రైతుల వాదన నిజమే | World Bank support to the farmers | Sakshi
Sakshi News home page

రైతుల వాదన నిజమే

Published Thu, Jun 29 2017 2:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రైతుల వాదన నిజమే - Sakshi

రైతుల వాదన నిజమే

రాజధాని అన్నదాతల వేదనతో ఏకీభవించిన ప్రపంచ బ్యాంకు 
- అందువల్లే తనిఖీ, విచారణకు ఆదేశిస్తున్నామని వెల్లడి
- రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు పూలింగ్, సేకరణ చేస్తోంది..
జీవనోపాధి, ఆహార భద్రతకు ముప్పు.. సామాజిక సర్వే లోపభూయిష్టం
1,27,505 మంది ప్రభావితం.. 150 మంది అభిప్రాయాలే సేకరిస్తారా?
రెతుల విన్నపాలను లోతుగా అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం 
-  వచ్చే నెల 13లోగా తనిఖీ, విచారణ పూర్తి చేయాలంటూ తలంటిన వైనం
 
సాక్షి, అమరావతి : ‘అయ్యా.. అన్యాయం చేయమాకండయ్యా.. ఆ భూములమీదే ఆధారపడి బతుకుతున్నాం.. మూడు కార్లు పండే పచ్చటి పొలాలను లాగేసి మా కడుపు కొట్టొద్దు’ అని నవ్యావంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఎంతగా నెత్తీనోరు కొట్టుకున్నా స్పందించని రాష్ట్ర సర్కారు తీరును ప్రపంచ బ్యాంకు తప్పు పట్టింది. బలవంతంగా రైతుల నుంచి భూములు సేకరిస్తూ వారి జీవనోపాధికి భంగం కలిగిస్తున్నారని, తద్వారా పర్యావరణం, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎత్తి చూపింది. సామాజిక ఆర్థిక సర్వే అంతా లోపభూయిష్టంగా సాగిస్తూ.. కొంత మంది అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా చెప్పడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్‌ చైర్మన్‌ గోంజలో కాస్ట్రోడెలా మాటా సంతకంతో ఒక డాక్యుమెంట్‌ విడుదల చేశారు.

అన్ని అంశాలపై తనిఖీ, విచారణ పూర్తి చేసి, వచ్చే నెల 13వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు రుణం కోరిన నేపథ్యంలో రూ.3,334 కోట్లు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆ ప్రాంతంతో సామాజిక స్థితిగతులు, పర్యావరణం తదితర అంశాలను ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్‌ పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకుంటుంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తోందని పెద్దఎత్తున రైతులు ఫిర్యాదు చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలను గమనించిన తనిఖీ ప్యానల్‌ ప్రభుత్వానికి తలంటింది. మాకే లోపభూయిష్టమైన సమాచారం ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని, పారదర్శకత పాటించలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాచారాన్ని తాము విశ్వసించడం లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. రాజధానిలో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతుల ఆవేదనలో న్యాయం ఉందని తేల్చి చెప్పింది. రైతులకు జరుగుతున్న అన్యాయానికి ఆధారాలున్నాయని వెల్లడించింది.
 
ఆకాశ రామన్నలు చెబితే విచారించడం లేదు..
రైతుల విన్నపాలపై లోతుగా అధ్యయనం చేసిన తరువాతే విచారణకు ఆదేశించామని ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్‌ వెలువరించిన డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది. ఆకాశ రామన్న లేదా పస లేని ఫిర్యాదుల ఆధారంగా విచారణకు ఆదేశించలేదని వివరించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేకపోవడంతోపాటు అమరావతి ప్రాజెక్టు తొలి దశలోనే ఉన్నందున రైతుల విన్నపాలపై విచారణ, తనిఖీలకు ఆదేశించలేదని పేర్కొంది. రాజధానిలో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతులు కోర్టు డాక్యుమెంట్లతో సహా మొత్తం 22 ఆధారాలు సమర్పిస్తూ.. న్యాయం చేయాల్సిందిగా తమకు విన్నవించుకున్నారని వెల్లడించింది. రైతులు లేవనెత్తిన అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే తనిఖీలు, విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ప్రపంచ బ్యాంకు ప్యానెల్‌ విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఇంకా చెప్పారంటే... 
 
అభిప్రాయాలు చెప్పకుండా నిరోధించారు..  
‘రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ(ల్యాండ్‌ పూలింగ్‌) విధానం ప్రజల జీవనోపాధి, ఆహార భద్రత, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సహాయ, పునరావాసంపై ప్రభుత్వం తమను సంప్రదించలేదని వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని మా(ప్రపంచ బ్యాంకు) దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూములను లాగేసుకుంటోందని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తగినంత పరిహారం చెల్లించడం లేదని, తాము జీవనోపాధి కోల్పోతామని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ భూములు కోల్పోతున్న వారికి అంతే మొత్తంలో మరోచోట భూములు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. సహాయ, పునరావాస ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు నిబంధనల మేరకు అమలు చేయడం లేదని అంటున్నారు.

రాజధాని ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారిపై ప్రభావ తీవ్రతను సరిగా అంచనా వేయడం లేదని బ్యాంకు దృష్టికి రైతులు తీసుకెళ్లారు. సామాజిక ఆర్థిక సర్వే లోపభూయిష్టంగా నిర్వహించారని, ఒక కన్సల్టెంట్‌ ద్వారా నిర్వహించిన సర్వేలో వాస్తవాలు ప్రతిబింబించలేదని రైతులు పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టు వల్ల 1,27,505 మంది ప్రభావితం అవుతుంటే కేవలం 150 మందిని మాత్రమే సర్వేలో సంప్రదించారని, మరో ఐదు ఆన్‌లైన్‌ అభిప్రాయాలు మాత్రమే వచ్చాయని రైతులు పేర్కొన్నారు. సెక్యూరిటీని పెట్టి అభిప్రాయాలు చెప్పడానికి రాకుండా చాలా మందిని నిరోధించారని రైతులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘనలను నిరోధించడంతో పాటు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకును కోరారు. గతంలో పలుసార్లు వినతులు చేసినప్పటికీ బ్యాంకు మేనేజ్‌మెంట్‌ వాటిపై చర్యలను తీసుకోవడంలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.
 
ల్యాండ్‌ పూలింగ్‌పై అనేక అభ్యంతరాలు
 రైతుల వినతులపై ప్రపంచ బ్యాంకు ప్యానల్‌ గత నెల 24వ తేదీన ప్రపంచ బ్యాంకు మేనేజ్‌మెంట్‌తో సమావేశమై పలు అంశాలపై సమాచారం, వివరణ కోరింది. రైతులు ప్రస్తావించిన అంశాలు బ్యాంకు మేనేజ్‌మెంట్‌ దృష్టిలో ఉన్నాయని, అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్యానల్‌కు సమర్పించామన్నారు. సహాయ పునరావాస ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, ప్రస్తుతం కేవలం ఉప ప్రాజెక్టుల పరిధిలో మాత్రమే అమలయ్యే చర్యలను తీసుకుంటున్నట్లు బ్యాంకు మేనేజ్‌మెంట్‌ ప్యానల్‌ దృష్టికి తీసుకువచ్చింది. ప్రపంచ బ్యాంకు సాయం అందించే మొత్తం ప్రాజెక్టులో ప్రస్తుతం 30 శాతం మాత్రమే అంటే పది రహదారులకు సంబంధించి సహాయ పునరావాస కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు బ్యాంకు మేనేజ్‌మెంట్‌ ప్యానల్‌ దృష్టికి తీసుకువచ్చింది.

ఈ రహదారుల ప్రాజెక్టుకు 400 కుటుంబాలు ప్రభావితం అవుతాయని, కన్సల్టేషన్‌ సమావేశంలో కేవలం 150 మంది మాత్రమే పాల్గొన్నారని, ల్యాండ్‌ పూలింగ్‌పై అనేక అభ్యంతరాలు, అభిప్రాయాలు వచ్చాయని బ్యాంకు మేనేజ్‌మెంట్‌ ప్యానల్‌కు వివరించింది. ల్యాండ్‌ పూలింగ్‌పై మూడవ పార్టీ అంచనా కొనసాగుతోందని, త్వరలోనే ఆ నివేదికను ప్యానల్‌కు సమర్పిస్తామని బ్యాంకు మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తనిఖీ, విచారణకు ఆదేశించాము’ అని డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement