తీరంలోని ఆలివ్ రిడ్లే కళేబరంపై వాలిన కాకులు
భువనేశ్వర్: ఆలివ్ రిడ్లేల మృత్యువాతపై రాష్ట్ర హైకోర్టు చొరవ కల్పించుకోవడం విశేషం. గహీరమ తీరంలో లెక్కకు మించి ఆలివ్‌రిడ్లే రకం తాబేళ్లు మరణిస్తుండడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ కేంద్రాపడ జిల్లా కలెక్టర్, అటవీ-పర్యావరణ విభాగం కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే గహీరమర మెరైన్ సాంక్చువరిలో ఆలివ్ రిడ్లేల సంరక్షణ మార్గదర్శకాల కార్యాచరణ సమీక్షించేందుకు హైకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది.
ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న డాక్టర్ కార్తీక్ శంకర్(బెంగళూరు), పర్యావరణ విభాగం డైరెక్టరు డాక్టర్ సుశాంత నొందొ, న్యాయవాది మోహిత్ అగర్వాల్ గహీరమ, రుసికుల్యా సాగర తీరాలను సందర్శిస్తారు. అనంతరం ఆలివ్ రిడ్లేల సంరక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మత్స్యకారులు, స్థానికులు ఇతర అనుబంధ వర్గాలతో కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా భేటీ అయి సంప్రదిస్తారు. మార్చి 10వ తేదీ నాటికి ఈ కమిటీ నివేదిక దాఖలు చేస్తుందని హైకోర్టు తెలిపింది.
ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో ఆలివ్ రిడ్లేలు మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటుండగా, ఈ విషయంపై పలు వార్తా పత్రికల్లో వచ్చే కథనాల ఆధారంగా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం నమోదు కావడం విశేషం. ప్రస్తుతం ఈ కేసు విచారణ మార్చి 15వ తేదీ నాటికి వాయిదా పడగా, జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 800 తాబేళ్లు మృతి చెందినట్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనికి గహీరమ శాంక్చువరీ తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల పొడవునా నీటిపై తేలిన తాబేళ్ల కళేబరాలు నిలువెత్తు సాక్ష్యంగా వ్యాజ్యంలో తెలిపారు. సియాలి నుంచి నాసి వరకు పలు తీరాల్లో తాబేళ్ల కళేబరాలు తారసపడ్డాయి. 1997లో గహీరమ-రూర్కీ ప్రాంతాన్ని మెరైన్ సాంక్చువరీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆలివ్‌రిడ్లే సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంక్షలు కూడా జారీ చేసింది. గతేడాది నవంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది మే 31వ తేదీ వరకు గహీరమ తీరంలో 20 కిలో మీటర్ల పొడవునా చేపల వేట కూడా ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, గహీరమ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర తాబేళ్ల సంతతి ఉత్పత్తి తీరంగా వెలుగొందుతుండడం విశేషం.
చదవండి: బాలాకోట్ ఆపరేషన్: లాంగ్ రేంజ్ స్టైక్
Comments
Please login to add a commentAdd a comment