హైదరాబాద్ నగరంలో అదో ప్రముఖ దేవాలయం. నిత్యం వేల మంది భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అక్కడ దాదాపు పదేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగిదే ఇష్టారాజ్యం. ప్రసాదాల తయారీకి సంబంధించిన బాధ్యత అతనిది. స్టోర్స్ నిర్వహణ తప్ప మరో పని చేయడు. సరుకుల కొనుగోలు పేరుతో రూ.లక్షలు స్వాహా చేస్తున్నాడు.
అతనిపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా ఈగవాలనీయకుండా స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఉన్నతాధికారి అతన్ని ఆ విధుల నుంచి తప్పించారు. అతని అక్రమాలపై కమిషనర్ కార్యాలయానికి నివేదిక సమర్పించాడు. కానీ, ఇన్ని రోజులు ఏం చేశావంటూ అనూహ్యంగా ఆ ఉన్నతాధికారికే మెమో జారీ చేశారు.
అతనో సీనియర్ అసిస్టెంట్. రెడ్‌హిల్స్‌లోని వేణుగోపాలస్వామి దేవాలయంలో నియమితుడయ్యాడు. ఇది 6సి కేడర్ దేవాలయం, కానీ నిబంధనలకు విరుద్ధంగా కొద్దిరోజుల్లోనే ఏకంగా 6ఏ కేడర్‌లోని పెద్ద దేవాలయంలోకి మారిపోయాడు. ఇంకేముంది, ఆలయ ఆదాయాన్ని దొంగబిల్లులతో కొల్లగొట్టడమే కాకుండా, తనలాంటి కొందరు ఉద్యోగులతో ముఠా ఏర్పాటుచేసి అక్రమ నియామకాలు, పెద్ద దేవాలయాలకు బదిలీలు, అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన వారికి తిరిగి పోస్టింగ్స్ ఇప్పించటం.. ఒకటేమిటి, ఉన్నతాధికారులనే బెదిరించే స్థాయికి ఎదిగాడు.
సాక్షి, హైదరాబాద్: అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన దేవాదాయ శాఖలో కొందరు కిందిస్థాయి ఉద్యోగుల ఆగడాలు తీవ్రమయ్యాయి. ఏళ్లుగా అదే దేవాలయంలో పాతుకుపోయి స్థానిక ఎమ్మెల్యే, పలుకుబడి కలిగిన నేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దేవాలయాల సొమ్ము యథేచ్ఛగా స్వాహా చేస్తున్నారు. దేవాదాయ శాఖలో ఆలయ సిబ్బంది బదిలీలు జరిగి 12 ఏళ్లు గడిచింది. దీంతో కొందరు 12 ఏళ్లుగా ఒకే దేవాలయంలో పనిచేస్తున్నారు. స్థానిక నేతలతో పరిచయాలు పెంచుకుని వారి అండతో రెచ్చిపోతున్నారు.
ఇటీవల వేములవాడ, బాసర, సికింద్రాబాద్ గణేశ్ దేవాలయం, విజయనగర్ కాలనీ హనుమాన్ దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, కాళేశ్వరం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం... ఇలా చాలా చోట్ల సిబ్బంది వ్యవహారం దేవాదాయశాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ సత్రంలో ఓ ఉద్యోగి తాగుబోతుల సేవలో తరించి ఆలయానికే తలవంపులు తెచ్చాడు. వేములవాడలో స్టోర్స్ బాధ్యత చూసే ఓ ఉద్యోగి నెయ్యి కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డట్టు వెలుగు చూసింది.
సికింద్రాబాద్‌లోని ఓ పెద్ద దేవాలయంలో సరుకులు ఖాళీ అయినట్టు తప్పుడు రిపోర్టులు తయారు చేసి, మళ్లీ సరుకులు కొన్నట్టు తప్పుడు బిల్లులు పెట్టి డబ్బులు దండు కున్న తీరును విజిలెన్సు అధికారులు గుర్తించారు. సిబ్బందిపై చర్యలకు సిఫారసు చేయగా స్థానిక నేతలు అడ్డుకుని వారిపై ఈగవాలనీయకుండా చేశారు. పాతనగరంలోని ఓ దేవాలయంలో ఉద్యోగి అక్రమాలను గుర్తించిన ఉన్నతాధికారి అతడిని మరో దేవాలయానికి ఉన్నఫళంగా మార్చి అతనిపై చర్యలకు సిఫారసు చేశారు.
సిబ్బంది అక్రమాలపై ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ అధికారికే మెమో జారీ చేశారు. అమీర్‌పేట్‌లోని ఓ దేవాలయంలో ఓ ఉద్యోగి స్వామివారి వస్త్రాలను గల్లం తు చేస్తూ దుకాణాలకు అమ్ముతున్నట్టు తేలింది. కానీ చర్యలు మాత్రం తీసుకోలేదు. వరంగల్‌లోని ఓ ప్రముఖ దేవాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ జూనియర్ ఆర్టిస్టుకు సాయంత్రం చీకటిపడ్డాక పూర్ణకుంభం స్వాగతం ఇప్పించారు. నగరంలో దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న దుకాణాల అద్దెలను ఇష్టారాజ్యంగా కాజేస్తున్నారు.
లెక్కలేనన్ని అక్రమాలు..
ఏ కేడర్ ఆలయంలో ఉద్యోగి విధుల్లో చేరాడో తిరిగి అదే కేడర్ ఆలయానికే బదిలీ చేయాలనేది నిబంధన. పోస్టింగ్ పొందిన ఆలయంలో ఖాళీల ఆధారంగా మాత్రమే పదోన్నతి కల్పించాలని కూడా చట్టం చెబుతోంది. కానీ, చిన్న దేవాలయంలో ఉద్యోగంలో చేరి, స్వల్ప సమయంలోనే పెద్ద దేవాలయాలకు అక్రమంగా బదిలీ చేయించుకుని పదోన్నతులు పొందుతున్న పైరవీకారులైన ఉద్యోగుల సంఖ్య దేవాదాయ శాఖలో చాంతాడంత ఉంది. ఖాళీలలో సంబంధం లేకుండా అక్రమంగా పదోన్నతులు పొంది సహాయ కమిషనర్లు అయినవారూ ఉండడం ఇక్కడ విడ్డూరం.
నిబంధనలు ఏం చెబుతున్నాయి
ఇతర ప్రభుత్వ విభాగాల తరహాలో దేవాదాయశాఖలో కూడా సిబ్బంది బదిలీలపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దేవాదాయ చట్టం సెక్షన్ 35 ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేయాలి. 6సీ కేడర్ దేవాలయం ఉద్యోగులను సంబంధిత సహాయ కమిషనర్, 6బి కేడర్ ఆలయాల్లో ఉప కమిషనర్, 6ఏ కేడర్ పెద్ద దేవాలయాల్లో ఉద్యోగులను కమిషనర్ బదిలీ చేయొచ్చు.
2006లో అప్పటి ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని పెద్ద సంఖ్యలో బదిలీ చేసింది. కానీ విధివిధానాలు స్పష్టంగా లేవని, బదిలీ సరికాదని కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించి వాటిని నిలుపుదల చేయించుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత బదిలీ సక్రమమేనన్న తీర్పు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు బదిలీ ఊసే లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment