికి దాదాపు 60 ఎకరాలకుపైగానే వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 20 ఎకరాలు ఆలయ ఉద్యోగులు సాగు చేసుకుంటుండగా, మిగిలిన భూములను రైతులకు కౌలుకు ఇచ్చాం. ఆ భూములకు వస్తున్న కౌలు నామమాత్రంగానే ఉంది. అయినప్పటికీ దేవాలయాన్ని అభివృద్ది చేయడానికి అంచనాలను రూపొందించి దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాము. – కృష్ణప్రసాద్, దేవాలయ ఉద్యోగి -
బాబు హామీ కోసం దేవుడి భూమికి ఎసరు
సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక హామీలు గుప్పించిన విషయం విదితమే. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఒక సామాజిక వర్గం ఓట్లన్నింటినీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వేయిస్తే మహానందిలో ఆ సామాజిక వర్గం పేరిట సత్రం నిర్మాణానికి పార్టీ, ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సామాజికవర్గం కోసం సత్రం నిర్మాణానికి మహానందిలో 47 సెంట్ల దేవుడి భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాసింది. ఆలయ భూముల అమ్మకం, ఇతరులకు ప్రభుత్వం బదలాయించే అధికారాలపై హైకోర్టు ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలియజేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెంటనే జవాబిచ్చారు. ఆ సమాధానంతో ప్రభుత్వ పెద్దలు తృప్తి చెందకపోవడంతో తక్షణమే అన్ని వివరాలతో ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్, ఆ శాఖకు చెందిన ఇతర అధికారులను సీఎం కార్యాలయ అధికారులు ఆదేశించారు. ఈ వ్యవహారం దేవాదాయ శాఖలో దుమారం రేపుతోంది. -
మేడారం జాతరకు ‘గ్రహణం’
సాక్షి ప్రతినిధి, వరంగల్: రానున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం రోజున గద్దెలపైకి సారలమ్మ చేరుకునే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో గ్రహణం వీడిన తర్వాత సారలమ్మను గద్దెలపైకి తీసుకు రానున్నారు. ఈ మేరకు సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం, దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మేడారం జాతర జరుగుతుంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతరను ఈసారి 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో నిర్వహిస్తామని సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం 2017 ఏప్రిల్‌లో తేదీలు ప్రకటించింది. 2018 జనవరి 31 జాతర తొలిరోజున కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించి, సాయంత్రం వేళ కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకువస్తారు. ఇదే సమయంలో సాయంత్రం 6:04 నుంచి రాత్రి 8:40 వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో గ్రహణ సమయంలో ఏం చేయాలనే అంశంపై సందిగ్ధం ఏర్పడింది. గ్రహణం తర్వాత: చంద్రగ్రహణం వీడిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో సారలమ్మను మేడారం గద్దెలపైకి తీసుకురావాలని సమ్మక్క–సారలమ్మ పూజా రుల సంఘం నిర్ణయించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గ్రహ ణం విడిచిన తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తీసుకొ స్తామని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు చెప్పారు. పూజారుల సంఘం నిర్ణయం ప్రకారమే మేడారం జాతర విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం నిర్ణయం ప్రకారం ఏర్పాట్లు చేస్తాం. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గ్రహణం విషయంలో పట్టింపులు లేవని పూజారులు చెప్పారు. కాబట్టి ముందుగా నిర్ణయించినట్లుగానే 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జాతర జరుగుతుంది. –రమేశ్‌బాబు, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, వరంగల్ -
‘సదావర్తి’లో మళ్లీ హైడ్రామా!
-
‘సదావర్తి’లో మళ్లీ హైడ్రామా!
భూములు దక్కించుకున్న టీడీపీ నేత గడువులోగా డబ్బులు చెల్లించని వైనం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని 83.11 ఎకరాల అత్యంత విలువైన భూములను కారు చౌకగా కొట్టేయడానికి సర్కారు పెద్దలు సాగిస్తున్న యత్నంలో మళ్లీ హైడ్రామా చోటుచేసుకుంది. రెండవ విడత నిర్వహించిన బహిరంగ వేలంలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రధాన అనుచరుడు బద్వేలు శ్రీనివాసులురెడ్డి గడువులోగా డబ్బులు చెల్లించక పోవడం చర్చనీయాంశమైంది. సుమారు రూ.వెయ్యి కోట్ల విలువ చేసే ఈ భూములను మళ్లీ టీడీపీ నేతలే తక్కువ ధరకు వ్యూహాత్మకంగా దక్కించుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది సోమవారం చెన్నైలో రెండోసారి నిర్వహించిన వేలంలో టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి అత్యధికంగా రూ.60.30 కోట్లకు పాడారు. బహిరంగ వేలం ముగిసిన 48 గంటల్లోగా వేలం పాడిన మొత్తం ధరలో 50 శాతం మేర అంటే రూ.30.15 కోట్లు దేవాదాయ శాఖకు చెల్లించాలనేది నిబంధన. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటతో ఆ గడువు ముగిసినా డబ్బులు చెల్లించలేదు.. ఈ నేపథ్యంలో బహిరంగ వేలంలో రెండో అత్యధిక ధరకు పాడిన హైదరాబాద్‌కు చెందిన చదలవాడ లక్ష్మణ్‌కు అవకాశం ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈయన రూ.60.25 కోట్లకు పాడారు. ఇతను కూడా భూముల కొనుగోలుకు ముందుకొచ్చినందున అతను పాడిన మొత్తంలో సగం డబ్బు చెల్లించాలని లేఖ రాసే విషయమై గురువారం నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ భూములు తనకే దక్కాలన్న ఆత్రంతో వేలంలో పాల్గొన్న శ్రీనివాసులురెడ్డి డబ్బు చెల్లించడానికి ముందుకు రాకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల ఎత్తుగడలే కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై దేవాదాయ శాఖ మంత్రి ఒక రకంగా, ఆ శాఖ అధికారులు మరో రకంగా మాట్లాడుతుండటం అనుమానాలకు తావిస్తోంది. సోమవారం వేలం ముగిశాక ‘ఈ భూములు మంచి విలువైనవి. సర్వే కూడా చేశాం. అన్ని విషయాలు తెలుసుకునే వేలం పాడాం’ అని మీడియా ఎదుట చెప్పిన శ్రీనివాసులురెడ్డి.. ఇపుడు ముఖం చాటేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వేలంలో తొలి బిడ్డర్‌గా నిలిచిన వ్యక్తి నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకుండా వైదొలిగారని, అతని చేతనే డబ్బులు కట్టించాలని కోర్టును కోరతామని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. సుప్రీంకోర్టు సూచన మేరకు వేలం ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి డబ్బులు కట్టకపోతే రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వలేమన్నారు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం ఏమి చేయాలో నిర్ణయిస్తుందని చెప్పారు. -
కేసీఆర్ మొక్కులపై పిల్ విచారణకు స్వీకరణ
వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇటీవల పలు దేవస్థానాలకు మొక్కుల కింద బంగా రు ఆభరణాలను సమర్పించడంపై దాఖలైన పిల్‌ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరిం చింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ సీఎస్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయ మూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సీఎం తన వ్యక్తిగత మొక్కులను కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కు చెందిన కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి తీర్చుకున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని విశ్రాంత ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సామాజిక కార్యకర్త గుండ మాల రాములు వేసిన పిల్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపి స్తూ, ఏఏ దేవస్థానాలకు మొక్కులు చెల్లిం చారో వివరించారు. ఈ క్రమంలో సీజీఎఫ్ గురించి ధర్మాసనం ఆరా తీసింది. -
పోదాం పద... వన జాతరకు
♦ నేటి నుంచి మేడారం జాతర ♦ సాయంత్రం గద్దెలపైకి రానున్న సారలమ్మ ♦ గోవిందరాజులు, పగిడిద్దరాజులు సైతం... ♦ ఇప్పటికే 32 లక్షల మంది మొక్కులు గత జాతరలో కోటి మంది 2014 జాతరకు కోటి మంది భక్తులు వచ్చారు. ప్రస్తుత జాతరలో ఇప్పటికే 32 లక్షల మంది భక్తులు మేడారంలో మొక్కులు సమర్పించుకున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భారీగా భక్తులు రానున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: వనం జనంతో నిండుతోంది. మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారం చేరుకుంటున్నారు. సారలమ్మ మేడారంలోని గద్దెపై కొలువుదీరే గడియలు దగ్గరపడుతున్నాయి. వన దేవతల వడ్డెలు(పూజారులు) దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలవుతుంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఆదివాసీ పూజారులు, వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్, ములుగు ఏఎస్పీలు కలసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే... పూజారులు, అధికారులు కలిసి ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల పడిగిద్దరాజును మేడారం గద్దెల వద్దకు చేరుస్తారు. వరాల తల్లిగా కొలిచే సమ్మక్క గురువారం మేడారం గద్దెలపై చేరనుంది. ఇద్దరు వన దేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. వన దేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో శనివారం జాతర ముగుస్తుంది. భారీ ఏర్పాట్లు... మేడారం జాతరకు ఈసారి కోటీ పది లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థరాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 3,605 బస్సులను నడుపుతోంది. జాతర నిర్వహణ కోసం 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు సాంకేతికంగా ఉపయోగపడేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. జంపన్న వాగుకు ఇరు వైపులా 3.6 కిలో మీటర్ల పొడవున స్నానఘట్టాలను నిర్మించారు. వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధం చేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో.. దేవాదాయ శాఖ పలు కొత్త నిర్ణయాలను తీసుకుంది. దర్శనం, ఎత్తు బంగారం, క్యూలైను ఏర్పాటు చేసింది. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు వచ్చే అన్ని వర్గాల భక్తులకు పూర్తి ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. రూ.100 ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేసింది. మొత్తం ఐదు క్యూలైన్లు ఉచిత దర్శనం కోసమే ఉండనున్నాయి. వికలాంగుల కోసం, వీవీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. భక్తులు మొక్కుల రూపంలో వనదేవతలకు బెల్లం(బంగారం) సమర్పించే ప్రక్రియను ఈసారి పూర్తిగా ఉచితం చేసింది. గతంలో దేవతలకు బెల్లం మొక్కు సమర్పించేందుకు రూ.1,116 రుసుముతో టికెట్ ఉండేది. ప్రస్తుత జాతరలో ఈ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా మార్చారు. -
టీటీడీ బడ్జెట్ రూ.2,678 కోట్లు
♦ 2016-17 వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం ♦ రూ.వెయ్యి కోట్లు దాటిన హుండీ కానుకలు ♦ రూ.18 కోట్లతో మహామణి మండపం ♦ ఆర్జితసేవల టికెట్ల ధరల పెంపు వాయిదా సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.2,678 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఆమోదించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.2,530 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి (2015-16) పెరిగిన అంచనాలతో కలిపి మొత్తం రూ.2,621 కోట్లతో ముగించారు. శనివారం తిరుమలలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదిత బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్టు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తిరుమలేశుని ఆర్జిత సేవలు, వీఐపీ టికెట్ల ధరల పెంపు వాయిదా పడింది. ధరల పెంపు లడ్డూలకు కూడా ముడిపడి ఉండటంతో వెనువెంటనే పెంచటం వల్ల ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో చైర్మన్, ఈవో వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యమైన తీర్మానాలు ► వేయికాళ్ల మండపం నిర్మాణానికి కొత్త డిజైన్లతో రూ.18 కోట్ల అంచనాలతో మండపం నిర్మించేందుకు టెండర్లు ఖరారు ► శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి రూ.10లక్షల ఖర్చుతో బంగారు తాపడం పనులు ► ఇతర ప్రాంతాల్లో శ్రీవారి వైభవోత్సవాలను తొమ్మిది నుంచి ఐదు రోజులకు కుదింపు ► తిరుపతి కోదండరామాలయంలో ప్రతి అమావాస్యరోజున హనుమంత వాహన సేవ ► అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద యాత్రీసదన్ నిర్మాణానికి రూ.4.90 కోట్ల టెండరు పనులు, ప్రకాశం జిల్లా జారుగుమల్లి మండపం పచ్చవ గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.22.5 లక్షలు కేటాయించారు. వసూళ్ల అంచనా 2016-17లో హుండీ ద్వారా భక్తులు సమర్పించే కానుకలు రూ.1,010 కోట్లురావచ్చని అంచనా వేశారు. పెట్టుబడులపై వడ్డీ రూ.778.93 కోట్లు, రూ.500 వీఐపీ దర్శనం, రూ.50 సుదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టి కెట్ల విక్రయం ద్వారా రూ.209 కోట్లు, ఆర్జితసేవా టికెట్ల ద్వారా రూ.55 కోట్లు, లడ్డూ, ఇతర ప్రసాదాల విక్రయంతో రూ.175 కోట్లు, గదుల అద్దె వసూళ్లతో రూ.114.5 కోట్లు రావొచ్చని అంచనా వేశారు. తలనీలాల విక్రయం ద్వారా రూ.150 కోట్లు, దుకాణాలు, జనతా హోటళ్ల అద్దెలు, టోల్గేట్ ప్రవేశ రుసుం, పుస్తక విక్రయం, ఇతర ఆదాయాల ద్వారా 133.25 కోట్లు రావొచ్చని అంచనావేశారు. వ్యయాల అంచనా ఉద్యోగులు (రెగ్యులర్, ఔట్సోర్సింగ్) జీతాల కోసం రూ.500 కోట్లు, పెట్టుబడులకు రూ.757.06 కోట్లు, ఆలయాలకు సరుకుల కొనుగోళ్లు రూ.320 కోట్లు, ఇతర కొనుగోళ్లు రూ.42.60 కోట్లు, పెన్షన్ ట్రస్టుకు రూ.120 కోట్లు, పెన్షన్ ఫండ్‌కు రూ.75 కోట్లు కేటాయించారు. గ్రాంట్లు రూ.165.50 కోట్లు, స్థిరాస్తులు, ఔట్ సోర్సింగ్ ఖర్చులు రూ.199.25 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ.55 కోట్లు, స్థిరాస్తుల నిర్వహణ ఖర్చులు రూ.80.20 కోట్లు, ఇతర చిల్లర ఖర్చులు రూ.129.96 కోట్లు కేటాయించారు. ఇంజనీరింగ్ పనుల కోసం రూ.160 కోట్లు, హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలకు రూ.121 కోట్లు కేటాయించారు. -
ప్రవాసులను ఆదర్శంగా తీసుకోవాలి
‘ఆటా’ ముగింపు వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, భాషావ్యాప్తిని ప్రవాస తెలుగువారు చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారని, ఇక్కడి వారు విదేశాల్లో ఉన్న మన తెలుగువాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. ఉద్యోగాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా జన్మభూమికి సేవలందిస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించడం అభినందనీయమన్నారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శిల్పకళా వేదికలో ఆటా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆటా ఎలక్ట్ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ 15 రోజులుగా వివిధ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటా ముగింపు వేడుకలను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు సుధాకర్ పెరికారి, సాంస్కృతిక కార్యక్రమాల సలహాదారు డాక్టర్ పద్మజారెడ్డి, ఆటా ఓవర్సీస్ సమన్వయకర్తలు పి.హరినాథ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఆటా కార్యదర్శి బొమ్మినేని మధు, ఎనుగు లక్ష్మారెడ్డి, పీ కిరణ్, శ్రీనివాస్, టీడీటీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేవాదాయశాఖలో ‘నిధి’ చిచ్చు!
పరిపాలన నిధి నుంచి అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలిచ్చే యోచనలో ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయశాఖ పరిధిలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం... ఆ శాఖలో మరో వివాదానికి తెరతీసింది. దేవాదాయశాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం సర్కారు నేరుగా వేతనాలు చెల్లిస్తోంది. ఈ సొమ్మును దేవాదాయశాఖ తన పరిపాలన నిధి నుంచి తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తోంది. అయితే తాజాగా అర్చకులు, దేవాలయాల్లోని ఉద్యోగులకూ పరిపాలనా నిధి నుంచే వేతనాలు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది ఆ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు- దేవాలయాల్లోని ఉద్యోగులు, అర్చకులకు మధ్య చిచ్చు రాజేసింది. అర్చకులు, దేవాలయాల్లోని ఉద్యోగుల నియామకం ఒక పద్ధతి అంటూ లేకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో జరిగిందని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా లెక్కకట్టే వీలే లేదని.. భవిష్యత్‌లో తమకు ఇబ్బందులు కలి గించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సమ్మె చేపడతామని హెచ్చరిస్తున్నారు. వేతనాల కోసమే.. తమకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలంటూ అర్చకులు, ఆలయ ఉద్యోగుల జేఏసీ సమ్మె చేసింది. ఈ డిమాండ్‌పై ప్రభుత్వం వేసిన కమిటీ పరిశీలన జరిపి పలు ప్రతిపాదనలు చేసింది. ఆలయాల నుంచి వసూలు చేస్తున్న పరిపాలన నిధి వాటాను 12% నుంచి 15 శాతానికి పెంచాలని, ఆ పెరిగే మొత్తాన్ని అర్చకులు, ఉద్యోగుల వేతనాలకయ్యే మొత్తానికి కలపాలని సూచించింది. అంటే ఆలయ ఆదాయంలో వేతనాలకు కేటాయించిన 30 శాతానికి ఇది అదనంగా చేరుతుంది. ఇక ఆ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సొమ్మును ప్రభుత్వానికి రీయింబర్స్ చేయడాన్ని దేవాదాయ శాఖ నిలిపేస్తుంది. దీనికి ప్రభుత్వం సానుకూలంగానే స్పందించినా... దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఓ పద్ధతంటూ లేకుండా ఆలయ కమిటీల ద్వారా ఉద్యోగులు నియమితులయ్యారని, వారికి ఈ నిధిని ఎలా వాడతారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి రీయింబర్స్ చేయటం ఆపేస్తే.. నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లించినట్లు అవుతుందని... దీన్ని ఇతర మతాల వారు ప్రశ్నిస్తే న్యాయపర చిక్కులొస్తాయని స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు దీనివల్ల భవిష్యత్తులో తమ వేతనాలకు ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. ఈ మేరకు వారు శనివారం సమావేశమై కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. నిధి నుంచి చెల్లింపు ప్రతిపాదనను విరమించుకోకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఇదీ సమస్య.. దేవాదాయశాఖ పరిధిలోని ప్రతి ఆలయ ఆదాయం నుంచి ఏటా 12 శాతం చొప్పున వసూలు చేసి... దేవాదాయశాఖ పరిపాలనా నిధికి జమచేస్తారు. ఇలా ఏటా దాదాపు రూ. 23 కోట్ల వరకు సమకూరుతుంది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాల యం, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది, ఆలయాల ఈవోలను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరికి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని ఏటా పరిపాలన నిధి నుంచి దేవాదాయ శాఖ తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇలా చెల్లించగా ఏటా కొంత మొత్తం మిగులుతోంది. ఆ మిగులు నిధు లు రూ.90 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆలయాల్లోని సాధారణ ఉద్యోగులు, అర్చకులకు వాటికి వచ్చే ఆదాయం నుంచే వేతనాలు చెల్లిస్తారు. ఆలయానికి వచ్చే మొత్తం ఆదాయంలో వేతనాలకు 30 శాతం కేటాయిస్తారు. ఈ 30 శాతానికి లోబడే అర్చకులు, సిబ్బంది వేతనాలు ఉండాలి. -
బెల్ కంపెనీ.. తరలిపోతోంది
మచిలీపట్నం : మచిలీపట్నానికి మణిహారంగా ఉండి దేశ రక్షణ శాఖకు కీలకమైన పరికరాలను ఉత్పత్తి చేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను పామర్రు మండలం నిమ్మలూరుకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. నిమ్మలూరు రెవెన్యూ పరిధిలోని 50.54 ఎకరాల భూమిని సేకరించేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం బస్టాండ్ పక్కనే ఉన్న బెల్ కంపెనీని నిమ్మలూరుకు తరలించి రూ.110 కోట్ల వ్యయంతో అక్కడ నూతనంగా ఈ కంపెనీని నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. బెల్ కంపెనీకి ఇచ్చే భూమి నిమ్మలూరు సమీపంలో ఉన్నా నిమ్మకూరుకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ కంపెనీని తరలించేందుకు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, విజయవాడలోని ఓ స్టార్ హోటల్ యజమాని దగ్గరి బంధువు, బందరు బెల్ కంపెనీలో అత్యున్నత పదవిలో ఉన్న ఓ ఉద్యోగి తెరవెనుక మంత్రాంగం నడిపారనే వాదన వినిపిస్తోంది. దేవాదాయశాఖ భూముల్లో బెల్ పామర్రు మండలం నిమ్మకూరు సమీపంలోని నిమ్మలూరు వద్ద బెల్ కోసం సేకరించనున్న 50.54 ఎకరాల భూమి మచిలీపట్నంలోని బచ్చుపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధీనంలో ఉంది. గతంలోనే ఇక్కడ బెల్ కంపెనీని నిర్మించేందుకు ప్రతిపాదన చేయగా, దేవస్థానం ట్రస్టీలు అంగీకరించక కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ప్రముఖులు తెరవెనుక మంత్రాంగం నడిపి.. ఆలయ ట్రస్టీలు అంగీకరిస్తే ఈ భూమిని బెల్ కంపెనీ కోసం తీసుకోవచ్చని దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి లేఖ రాయించినట్లు కలెక్టరేట్ అధికారులు చెబుతున్నారు. పాలకుల ఒత్తిడి మేరకు జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ ట్రస్టీలతో సంప్రదింపులు జరిపి ఒప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో భూ సేకరణకు నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేశారు. బెల్ కంపెనీని విస్తరించేందుకు మచిలీపట్నం గోసంఘానికి చెందిన 25 ఎకరాల భూమి కేటాయించేందుకు అప్పట్లో కలెక్టర్‌గా పనిచేసిన రిజ్వీ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయినప్పటికీ టీడీపీ అధికారంలోకొచ్చాక బెల్ కంపెనీని నిమ్మకూరు సమీపానికి తరలించేందుకు గట్టి ప్రయత్నాలు జరగటం గమనార్హం. ప్రజా ఉద్యమాలతో అడ్డుకుంటాం... బందరులోని ఏకైక పరిశ్రమను నిమ్మలూరుకు తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, దీనిని ప్రజాఉద్యమం ద్వారా అడ్డుకుని తీరుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లు రవీంద్ర తన మంత్రి పదవి కోసం బెల్ కంపెనీని తాకట్టు పెట్టి జన్మనిచ్చిన ఊరుకు అన్యాయం చేశారన్నారు. బెల్ కంపెనీని మచిలీపట్నంలోనే విస్తరిస్తామని ఒకటికి పదిసార్లు మాట ఇచ్చిన మంత్రి తన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. అన్ని ప్రజాసంఘాలను కలుపుకొని బెల్ కంపెనీ తరలిపోకుండా ఉద్యమం చేస్తామని చెప్పారు. శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కన్వీనరు షేక్ సలార్‌దాదా, నాయకులు లంకే వెంకటేశ్వరరావు, చిటికిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అహంకారానికి మూల్యమిది!
స్వయంగా ముఖ్యమంత్రే పుష్కర ఏర్పాట్లన్నీ సమీక్షించారని అధికార పార్టీ శాసనసభ్యులే చెబుతున్నారు. మిత్రపక్షం బీజేపీ తరఫున మంత్రివర్గంలో దేవాదాయ శాఖను నిర్వహిస్తున్న మాణిక్యాలరావుకు కూడా ఈ పుష్కరాల ఏర్పాట్లలో ఎటువంటి భాగస్వామ్యమూ లేనట్టున్నది. ఆయనే స్వయంగా ఈ విషయంలో తన అసంతృప్తిని మీడియా ముందు వెల్లడించారు. ఓ అఖిల పక్ష కమిటీ లేదు. అన్నీ తానే అయి చెయ్యబోతే ఇవ్వాళ ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్న విషయం ముఖ్యమంత్రి ఇప్పటికైనా గమనించాలి. కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షి తనకు జరిగిన అవమా నాన్ని మరచిపోయి మళ్లీ మామూలుగానే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇసుక మాఫియా వ్యవహారంలో అధికార పార్టీ శాసనసభ్యుడే దగ్గరుండి తన మీద దాడి చేయించాడని తెలిసీ కమిటీ ఏర్పాటుకు ఆమె, ఉద్యోగ సంఘ నాయకత్వం ఎందుకు ముఖ్యమంత్రి ఎదుట గంగిరెద్దుల్లా తలలు ఊపి వచ్చారో మాట్లాడుకోవాలి. దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభా కర్ తాజాగా ఎవరిని బెదిరించాలా, ఎవరిని తన్నించాలా అని ఆలోచిస్త్తు న్నాడు. మీడియా ముందుకు వచ్చి ‘అవును, నేను దురుసుగానే ప్రవర్తిస్తాను. నా మీద బోలెడు కేసులు ఉన్నాయి. నా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు గతంలోనే రౌడీ షీట్ తెరిపించాడు!’ అని బరితెగించి మాట్లాడిన ప్రభాకర్‌ను ప్రభుత్వ విప్ పదవిలో నుండి తొలగించలేని, కనీసం మందలిం చలేని బలహీనస్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నారో కూడా మాట్లాడుకోవాలి. శాసనసభ్యురాలు కూడా అయిన కూతురు అఖిలప్రియ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను మందలించినందుకే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద జైలుకు వెళ్లి వచ్చిన ప్రతిపక్ష శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఇంకా ఆ షాక్‌లో నుండి బయట పడనేలేదు. భూమా నాగిరెడ్డి, చింతమనేని ప్రభాకర్ ఇద్దరూ శాసనసభ్యులే. మరి ట్రీట్మెంట్లో ఈ తేడా ఏమిటీ అనే అంశాన్నీ చర్చించవలసిందే. మరో పక్క, ఈ చట్టం ఎన్ని పోరా టాలు చేస్తే, ఏ ప్రయోజనం కోసం వచ్చింది? ఏ ప్రయోజనాల కోసం దుర్వి నియోగం జరుగుతున్నది? అన్న విషయాలు కూడా ఉద్ధృత స్థాయిలో చర్చకు రావాలని దళిత మేధావులు ఆశిస్తున్నారు. ఇది జరగాల్సిందే కూడా. రాష్ర్టమంతా చెత్తమయమై, అంటురోగాల పాలవుతామేమోనని జనం బెదిరిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఆ దుర్వాసన తమ నాసికాపుటాలకు సోకకుండా గోదావరిలో పుష్కరస్నానాల పేరిట మునకలేస్తున్నది. తాజా విదేశీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్‌లో పర్యటించి వచ్చారు. మీ విలాసవంతమైన కార్యాలయాలకూ, నివాసా లకూ, ప్రయాణాలకూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ మున్సిపల్ కార్మి కుల కనీస కోర్కెలను పట్టించుకోకుండా ఎట్లా ఉంటారని ప్రశ్నించాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో గతవారం జరిగిన ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలి. మహోపద్రవమిది కానీ వీటన్నిటినీ వెనక్కు నెట్టేస్తూ గోదావరి పుష్కరాల ప్రారంభవేళ ఒక మహా ఉపద్రవం జరిగింది. పవిత్ర పుష్కర స్నానాలు చెయ్యడానికి రాజ మండ్రి వచ్చిన భక్తులు 30 మంది వరకు తొక్కిసలాటలో మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునంటున్నారు. సునామీ వచ్చి ఈ 30 మం ది కొట్టుకుపోలేదు. చార్‌ధామ్‌కు హఠాత్తుగా వచ్చిన వరదల వంటి ఘటన కూడా కాదు. మానవ తప్పిదం ఈ 30 మంది అమాయకుల ప్రాణాలను బలి గొన్నది. రూ. 1,600 కోట్లు కేటాయించి, అట్టహాసంగా జరప తలపెట్టిన ఈ భారీ కార్యక్రమంలో ఏర్పాట్లు సరిగా లేవని ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. సాక్షాత్తూ రాష్ర్ట ముఖ్యమంత్రి ఈ ఏర్పాట్లమీద తీవ్రఅసంతృప్తినీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చే శారు. ఏర్పాట్లు సరిగా లేవనీ, స్థానిక అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చేటట్టు ఉన్నారనీ మీడియా హెచ్చరించింది. ఇంకెవరికీ ఎటువంటి బాధ్యతలూ అప్పచెప్పకుండా స్వయంగా ముఖ్యమంత్రే పుష్కర ఏర్పాట్లన్నీ సమీక్షించారని అధికార పార్టీ శాసన సభ్యులే చెబుతున్నారు. మిత్రపక్షం బీజేపీ తరఫున మంత్రివర్గంలో దేవాదా యశాఖను నిర్వహిస్తున్న మాణిక్యాలరావుకు కూడా ఈ పుష్కరాల ఏర్పా ట్లలో ఎటువంటి భాగస్వామ్యమూ లేనట్టున్నది. ఆయనే స్వయంగా ఈ విష యంలో తన అసంతృప్తిని మీడియా ముందు వెల్లడించారు. ఓ అఖిల పక్ష కమిటీ లేదు. పోనీ తన పక్షంలోనైనా పని విభజన లేదు. అన్నీ తానే అయి చెయ్యబోతే ఇవ్వాళ ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్న విష యం ముఖ్యమంత్రి ఇప్పటికైనా గమనించాలి. ఆయన ఎంతసేపూ తన రాజ కీయ అనుభవాన్ని గుర్తు చేస్తూ కూర్చుంటే కుదరదు. ఒక సినిమాలో హీరో వేషం వేస్తున్న నటుడు ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!’ అని; ఇంకో సిని మాలో మరో నటుడు ‘పచ్చీస్ సాల్ సే చార్మినార్ క నే బైట్ కె చాయ్ పీ రహాహూ’ అని ‘నాకే చెపుతారా?’ అన్నట్టు కొట్టే డైలాగ్‌లు గుర్తొస్తాయి. ఈ ఘోర ప్రమాదం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప స్పందన మొత్తం సిగ్గుపడే విధంగా ఉం ది. కొన్ని కోట్ల మంది హాజరవుతున్న ఇలాంటి సందర్భాలలో ఇవి మామూలే అన్నట్టుగా మాట్లాడారాయన. కోట్లమంది వచ్చి పోతున్నప్పుడు, 30 మంది చస్తే ఒక లెక్కా అన్నట్టే ఉంది ఆయన తీరు. ఒక్క ప్రాణం పోయినా ప్రభు త్వాలు సిగ్గుతో తలదించుకోవాలి కానీ, ఇంకా ఏదో ఘనకార్యం చేసినట్టు మీడియా ముందు మాట్లాడటం అసహ్యంగా ఉంటుంది. తలలు దించుకుం టారా, పదవులకు రాజీనామాలు చేస్తారా అనేది వాళ్ల ఇష్టం. కమిటీతో కాలయాపన మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల వంతున నష్ట పరిహారం చెల్లి స్తామనీ, పుష్కరాలు అయిపోయాక విచారణకు కమిటీ వేస్తామనీ ముఖ్య మంత్రి ప్రకటించారు. కమిటీలు వేసి కాలం వెళ్లబుచ్చడం అలవాటుగా మారి పోయింది ప్రభుత్వానికి. జరిగిందేమిటో కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తుంటే బాధ్యుల మీద తక్షణ చర్యలు ఉండవు కానీ, ఎప్పుడో పుష్కరాలయ్యాక కమి టీ వేసి విచారిస్తామనడం ఎంత దుర్మార్గం! ఎంత బాధ్యతా రాహిత్యం?! కాగా, ఈ దుర్మరణాల గురించి మిగిలిన మీడియా ప్రసారాలు చేస్తుంటే, ఒక చానల్ మాత్రం పుష్కరాలకు ప్రభుత్వం చేసిన అద్భుతమైన ఏర్పాట్ల గురించి గొంతు చించుకోవడం ఎంత అన్యాయం? లక్షలాది మంది హాజరయ్యే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేశంలో చాలా జరిగుంటాయి. కుంభమేళాలు, మహా కుంభమేళాలు, పుష్క రాలు ఇంకా అనేకం జరుగుతాయి. ఇటువంటి కార్యక్రమాలలో ప్రభుత్వాలు ఎంతవరకు కల్పించుకోవాలి, ఎంతవరకు ప్రభుత్వం బాధ్యత వహించాలి అనే విషయంలో స్పష్టతలేక పరిస్థితి గందరగోళంగా తయారవుతున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ గోదావరి పుష్కరాలు జరుగు తున్నాయి. ఇది ఒక మతానికి- హిందూ మతానికి సంబంధించిన కార్య క్రమం. దేశంలో అత్యధిక సంఖ్యాకులు హిందువులు కాబట్టి, వారి ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవించవలసిందే. సౌకర్యాలు కల్పించాల్సిందే. నది అంతా పుణ్యతీర్థం కాదా? పుష్కరాలకు హాజరయ్యే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్ట ప్రభుత్వాలూ పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్న, కోట్లాది రూపా యలు ఖర్చు చేస్తున్న చోట్లనే గోదావరి పారడం లేదు. వేలాది కిలోమీటర్ల పొడవునా పారుతూ ఉంటుంది. ఫలానా రాజమండ్రిలోనో, ఫలానా ధర్మపురి లోనో పారే గోదావరిలోనే పుష్కర స్నానాలు చేయాలని ఎక్కడా లేదు. గోదా వరి ఎక్కడైనా గోదావరే. ఎక్కడ పారినా పవిత్రతలో ఏ తేడా ఉండదని ప్రభు త్వాలు ప్రజలకు చెప్పాల్సిందిపోయి, ఒక ముఖ్యమంత్రి రాజమండ్రిలో, ఇంకో ముఖ్యమంత్రి ధర్మపురిలో స్నానాలు చేసి అట్టహాసంగా పుష్కరాలను ప్రారంభించడం ఎంత మాత్రం సరికాదు. ప్రజాస్వామ్యంలో పాలకులు వీలైనంత వరకు ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఈ వాదనకు బోలెడు కారణాలు చెప్పొచ్చు. ఈ రోజు రాజమండ్రి దుర్ఘటన ఇందుకు ఒక ఉదాహరణ. అన్ని వసతులూ ఉన్న ఘాట్లు ప్రముఖుల కోసం కేటా యించి, సామాన్య భక్తులను గంటల కొద్దీ ఆపి, ఒక్కసారిగా వదిలినందున తొక్కిసలాట జరిగి జనం చనిపోయారు. పొద్దున్నే ముఖ్యమంత్రులకు వీటిని ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత పుష్కర స్నానాల మీద నమ్మకం ఉంటే తరువాత ఎప్పుడో రద్దీ లేని సమయాలలో గప్‌చుప్‌గా వెళ్లి మొక్కులు తీర్చుకోవచ్చు కదా! మతాన్నీ, మత విశ్వాసాలనూ తమ రాజ కీయ ప్రయోజనాల కోసం పాలకులు వాడుకోవడం వల్లనే ఇదంతా. ప్రభువులు తమ రాజకీయాలనూ, తమనూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమా లకు దూరంగా ఉంచి, విధులూ, బాధ్యతలు వివరించి యంత్రాంగాన్ని వది లేస్తే సజావుగా జరిగిపోతుంది. లేదంటే ఇటువంటి ఘటనలు తప్పవు. ఇద్దరు ముఖ్యమంత్రులకు సరైన సలహాలు ఇచ్చేవారు కూడా చుట్టూ ఉన్నట్టు లేరు. అధికారికంగా నియమితులైన సలహాదారులు వారి విధి సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు లేదు. ముఖ్యమంత్రులు ఎవరి మాటా వినని సీతయ్యలైతే మాత్రం ప్రజలకు, ప్రజాస్వామ్యానికీ నష్టం. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఆలయాల్లో ధూప దీపాలకు ఇకపై రూ.5వేలు
సాక్షి, హైదరాబాద్: ఆదాయం తక్కువగా ఉండే ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు సజావుగా జరిగేందుకు దేవాదాయ శాఖ ఒక్కో ఆలయానికీ ఇచ్చే సాయాన్ని రూ. 5 వేలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతి నెలా ఒక్కో ఆలయానికి రెండున్నర వేల రూపాయలు సాయం అందజేస్తుండగా.. అందులో రూ. 1500 ఆలయ అర్చకుని గౌరవ వేతనంగా, వెయ్యి రూపాయలు ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు కేటాయించారు. ఇక నుంచి అర్చకుని గౌరవ వేతనం మూడు వేలకు, నైవేద్యం ఖర్చు రెండు వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 23,834 ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా ప్రస్తుతం కేవలం 1367 ఆలయాలకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2007కు ముందు ఆదాయం లేని ఆలయాల్లో పూజా కార్యక్రమాలు కొరవడటంతో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.