సాక్షి, హైదరాబాద్: ఆయన సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ దేవాలయానికి కార్యనిర్వహణాధికారి. గతంలో ఉత్తర తెలంగాణలోని ఓ దేవాలయంలో అక్రమాలకు పాల్పడ్డందుకు సస్పెండ్ కూడా అయ్యారు. కానీ పైరవీలు, మామూళ్లతో తిరిగి ఉద్యోగంలో చేరి.. అనతికాలంలో పెద్ద దేవాలయంలో ఈవోగా చేరారు. దేవాలయానికి దాతలు ఇచ్చే విరాళాలను నొక్కేయడమే కాకుండా ప్రసాదం సామగ్రి కొనుగోళ్లలోనూ చేతివాటం చూపి విజిలెన్స్‌కు చిక్కారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ మంత్రి ఆదేశించినా అమలుకాలేదు. ఇప్పుడాయనను ఏకంగా డిప్యూటీ కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టారు.
ఉత్తర తెలంగాణలోని ఓ ప్రముఖ శైవక్షేత్రం కార్యనిర్వహణాధికారి ఆయన. నిబంధనల ప్రకారమైతే 2011లో గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి వచ్చి.. అసిస్టెంట్ కమిషనర్ హోదాలో రిటైర్ కావాల్సి ఉంది. కానీ 2003లోనే గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి పొంది.. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ హోదాకు వచ్చారు. తీవ్ర అవినీతి ఆరోపణలున్న ఆ అధికారి తాజాగా రిటైర్ కావాల్సి ఉంది. కానీ ఆయనను మరో రెండేళ్లపాటు కొనసాగించాలంటూ ఇద్దరు ఉన్నతాధికారులు ఫైలును సీఎం కార్యాలయానికి పంపారు. దేవాదాయశాఖ మంత్రి వ్యతిరేకించినా ఆ ఫైలు ముందుకు కదలడం గమనార్హం.
...దేవాదాయ శాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. ఆ శాఖ మంత్రి మాటను కూడా లెక్కచేయకుండా.. ఓ ఉన్నతాధికారి, సచివాలయంలోని మరో ఉన్నతాధికారి కలసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనమిది. కాసుల కోసం అవినీతి అధికారులతో కుమ్మక్కవుతున్న సదరు ఉన్నతాధికారులు.. అడ్డగోలుగా పదోన్నతులు ఇచ్చేస్తున్నారు. పదవీ విరమణ పొందాల్సిన వారినీ మరింత కాలం కొనసాగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఇతర అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అడ్డగోలు పదోన్నతులు, కొనసాగింపుల కారణంగా కింది అధికారులకు పదోన్నతుల్లో జాప్యం జరిగే పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
విచ్చలవిడిగా అక్రమాలు
ఉత్తర తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం ఈవోగా పనిచేస్తున్న అధికారి ఈ నెలాఖరుకు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఆయన రిటైరైతే ఆ స్థానంలో మరో అధికారికి, ఆ అధికారి ఖాళీ చేసే అసిస్టెంట్ కమిషనర్ స్థానంలోకి కింది అధికారికి పదోన్నతి లభిస్తుంది. కానీ ఇప్పుడున్న అధికారికే మరో రెండేళ్లు పదవీకాలం పొడిగించే దిశగా రం గం సిద్ధమైంది. వాస్తవానికి ఆ అధికారి అక్రమంగా పదోన్నతి పొందారంటూ ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది.
2011లో గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి పొందాల్సిన ఆయన 2003లోనే పొందారు. దీంతో అర్హత లేకున్నా డిప్యూటీ కమిషనర్ స్థాయికి వచ్చా రు. దీన్ని సరిచేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా శాఖ కమిషనర్ 2016లో ప్రభుత్వాన్ని కోరగా.. 2017లో అనుమతి వచ్చింది. కానీ దానిని అమలు చేయకుండా ఇప్పటికీ పెండింగ్‌లో పెట్టడంతోపాటు తాజాగా మరో రెండేళ్లు కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది.
ఇక దేవాదాయ శాఖలో తీవ్ర అవినీతి ఆరోపణలు మూటగట్టుకుని, ఇప్పటికే ఓసారి సస్పెండైన అధికారికి తాజాగా డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఆ అధికారి అవినీతిపై ఇటీవల కొందరు భక్తులు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించినా అధికారులు బేఖాతరు చేశారు. పైగా కీలక పదవిని కట్టబెట్టారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్‌కు ఈ అవకతవకలన్నీ తెలిసినా.. నిస్సహాయంగా ఉండిపోయే పరిస్థితి ఉందని దేవాదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment