సాక్షి, అమరావతి: రాజధానిలో దేవుడి భూములకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామాలు పెడుతోంది. ఆ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పులతో పాటు తాను చేసిన చట్టాలను, జారీచేసిన మెమోలను సైతం లెక్క చేయడంలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న దేవాలయాల భూములకు ఎటువంటి రైతువారీ పట్టాలు చెల్లబోవని, గతంలో రైతు వారీ పట్టాలు ఇచ్చినప్పటికీ అవి పనికిరావని స్పష్టం చేస్తూ సీఆర్‌డీఏ 2015 సంవత్సరంలో మెమో జారీ చేసింది. ఆ భూమలన్నీ కూడా ధార్మిక సంస్థలకే చెందుతాయని ఆ మెమోలో స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న ఆలయాల భూములకు కేవలం పరిహారం మాత్రమే సదరు ధార్మిక సంస్థలకు చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు మాత్రం ఆక్రమణదారుల పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో దేవుడి భూములపై గతంలో హైకోర్టుకు సీఆర్‌డీఏ ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి చట్టానికి విరుద్ధంగా రైతు వారీ పట్టాల సాకుతో ఈనాం భూముల ఆక్రమణదారులకు కోట్ల రూపాయల విలువైన ప్లాట్లను కట్టబెడుతుండటంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ప్లాట్లు, పరిహారం కూడా ఆలయాలకే
రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా వివిధ దేవాలయాలకు చెందిన 843.87 ఎకరాలను సీఆర్‌డీఏ సేకరించింది. మరో 173.22 ఎకరాలకు సంబంధించి దేవాదాయ శాఖతో పాటు రైతులు కూడా ఆ భూములు తమవంటూ క్లెయిమ్ చేయడంతో ఆ భూములపై సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకోలేదు. రాజధానిలోని ఆలయాలకు, చారిటబుల్ సంస్థలకు చెందిన భూములన్నీ ఆయా సంస్థలకే చెందాలని, ఎటువంటి రైతు వారీ పట్టాదారులకు ఆ భూములపై హక్కు లేదని దేవాదాయ శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులతో ఆ భూములను సీఆర్‌డీఏకు బదిలీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలకు చెందిన భూములకు సంబంధించి పూర్తి పరిహారంతో పాటు అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా ఆయా ఆలయాల వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లకు జమ చేయాల్సిందిగా ఆ షరతుల్లో హైకోర్టు పేర్కొంది. దీనిపై హైకోర్టుకు సీఆర్‌డీఏ లిఖితపూర్వక అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగానే సీఆర్‌డీఏ మెమో జారీ చేసింది. ఆ మెమోలో.. ఎటువంటి రైతు వారీ పట్టాలు జారీ చేయడానికి వీల్లేదని, ఇప్పటికే జారీ చేసి ఉంటే అవి చెల్లుబాటు కావని, ఆ భూములపై పూర్తి హక్కులు ఆయా సంస్థలకే చెందుతాయని మెమోలో స్పష్టం చేసింది.
రైతువారీ పట్టాలు చెల్లవు..
ఈనాం భూములకు ఇచ్చిన పట్టాలపై 2015లో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వింజమూరి రాజగోపాలచారి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసుల్లో హైకోర్టు గతంలో స్పష్టంగా పేర్కొంది. ఈనాం భూములకు సంబంధించి 1956 చట్టం ప్రకారం రైతు వారీ పట్టాలు ఇవ్వడానికి ఆస్కారం లేదని, ఒక వేళ రైతు వారీ పట్టాలు ఇచ్చినా అవి చెల్లుబాటు కావని, ఈనాం భూములన్నీ కూడా ఆయా ఆలయాలకు మాత్రమే చెందుతాయని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రైతువారీ పట్టాలు జారీ చెల్లబోవని 2013లో చేసిన చట్టసవరణను ఈ తీర్పు ద్వారా హైకోర్టు సమర్థించినట్లు అయిందని న్యాయశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈనాం భూములను ఆక్రమించుకున్న రైతులు తమకే పరిహారం చెల్లించాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సీఆర్‌డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో దేవుని భూములకు పరిహారాన్ని ఆయా ఆలయాలకు చెల్లించాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లను మాత్రం ఆక్రమణదారులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పునకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడించిందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment