సాక్షి, తిరుమల: తిరుపతి తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వింత వ్యాఖ్యలు చేశారు. చింతించడం తప్ప చేసేదేమీ లేదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరూ ఏం చేయలేరు.. దైవ నిర్ణయం. పరిపాలనా లోపం వల్లే తొక్కిసలాట. గొడవలు జరుగుతాయని ముందే తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు. భక్తుల మరణాలపై టీటీడీ ఛైర్మన్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘‘క్యూలైన్లలో సౌకర్యాలు లేవు.మమ్మల్ని చావిడిలో గొడ్డుల్లా లోపల వేశారు. క్యూ లైన్లలో రద్దీని నియంత్రించకలేకపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు. టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట’’ జరిగిందని భక్తులు మండిపడుతున్నారు.
వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి..
ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారన్నారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను వాడుకున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇదీ చదవండి: ప్రాణాలతో చెలగాటం.. తిరుమల ఘటనపై భక్తుల రియాక్షన్
టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజని, చంద్రబాబు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవని, గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకమని చెప్పారు. హిందూ ధర్మంపై భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసని, తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని నిలదీశారు.
తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉందన్నారు. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదన్నారు. అధికారుల, పోలీసుల మధ్య సమన్వయం లేదని, శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ చైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. ఆయన పనంతా రాజకీయ దు్రష్పచారం చేయడమేనని, టీటీడీ చైర్మన్ తన టీవీ కార్యాలయాలను తిరుమల టికెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలని, టీటీడీ చైర్మన్ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment