బహిరంగ వేలం ముగిసిన 48 గంటల్లోగా వేలం పాడిన మొత్తం ధరలో 50 శాతం మేర అంటే రూ.30.15 కోట్లు దేవాదాయ శాఖకు చెల్లించాలనేది నిబంధన. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటతో ఆ గడువు ముగిసినా డబ్బులు చెల్లించలేదు.. ఈ నేపథ్యంలో బహిరంగ వేలంలో రెండో అత్యధిక ధరకు పాడిన హైదరాబాద్‌కు చెందిన చదలవాడ లక్ష్మణ్‌కు అవకాశం ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈయన రూ.60.25 కోట్లకు పాడారు. ఇతను కూడా భూముల కొనుగోలుకు ముందుకొచ్చినందున అతను పాడిన మొత్తంలో సగం డబ్బు చెల్లించాలని లేఖ రాసే విషయమై గురువారం నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.
ఈ భూములు తనకే దక్కాలన్న ఆత్రంతో వేలంలో పాల్గొన్న శ్రీనివాసులురెడ్డి డబ్బు చెల్లించడానికి ముందుకు రాకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల ఎత్తుగడలే కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై దేవాదాయ శాఖ మంత్రి ఒక రకంగా, ఆ శాఖ అధికారులు మరో రకంగా మాట్లాడుతుండటం అనుమానాలకు తావిస్తోంది. సోమవారం వేలం ముగిశాక ‘ఈ భూములు మంచి విలువైనవి. సర్వే కూడా చేశాం. అన్ని విషయాలు తెలుసుకునే వేలం పాడాం’ అని మీడియా ఎదుట చెప్పిన శ్రీనివాసులురెడ్డి.. ఇపుడు ముఖం చాటేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
వేలంలో తొలి బిడ్డర్‌గా నిలిచిన వ్యక్తి నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకుండా వైదొలిగారని, అతని చేతనే డబ్బులు కట్టించాలని కోర్టును కోరతామని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. సుప్రీంకోర్టు సూచన మేరకు వేలం ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి డబ్బులు కట్టకపోతే రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వలేమన్నారు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం ఏమి చేయాలో నిర్ణయిస్తుందని చెప్పారు.