అపహరణకు గురైన పంచలోహ విగ్రహాలు ఇవే..
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు 700 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహాలు శనివారం సాయంత్రం అపహరణకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెద్దబజార్‌లో గల వేణుగోపాలస్వామి (శ్రీకృష్ణుడు) ఆలయానికి దాదాపుగా 700 ఏళ్ల చరిత్ర ఉంది. శనివారం సాయంత్రం ఆలయ ప్రధాన పూజారి పక్కనే ఉన్న తన ఇంట్లోకి వెళ్లి వస్తానని గడియ వేసి వెళ్లాడు. కొద్దిసేపట్లో తిరిగి వచ్చేసరికి ప్రధాన విగ్రహాల ముందు ఉంచిన శ్రీ కృష్ణుడు, రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు కనిపించకుండా పోయాయి.
దుండగులు మరే వస్తువులను ముట్టుకోకుండా కేవలం పంచలోహ విగ్రహాలను మాత్రమే అపహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఆలయం చుట్టూ గృహాలు ఉన్నాయి. సాయంత్రం వేళ ఆలయంతో పాటు కాలనీలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో విగ్రహాలు అపహరణకు గురైన నేపథ్యంలో.. ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే చేసి ఉంటారని భావిస్తున్నారు. చోరీకి గురైన విగ్రహాల బరువు 75 కిలోల వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ ప్రసన్నరాణి, సీఐ శ్రీధర్‌కుమార్ ఆలయానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ బృందాన్ని తెప్పించి తనిఖీలు ప్రారంభించారు. అపహరణకు గురైన పంచలోహ విగ్రహాల విలువ బయట మార్కెట్‌లో కోటికి పైగా ఉండవచ్చని ఆలయాన్ని నిర్మించిన వారి వంశీయులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment