హంసలదీవిలో వేణుగానం | Magha shuddha Navami to the Hamsaladeevi Krishna River | Sakshi
Sakshi News home page

హంసలదీవిలో వేణుగానం

Published Tue, Feb 16 2016 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

హంసలదీవిలో వేణుగానం

హంసలదీవిలో వేణుగానం

బిరాబిరా పరుగులిడే కృష్ణమ్మ...
పరిష్వంగానికి పరితపించే సముద్రుడు...
దాపున వేణుగోపాలస్వామి గుడి...
సాగర సంగమంలో భక్తిలీనం...
వెరసి హంసలదీవి ఒక దర్శనీయ స్థలి.

 
సందర్భం: మాఘ శుద్ధ నవమి ఫిబ్రవరి 16 నుంచి మాఘ బహుళ పాడ్యమి ఫిబ్రవరి 23 వరకు వరకూ స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా...

హంసలదీవి కృష్ణానది సాగరసంగమ ప్రాంతం. కృష్ణాజిల్లా కోడూరు నుండి 15 కి.మీ. దూరంలో, మోపిదేవి నుంచి 28 కి.మీ. దూరంలో బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ వేణుగోపాలస్వామి రుక్మిణీసత్యభామా సమేతుడై కొలువుతీరాడు. పూర్వం దేవతలు ఈ ఆలయాన్ని నిర్మిస్తుండగా దేవాలయ నిర్మాణం పూర్తయి గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోవడంతో అక్కడి నుంచి దేవతలు వెళ్లిపోయారని అందువల్ల అది అసంపూర్తిగా మిగిలి పోయిందని ప్రతీతి. అయితే కొన్నేళ్ల తర్వాత ఐదంతస్తుల గాలిగోపురం నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ఆలయ ముఖమండపంలోని స్తంభాలపై ఉన్న శాసనాలు చరిత్రను వివరిస్తాయి. ఈ ఆలయంలో శ్రీవేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తుల విశ్వాసం. ఏటా మాఘ శుద్ధ నవమి నుంచి మాఘ బహుళ పాడ్యమి వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈసారి ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
 
నిర్మాణం వెనుక కథ...
వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించి ఒక కథ ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో ఒక  పుట్ట ఉండేదట. స్వామి దానిలో ఉండేవారట. మేత పూర్తి చేసుకున్న గోవులు ఆ పుట్ట దగ్గరకు వచ్చి పుట్టలో ఉన్న స్వామికి తమ పొదుగుల నుంచి పాలు ఇచ్చేవట. ఇంటికి తిరిగి వచ్చిన గోవులు పాలు ఇవ్వకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఒకనాడు మాటు వేసి విషయం తెలుసుకున్నాడట. కోపం పట్టలేక పుట్ట చుట్టూ పడి ఉన్న చెత్త పోగు చేసి పుట్ట మీద వేసి నిప్పు పెట్టారట. పుట్టలోని స్వామికి వేడి తగిలిందట.

ఇంతలో ఒకరికి పూనకం వచ్చి పుట్టలో స్వామి ఉన్న విషయాన్ని చెప్పారట. తప్పు తెలుసుకున్న ఆ యజమాని క్షమాభిక్ష కోరుకుని స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారట. కాలక్రమేణా ఆ విగ్రహం శిథిలమైపోయిందట. అప్పుడా స్వామి, గ్రామస్థులకు కలలో కన్పించి, కాకరపర్రు గ్రామ మునసబు పెరడులో కాకరపాదు కింద భూమిలో ఉన్నానని చెప్పాడట. దాంతో గ్రామస్తులు కాకరపర్రు గ్రామానికి వెళ్లి, స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి, హంసలదీవికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారట. ఈ విగ్రహం నీలిమేఘచ్ఛాయలో ఉండ టాన్ని విశేషంగా చెప్పుకుంటారు. శిథిలమైన విగ్రహం కూడా అలంకరించబడిన మూలవిరాట్ పక్కనే నేటికీ దర్శనమిస్తోంది.
 
నమ్మకం...
ఈ ఆలయంలో వివాహం చేసుకున్న దంపతులు సాగరసంగమ ప్రదేశంలో సరిగంగ స్నానాలు చేస్తే  నూరేళ్లు సుఖంగా జీవిస్తారని, ఈ ఆలయంలో నిద్రచేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ కుడ్యాల మీద అందంగా చెక్కబడిన రామాయణ ఘట్టాలు, శిల్పకళా వైభవానికి అద్దం పడతాయి. ఆలయానికి ఈశాన్యంలో ఉన్న అతి పురాతన కల్యాణమండపం కనువిందు చేస్తుంది.
 
ప్రత్యేకతలు...
సుమారు ఆరేడువందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే అయినా ఉప్పెనలకు సైతం చెక్కుచెదరకుండా నిలబడింది. 1864, 1977 సంవత్సరాలలో  ఉప్పెనలు సంభవించినప్పుడు ఆ గ్రామస్థుల ప్రాణాలను కాపాడిన చరిత్ర ఈ ఆలయానిది. ఈ ప్రాంగణంలోనే జనార్దనస్వామి, రాజ్యలక్ష్మి, లక్ష్మీనరసింహస్వామి మూర్తులు, ఆలయ సమీపంలో బాలాత్రిపురసుందరి, అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరాలయాలు ఉన్నాయి.
 
ఆ పేరు ఎందుకు...
హంసలదీవి పేరు ఎలా వచ్చింది? ఒక కథ చెబుతారు. అందరి పాపాలను కడుగుతున్న అనేదానికి కారణంగా గంగానది మలినమైపోయిందట. అప్పుడు ఆమె తన పాప పంకిలాన్ని పోగొట్టుకునే మార్గం చెప్పమని శ్రీమహావిష్ణువును ప్రార్థించిందట. అప్పుడు విష్ణువు గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమనీ ఏ క్షేత్రంలో ఆమె హంసగా మారుతుందో అది మహోన్నతమైన దివ్యక్షేత్రంగా అలరారుతుందని చెప్పాడట.

సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ వెళుతూన్న కాకి కృష్ణవేణి సాగర సంగమ ప్రాంతంలో మునక వేయగానే అందమైన హంసగా మారింది. నాటి నుంచి ఈ ప్రాంతాన్ని హంసలదీవి అంటున్నారని స్థల పురాణం వివరిస్తోంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎందరో మునులు తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, అంతటి పరమహంసలు సంచరించిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని కూడా మరొక కథ ప్రచారంలో ఉంది.
 
మధురానుభూతి...
పాలకాయతిప్ప దగ్గర కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే సాగరసంగమ దృశ్యం చూడాలంటే రోడ్డు మార్గంలో మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి. ఒక పక్క నుంచి నల్లని వర్ణంలో కృష్ణమ్మ ప్రశాంతంగా ప్రవహిస్తుంటే, మరో పక్క తెల్లని వర్ణంలో సాగరుడు సైతం ప్రశాంతంగానే ఆమెను తన ఒడిలోకి ఆహ్వానిస్తుంటాడు. ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. చివరిలో బీచ్ వెంట కాలిబాటన రావాలి. అంతేకాదు, పాలకాయతిప్ప నుంచి కాలిబాటన వచ్చే ప్రాంతంలో సముద్రం పోటు మీద ఉన్నప్పుడు బాట కనుమరుగవుతుంది.

పోటు తగ్గాక తిరిగి ప్రశాంతంగా కాలిబాట కనులవిందు చేస్తుంది. అందుకే సముద్రం పోటు సమయంలో ఇక్కడకు రావడం అంత క్షేమం కాదు. నీటిలో ఎక్కువ దూరం వెళ్లకూడదు. దగ్గరలో ఉన్న ఒక భవంతి పైనుంచి సుందరమైన సాగరసంగమ దృశ్యాన్ని కన్నులారా చూడవచ్చు.
 - డా. పురాణపండ వైజయంతి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ
 
ఉత్సవాలు
మాఘపౌర్ణమికి స్వామివారి కల్యాణోత్సవం, కృష్ణాష్టమి, ధనుర్మాసం ప్రత్యేక ఉత్సవాలు, కార్తీకమాసంలో సముద్రస్నానం ఆచరించిన భక్తులు ఈ స్వామిని తప్పక దర్శిస్తారు.
 
కృష్ణవేణి పుట్టుక నుంచి సాగర సంగమం వరకు
కృష్ణమ్మ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర పడమటి కనుమలలో ప్రభవించి, దారిపొడవునా పచ్చటి పొలాలను తడి చేస్తూ, పూలు పూయిస్తూ 1400 కి.మీ. ప్రవ హించి ప్రవహించి... అలసి సొలసి హంసలదీవి దగ్గర తన మధుర జలాలతో సాగరుడి క్షారజలాల ఒడికి చేరి ఒదిగి కూర్చుంటుంది. కృష్ణాజలాలు నల్లని వర్ణంలో ఉంటాయి కనుకే ఆ తల్లిని కృష్ణమ్మ అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement