High court judgement
-
డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పాత్రధారైన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను (పీఏవో) హైకోర్టు సమర్థించింది. అలాగే మనీలాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్కు అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని డిజైన్ టెక్కు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోస్యుల భాస్కరరావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కుంభకోణం తీవ్రత, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ ఉత్తర్వులు, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది ‘మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈడీ అధికారులు ఏ వ్యక్తి ఆస్తినైనా జప్తు చేయొచ్చు. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు తమ ముందున్న ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం అధికారులకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. నేరం ద్వారా సంపాదించిన డబ్బు లేదా ఆస్తి (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైం)కి విస్తృత నిర్వచనం ఉంది. సీఐడీ జప్తు చేసే నాటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను మాత్రమే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైంగా భావించవచ్చని, అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదన్న డిజైన్ టెక్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాస్తవానికి సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ చేపట్టిన చర్యలు, మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవి. సీఐడీ జప్తుపై కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సీఐడీ జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ‘రెండో జప్తు’ అనడానికి ఏమాత్రం వీల్లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు.. ‘అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను డిజైన్ టెక్ ఉపయోగించుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు డిజైన్ టెక్ చెబుతోంది. అందువల్ల ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కూడా ఆ అథారిటీ ముందే తేల్చుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే తమకు ఇబ్బంది కలుగుతుందన్న డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న కారణంతో ఆ వాదనను ఆమోదించలేకున్నాం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డిజైన్ టెక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం. ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రభావానికి లోనవకుండా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి’ అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడులతో పాటు పలువురు అధికారులను సీమెన్స్, డిజైన్ టెక్ తదితరులను నిందితులుగా చేర్చింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్లడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్కిల్ కుంభకోణానికి సంబంధించినవేనని తేల్చింది. ఈ మొత్తాన్ని జప్తు చేస్తూ గతేడాది ఏప్రిల్ 21న ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ.. డిజైన్ టెక్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 13లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిజైన్ టెక్‌ను ఆదేశించింది. ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ చైర్మన్ కమ్ ఎండీ వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీది రెండో జప్తు అవుతుంది.. డిజైన్ టెక్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు వాదనలు వినిపించారు. డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సీఐడీ జప్తు చేసిందని, దానిపై తాము కింది కోర్టును ఆశ్రయించామని ఆదినారాయణరావు చెప్పారు. బ్యాంకు ఖాతా నిర్వహణకు అనుమతినిచ్చిన కింది కోర్టు.. నగదును ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చాలని ఆదేశించిందన్నారు. తరువాత ఈడీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆ డబ్బును వినియోగించుకునేందుకు హైకోర్టు తమకు అనుమతినిచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ జప్తు చేసిన మొత్తాలను తిరిగి ఈడీ జప్తు చేయడం రెండో జప్తు కిందకు వస్తుందని, ఒకే ఆస్తికి రెండు జప్తు ఉత్తర్వులు చెల్లవన్నారు. అందువల్ల ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. బ్యాంకులో ఉన్న నగదు ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తమన్నారు. తాము అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే నిర్దిష్ట గడువు లోపు చేయాల్సిన చెల్లింపులు చేయలేమని, దీంతో ఖాతాదారుల నుంచి సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సీఐడీ, ఈడీ జప్తులు వేర్వేరు డిజైన్‌టెక్ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది భాస్కరరావు తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విచారణ పూర్తి కాకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని.. దీన్ని కొట్టేయాలని కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై డిజైన్ టెక్కు అభ్యంతరం ఉంటే అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలని, ఆ తరువాతే హైకోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈడీ జప్తు చేసిన మొత్తాలకు, నేరానికి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత డిజైన్ టెక్పైనే ఉందన్నారు. షోకాజ్ నోటీసుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సింది అడ్జ్యుడికేటింగ్ అథారిటీయేనన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులకు, మనీలాండరింగ్ కింద ఈడీ జారీ చేసిన ఉత్తర్వులకు ఏ మాత్రం సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని నివేదించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాల విషయంలో కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఐడీ జప్తునకు సంబంధించినవే తప్ప, ఈడీ జప్తుకు సంబంధించినవి కావన్నారు.అందులో ఈడీ పార్టీ కూడా కాదన్నారు. అందువల్ల తమ జప్తు ఉత్తర్వులు రెండో జప్తు కిందకు రావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విని గతేడాది అక్టోబర్ 10న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ రవి ఇటీవల తన తీర్పును వెలువరించారు. -
‘చాలాకాలం సహజీవనం చేసి, పెళ్లి చేసుకోకున్నా భరణం ఇవ్వాల్సిందే’
భోపాల్: వివాహం, భరణం అంశంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పురుషుడితో చాలాకాలంపాటు సహజీవనం చేసిన మహిళ.. విడిపోయిన సమయంలో భరణం పొందేందుకు అర్హురాలని తెలిపింది. చట్టబద్దంగా ఇరువురు వివాహం చేసుకోకపోయినా ఇది వర్తిస్తుందని పేర్కొంది. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. వివరాలు .. శైలేష్ బోప్చే(38), అనితా బోప్చే (48) అనే మహిళతో కొంతకాలం సహజీవనం చేశారు. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. బాలాఘాట్‌కి చెందిన శైలేష్ బోప్చే.. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని.. సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన బెంచ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు వెల్లడించింది. తనతో నివసించిన మహిళకు నెలవారీ భత్యం రూ.1,500 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఉతర్వులను శైలేష్ బాప్చే హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియాతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టి.. ఆమెకు నెలసరి భత్యం కింద రూ. 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్
మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న బుల్డోజర్ చర్యను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండించింది. బుల్డోజర్ చర్యలు ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్‌గా తయారైందని కోర్టు సీరియస్ అయింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇల్లును ప్రభుత్వ అధికారులు కూల్చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తప్పు పట్టింది. సరైన విధానాలు అమలు పర్చకుండా నిందితుడి ఇంటిని కూల్చివేయటం సరికాదని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితుడు రాహుల్ లాంగ్రీ.. ఓ వ్యక్తి వద్ద ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిపై బెదింపులకు పాల్పడగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ప్రస్తుతం రాహుల్ లాంగ్రీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో తాజాగా రాహుల్ లాంగ్రీ ఇంటిపై ప్రభుత్వ అధికారులు బుల్డోజర్ చర్య చేపట్టి.. అతని ఇంటిని కూల్చేశారు. దీంతో రాహుల్ లాంగ్రీ భార్య రాధా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారుల బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా రాధా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తమ ఇంటి పాత యజమాని అధికారులు నోటీసులు పంపారు. తమ వివరణ వినకుండా ఉజ్జయినిలోని తమ ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారని లాంగ్రీ భార్య పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇల్లు అక్రమంగా కట్టింది కాదని.. ఆ ఇంటికి బ్యాంక్‌లో లోన్ కూడా తీసుకున్నామని ఆమె పిటిషన్లో తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇండోర్ బెంచ్ ప్రభుత్వ అధికారుల చేపట్టిన బుల్డోజర్ చర్యలను తప్పుపడుతూ.. నష్టపరిహారంగా లాంగ్రీ భార్య, తల్లికి చెరో రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఇక..ఈ కేసులో మరింత నష్టం పరిహారం పొందేందుకు పిటిషన్‌దారులు సివిల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిహార్‌లో మోదీని ఎదుర్కొంటాం: తేజస్వీ యాదవ్ -
పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, అమరావతి: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానాన్ని హైకోర్టు సమర్థించింది. పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఈ మేరకు ఒక కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ప్రభుత్వం 2019 డిసెంబర్లో జీవో 174 జారీ చేసింది. కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో కొన్ని నిబంధనలు తెచి్చంది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈవో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బహుళ పెన్షన్ల విషయంలో నిబంధనలు రూపొందించిందని ప్రభుత్వ న్యాయవాది వడ్లమూడి కిరణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. తీర్పులో ముఖ్యాంశాలు ఇవీ.. ఈ గణాంకాలు చూశాక.. ‘కేంద్రం రూ.288 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.19,161 కోట్లు చెల్లిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆసక్తికరమైన గణాంకాలను మా ముందుంచాయి. వృద్ధాప్య పెన్షన్ల కోసం కేంద్రం తన వాటా కింద ఏటా రూ.188.74 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.10,164 కోట్లు చెల్లిస్తోంది. వితంతు పెన్షన్ల కోసం కేంద్రం రూ.91.07 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.4,129.44 కోట్లు ఇస్తోంది. దివ్యాంగులకు కేంద్రం రూ.9.05 కోట్లు ఇస్తుంటే రాష్ట్రం రూ.2,594.31 కోట్లు చెల్లిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెన్షన్ల కింద వివిధ వర్గాలకు మొత్తం రూ.19,161.66 కోట్లు చెల్లిస్తోంది. ఈ గణాంకాలను చూసిన తరువాత జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదన్న పిటిషనర్ వాదనను మేం ఏమాత్రం అంగీకరించడం లేదు. ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం అశ్వనీకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వృద్ధులకు ఆర్థిక సాయం, పెన్షన్లు, నివాసం, మెడికల్ ఖర్చుల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వృద్ధుల దయనీయ పరిస్థితిని సానుభూతి కోణంలో పరిశీలించి పెన్షన్ ఇవ్వటాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే పెన్షన్ మంజూరు పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న నిధులు, ఆరి్థక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. అందువల్ల పెన్షన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం. దివ్యాంగులకు పెన్షన్లు మంజూరులో కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక కోణంలో ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఇది. దీన్ని పునఃసమీక్షించేందుకు మేం అధికరణ 226 కింద మాకున్న అధికారాన్ని వినియోగించలేం. ఆ నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నాం.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
టెక్నాలజీ అత్యవసరం.. అందిపుచ్చుకోవాల్సిందే
న్యూఢిల్లీ: పలు హైకోర్టుల్లో వర్చువల్ విచారణల శాతం తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచి్చంది. అన్ని కోర్టులు, దేశంలో ప్రతి జడ్జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా అందిపుచ్చుకోవాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. పంజాబ్, హరియాణా హైకోర్టు విచారణల్లో వీడియో కాన్ఫరెన్స్ వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టిందంటూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. న్యాయమూర్తులు టెక్నాలజీ వాడకంలో నిష్ణాతులా కాదా అన్నది కాదు సమస్య. కానీ వారికి దాని వాడకం తెలిసి ఉండాలి. లేదంటే అది అలవాటయ్యేలా శిక్షణ తీసుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఇది వర్తిస్తుంది. టెక్నాలజీ వాడకం మీద అవగాహన కోసం వాళ్లు ప్రత్యేక కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకున్నారు‘ అని పేర్కొంది. నేటి పరిస్థితుల్లో టెక్నాలజీ వాడకం ఇంకెంతమాత్రమూ ఆప్షన్ కాదని, అత్యవసర పనిముట్టుగా మారిందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ మార్పు దిశగా లాయర్లను కూడా సిద్ధం చేయక తప్పదని అభిప్రాయపడ్డారు. బాంబే హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌లకు ఉద్దేశించిన స్క్రీన్స్‌ను తీసేయడం దారుణమన్నారు. ఇకపై మన దేశంలో జడ్జి కావాలంటే టెక్ ఫ్రెండ్లీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. -
స్టార్ హీరో ఉపేంద్రకు తాత్కాలిక ఊరట!
స్టార్ హీరో ఉపేంద్రపై పోలీసు కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉప్పీ.. ఈ మధ్య తన రాజకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా పలు విషయాలు మాట్లాడారు. అయితే దళితులని అవమానించేలా కామెంట్స్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు దీనిపై కర్ణాటక హైకోర్టు ఊరట ఇచ్చింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) అసలేం జరిగింది? స్వతహాగా నటుడు అయిన ఉపేంద్ర.. ప్రజాక్రియా పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. దీని వార్షికోత్సవం సందర్భంగా ఫేస్బుక్, ఇన్‌స్టాలో శనివారం లైవ్ సెషన్లో పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. విమర్శకులని ఓ వర్గంతో పోల్చుతూ సామెత చెప్పాడు. ఓ ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉంటారని, అలానే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు కచ్చితంగా ఉంటారని అన్నాడు. వాళ్లని పట్టించుకోవాల్సిన పనిలేదని, ప్రజలపై ప్రేమాభిమానాలే నిజమైన దేశభక్తి అన్నాడు. అయితే ఉపేంద్ర వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కామెంట్స్ తమని ఆవేదనకు గురిచేశాయని నిరసన తెలియజేశాయి. కొందరైతే బెంగళూరులోని చెన్నమున్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ క్రమంలోనే తన కామెంట్స్‌పై దుమారం రేగడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పాడు. లైవ్ వీడియోని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే ఉపేంద్రపై నమోదైన ఎఫ్ఐఆర్పై కర్ణాటక హైకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇది తాత్కాలిక ఊరటకాగా.. భవిష్యత్తులో మాత్రం ఉపేంద్రకి చిక్కులు తప్పవేమో అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Upendra (@nimmaupendra) (ఇదీ చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్) -
నితీష్ కుమార్‌కు ఊరట.. కుల గణనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిహార్ ప్రభుత్వం చేపడుతున్న కుల గణన కార్యక్రమాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో గతంలో పలు పిటీషన్లు నమోదయ్యాయి. వీటిని కొట్టివేస్తూ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. బిహార్‌లో కుల గణన మొదటి సర్వే జనవరి 7 నుంచి 21 వరకు జరిగింది. రెండో దఫాలో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు జరగాల్సి ఉంది. కాగా ఈ కార్యక్రమంపై మే 4నే హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చింది. కుల గణన చేపట్టాలని గత ఏడాది జూన్ 21నే రాష్ట్ర అసెంబ్లీలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. బిహార్ సీఎం నితీష్ కుమార్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని నిర్మించడానికి ఆయన ప్రధాన వ్యక్తిగా నిలిచారు. ఎన్డీయే కూటమికి దేశంలో ప్రతిపక్షాలన్నింటిని ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఇండియా అనే కూటమిని నిర్మించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు.. -
సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
అలహాబాద్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికెషన్‌ను తోసిపుచ్చింది అలహాబాద్ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను బుట్టదాఖలు చేస్తూ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండానే అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ సౌరవ్ లావానియాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్ 5న ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 200 మున్సిపల్ కౌన్సిల్లో 54 ఛైర్పర్సన్ సీట్లు ఓబీసీలకు కేటాయిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 18 మహిలకు కేటాయించింది. అలాగే 545 నగర పంచాయతీల్లో 147 సీట్లు ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించింది. అందులో 49 మహిళలకు కేటాయించారు. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ క్రమంలో సుప్రీం కోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్ ఫార్ములానూ అనుసరించకుండానే ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్లు. రిజర్వేషన్లు కల్పించే ముందు రాజకీయంలో ఓబీసీలు వెనకబడి ఉన్నారనే అంశంపై ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు సూచనలను ప్రభుత్వం అనుసరించలేదని కోరారు. అయితే, తాము రాపిడ్ సర్వే నిర్వహించామని, అది ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను అనుసరిస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ పిల్‌పై శనివారం విచారించిన డివిజన్ బెంచ్ ఇరువైపుల వాదనలు విని తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. తాజాగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఇదీ చదవండి: బూస్టర్ డోస్‌గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే? -
సీబీఐ విచారణతో వాస్తవాలు తెలుస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొ న్నారు. ఈ కేసులో వాస్తవాలు బయ టకు రావాలని బీజేపీ కోరుకుంటోందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలి పా రు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను దాచి పెట్టి, అసత్య ప్రచారంతో బీజేపీని బద్నామ్ చేసే కుట్రకు తెరతీసిందని మండిపడ్డారు. ‘ఫాంహౌస్ కేసులో కర్త, కర్మ, క్రియ.. ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆరే. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌కు ‘ప్రగతి భవన్’అడ్డాగా మారింది. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు కేసీఆర్ ప్రభు త్వం ఆడుతున్న డ్రామాపై ప్రజల్లో చర్చ జరుగు తోంది’అని అన్నారు. నేరస్తు లను కాపాడ టానికే ‘సిట్’ విచారణ సాగుతున్నట్లుగా కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసుల్లో ‘సిట్’ విచారణ జరిపినా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక పోవడమే ఇందుకు నిదర్శనమని ఎద్దేవాచేశారు. లిక్కర్, డ్రగ్స్, అవినీతి కేసుల్లో నిండా కూరు కుపోయిన తన కుటుంబాన్ని కాపా డుకు నేందుకు, ప్రజల దృష్టిని మ ళ్లించడానికి కేసీఆర్ అల్లిన కట్టుకథనే ఫాంహౌస్ కేసు అని వ్యాఖ్యానించారు. ఫాంహౌస్కేసులో దోషులెవరో గుర్తించడానికే సీబీఐ విచారణ అవసరమని ప్రజలు కోరుతున్నారన్నా రు. సీబీఐ విచారణతో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని బీజేపీ భావిస్తోందన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందని మొదటి నుంచీ తా ము చెబుతున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించామని మీడియా తో అన్నారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ దర్యాప్తులో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. -
ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?
సాక్షి, అమరావతి: ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) రద్దు తరువాత అక్కడి ఉద్యోగులు డిప్యుటేషన్‌పై హైకోర్టులో పనిచేస్తుండగా, తమను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రయత్నించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. హైకోర్టులో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీఏటీ ఉద్యోగులను ఇతర శాఖలకు పంపాలనుకోవడం సరైన చర్యకాదని అభిప్రాయపడింది. వారు గతంలో కొద్దికాలం తమ వద్ద పనిచేశారని, కాబట్టి వారు తమ వద్దే పనిచేయడం సబబని తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. హైకోర్టును సంప్రదించకుండా ఏపీఏటీ ఉద్యోగుల బదిలీ విషయంలో లేఖ రాయడం తప్పేనన్నారు. ఇందుకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. ఆ లేఖను ఇప్పటికే ఉపసంహరించుకున్నామని ఆయన కోర్టుకు నివేదించారు. అయితే, ఏపీఏటీ ఉద్యోగులు హైకోర్టులో పనిచేయడానికి నిబంధనలు అంగీకరించవని, ఈ విషయంలో హైకోర్టుతో ప్రభుత్వాధికారులు చర్చలు జరుపుతున్నారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. కోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సిబ్బంది లేఖ రాయడం క్రమశిక్షణారాహిత్యం హైకోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులను వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనివల్ల హైకోర్టు కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయంటూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. హైకోర్టులో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులు తమను ఇతర శాఖల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి నేరుగా లేఖ రాయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇది క్రమశిక్షణారాహిత్యమేనని తెలిపింది. మరోవైపు.. హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఓ ఉద్యోగి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, ఆమె అక్కడే కొనసాగించేందుకు దయతో అనుమతినివ్వాలన్న ఆ ఉద్యోగిని తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తాము దయతో కాకుండా కేసులో ఉన్న దమ్మును బట్టి ఉత్తర్వులిస్తామంది. హైకోర్టులో చాలామంది ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్ వెళ్తున్నారని, జడ్జీలు కూడా వెళ్తున్నారని, ఇలా అందరూ హైదరాబాద్‌కు వెళ్తే విజయవాడలో ఎవరుంటారని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం హైకోర్టుతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. (చదవండి: ‘ఆపద్బాంధవి’ మరింత బలోపేతం.. మరిన్ని 108 అంబులెన్స్‌లు) -
అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎంకు భారీ ఊరట
ఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన జార్ఖండ్ హైకోర్టు పిల్ ఆదేశాలను సోమవారం సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌ను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మైనింగ్ కుంభకోణం కేసులో సోరెన్‌పై విచారణ కోసం హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) సబబే అని సమర్థించింది జార్ఖండ్ హైకోర్టు. అయితే.. సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మాత్రం ఇవాళ.. ఆ ఆదేశం చెల్లదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. హేమంత్ సోరెన్ సత్యమేవ జయతే అంటూ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. सत्यमेव जयते! pic.twitter.com/38JLdRLmsq — Hemant Soren (@HemantSorenJMM) November 7, 2022 దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అంటూ తన అభ్యర్థనలో హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2021లో మైనింగ్ లీజుల వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్.. బీజేపీ ఫిర్యాదు ద్వారా అనర్హత వేటు అంచున ఉన్నారు కూడా. మరోవైపు ఎన్నికల సంఘం సైతం.. అనర్హత వేటు వ్యవహారంలో గవర్నర్ రమేష్ అభిప్రాయం కోరింది. ఇదీ చదవండి: తప్పు చేస్తే అరెస్ట్ చెయ్యండి అంతే! -
హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు
న్యూఢిల్లీ: ఆన్సర్ షీట్లను సమర్పించాల్సిందిగా, పునర్మూల్యాంకనం చేయాల్సిందిగా హైకోర్టులు జారీ చేసే ఆదేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. సంబంధిత చట్టాల్లో ఆ మేరకు నిబంధనలుంటే తప్ప అలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని పేర్కొంది. విచక్షణాధికారంతో నిర్దిష్ట ఆదేశాలిచ్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 హైకోర్టులకు కల్పించిన అధికారాలను ఈ విషయంలో ఉపయోగించరాదని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్‌షా, ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కొందరు పీజీ డిప్లొమా విద్యార్థుల ఆన్సర్ షీట్ల పునర్మూల్యాంకనానికి ఆదేశిస్తూ 2019లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గత తీర్పులను మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించింది. -
జనసేనకు హైకోర్టు షాక్.. ఎఫ్ఐఆర్ రద్దుకు నిరాకరణ
సాక్షి, అమరావతి: విశాఖ జనసేన కార్యకర్తలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. విశాఖ జనసేన కార్యకర్తలపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలైని పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్‌కు విచారణ అర్హత ఉందో లేదో తేలుస్తామని వెల్లడించింది. అసలు నిందితుడు కాని మూడో వ్యక్తి ఎఫ్ఐఆర్ను ఎలా సవాలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ప్యాకేజీల పవన్, బాబులతో ఒరిగేదేమీ లేదు: మంత్రి కాకాణి -
భార్యతో భర్త రిలేషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు
బనశంకరి: ఎలాంటి భావనాత్మక సంబంధం లేకుండా, భార్య అంటే డబ్బును అందించే ఏటీఎం యంత్రంలా వాడుకోవడం మానసిక వేధింపులతో సమానమని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను రద్దుచేసి మహిళ ఆకాంక్ష మేరకు విడాకులను మంజూరు చేసింది. వ్యాపారాలని డబ్బు కోసం ఒత్తిళ్లు వివరాలు... బెంగళూరులో 1991లో వివాహమైన దంపతులకు 2001లో ఆడపిల్ల పుట్టింది. వ్యాపారం నిర్వహిస్తున్న భర్త అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. ఈ సమయంలో భార్య ఉపాధి కోసం బ్యాంకు ఉద్యోగంలో చేరింది. 2008లో భర్త దుబాయిలో సెలూన్ తెరుస్తానంటే రూ.60 లక్షలు ఇచ్చింది. కానీ అక్కడ కూడా నష్టాలు రావడంతో భర్త మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. నిత్యం డబ్బు కావాలని పీడిస్తుండడంతో తట్టుకోలేక ఆమె విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. భర్త ధోరణిపై జడ్జిల ఆగ్రహం మంగళవారం ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ అలోక్ ఆరాదే, జేఎం.ఖాజీల ధర్మాసనం విచారించింది. భార్యతో ఆ భర్త ఎలాంటి అనుబంధం లేకుండా యాంత్రికంగా భర్త పాత్ర పోషిస్తున్నాడని, ఆమెను కేవలం డబ్బులు ఇచ్చే ఏటీఎంగా వాడుకుంటున్నాడని జడ్జిలు పేర్కొన్నారు. భర్త ప్రవర్తనతో భార్య మానసికంగా కుంగిపోయిందని ఇది మానసిక వేధింపులతో సమానమని స్పష్టం చేశారు. కానీ ఫ్యామిలీ కోర్టు ఈ అంశాలను పరిగణించడంలో విఫలమైందన్నారు. కేసును కూడా సక్రమంగా విచారించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. భార్య వాదనను పరిగణించిన హైకోర్టు ఆమెకు విడాకులు మంజూరుచేసింది. -
టీబీఎస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ, మరమ్మతులు, సర్వీస్ కాంట్రాక్ట్ ఒప్పందం విషయంలో టెలీమ్యాటిక్ అండ్ బయో మెడికల్ సర్వీసెస్ (టీబీఎస్) సంస్థకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ.100 కోట్లకు పైగా బకాయిల చెల్లింపు వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. బకాయిల చెల్లింపు, ఒప్పందం అమలు విషయంలో ప్రభుత్వంతో నెలకొన్న వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తిని నియమించాలని కోరుతూ టీబీఎస్ దాఖలు చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టేసింది. భవిష్యత్‌లో ఈ విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే దానిపై మధ్యవర్తిత్వానికి వెళ్లాలన్న నిబంధన ఏదీ ఇరుపక్షాలు మధ్య కుదిరిన ఒప్పందంలో లేదని తేల్చి చెప్పింది. బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) ఎంతమాత్రం ఒప్పందం కిందకు రాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా ఇటీవల తీర్పు వెలువరించారు. కేసు నేపథ్యమిదీ.. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ, సర్వీసు, మరమ్మతుల విషయంలో ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ, టీబీఎస్ మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. 2018 వరకు ఈ ఒప్పందం అమలైంది. పరికరాల నిర్వహణలో టీబీఎస్ రూ.కోట్లమేర అక్రమాలకు పాల్పడినట్టు నిరూపణ అయింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, కోర్టు ఏసీబీ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ బయో మెడికల్ పరకరాల నిర్వహణలో టీబీఎస్ అక్రమాలు నిజమేనంటూ హైకోర్టుకు నివేదించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టీబీఎస్‌కు చెల్లింపులను నిలిపేసింది. అనంతరం టీబీఎస్తో ఒప్పందాన్ని రద్దు చేసింది. ఒప్పందం అమలుకు సంబంధించి భవిష్యత్‌లో ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలన్న ఒప్పందం ఏమీ ఇరుపక్షాల మధ్య లేదు. అయినప్పటికీ టీబీఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన వస్తు సేకరణ మాన్యువల్‌లో మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని, అందువల్ల వివాదం పరిష్కారానికి మధ్యవర్తిని నియమించాలని కోరుతూ హైకోర్టులో మధ్యవర్తిత్వ దరఖాస్తు దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా విచారణ జరిపారు. అక్రమాలకు పాల్పడి మధ్యవర్తిత్వానికి పిలవడమేంటి! దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. బయో మెడికల్ పరికరాల నిర్వహణ విషయంలో టీబీఎస్ అక్రమాలను ఏసీబీ నిర్ధారించిందని, దీనిపై సీఐడీ కూడా కేసు నమోదు చేసిందని హైకోర్టుకు నివేదించారు. రూ.కోట్ల మేర అక్రమాలకు పాల్పడి మధ్యవర్తిత్వానికి పిలవడం దారుణమన్నారు. అక్రమాలు జరిగిన చోట మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేదన్నారు. అంతేకాక మధ్యవర్తిత్వానికి ఇరుపక్షాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని, అందువల్ల మధ్యవర్తి నియామకమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. సుధాకరరెడ్డి వాదనలతో ప్రధాన న్యాయమూర్తి ఏకీభవించారు. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వానికి ఒప్పందం లేనప్పుడు మధ్యవర్తి నియామకం సాధ్యం కాదంటూ టీబీఎస్ దరఖాస్తును కొట్టేశారు. కేంద్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన ‘వస్తు సేకరణ మాన్యువల్’లో పేర్కొన్న అంశాలు కేవలం సలహా పూర్వకమైనవేనని, అందులో మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించినంత మాత్రాన, అది మధ్యవర్తిత్వ నిబంధన కాజాలదని హైకోర్టు తెలిపింది. అందువల్ల టీబీఎస్ దాఖలు చేసిన దరఖాస్తును కొట్టేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. -
యువకుడి బైక్ రేసు.. వెరైటీ శిక్ష విధించిన హైకోర్టు
సాక్షి, చెన్నై: బైక్ రేసులో దూసుకెళ్లిన ఓ యువకుడికి హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నెల రోజులు స్టాన్లీ ఆసుపత్రి అత్యవసర చికిత్సా విభాగంలో వార్డుబాయ్‌గా పనిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. వివరాలు.. చెన్నై నగరంలో, శివారుల్లోని బైపాస్, ఎక్స్‌ప్రెస్ వే, ఈసీఆర్ మార్గాల్లో రాత్రుల్లో యువత బైక్ రేసు పేరిట దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. వీరిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న ఈ యువకులు మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్చి 21వ తేదీ బైక్ రేసులో దూసుకెళ్లిన కొరుక్కుపేటకు చెందిన ప్రవీణ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బెయిల్ పిటిషన్‌ను హైకోర్టులో ఆ యువకుడి తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. గురువారం పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, అతడికి వినూత్న శిక్షను విధించింది. మానసిక పరివర్తన కోసమే.. బైక్ రేసులో దూసుకెళ్లే యువకుల కారణంగా రోడ్డున వెళ్తున్న వారు ఎందరో ప్రమాదాల బారిన పడుతున్నారని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ఆస్పత్రుల్లోని అత్యవసర చికిత్సా విభాగాలకు తరలించడం జరుగుతోందని, అక్కడ వారు పడే వేదన వర్ణాణాతీతం అని పేర్కొన్నారు. అందుకే ప్రవీణ్ చెన్నై స్టాన్లీ ఆసుపత్రి అత్యవసర చికిత్స విభాగంలో నెల రోజులు వార్డు బాయ్‌గా పనిచేయాలని ఆదేశించారు. ప్రమాదాల బారిన పడే వారి బాధల్ని చూసైనా ఇతడిలో మార్పు వచ్చేనా అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఏపీ హైకోర్టు: ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష ఆపై..
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష విధించింది. వీరికి రెండు వారాల పాటు కోర్టు జైలు శిక్షను విధించింది. అయితే, జైలు శిక్ష విధించిన నేపథ్యంలో సదరు ఐఏఎస్‌లు ధర్మాసనాన్ని క్షమాపణలు కోరారు. దీంతో కోర్టు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని కోర్టు పేర్కొంది. అలాగే, ఒకరోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఎనిమిది మంది ఐఏఎస్‌లను హైకోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పై తీర్పును వెలువరించింది. -
బీర్భూమ్పై సీబీఐ విచారణ
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీర్భూమ్ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. 8 మంది మరణంపై పలు కేసులు నమోదు చేసింది. సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణుల బృందం సంఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించింది. అంతకుముందు కలకత్తా హైకోర్టు ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రగతి నివేదికను వచ్చేవారం సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్భమ్ జిల్లాలోని బోగ్తూయి గ్రామంలో 10 ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడంతో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. సజీవ దహనాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అనారుల్ హుస్సేన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ శుక్రవారం డిమాండ్ చేశారు. -
బోట్లకు నిప్పు అంటించిన ఘటనలో రోడ్డెక్కిన వివాదం
Fight Between Two Groups Of Fishermen In Jalaripeta ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): మత్స్యకారుల మధ్య రాజుకున్న వివాదం బుధవారం మరోసారి రొడ్కెక్కింది. రింగు వలలతో వేట నేపథ్యంలో తీరంలోని మత్స్యకార గ్రామాల మధ్య మంగళవారం చిచ్చురేగిన విషయం తెలిసిందే. వాసవానిపాలెం, జాలరి ఎండాడ, మంగమారిపేటకు చెందిన కొందరు జాలర్లు రింగు వలలతో మంగళవారం వేటకు వెళ్లగా పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు అడ్డుకోవడంతో ఈ వివాదం తలెత్తింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా పెదజాలరిపేటకు చెందిన 8 మందికి గాయాలుకాగా వాసవానిపాలెం, మంగమారిపేటకు చెందిన 6 బోట్లు దహనమయ్యాయి. అయితే బోట్లకు నిప్పు అంటించిన ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను మెరైన్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ జాలరిపేటలో వాతావరణం వేడెక్కింది. జాలరిపేటలోని మత్స్యకారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కారు. సాయంత్రం 4 గంటల సమయంలో జాలరిపేటను ఆనుకొని ఉన్న ఆర్టీసీ కూడలికి భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. మహిళలు, యువతతో సహా వేల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్టయిన మత్స్యకారులను విడుదల చేయాలంటూ వారంతా కొద్దిసేపు నిరసన గళం వినిపించారు. ఈ సందర్భంగా తెడ్డిరాజు, పరసన్న వంటి పలువురు మత్స్యకార సంఘ నాయకులు మాట్లాడుతూ పోలీసులు అరెస్ట్ చేసిన మత్స్యకారులను తక్షణమే విడుదల చేయాలని హెచ్చరించారు. గంటలో విడుదల చేయకుంటే బీభత్సం సృష్టిస్తామని తెడ్డి రాజు బహిరంగంగా హెచ్చరించడం, కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ తీసేందుకు కొందరు మత్స్యకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని నిలువరించారు. పెదవాల్తేర్ ఆర్టీసీ డిపో కూడలి వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు చదవండి: కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం మంత్రుల సదస్సుకు గైర్హాజరు రింగు వలల వివాదంపై ఇప్పటికే పలు అవగాహన సదస్సులు, సమావేశాలు మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే తాజా వివాదంతో బుధవారం మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు సమక్షంలో మరోసారి సమావేశం నిర్వహించేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో ఇరువర్గాల మత్స్యకార గ్రామాల పెద్దలు కలెక్టర్ ఆధ్వర్యంలో సర్క్యూట్ హౌస్‌లో నిర్వహించే సమావేశానికి హాజరు కావాల్సివుంది. అయితే ఇంతలో జాలరిపేట మత్స్యకారులు ఆందోళనకు దిగడంతో సమావేశం నిలిచిపోయింది. పూచీకత్తుతో నిందితుల విడుదల ఈ ఘర్షణల్లో భాగంగా మంగళవారం 6 బోట్లు దహనం చేసిన విషయం తెసిందే. ఈ ఘటనకు సంబంధించి మెరైన్ పోలీసులు పిల్లా నూకన్న, వాడమదుల సత్యారావును అరెస్ట్ చేశారు. అయితే జాలరిపేట మత్స్యకారుల ఆందోళన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని విడిచిపెడుతున్నట్లు ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. మెరైన్ పోలీసులు వారి వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు 41 నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతోపాటు పూచీకత్తులు రాయించుకొని విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. దీంతో రాత్రి 8గంటల సమయంలో నూకన్న, సత్యారావు విడుదలై నిరసన శిబిరానికి చేరుకోవడంతో ఆందోళన ముగిసింది. అయితే తీర ప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు అధికారులు వెల్లడించారు. హైకోర్టు ఉత్వర్వుల అమలుకు డిమాండ్ జిల్లాలో ఎంఎఫ్ఆర్ చట్టం – 1995 ప్రకారం రింగు వలలతో చేపల వేటపై వెంటనే నిషేధం అమలు చేయాలని పెదజాలారిపేట గ్రామ సేవా సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం పెదజాలరిపేట దరి కురుపాం సర్కిల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామ కుల పెద్ద తెడ్డు పరసన్న మాట్లాడుతూ కొత్తగా రింగు వలలకు అనుమతులు ఇవ్వరాదని కోరారు. తాము గతంలో హైకోర్టును ఆశ్రయిస్తే సముద్రంలో 8 కిలో మీటర్లలోపు రింగు వలలతో వేట నిషేధం అమలు చేయాలని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. కోర్టు ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని తాము ఇప్పటికే రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, ఆ శాఖ కమిషనర్‌ను కోరామని గుర్తు చేశారు. అయినప్పటికీ రింగువలలతో వేట చేయవద్దని చెప్పినందున తమ గ్రామ మత్స్యకారులపై మంగళవారం దాడి చేసి గాయపరచడం అన్యాయమన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేని మత్స్యశాఖ అధికారులు తమను గంగవరం నుంచి పెదనాగమయ్యపాలెం బీచ్ వరకు చేపలవేట చేయరాదని నిబంధనలు విధించడం విడ్డూరంగా వుందని విమర్శించారు. కార్యక్రమంలో తెడ్డు రాజు, తెడ్డు సత్తయ్య, ఒలిశెట్టి గురయ్య, తెడ్డు సతీష్ పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంవీపీ స్టేషన్ సీఐ రమణయ్య పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. చదవండి: దంత కళాశాలలో కీచక వైద్యుల లీలలు! -
భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు
Recording wife’s telephonic call without her consent is a blatant violation of her privacy చండీఘడ్: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్‌ను భర్త రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి 20, 2020 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లిసా గిల ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి భార్య వేదింపులకు గురిచేస్తోందని, విడాకులు ఇప్పించమని కోర్టును ఆశ్రయించాడు. అందుకు సాక్షంగా ఫోన్ సంభాషణలను సమర్పించాడు. దీంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఫిబ్రవరి 20, 2007లో సదరు భార్యభర్తలిరువురికీ వివాహం జరిగింది. 2011 మేలో వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఐతే మనస్పర్ధల కారణంగా 2017లో విడాకులు కోరుతూ భర్త పిటిషన్ దాఖలు చేశాడు. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో జూలై 9, 2019న భార్య భర్తలిరువురి ఫోన్ సంభాషణకు సంబంధించిన సీడీ, సిమ్ కార్డులను సాక్షాలుగా సమర్పించాడు. దీన్ని సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. తనకు తెలియకుండా తన సంభాషణలను రికార్డు చేయడం గోప్యతను ఉల్లంఘించడమేనని వాదించింది. ఐతే భార్య వేధింపులకు సాక్షాలుగా మాత్రమే వీటిని సమర్పించామని, ఆమె గోప్యతకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యంతోకాదని భర్త తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఫోన్ రికార్డులను సాక్షాలుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అంతేకాకుండా భార్య అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఫోన్ సంభాషణలు రికార్డు చేయడం నేరమని పంజాబ్- హర్యానా హైకోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించకుండా విడాకుల కేసుపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. చదవండి: అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది! -
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పుపై తాప్సీ అసహనం
Taapsee Pannu Strongly Reacts to Chhattisgarh HC Order: స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను షూటింగ్స్‌తో ఎంత బిజీ ఉన్న సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలపై జరిగే దాడులు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తారు. తాజాగా అలాంటి ఘటనపై తాప్సీ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్డు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా అయ్యింది. ‘అంతే.. ఇప్పుడు మనం వినాల్సిన వాటిలో ఇది మాత్రమే మిగిలింది’ అంటూ తాప్సీ అసహనం వ్యక్తం చేశారు. చదవండి: ఆ స్టార్ హీరో సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న రకుల్! కాగా భార్యపై భర్త అత్యాచారానికి పాల్పడిన కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నిన్న(గురువారం) సంచలన తీర్పు వెలువరించింది. వివాహం చేసుకున్న భార్య ఇష్టానికి విరుద్దంగా, బలవంతంగా శృంగారం చేస్తే చట్ట ప్రకారం నేరం కాదని, అది అత్యాచారం కిందికి రాదంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే భార్య వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అంతేగాక ఈ కేసులో భర్తను నిర్దోషిగా విడుదల చేస్తూ.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్కే చంద్రవంశీ తీర్పు వెలువరించారు. దీంతో ఛత్తీస్గడ్ ఇచ్చిన ఈ తీర్పుపై తాప్సీతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాయనీ సోనా మొహపాత్రా కూడా ట్వీట్ చేస్తూ హైకోర్టు తీర్పును వ్యతిరేకించారు. Bas ab yehi sunna baaki tha . https://t.co/K2ynAG5iP6 — taapsee pannu (@taapsee) August 26, 2021 -
ట్రంప్, అమితాబ్‌లకు లాక్డౌన్ పాసులు!!
సిమ్లా: లాక్డౌన్ టైంలో జనాల అత్యవసరాల సేవల కోసం పోలీసులు ఈ-పాస్‌లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హిమాచల్ ప్రదేశ్ పోలీసుల నిర్వాకంపై జనాలు నవ్వుకుంటున్నారు ఇప్పుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లకు లాక్డౌన్ ఈ-పాస్‌లు జారీ చేశారు అక్కడి పోలీసులు. ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ కాగా, ఈ వ్యవహారం వెనుక ఉన్న జర్నలిస్ట్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వ్యవహారం కోర్టుకి చేరింది. లాక్డౌన్ టైంలోనూ ప్రైవేట్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో యథేచ్చగా తిరుగుతుండడంతో అమన్ కుమార్ భరద్వాజ్ అనే జర్నలిస్ట్ ‘ఈ-పాస్ వ్యవహారం’పై అనుమానపడ్డాడు. తన ఆధార్ వివరాల్ని ఇచ్చి.. ట్రంప్, అమితాబ్ ఫొటోలతో పాస్‌ల కోసం పోలీస్ ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కనీసం ఆ ఫొటోల్ని కూడా పట్టించుకోకుండా, దరఖాస్తుల్ని కూడా వెరిఫై చేయకుండానే పాస్‌లు జారీ చేశారు పోలీసులు. ఈ వ్యహారంపై మే 5న అమన్ కుమార్ రిపోర్ట్ చేసిన స్టోరీ టీవీ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యింది. దీంతో పోలీసులు అదే రోజు సాయంత్రం ఆ జర్నలిస్ట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అరెస్ట్ కోసం ప్రయత్నించారు. ఈలోపే అమన్ అప్రమత్తమై హైకోర్టును ఆశ్రయించాడు. ఈ-పాస్‌ల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం బయటపడిందని, పత్రికా స్వేచ్ఛను పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే అతని విజ్ఞప్తిని మన్నించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు.. ఈ వ్యవహారంలో పోలీసులపై అక్షింతలు వేసింది. అంతేకాదు ఈ కేసు విచారణలో తదుపరి వాదనల వరకు అమన్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. చదవండి: సంసారానికి పనికి రాడనడం దాని కిందకే లెక్క! -
ఆనందయ్య ఐ డ్రాప్స్‌కు అనుమతినివ్వలేం
సాక్షి, అమరావతి: కరోనా చికిత్సకోసం ఆనందయ్య అందిస్తున్న మూలికా వైద్యంలోని నాలుగు రకాల మందుల పంపిణీకి అభ్యంతరం లేదని, అయితే కళ్లల్లో వేసే చుక్కల(ఐ డ్రాప్స్) పంపిణీకి మాత్రం ప్రస్తుతానికి అనుమతినివ్వలేమని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య ఐ డ్రాప్స్ పరిశుభ్ర వాతావరణంలో తయారు కావట్లేదని నిపుణుల కమిటీ తేల్చిందని వివరించింది. ఈ డ్రాప్స్‌ను వేసుకునేవారి కళ్లు దెబ్బతినే వీలుందని కూడా చెప్పిందని, అందువల్ల ప్రస్తుతానికి ఐ డ్రాప్స్ పంపిణీకి అనుమతినివ్వలేమంది. ఐ డ్రాప్స్‌పై తదుపరి పరీక్షలు అవసరమని, ఇందుకు నెలకుపైగా సమయం పట్టే వీలుందని తెలిపింది. మీరు అనుమతిని ఇవ్వొద్దని, అయితే తమకు అవసరముందంటూ తమంతట తాముగా వచ్చేవారికి ఐ డ్రాప్స్ ఇచ్చేందుకు అడ్డుచెప్పవద్దని హైకోర్టు సూచించగా, ఆ పని తాము చేయలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ దిశగా ఐ డ్రాప్స్ పంపిణీకి హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలివ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని తెలిపింది. దీంతో ఐ డ్రాప్స్ పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారుల్ని ఆదేశించాలని, అలాగే ఆనందయ్య మందు పంపిణీకి తక్షణమే అనుమతులిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వర నాయుడులు వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. అలాగే తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, తనకు తగిన భద్రత కల్పించేలా కూడా ఆదేశాలివ్వాలంటూ ఆనందయ్య పిటిషన్ వేశారు. వీటిపై జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఐ డ్రాప్స్‌పై పూర్తిస్థాయి పరీక్షలు అవసరం... ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. మందు తయారీకి ఐదు రోజుల సమయం పడుతుందని ఆనందయ్య చెప్పారని, వెబ్సైట్ ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మందు తయారీకి అవసరమైన మూలికలు అందించే విషయంలో ఆనందయ్యకు అటవీశాఖ సాయం చేస్తుందని, గిరిజన కార్పొరేషన్ ద్వారా తేనె అందిస్తామని వివరించారు. కృష్ణపట్నం పోర్టులో ఖాళీగా ఉన్న ఓ గోదాములో మందు తయారు చేసుకోవచ్చునన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఐ డ్రాప్స్ సంగతేంటని ప్రశ్నించింది. నిపుణుల కమిటీ ఆనందయ్య ఇచ్చిన కే రకం మందు శాంపిల్స్‌ను పరీక్షించిందని, దీన్ని ఇచ్చేందుకు అభ్యంతరం లేదని సుమన్ తెలిపారు. అయితే ఐ డ్రాప్స్‌పై కమిటీ అభ్యంతరాలు లేవనెత్తిందని, ప్రమాణాలకనుగుణంగా తయారీ లేదని తెలిపిందన్నారు. పూర్తిస్థాయి పరీక్షల నిమిత్తం 1–3 నెలల సమయం పట్టే వీలుందన్నారు. అందువల్ల ప్రస్తుతానికి ఐ డ్రాప్స్ పంపిణీకి అనుమతినివ్వలేమన్నారు. నెల రోజులంటే ఎక్కువ సమయమని, ఎలాంటి వాతావరణంలో చేయాలో చెబితే దానిప్రకారం ఆనందయ్య తయారు చేస్తారని ధర్మాసనం చెప్పగా.. అలా చేస్తున్నారో లేదో మళ్లీ నిపుణుల కమిటీ పరిశీలించాల్సి ఉంటుందని సుమన్ తెలిపారు. కోర్టును నిందించే పరిస్థితి రాకూడదు... ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ స్పందిస్తూ, ఐ డ్రాప్స్ అప్పటికప్పుడు తయారుచేసి వినియోగిస్తున్నారని, అందువల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) హరినాథ్ జోక్యం చేసుకుంటూ.. ఐ డ్రాప్స్ భద్రత, సమర్థత చాలా ముఖ్యమని, గుజరాత్లో ఇలాంటి మందే తయారు చేస్తే సమర్థత, భద్రత కారణాలతో హైకోర్టు దాని పంపిణీని ఆపేసిందన్నారు. రేపు జరగరానిది జరిగితే అందుకు కోర్టును నిందించే పరిస్థితి ఉండకూడదన్నారు. తుది పరీక్షలు వేగవంతం చేయలేరా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. పలు సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, ఒక్కో సంస్థ నుంచి అనుమతి వచ్చేందుకు వారంపైగా పడుతుందని ఎస్‌జీపీ సుమన్ తెలిపారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని అక్కడకొచ్చి వేసుకోనివ్వాలని, అలాంటి వారిని ఆపొద్దని ధర్మాసనం సూచించగా.. కరోనా తీవ్రంగా ఉన్నవారు అక్కడికి వస్తే కరోనా వ్యాప్తి ప్రమాదం ఉంటుందని సుమన్ తెలిపారు. తయారుచేసిన ఐ డ్రాప్స్‌ను ఎంతకాలం వరకు భద్రపరచవచ్చునని ధర్మాసనం అడుగగా.. కొద్ది నిమిషాల వరకేనని అశ్వనీకుమార్ చెప్పారు. కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఐ డ్రాప్స్కోసం 15–20 మంది వరకు వచ్చారని, ఇప్పుడు అంతకన్నా తక్కువమంది వచ్చే అవకాశముంటుందని ధర్మాసనం అడిగిన మరో ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. అలాగైతే ఐ డ్రాప్స్ పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. -
మూడు బెంచ్‌లు... మూడు తీర్పులు
కేవలం కొన్ని రోజుల వ్యవధి... మూడు కేసులు, మూడు బెంచ్‌లు–అదే హైకోర్టు. కానీ యువతీయువ కుల సహజీవన సంబంధాల విషయంలో వేర్వేరు తీర్పులు. సమాజంలో ఇలాంటి సంబంధాల విషయంలో ఎలాంటి వైఖరులు వ్యక్తమవుతున్నాయో, అవి ఎంత పరస్పర విరుద్ధంగా వుంటున్నాయో చెప్పడానికి ఈ మూడు తీర్పులూ ఉదాహరణ. న్యాయస్థానాలను సమాజానికి అతీతంగా లేదా వెలు పల వుంచి ఆలోచించటం సాధ్యం కాదు. న్యాయమూర్తులు చట్టాన్ని, న్యాయాన్ని అర్థం చేసుకున్న తీరునుబట్టి, వారి వారి సామాజిక అనుభవాలనుబట్టి తమ ముందుకొచ్చిన కేసుల్ని అన్వయించి తీర్పు చెబుతారు. అయితే ఆ తీర్పులు పురోగామి దృక్పథంతో వుంటే సమాజంలోవుండే దురభిప్రా యాలు సడలుతూ, అది క్రమేపీ మెరుగుపడే అవకాశం వుంటుంది. న్యాయమూర్తులు సైతం కులాధి క్యత, పురుషాధిక్యత, వివక్ష వంటి అంశాల చట్రాన్ని దాటకపోతే ఆ మేరకు సమాజం నష్టపోతుంది. మూడు కేసుల్లోని సారాంశమూ ఒకటే. పెళ్లీడు వచ్చిన ఆడ–మగ జంటలు తల్లిదండ్రుల అభీష్టానికి భిన్నంగా వెలుపలికొచ్చి సహజీవనం సాగిస్తున్నారు. పెద్దవాళ్లనుంచి ఆ జంటలకు ప్రమాదం ముంచు కొచ్చింది. ముందుగా పోలీసులను ఆశ్రయించి, అక్కడ సరైన స్పందన లేదన్న ఆందోళనతో పంజాబ్, హరియాణా కోర్టును ఆశ్రయించారు. మొదటి కేసులో ఈనెల 11న తీర్పు వెలువడింది. తమకు పెద్దవాళ్లనుంచి ప్రాణహాని వున్నదని, రక్షణ కల్పించాలని కోరిన పిటిషన్ జస్టిస్ హెచ్ఎస్ మదాన్ నేతృత్వంలోని ధర్మాసనంముందుకు రాగా, ‘ఇలాంటి సంబంధాలు సామాజికంగానూ, నైతికంగానూ అంగీకరించదగ్గవి కాదు. అందువల్ల పిటిషనర్లు కోరుతున్నట్టు రక్షణ కోసం ఆదేశాలివ్వలేం’ అంటూ తోసిపుచ్చింది. ఆ మర్నాడు ఈ మాదిరి కేసులోనే జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ నాయకత్వంలోని ధర్మాసనం ఇలాంటి కారణాన్నే చెప్పి భద్రత కల్పించాలన్న మరో జంట వినతిని తోసిపుచ్చింది. ‘ఇలాంటివారికి రక్షణ కల్పిస్తే మొత్తం సమాజ నిర్మాణమే చెదిరిపోతుంది’ అంటూ కొంత కటువుగానే న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కానీ మూడో కేసులో జస్టిస్ సుధీర్ మిత్తల్ నాయకత్వంలోని ధర్మాసనం గురువారం పూర్తి భిన్నమైన తీర్పునిచ్చింది. పెళ్లీడు వచ్చినవారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని పరస్పర అంగీకారంతో కలిసివుండొచ్చని...అది పెళ్లి ద్వారానా లేక మరోవిధంగానా అనేది పూర్తిగా వారి ఇష్ట మని, పౌరులుగా అది వారికుండే ప్రాథమిక హక్కని తేల్చిచెప్పింది. అంతేకాదు... వివాహంతో ప్రమేయం లేని సహజీవన సంబంధాలు వర్తమానకాలంలో నగరాల్లోనేకాక గ్రామాల్లో కూడా పెరుగు తున్నాయని న్యాయమూర్తి చెప్పారు. ఏ సంబంధాన్నీ చట్టం నిషేధించనప్పుడు అలాంటి సంబం ధాల్లో వుండేవారికి రక్షణ కల్పించాల్సిందేనని తేల్చిచెప్పారు. మన దేశంలో పెద్దలకు నచ్చని పెళ్లి చేసుకుని న్యాయస్థానాలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. వ్యక్తులుగా ఇలాంటి సంబంధాల విషయంలో న్యాయమూర్తులకు ఎలాంటి అభిప్రాయాలున్నా అవి తీర్పుల్లో ప్రతిబింబించకుండా వుండటమే మేలు. ఎందుకంటే మన రాజ్యాంగం చాలా అంశాల్లో సమాజం ఆచరించే విలువలకు భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంది. కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ వివక్ష లేని సమాజం ఏర్పడాలని రాజ్యాంగం ఆకాంక్షించింది. అందుకనుగుణమైన అధికర ణలు అందులో పొందుపరిచారు. పైగా మూడేళ్లక్రితం ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పును వెలువరించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఆ ధర్మాసనం వ్యక్తి స్వేచ్ఛ, ప్రతిష్టల్లో ఎంపిక చేసుకోవటమన్నది విడదీయలేని భాగమని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం అనుసరించిన ఆ వైఖరి దేశంలోని మారుమూలవుండే కిందిస్థాయి కోర్టు వరకూ... పోలీసులు, పాలనా యంత్రాంగం తోసహా అన్ని వ్యవస్థలకూ శిరోధార్యమైనది. హరియాణా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ప్రేమించుకోవడం, స్వతంత్రంగా పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడటం యువతీయువకుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నదని శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. అయినా పంజాబ్, హరియాణా హైకోర్టులో రెండు ధర్మాసనాలు అందుకు విరుద్ధమైన తీర్పులివ్వడం విచారించదగ్గ విషయం. ఈ మూడు జంటలూ తాము కలిసి బతకాలనుకుంటున్నామని, కానీ పెద్దవాళ్లు అందుకు నిరా కరించి ప్రాణహాని తలపెడతామని హెచ్చరిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించాయి. రక్షణ కల్పిం చాలని కోరాయి. న్యాయమూర్తులు ఆ పరిమిత అంశానికి లోబడి అలాంటి పౌరుల భద్రతకు అవసరమైన ఆదేశాలివ్వాలి. కానీ అందుకు భిన్నంగా నైతికత గురించి, తల్లిదండ్రుల అభీష్టానికి భిన్నంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వల్ల సమాజానికి ఏర్పడే ఉపద్రవం గురించి ఉపన్య సించి, రక్షణ కల్పించలేమని తిరస్కరించడం ప్రమాదకరమైన ధోరణి. వాస్తవానికి పంజాబ్, హరి యాణా, మరికొన్ని ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఉభయ తెలుగు రాష్ట్రాలతోసహా చాలాచోట్ల ఈమాదిరి జంటలు నిత్యం ప్రాణభయంతో బతుకుతున్నాయి. ఇలాంటి ఉదంతాల్లో తల్లిదండ్రుల వల్లమాలిన ప్రేమ, కుల మత వివక్ష, ఆర్థిక కారణాలు వగైరాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. అనేక ఉదంతాల్లో పోలీసులు సైతం ఈ ప్రభావాలకు లోనై ఆ జంటలకు రక్షణ కల్పించడానికి నిరాకరిస్తుంటారు. ఇక న్యాయస్థానాలు సైతం అదే దృక్పథాన్ని ప్రదర్శిస్తే సమాజం ఎప్పటికీ వెనకబాటుతనాన్నే ప్రదర్శిస్తుంది. అది అవాంఛనీయం. -
800 తాబేళ్ల మృతి.. కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు
భువనేశ్వర్: ఆలివ్ రిడ్లేల మృత్యువాతపై రాష్ట్ర హైకోర్టు చొరవ కల్పించుకోవడం విశేషం. గహీరమ తీరంలో లెక్కకు మించి ఆలివ్‌రిడ్లే రకం తాబేళ్లు మరణిస్తుండడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ కేంద్రాపడ జిల్లా కలెక్టర్, అటవీ-పర్యావరణ విభాగం కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే గహీరమర మెరైన్ సాంక్చువరిలో ఆలివ్ రిడ్లేల సంరక్షణ మార్గదర్శకాల కార్యాచరణ సమీక్షించేందుకు హైకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న డాక్టర్ కార్తీక్ శంకర్(బెంగళూరు), పర్యావరణ విభాగం డైరెక్టరు డాక్టర్ సుశాంత నొందొ, న్యాయవాది మోహిత్ అగర్వాల్ గహీరమ, రుసికుల్యా సాగర తీరాలను సందర్శిస్తారు. అనంతరం ఆలివ్ రిడ్లేల సంరక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మత్స్యకారులు, స్థానికులు ఇతర అనుబంధ వర్గాలతో కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా భేటీ అయి సంప్రదిస్తారు. మార్చి 10వ తేదీ నాటికి ఈ కమిటీ నివేదిక దాఖలు చేస్తుందని హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో ఆలివ్ రిడ్లేలు మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటుండగా, ఈ విషయంపై పలు వార్తా పత్రికల్లో వచ్చే కథనాల ఆధారంగా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం నమోదు కావడం విశేషం. ప్రస్తుతం ఈ కేసు విచారణ మార్చి 15వ తేదీ నాటికి వాయిదా పడగా, జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 800 తాబేళ్లు మృతి చెందినట్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనికి గహీరమ శాంక్చువరీ తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల పొడవునా నీటిపై తేలిన తాబేళ్ల కళేబరాలు నిలువెత్తు సాక్ష్యంగా వ్యాజ్యంలో తెలిపారు. సియాలి నుంచి నాసి వరకు పలు తీరాల్లో తాబేళ్ల కళేబరాలు తారసపడ్డాయి. 1997లో గహీరమ-రూర్కీ ప్రాంతాన్ని మెరైన్ సాంక్చువరీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆలివ్‌రిడ్లే సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంక్షలు కూడా జారీ చేసింది. గతేడాది నవంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది మే 31వ తేదీ వరకు గహీరమ తీరంలో 20 కిలో మీటర్ల పొడవునా చేపల వేట కూడా ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, గహీరమ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర తాబేళ్ల సంతతి ఉత్పత్తి తీరంగా వెలుగొందుతుండడం విశేషం. చదవండి: బాలాకోట్ ఆపరేషన్: లాంగ్ రేంజ్ స్టైక్