మావాళ్లు అడ్డంగా దొరికిపోయారు..
♦ ‘రాజధాని దురాక్రమణ’పై టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చ
♦ భూములు కొంటే తప్పేంటని సీఎం అనడంతోనే తప్పును ఒప్పుకున్నట్లయింది
♦ మావాళ్లు భూ లావాదేవీలు జరిపిన తీరే ప్రశ్నలకు తావిస్తోంది
♦ భూములిస్తే రైతుల్ని కోటీశ్వరుల్ని చేస్తామని సీఎం అన్నారు.. ఇప్పుడు మంత్రులే కోటీశ్వరులవుతున్నారు
సాక్షి, హైదరాబాద్: రాజధాని దురాక్రమణపై ‘సాక్షి’లో వరుసగా వచ్చిన కథనాల మీద మంగళవారం అసెంబ్లీ లాబీల్లో అధికార తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. రాజధాని భూముల్ని మంత్రులు, పార్టీలోని కొందరు నేతలు అక్రమంగా, అప్పనంగా కొట్టేసిన వైనంపై టీడీపీ శాసనసభ్యులు గుంపులుగా లాబీల్లో, సెంట్రల్‌హాల్‌లో చర్చించుకోవడం కనిపించింది. ఈ భూముల వ్యవహారంతో సంబంధం లేని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలైతే.. మీడియా ప్రతినిధులతోనూ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అక్రమాలపై ఆక్రోశం, ఆవేదన వ్యక్తంచేశారు.
‘రాజధానిలో ఏది ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని మా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు భూముల్ని తీసుకుని రైతుల్ని మోసగించారు. సాక్షి కథనాలతో ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. సీఎం చంద్రబాబు ఇటీవల మీడియా సమావేశంలో ఇచ్చిన వివరణే దీనికి తార్కాణం’ అని గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే అన్నారు. భూములు కొనుక్కొంటే తప్పేంటి? అని సీఎం అనడంలోనే తప్పును ఒప్పుకున్నట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు భూ లావాదేవీలు జరపడంలో తప్పులేదు కానీ అవి జరిగిన తీరే ఇప్పుడు ప్రశ్నలకు తావిస్తోందన్నారు.
ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలెక్కడ?
‘రాజధాని దురాక్రమణ’లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయని మరో టీడీపీ ఎమ్మెల్యే చెబుతూ.. వాటిపై పత్రికలు, ప్రతిపక్షాలు తమ నాయకుడ్ని ఇంకా ప్రశ్నించలేదని, వాటినే కనుక లేవనెత్తితే సమాధానాలు కూడా లేవని వివరించారు. ‘భూములు కొంటే తప్పేంటని సీఎం అంటున్నారు. నిజమే కానీ రాజధానికి భూములివ్వండి మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తానని ఆయన రైతులనుద్దేశించి ప్రకటించారు. అందుకు విరుద్ధంగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పేరిట, కుటుంబసభ్యులు, బినామీల పేరిట రైతులనుంచి వేలాది ఎకరాల్ని కొనేశారు. సీఎం చెప్పినదాని ప్రకారమే 9 వేల ఎకరాాలకుపైగా కొనుగోళ్లు జరిగాయి.
రాజధాని ప్రకటనకు అటుఇటుగా కొనుగోలు చేసిన ఈ భూములకు వారు చెల్లించిన మొత్తం అప్పటి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చూస్తే ఎకరాకు 6 లక్షలకు మించదు. మరి చంద్రబాబు చెబుతున్నట్లు రైతులు కోటీశ్వరులయ్యారా? మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతున్నారా? ఆయన ఎవరిని కోటీశ్వరుల్ని చేస్తున్నట్లు?’ అని ఆ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ‘ఒకవేళ ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు చెల్లించారని, రైతులను నష్టపర్చలేదని చెబితే రిజిస్ట్రేషన్ విలువ ఆరు లక్షలు దాటనప్పుడు ఆపై చెల్లించిన మొత్తం ఎక్కడిది? ఆ నల్లధనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పగలరా?’ అని ఆవేశంగా అన్నారు.
వీటికి సమాధానం చెప్పుకోలేనప్పుడు మావాళ్లు ప్రతిపక్షంపైన, మీడియాపైనా ఆరోపణలు చేయకుండా మౌనంగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ‘తమ విద్యాసంస్థల సిబ్బంది ఆస్తులు కొనుగోలు చేస్తే తప్పేంటి? మేము ఆస్తులు కూడబెట్టుకోరాదా? అని అడుగుతున్నారు. గుమాస్తా పనిచేసేవారికి ఆయనిస్తున్న జీతభత్యాలెంత? లక్షలు వెచ్చించి ఎకరాలకొద్దీ భూములు ఎలా కొనుగోలు చేయగలుగుతున్నారో ఆయన సమాధానం చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. బహిరంగంగా జరిగిన ఈ దోపిడీ వ్యవహారాలు ప్రజల్లోకి లోతుగా వెళ్లాయని, ప్రభుత్వం, పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నాయని ఆ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు.
మరికొందరు ఎమ్మెల్యేలపై వల వేశారు
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతనుంచి తాత్కాలికంగా గట్టెక ్కడానికే ప్రతిపక్షాన్ని బలహీనపర్చడానికి తమ నేత తెరవెనుక అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మరో టీడీపీ ఎమ్మెల్యే చెప్పారు. ఇందులో భాగంగానే అనేకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని టీడీపీలో చేర్చుకొంటున్నారన్నారు. ‘ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి తీసుకున్నారు. వీరికి ఇబ్బంది రాకుండా ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందుకే మరికొంత మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని కూడా బయటకు లాగాలని చూస్తున్నారు’’ అని ఆ ఎమ్మెల్యే పేర్కొన్నారు.