Panchaloha Idols
-
పంచలోహ విగ్రహాల అపహరణ
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు 700 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహాలు శనివారం సాయంత్రం అపహరణకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెద్దబజార్లో గల వేణుగోపాలస్వామి (శ్రీకృష్ణుడు) ఆలయానికి దాదాపుగా 700 ఏళ్ల చరిత్ర ఉంది. శనివారం సాయంత్రం ఆలయ ప్రధాన పూజారి పక్కనే ఉన్న తన ఇంట్లోకి వెళ్లి వస్తానని గడియ వేసి వెళ్లాడు. కొద్దిసేపట్లో తిరిగి వచ్చేసరికి ప్రధాన విగ్రహాల ముందు ఉంచిన శ్రీ కృష్ణుడు, రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు కనిపించకుండా పోయాయి. దుండగులు మరే వస్తువులను ముట్టుకోకుండా కేవలం పంచలోహ విగ్రహాలను మాత్రమే అపహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఆలయం చుట్టూ గృహాలు ఉన్నాయి. సాయంత్రం వేళ ఆలయంతో పాటు కాలనీలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో విగ్రహాలు అపహరణకు గురైన నేపథ్యంలో.. ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే చేసి ఉంటారని భావిస్తున్నారు. చోరీకి గురైన విగ్రహాల బరువు 75 కిలోల వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ ప్రసన్నరాణి, సీఐ శ్రీధర్‌కుమార్ ఆలయానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ బృందాన్ని తెప్పించి తనిఖీలు ప్రారంభించారు. అపహరణకు గురైన పంచలోహ విగ్రహాల విలువ బయట మార్కెట్లో కోటికి పైగా ఉండవచ్చని ఆలయాన్ని నిర్మించిన వారి వంశీయులు చెబుతున్నారు. -
రూ.3 కోట్ల విలువైన పంచలోహా విగ్రహాలు స్వాధీనం
వరంగల్ : వరంగల్ జిల్లాలోని పలు ఆలయాల్లో పంచలోహ విగ్రహాల చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ములుగు క్రాస్ రోడ్డులోని పెద్దమ్మ గడ్డ ప్రాంతంలో నిందితులు ఆటోలో సంచరిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఏడు పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్నట్టు కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ... స్వాధీనం చేసుకున్న విగ్రహాల్లో అతి పురాతనమైన రెండు శ్రీరాముడు, సీతమ్మవారి విగ్రహం ఒకటి, వేణుగోపాల స్వామి విగ్రహం, రాధాదేవి విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. పట్టుబడిన నిందితుల్లో ములుగు మండలం అన్నంపల్లి గ్రామానికి చెందిన తేజావత్ రమేశ్, పర్వతగిరి మండలం వడ్లకోండ గ్రామానికి చెందిన వలందాస్ రంగయ్య, వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ అని సుధీర్‌బాబు చెప్పారు. -
పంచలోహ విగ్రహాల చోరీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: పంచలోహ విగ్రహాలు చోరీ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నగర పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాలోని సభ్యుల నుంచి మూడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో వారిని విచారిస్తున్నారు. సదరు మూడు విగ్రహాలను వరంగల్ జిల్లా మొగిళ్లపల్లి నుంచి చోరీ చేసినట్లు దొంగలు వెల్లడించారని పోలీసులు తెలిపారు.