Venugopalaswamy Temple
-
ఆలయ ఉద్యోగుల ‘స్వామి’ భక్తి
హైదరాబాద్ నగరంలో అదో ప్రముఖ దేవాలయం. నిత్యం వేల మంది భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అక్కడ దాదాపు పదేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగిదే ఇష్టారాజ్యం. ప్రసాదాల తయారీకి సంబంధించిన బాధ్యత అతనిది. స్టోర్స్ నిర్వహణ తప్ప మరో పని చేయడు. సరుకుల కొనుగోలు పేరుతో రూ.లక్షలు స్వాహా చేస్తున్నాడు. అతనిపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా ఈగవాలనీయకుండా స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఉన్నతాధికారి అతన్ని ఆ విధుల నుంచి తప్పించారు. అతని అక్రమాలపై కమిషనర్ కార్యాలయానికి నివేదిక సమర్పించాడు. కానీ, ఇన్ని రోజులు ఏం చేశావంటూ అనూహ్యంగా ఆ ఉన్నతాధికారికే మెమో జారీ చేశారు. అతనో సీనియర్ అసిస్టెంట్. రెడ్‌హిల్స్‌లోని వేణుగోపాలస్వామి దేవాలయంలో నియమితుడయ్యాడు. ఇది 6సి కేడర్ దేవాలయం, కానీ నిబంధనలకు విరుద్ధంగా కొద్దిరోజుల్లోనే ఏకంగా 6ఏ కేడర్‌లోని పెద్ద దేవాలయంలోకి మారిపోయాడు. ఇంకేముంది, ఆలయ ఆదాయాన్ని దొంగబిల్లులతో కొల్లగొట్టడమే కాకుండా, తనలాంటి కొందరు ఉద్యోగులతో ముఠా ఏర్పాటుచేసి అక్రమ నియామకాలు, పెద్ద దేవాలయాలకు బదిలీలు, అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన వారికి తిరిగి పోస్టింగ్స్ ఇప్పించటం.. ఒకటేమిటి, ఉన్నతాధికారులనే బెదిరించే స్థాయికి ఎదిగాడు. సాక్షి, హైదరాబాద్: అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన దేవాదాయ శాఖలో కొందరు కిందిస్థాయి ఉద్యోగుల ఆగడాలు తీవ్రమయ్యాయి. ఏళ్లుగా అదే దేవాలయంలో పాతుకుపోయి స్థానిక ఎమ్మెల్యే, పలుకుబడి కలిగిన నేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దేవాలయాల సొమ్ము యథేచ్ఛగా స్వాహా చేస్తున్నారు. దేవాదాయ శాఖలో ఆలయ సిబ్బంది బదిలీలు జరిగి 12 ఏళ్లు గడిచింది. దీంతో కొందరు 12 ఏళ్లుగా ఒకే దేవాలయంలో పనిచేస్తున్నారు. స్థానిక నేతలతో పరిచయాలు పెంచుకుని వారి అండతో రెచ్చిపోతున్నారు. ఇటీవల వేములవాడ, బాసర, సికింద్రాబాద్ గణేశ్ దేవాలయం, విజయనగర్ కాలనీ హనుమాన్ దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, కాళేశ్వరం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం... ఇలా చాలా చోట్ల సిబ్బంది వ్యవహారం దేవాదాయశాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ సత్రంలో ఓ ఉద్యోగి తాగుబోతుల సేవలో తరించి ఆలయానికే తలవంపులు తెచ్చాడు. వేములవాడలో స్టోర్స్ బాధ్యత చూసే ఓ ఉద్యోగి నెయ్యి కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డట్టు వెలుగు చూసింది. సికింద్రాబాద్‌లోని ఓ పెద్ద దేవాలయంలో సరుకులు ఖాళీ అయినట్టు తప్పుడు రిపోర్టులు తయారు చేసి, మళ్లీ సరుకులు కొన్నట్టు తప్పుడు బిల్లులు పెట్టి డబ్బులు దండు కున్న తీరును విజిలెన్సు అధికారులు గుర్తించారు. సిబ్బందిపై చర్యలకు సిఫారసు చేయగా స్థానిక నేతలు అడ్డుకుని వారిపై ఈగవాలనీయకుండా చేశారు. పాతనగరంలోని ఓ దేవాలయంలో ఉద్యోగి అక్రమాలను గుర్తించిన ఉన్నతాధికారి అతడిని మరో దేవాలయానికి ఉన్నఫళంగా మార్చి అతనిపై చర్యలకు సిఫారసు చేశారు. సిబ్బంది అక్రమాలపై ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ అధికారికే మెమో జారీ చేశారు. అమీర్‌పేట్‌లోని ఓ దేవాలయంలో ఓ ఉద్యోగి స్వామివారి వస్త్రాలను గల్లం తు చేస్తూ దుకాణాలకు అమ్ముతున్నట్టు తేలింది. కానీ చర్యలు మాత్రం తీసుకోలేదు. వరంగల్‌లోని ఓ ప్రముఖ దేవాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ జూనియర్ ఆర్టిస్టుకు సాయంత్రం చీకటిపడ్డాక పూర్ణకుంభం స్వాగతం ఇప్పించారు. నగరంలో దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న దుకాణాల అద్దెలను ఇష్టారాజ్యంగా కాజేస్తున్నారు. లెక్కలేనన్ని అక్రమాలు.. ఏ కేడర్ ఆలయంలో ఉద్యోగి విధుల్లో చేరాడో తిరిగి అదే కేడర్ ఆలయానికే బదిలీ చేయాలనేది నిబంధన. పోస్టింగ్ పొందిన ఆలయంలో ఖాళీల ఆధారంగా మాత్రమే పదోన్నతి కల్పించాలని కూడా చట్టం చెబుతోంది. కానీ, చిన్న దేవాలయంలో ఉద్యోగంలో చేరి, స్వల్ప సమయంలోనే పెద్ద దేవాలయాలకు అక్రమంగా బదిలీ చేయించుకుని పదోన్నతులు పొందుతున్న పైరవీకారులైన ఉద్యోగుల సంఖ్య దేవాదాయ శాఖలో చాంతాడంత ఉంది. ఖాళీలలో సంబంధం లేకుండా అక్రమంగా పదోన్నతులు పొంది సహాయ కమిషనర్లు అయినవారూ ఉండడం ఇక్కడ విడ్డూరం. నిబంధనలు ఏం చెబుతున్నాయి ఇతర ప్రభుత్వ విభాగాల తరహాలో దేవాదాయశాఖలో కూడా సిబ్బంది బదిలీలపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దేవాదాయ చట్టం సెక్షన్ 35 ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేయాలి. 6సీ కేడర్ దేవాలయం ఉద్యోగులను సంబంధిత సహాయ కమిషనర్, 6బి కేడర్ ఆలయాల్లో ఉప కమిషనర్, 6ఏ కేడర్ పెద్ద దేవాలయాల్లో ఉద్యోగులను కమిషనర్ బదిలీ చేయొచ్చు. 2006లో అప్పటి ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని పెద్ద సంఖ్యలో బదిలీ చేసింది. కానీ విధివిధానాలు స్పష్టంగా లేవని, బదిలీ సరికాదని కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించి వాటిని నిలుపుదల చేయించుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత బదిలీ సక్రమమేనన్న తీర్పు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు బదిలీ ఊసే లేకుండా పోయింది. -
పంచలోహ విగ్రహాల అపహరణ
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు 700 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహాలు శనివారం సాయంత్రం అపహరణకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెద్దబజార్లో గల వేణుగోపాలస్వామి (శ్రీకృష్ణుడు) ఆలయానికి దాదాపుగా 700 ఏళ్ల చరిత్ర ఉంది. శనివారం సాయంత్రం ఆలయ ప్రధాన పూజారి పక్కనే ఉన్న తన ఇంట్లోకి వెళ్లి వస్తానని గడియ వేసి వెళ్లాడు. కొద్దిసేపట్లో తిరిగి వచ్చేసరికి ప్రధాన విగ్రహాల ముందు ఉంచిన శ్రీ కృష్ణుడు, రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు కనిపించకుండా పోయాయి. దుండగులు మరే వస్తువులను ముట్టుకోకుండా కేవలం పంచలోహ విగ్రహాలను మాత్రమే అపహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఆలయం చుట్టూ గృహాలు ఉన్నాయి. సాయంత్రం వేళ ఆలయంతో పాటు కాలనీలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో విగ్రహాలు అపహరణకు గురైన నేపథ్యంలో.. ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే చేసి ఉంటారని భావిస్తున్నారు. చోరీకి గురైన విగ్రహాల బరువు 75 కిలోల వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ ప్రసన్నరాణి, సీఐ శ్రీధర్‌కుమార్ ఆలయానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ బృందాన్ని తెప్పించి తనిఖీలు ప్రారంభించారు. అపహరణకు గురైన పంచలోహ విగ్రహాల విలువ బయట మార్కెట్లో కోటికి పైగా ఉండవచ్చని ఆలయాన్ని నిర్మించిన వారి వంశీయులు చెబుతున్నారు. -
హంసలదీవిలో వేణుగానం
బిరాబిరా పరుగులిడే కృష్ణమ్మ... పరిష్వంగానికి పరితపించే సముద్రుడు... దాపున వేణుగోపాలస్వామి గుడి... సాగర సంగమంలో భక్తిలీనం... వెరసి హంసలదీవి ఒక దర్శనీయ స్థలి. సందర్భం: మాఘ శుద్ధ నవమి ఫిబ్రవరి 16 నుంచి మాఘ బహుళ పాడ్యమి ఫిబ్రవరి 23 వరకు వరకూ స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా... హంసలదీవి కృష్ణానది సాగరసంగమ ప్రాంతం. కృష్ణాజిల్లా కోడూరు నుండి 15 కి.మీ. దూరంలో, మోపిదేవి నుంచి 28 కి.మీ. దూరంలో బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ వేణుగోపాలస్వామి రుక్మిణీసత్యభామా సమేతుడై కొలువుతీరాడు. పూర్వం దేవతలు ఈ ఆలయాన్ని నిర్మిస్తుండగా దేవాలయ నిర్మాణం పూర్తయి గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోవడంతో అక్కడి నుంచి దేవతలు వెళ్లిపోయారని అందువల్ల అది అసంపూర్తిగా మిగిలి పోయిందని ప్రతీతి. అయితే కొన్నేళ్ల తర్వాత ఐదంతస్తుల గాలిగోపురం నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆలయ ముఖమండపంలోని స్తంభాలపై ఉన్న శాసనాలు చరిత్రను వివరిస్తాయి. ఈ ఆలయంలో శ్రీవేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తుల విశ్వాసం. ఏటా మాఘ శుద్ధ నవమి నుంచి మాఘ బహుళ పాడ్యమి వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈసారి ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నిర్మాణం వెనుక కథ... వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించి ఒక కథ ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో ఒక పుట్ట ఉండేదట. స్వామి దానిలో ఉండేవారట. మేత పూర్తి చేసుకున్న గోవులు ఆ పుట్ట దగ్గరకు వచ్చి పుట్టలో ఉన్న స్వామికి తమ పొదుగుల నుంచి పాలు ఇచ్చేవట. ఇంటికి తిరిగి వచ్చిన గోవులు పాలు ఇవ్వకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఒకనాడు మాటు వేసి విషయం తెలుసుకున్నాడట. కోపం పట్టలేక పుట్ట చుట్టూ పడి ఉన్న చెత్త పోగు చేసి పుట్ట మీద వేసి నిప్పు పెట్టారట. పుట్టలోని స్వామికి వేడి తగిలిందట. ఇంతలో ఒకరికి పూనకం వచ్చి పుట్టలో స్వామి ఉన్న విషయాన్ని చెప్పారట. తప్పు తెలుసుకున్న ఆ యజమాని క్షమాభిక్ష కోరుకుని స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారట. కాలక్రమేణా ఆ విగ్రహం శిథిలమైపోయిందట. అప్పుడా స్వామి, గ్రామస్థులకు కలలో కన్పించి, కాకరపర్రు గ్రామ మునసబు పెరడులో కాకరపాదు కింద భూమిలో ఉన్నానని చెప్పాడట. దాంతో గ్రామస్తులు కాకరపర్రు గ్రామానికి వెళ్లి, స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి, హంసలదీవికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారట. ఈ విగ్రహం నీలిమేఘచ్ఛాయలో ఉండ టాన్ని విశేషంగా చెప్పుకుంటారు. శిథిలమైన విగ్రహం కూడా అలంకరించబడిన మూలవిరాట్ పక్కనే నేటికీ దర్శనమిస్తోంది. నమ్మకం... ఈ ఆలయంలో వివాహం చేసుకున్న దంపతులు సాగరసంగమ ప్రదేశంలో సరిగంగ స్నానాలు చేస్తే నూరేళ్లు సుఖంగా జీవిస్తారని, ఈ ఆలయంలో నిద్రచేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ కుడ్యాల మీద అందంగా చెక్కబడిన రామాయణ ఘట్టాలు, శిల్పకళా వైభవానికి అద్దం పడతాయి. ఆలయానికి ఈశాన్యంలో ఉన్న అతి పురాతన కల్యాణమండపం కనువిందు చేస్తుంది. ప్రత్యేకతలు... సుమారు ఆరేడువందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే అయినా ఉప్పెనలకు సైతం చెక్కుచెదరకుండా నిలబడింది. 1864, 1977 సంవత్సరాలలో ఉప్పెనలు సంభవించినప్పుడు ఆ గ్రామస్థుల ప్రాణాలను కాపాడిన చరిత్ర ఈ ఆలయానిది. ఈ ప్రాంగణంలోనే జనార్దనస్వామి, రాజ్యలక్ష్మి, లక్ష్మీనరసింహస్వామి మూర్తులు, ఆలయ సమీపంలో బాలాత్రిపురసుందరి, అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరాలయాలు ఉన్నాయి. ఆ పేరు ఎందుకు... హంసలదీవి పేరు ఎలా వచ్చింది? ఒక కథ చెబుతారు. అందరి పాపాలను కడుగుతున్న అనేదానికి కారణంగా గంగానది మలినమైపోయిందట. అప్పుడు ఆమె తన పాప పంకిలాన్ని పోగొట్టుకునే మార్గం చెప్పమని శ్రీమహావిష్ణువును ప్రార్థించిందట. అప్పుడు విష్ణువు గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమనీ ఏ క్షేత్రంలో ఆమె హంసగా మారుతుందో అది మహోన్నతమైన దివ్యక్షేత్రంగా అలరారుతుందని చెప్పాడట. సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ వెళుతూన్న కాకి కృష్ణవేణి సాగర సంగమ ప్రాంతంలో మునక వేయగానే అందమైన హంసగా మారింది. నాటి నుంచి ఈ ప్రాంతాన్ని హంసలదీవి అంటున్నారని స్థల పురాణం వివరిస్తోంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎందరో మునులు తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, అంతటి పరమహంసలు సంచరించిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని కూడా మరొక కథ ప్రచారంలో ఉంది. మధురానుభూతి... పాలకాయతిప్ప దగ్గర కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే సాగరసంగమ దృశ్యం చూడాలంటే రోడ్డు మార్గంలో మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి. ఒక పక్క నుంచి నల్లని వర్ణంలో కృష్ణమ్మ ప్రశాంతంగా ప్రవహిస్తుంటే, మరో పక్క తెల్లని వర్ణంలో సాగరుడు సైతం ప్రశాంతంగానే ఆమెను తన ఒడిలోకి ఆహ్వానిస్తుంటాడు. ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. చివరిలో బీచ్ వెంట కాలిబాటన రావాలి. అంతేకాదు, పాలకాయతిప్ప నుంచి కాలిబాటన వచ్చే ప్రాంతంలో సముద్రం పోటు మీద ఉన్నప్పుడు బాట కనుమరుగవుతుంది. పోటు తగ్గాక తిరిగి ప్రశాంతంగా కాలిబాట కనులవిందు చేస్తుంది. అందుకే సముద్రం పోటు సమయంలో ఇక్కడకు రావడం అంత క్షేమం కాదు. నీటిలో ఎక్కువ దూరం వెళ్లకూడదు. దగ్గరలో ఉన్న ఒక భవంతి పైనుంచి సుందరమైన సాగరసంగమ దృశ్యాన్ని కన్నులారా చూడవచ్చు. - డా. పురాణపండ వైజయంతి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ ఉత్సవాలు మాఘపౌర్ణమికి స్వామివారి కల్యాణోత్సవం, కృష్ణాష్టమి, ధనుర్మాసం ప్రత్యేక ఉత్సవాలు, కార్తీకమాసంలో సముద్రస్నానం ఆచరించిన భక్తులు ఈ స్వామిని తప్పక దర్శిస్తారు. కృష్ణవేణి పుట్టుక నుంచి సాగర సంగమం వరకు కృష్ణమ్మ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర పడమటి కనుమలలో ప్రభవించి, దారిపొడవునా పచ్చటి పొలాలను తడి చేస్తూ, పూలు పూయిస్తూ 1400 కి.మీ. ప్రవ హించి ప్రవహించి... అలసి సొలసి హంసలదీవి దగ్గర తన మధుర జలాలతో సాగరుడి క్షారజలాల ఒడికి చేరి ఒదిగి కూర్చుంటుంది. కృష్ణాజలాలు నల్లని వర్ణంలో ఉంటాయి కనుకే ఆ తల్లిని కృష్ణమ్మ అంటారు. -
ఘనంగా వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గురువారం వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వారం రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కల్యాణ మహోత్సవం జరిగింది. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి. వివేక్‌లు హాజరయ్యారు. అనంతరం విగ్రహాల పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.