నరసాపురం అర్బన్ : జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు జూదాల కోసం పోరాటాలు చేస్తున్నారని, రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగుల కోసం వారు రోడ్డెక్కితే ప్రజలు హర్షిస్తారని వైఎస్సార్ సీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. శనివారం రాత్రి రుస్తుంబాదలో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ అమలు కాక రైతులు, డ్వాక్రా మహిళలు దిక్కుతోచని స్థితిలో ఉంటే టీడీపీ ప్రజా ప్రతినిధులకు చీమకుట్టినట్టయినా లేదన్నారు. నిట్ లాంటి సంస్థలు పక్క జిల్లాకు తరలిపోతుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు. అధికార టీడీపీ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు అందకుండా నీటిని పక్క జిల్లాలకు తరలించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ రూపంలో జిల్లా రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వరాన్ని ఇస్తే నేడు టీడీపీ పశ్చిమ రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుందన్నారు.
వైఎస్ జగన్ ఆందోళన చరిత్రలో నిలవాలి
ఈ నెల 20, 21 తేదీల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో రెండు రోజులపాటు చేపట్టిన రైతు సదస్సు, ధర్నాను చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు కొత్తపల్లి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగుల కోసం జగన్‌మోహన్‌రెడ్డి మన జిల్లాలో పోరాటం చేయడం మన అదృష్టమన్నారు. ఒకరోజు ముందుగానే తణుకు చేరుకుని జగన్‌తో పాటు రెండు రోజులు ఆందోళనలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమం విజయవంతానికి ఇప్పటి నుంచే ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. సమావేశానికి నల్లిమిల్లి జోసెఫ్ అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, పార్టీ జిల్లా క్రమశిక్షణా సంఘం కన్వీనర్ సాయినాథ్ ప్రసాద్, కొత్తపల్లి భుజంగరాయలు (నాని), పాలంకి ప్రసాద్, షేక్ బులిమస్తాన్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో నరసాపురం, మొగల్తూరు మండలాల పార్టీ నేతలు పప్పుల రామారావు, కావలి నాని, కర్రి ఏసు, పాలా రాంబాబు, పోలిశెట్టి సూరిబాబు, మైల వసంతరావు, లంకలపల్లి నాగేశ్వరరావు, దొంగ సత్యనారాయణ, కవురు రాంబాబు, కామన మహేష్, ఇంజేటి రవీంద్ర, వంగలపూడి యేషియా, వంగలపూడి జక్కరయ్య, దొండపాటి స్వాములు, చెన్నా రమేష్, కటికిరెడ్డి లక్ష్మీనారాయణ, పప్పుల తాతాజీ, కౌన్సిలర్లు వన్నెంరెడ్డి శ్రీనివాస్, గోరు సత్యనారాయణ, కత్తుల శ్యామ్, ముసూడి రత్నం, పట్టా రజనీకుమారి, ఈదా ఝాన్సీ, అయితం ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జూదాల కోసం పోరాటాలా?
Published Sun, Jan 4 2015 1:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement