పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇండోర్‌కు చెందిన యువకుడికి చిన్నప్పటినుంచీ ఒక అలవాటు ఉండేది. తన పరిసరాల్లో కనిపించిన పనికి రాని వస్తువుల ద్వారా ఏదో ఒక ఉపయోగపడే వస్తువును తయారు చేసేవాడు. ఆ అలవాటే అతడిని అద్భుత కళకారుడిగా తీర్చిదిద్దింది. స్క్రాప్ మెటల్‌తో తన కలలకు ప్రాణం పోసి, అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నాడు. దేశ విదేశాల్లో అతని కళాఖండాలకు ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఎవరా యువకుడు? అతని కథేంటి తెలుసుకుందాం ఈ కథనంలో.
దేశంలో చాలా మంది కళాకారులు మట్టి , రాయి, చెక్క, ఇలా అనేక రకాల వస్తువులతో విగ్రహాలు తయారు చేయడం మనకు తెలుసు. ఇండోర్‌లో నివసిస్తున్న ఈ కళాకారుడి విగ్రహాలు మాత్రం చాలా స్పెషల్. ఇండోర్‌కు చెందిన దేవల్ వర్మకు చిన్నప్పటినుంచీ ఫిక్షన్ సినిమాలు, బైక్‌లు అంటే ఇష్టం. చిన్నతనంలో, దేవల్ వారాంతాల్లో తన ఇల్లు ,పాఠశాల చుట్టూ దొరికిన స్క్రాప్‌లను ఉపయోగించి తనకు నచ్చిన విధంగా చిన్న చిన్న వస్తువులను తయారు చేసేవాడు. అదే అతణ్ని గొప్పవాడిగా మలుస్తుందని అస్సలు ఊహింఛలేదు.
యువకుడిగా మారిన కొద్దీ, కాస్త విజ్ఞానం అలవడుతున్న కొద్దీ తను చేస్తున్న పనిపై మరింత ఆసక్తి పెరిగింది. కళాశాలకు చేరుకునే సమయానికి, ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల పట్ల ప్రేమతో ప్రేరణ పొంది స్క్రాప్ మెటల్‌తో క్లిష్టమైన నమూనాలను తయారు చేసేశాడు. దీనికి తోడు ప్రముఖ టీవీ షో M.A.D (సంగీతం, కళ , నృత్యం), దాని హోస్ట్ హరున్ రాబర్ట్ నుంచి మరింత ప్రేరణ లభించింది. అలా వ్యర్థ పదార్థాలతో కార్లు, మోటార్ సైకిళ్ల సూక్ష్మ నమూనాలను తయారు చేస్తూ ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు దేవల్ వర్మ.
ఈ ఆసక్తి తగ్గట్టుగానే దేవల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు,స్థానిక గ్యారేజీలు . ఆటోమోటివ్ ఫ్యాక్టరీల దృష్టిని ఆకర్షించాయి. వారినుంచి మెటల్ స్క్రాప్ సేకరించి హార్లే డేవిడ్సన్ అధికారిక లోగో రూపకల్పన గొప్ప మైలురాయిగా నిలిచింది. వారి షోరూమ్ కోసం ఈ స్క్రాప్ ఇన్‌స్టాలేషన్‌ను ప్రత్యేకంగా రూపొందించాడు.
ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత దేవల్ క్రియేటివ్ జర్నీ మరింత వేగం పుంజుకోవడమే కాదు, కీలక మలుపు తిరిగింది. తన కళను కరియర్‌గా మలుచుకోవాని నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో తల్లిదండ్రుల నుండి ప్రారంభ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, చివరికి కుమారుడికి అండగా నిలిచారు. పూణేలోని MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ప్రోడక్ట్ డిజైన్‌లో కోర్సును అభ్యసించాడు. అలా దుబాయ్‌లో తొలి ప్రదర్శన సక్సెస్ అయింది. మెటల్ స్క్రాప్‌తో రూపొందించిన రెండు గిటార్‌లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకోవడంతో మెటల్ ఆర్టిస్ట్‌గా వృత్తిపరమైన ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.
ఈరంగంలో నిపుణుల సలహాలను తీసుకుంటూ మరింత పట్టుదల ఎదిగాడు. కళా ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు పొందాడు. మినీ-రోబోట్ ప్లాంటర్ మొదలు అందమైన శిల్పాల వరకు కొలువు దీరాయి. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అద్భుత కళాఖండాలుగా నిలిచాయి. సింగపూర్, ఇటలీ, అమెరికాలోని కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి.
దేవల్ వర్మ స్టార్టప్
2017 నుండి ఒక సొంత స్టార్టప్‌ను నడుపుతున్నాడు. అతను ఇప్పటివరకు అనేక రకాల శిల్పాలు , కళాఖండాలను తయారు చేశాడు. ఏనుగు, నెమలి, చిలుక, గిటార్, డేగ, ఇండియా మ్యాప్, పువ్వులు ఇలా ఒకటేంటి అనేక రకాల జంతువులు, పక్షుల బొమ్మలను రూపొందించాడు. ముఖ్యంగా హనుమాన్ విగ్రహం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.
అద్భుతమై హనుమాన్ విగ్రహం
గుజరాత్‌లోని గోద్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త సోషల్ మీడియా ద్వారా దేవల్ గురించి తెలుసుకుని హనుమంతుని విగ్రహాన్ని తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. దీన్ని సవాల్‌గా తీసుకున్న దేవల్ 350 కిలోల స్క్రాప్ ఉపయోగించి, ఏడాది పాటు శ్రమించి హనుమాన్‌జీ విగ్రహాన్ని రూపొందించాడు. ఇత్తడి స్టీల్ వస్తువులు, గేర్-బేరింగ్‌లతో కండలు తిరిగిన దేహంతో అందమైన హనుమాన్ విగ్రహం చూస్తే ఎవరైనా చేయొత్తి మొక్కాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment