గ్రీన్ గన్!
- ‘గ్రీన్ బెల్ట్’ పేరుతో సర్కారు బెదిరింపులు
- భూములు ఇవ్వనివారికి నష్టం కలిగించేలా నిర్ణయం
- గ్రీన్ బెల్ట్ ప్రకటిస్తే అభివృద్ధికి విఘాతం
- భూములు ఇచ్చినవారిపైనా తీవ్ర ప్రభావం
- సీఎం ప్రకటనపై రాజధాని రైతుల ఆగ్రహం
సర్కారు భూ దాహం తారస్థాయికి చేరింది. తనను నమ్మి రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని గొప్పగా చెబుతున్న సీఎం చంద్రబాబు... తనను నమ్మని వారి భూములను గుంజుకునేందుకు ‘గ్రీన్’ గన్ ఎక్కు పెట్టారు. ల్యాండ్ పూలింగ్, సమీకరణకు భూములు ఇవ్వని ప్రాంతాల్లో ‘గ్రీన్ బెల్ట్’ ప్రకటిస్తామని బెదిరిస్తు న్నారు. ఈ విధంగా చేస్తే రాజధాని పరిధిలో అభివృద్ధికి విఘాతం కలిగే అవకాశం ఉంది. తద్వారా సీఎం ‘గ్రీన్’ గన్ తూటాకు ఆయన్ను నమ్మి భూములు ఇచ్చినవారు.. పెట్టుబడి పెట్టినవారు బలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరి పరిస్థితి ‘ఇంటి కూటికి.. బంతి కూటికి చెడిన’ చందంగా మారుతుందని చెబుతున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో : ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోంది. ప్రభుత్వానికి ఇవ్వని భూములను గ్రీన్‌బెల్ట్ కింద పరిగణిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం ఇందుకు నిదర్శనం. సీఎం ప్రకటనపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేవలం భూములు ఇవ్వనందుకే కక్షగట్టి... భవిష్యత్‌లో ఆ రైతులు ఆర్థికంగా ఎదగకూడదనే ఉద్దేశంతో సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు గ్రీన్‌బెల్ట్ సాధ్యాసాధ్యాలపైనా రాజధానిలో చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వం ఇదే వైఖరి అవలంబిస్తే ఇప్పటికీ భూములు ఇవ్వకుండా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పెద్దగా నష్టం ఉండదని, ఎప్పటికీ సాగు చేసుకుని సంతోషంగా జీవిస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చినవారి పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
రైతులను భయపెట్టాలని...
గ్రీన్‌బెల్ట్ ప్రకటన సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీఎం సమావేశంలో తొలుత చర్చ సాగినట్లు సమాచారం. నిబంధలను తరువాత చూసుకోవచ్చు.. ముందు ప్రకటిస్తే.. భయపడి రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొస్తారని ప్రభుత్వ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆ భూములను గ్రీన్‌బెల్ట్ కింద చూపిస్తామని ప్రకటించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అయితే గ్రీన్‌బెల్ట్ కింద ప్రకటిస్తే ప్రభుత్వం మరోసారి కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీఆర్‌డీఏ యాక్ట్–7లో సెక్షన్ 41 ప్రకారం మాస్టర్ ప్లాన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏరియా డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్‌ను మార్చుకునే అధికారాలు ఉన్నాయి. అయితే అలా మార్చుకోవాలంటే స్థానిక సంస్థలు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రజాభిప్రాయ వెల్లడికి కొంత సమయం ఇవ్వాలి.
ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ఆ వివరాలన్నింటినీ గెజిట్‌లో పెట్టి అందరికీ తెలియజేయాలి. ఆ తరువాతే గ్రీన్‌బెల్ట్ ప్రాంతంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేయడం పాలకులకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. అయితే ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామ పంచాయతీలు భూములు ఇవ్వబోమని ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఆ తీర్మాన కాపీలను కూడా సీఆర్‌డీఏకు అందజేశాయి. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాలను గ్రీన్‌బెల్ట్ కింద ప్రకటించే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ బెల్ట్ వల్ల ఇవీ సమస్యలు..
► ప్రభుత్వం అడ్డగోలుగా తమకు భూ ములు ఇవ్వని పొలాలను గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటిస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
► గ్రీన్ బెల్ట్‌గా ప్రకటించిన భూములలో కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలి.
► గ్రీన్‌బెల్ట్‌కు పరిసర ప్రాంతాల్లో పర్యావరణానికి హాని కలిగే పరిశ్రమలు ఏర్పాటు చేయకూడదు.
► రాజధాని పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇద్దరు రైతులకు చెందిన భూములు ఒకే సర్వే నంబర్‌లో ఉంటాయి. అందులో ఓ రైతు తన భూమిని ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చినా.. మరోరైతు భూమి ఇవ్వకుండా సాగు చేసుకుంటున్నారు.పూలింగ్‌లో ఇచ్చిన భూమిని ప్రభుత్వం ఏదో ఒక సంస్థకు కేటాయిస్తుంది. పూలింగ్‌కు ఇవ్వని పొలాన్ని గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటిస్తామని బెదిరిస్తోంది. ఇలా చేస్తే పలు సంస్థలకు కేటాయించిన స్థలాల్లో అభివృద్ధికి అవకాశం ఉండదు.
► సమీపంలో గ్రీన్‌బెల్ట్ ఉండడం వల్ల పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు వచ్చే అవకాశం ఉండదు. గ్రీన్‌బెల్ట్ అనేది సదుద్దేశంతో ఏర్పాటు చేయాల్సినదని, బెదిరింపులకు వాడుకునే ఆయుధం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దూకుడు పెంచిన సర్కారు
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా బలవంతంగా వ్యవసాయ భూములను లాక్కున్న విషయం తెలిసిందే. వ్యవసాయమే జీవనా«ధారంగా బతికే అనేక మంది రైతులు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో టీడీపీ పెద్దలు రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఆ భూములన్నీ సేకరణ ద్వారా తీసుకుంటామని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అంతటితో ఆగని ప్రభుత్వ పెద్దలు ఆ భూములను ఎలాగైనా లాక్కునేందుకు దూకుడు పెంచారు.
అందులో భాగంగా సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతుల గురించి సుధీర్ఘంగా చర్చించారు. ఆ రైతులు భూములు ఇవ్వని కారణంగా సీడ్‌యాక్సెస్ రోడ్డు పనులు పూర్తి చేయలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే విధంగా అనేక ప్రాంతాల్లో భూములు ఇవ్వకపోవడంతో రాజధాని నిర్మాణానికి అడ్డంకులు ఎదురవుతున్నట్లు గుర్తించారు.