![రైతులపై రౌడీయిజం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61449691627_625x300.jpg.webp?itok=EJq2v0DT)
రైతులపై రౌడీయిజం
♦ భూములివ్వని వారిపై దౌర్జన్యం
♦ కక్ష సాధింపు చర్యలకు దిగిన ప్రభుత్వం
♦ రాజధాని ప్రాంతంలో అరటి తోటలు ధ్వంసం
♦ బుల్డోజర్లతో పూర్తిగా దున్నించిన సీఆర్‌డీఏ
♦ 7.30 ఎకరాల్లోని పంట నేలమట్టం..
♦ ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపణలు
♦ భూ సమీకరణకు సహకరించనందునే ధ్వంసమని ఆవేదన
♦ రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
♦ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు సర్కారు వికృత స్వరూపం బట్టబయలైంది. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, ఆదర్శవంతంగా భూసమీకరణ జరిపామనీ చెబుతున్న మాటలన్నీ బూటకమేనని... రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కున్నారని, లాక్కుంటున్నారని స్పష్టమవుతోంది. భూముల స్వాధీనానికి ఎంతకైనా తెగిస్తామని, పచ్చని పంటపొలాలను నిలువునా నాశనం చేసేస్తామని చంద్రబాబు సర్కారు నిరూపించుకుంది. రాజధాని భూసమీకరణకు సహకరించని రైతుల పాలిట రౌడీగా మారుతోంది. ఇదివరకు దొంగచాటుగా పంటలకు నిప్పుపెట్టి రైతులను అష్టకష్టాల పాల్జేసిన సర్కారు ఇప్పుడు నేరుగానే దౌర్జన్యానికి పాల్పడింది. భూసమీకరణకు సహకరించని రైతులకు చెందిన అరటి తోటను నిర్దయగా నాశనం చేసి తన కపట రూపాన్ని చూపింది.
ప్రభుత్వ దాష్టీకంతో నివ్వెరపోయిన రైతులు బోరుమంటున్నారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఇది వరకూ పంట పొలాలను తగులబెట్టించడ ం, వ్యవసాయ పంప్‌సెట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడిన వ్యవహారాలు వెలుగులోకి రాగా ఇప్పుడు భూ సమీకరణకు సహకరించని రైతుల పంట పొలాలను అన్యాయంగా నేలమట్టం చేయించే పనులకు పూనుకున్నారు సీఆర్‌డీఏ అధికారులు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో చోటు చేసుకున్న తాజా సంఘటనే ఇందుకు నిదర్శనం. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు సహకరించని గుండపు రాజేష్ సోదరుల అరటి తోటలను మంగళవారం సాయంత్రం సీఆర్‌డీఏ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా నేల మట్టం చేయించారు.
సీఆర్‌డీఏ యూనిట్ 16 డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి పర్యవేక్షణలో సీఆర్‌డీఏకు చెందిన మూడు బుల్డోజర్లు పొలాల్లోకి ప్రవేశించి గెలలతో ఉన్న అరటి చెట్లను గంట వ్యవధిలోనే నేలమట్టం చేసి గుట్టగా నాలుగైదు చోట్ల పోశాయి. సమాచారం అందుకున్న పొలాల యజమానులు పొలం దగ్గరకు చేరుకునే లోగానే 7.30 ఎకరాల పంట నేలమట్టమైంది. కోర్ కేపిటల్ పరిధిలోని లింగాయపాలెం వాసులు గుండపు రాజేష్‌కుమార్, చంద్రశేఖర్‌లు అన్నదమ్ములు, వీరి తల్లి రమణమ్మతో కలిపి వీరికి 139/ఏ1, 139/ఏ3, 140, 141/1 సర్వే నంబర్లలో మొత్తం 7.30 ఎకరాల జరీబు భూములున్నాయి.
రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి ఫర్లాంగు దూరంలోనే ఈ భూములున్నాయి. రాజధాని కోసం భూ సమీకరణ జరిగే సమయంలో రాజేష్ సోదరులిద్దరూ ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించలేదు. తమ భూముల్లో పాలీ హౌస్‌ల నిర్మాణం చేపట్టనున్నామనీ, భూములను ఇచ్చే ఉద్దేశం లేదని వీరు సర్కారుకు తేల్చి చెప్పారు. అంతేకాకుండా భూ సమీకరణకు తాము సిద్ధంగా లేమంటూ అభ్యంతర పత్రాలను సమర్పించారు. తమ పొలంలో అరటి పంట సాగు చేశారు. గెలలతో ఉన్న పంట రెండు నెలల్లో చేతికందుతుందని, నాలుగు లక్షల రూపాయల వరకూ వస్తుందని వారు భావించారు.
అయితే ఉన్నట్టుండి సీఆర్‌డీఏ అధికారులు పచ్చని పంటను నాశనం చేశారు. మిత్రుడు రామ్మోహన్ ద్వారా సమాచారం అందుకున్న రాజేష్ సోదరులు హుటాహుటిన పొలానికి చేరుకునే సరికి పంట మొత్తం నేలమట్టమైంది. విస్మయానికి గురైన భూ యజమానులు తమకు జరిగిన అన్యాయం గురించి తహసీల్దార్ సుధీర్‌బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌లకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే తుళ్లూరులో ఉండే సీఆర్‌డీఏ భూ వ్యవహారాల డెరైక్టర్ బీఎల్ చెన్నకేశవరావుకు కూడా విషయాన్ని వివరించారు.
రూ.20 లక్షలకు పైగా నష్టం...
కాపుకొచ్చిన పంట విలువతో పాటు పెట్టుబడులన్నీ కలిపి రూ.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. పొలాల్లో వేసిన మూడు బోర్లు పూర్తిగా పూడిపోయాయి, రూ.6 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ కూడా ధ్వంసమైందన్నారు. గట్లు చెదిరిపోయాయి పొలం రూపమే మారిపోయిందని వారు గగ్గోలు పెడుతున్నారు.
పొరపాటున జరిగిందంతే...
చేతికందిన ఏడెకరాల అరటి పంటను ప్రభుత్వం నాశనం చేయించిందని రైతులు లబోదిబోమంటుంటే, దీన్ని చిన్న పొరపాటుగా అభివర్ణించారు యూనిట్ 16 డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి. గుండపు రాజేష్ సోదరుల భూములు రాజధాని భూ సమీకరణ కిందకు రావని, వారు అభ్యంతర పత్రాలిచ్చిన విషయం వాస్తమేనని చెప్పిన ఆయన జరిగిన నాశనం సమాచార లోపం ఫలితమేనన్నారు. దీనిపై విచారణ చేయిస్తున్నామని చెప్పారు.
స్టే ఉన్నా... పొలాలను చదును చేయడమేమిటి?
రాజధాని నిర్మాణ పనులపై స్టే ఉన్నప్పటికీ ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి పొలాలను చదును చేయడం దారుణమని పర్యావరణవేత్త, గ్రీన్ ట్రిబ్యునల్ పిటీషనర్ శ్రీమన్నారాయణ అన్నారు. అరటి తోటలను ఇలా నాశనం చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వీరు తుళ్లూరు పోలిస్‌స్టేషన్‌కు చేరుకుని పంట పొలం చదును చేసిన విషయంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉద్దేశపూర్వకంగానే చేశారు
తమ అరటి తోటలను సీఆర్‌డీఏ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేయించినట్లు రాజేష్, చంద్ర శేఖర్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. భూ సమీకరణకు తాము సహకరించకపోవడంతో మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో ప్రభుత్వం పంటకు నష్టం కలిగించిందన్నారు. భూ సమీకరణ కింద ప్రభుత్వం సొంతం చేసుకున్న భూములు పక్కనే ఉన్నా, వాటిని చదును చేయడం మాని మధ్యలో ఉన్న తమ పంట చేలను మాత్రమే చదును చేయడం చూస్తే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే యూనిట్-16కు చెందిన డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి పొరపాటున జరిగినట్లుందని చెప్పడం విడ్డూరమన్నారు. తమకు జరిగిన నష్టానికి పరిహారం కట్టించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయం కోసం చట్టబద్ధంగా పోరాడతామన్నారు.