ప్రాణాలతో చెలగాటం.. తిరుమల ఘటనపై భక్తుల రియాక్షన్‌ | Six Devotees Dead In Tirupati Stampede Happened At Vaikunta Dwara Darshanam Ticket Counters, More Details Inside | Sakshi
Sakshi News home page

Tirupati Stampede: ప్రాణాలతో చెలగాటం.. తిరుమల ఘటనపై భక్తుల రియాక్షన్‌

Published Thu, Jan 9 2025 7:53 AM | Last Updated on Thu, Jan 9 2025 10:50 AM

Six Devotees Dead In Tirupati

వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు పోటెత్తిన భక్తులు 

తూతూమంత్రంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు 

క్యూల నియంత్రణలో విఫలమైన పోలీసులు 

తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన పలువురు భక్తులు 

గాయపడిన వారితో నిండిపోయిన ఆస్పత్రులు

నిలబడలేం.. కూర్చోలేం.. ఒకే చోట పడిగాపులు.. కనీస వసతులు లేవు.. అన్నపానీయాలు అందలేదు.. పట్టించుకునేవారు లేరు.. వైకుంఠ ద్వార దర్శనార్థం వచ్చిన భక్తులతో టీటీడీ అధికారులు దారుణంగా వ్యవహరించారు. వీధులనే క్యూలుగా మార్చి అందులో తోసేశారు.. పిల్లలు.. పెద్దలు.. మహిళలనే జ్ఞానం లేకుండా ఇష్టారాజ్యంగా నెట్టేశారు. ఏమాత్రం నియంత్రణ పాటించకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కౌంటర్ల వద్ద తూతూమంత్రంగా భద్రత కల్పించారు. టోకెన్‌ తీసుకునేందుకు పోటీపడే దుస్థితిని తీసుకువచ్చారు. వారి నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.పెద్దసంఖ్యలో గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. చివరకు సహాయక చర్యల్లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించారు. సకాలంలో వైద్యసేవలందించడంలోనూవైఫల్యం చెందారు. 

టీటీడీదే బాధ్యత 


పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయని టీటీడీ అధికారులే ఈ ఘోరానికి బాధ్యత వహించాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఇంత మంది తీవ్రంగా గాయపడేందుకు కారణమయ్యారు. పోలీసులు సైతం అత్యంత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించారు. ఈక్రమంలో ప్రభుత్వం స్పందించాలి. బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి.  
– మురళి, జిల్లా కార్యదర్శి, సీపీఐ 

ప్రాణాలతో చెలగాటం 


టీటీడీ అధికారులు శ్రీవారి భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు పంపిణీ చేసేందుకు పది రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించారు. చివరకు చేసింది ఇదా. ఇంతమంది ప్రాణాలకు ఎసరు పెడతారా. ఈ ఘెరానికి కారకులను వదిలిపెట్టకూడదు. కఠినంగా శిక్షించాలి. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి.  
– వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శి, సీపీఎం 

పరిహారం చెల్లించాలి 


టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇన్ని ప్రాణాలు పోయాయి. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలి. ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు చేపట్టాలి. శ్రీవారి భక్తులను ఇంతగా ఇబ్బంది పెట్టినందుకు టీటీడీ బోర్డు వెంటనే దిగిపోవాలి. ఈఓ, అదనపు ఈఓ బాధ్యత తీసుకోవాలి. భక్తులకు సేవ చేయాల్సిన అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. 
– కందారపు మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ  

విచారకరం 


భక్తుల రద్దీకి తగ్గట్టు టీటీడీ అధికారులు ఏర్పాటు చేయలేదు. ఇంత పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తే కనీస వసతులు కూడా కల్పించలేదు. పైగా క్యూల నిర్వహణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భక్తులను క్యూలోకి వదిలేశారే కానీ,  అన్నప్రసాదాలు సైతం అందించలేదు. అసలు తొక్కిసలాటకు పోలీసుల వైఖరే కారణం. భక్తులను నిర్దాక్షిణ్యంగా ఒకరిపై ఒకరిని నెట్టేశారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన దుస్థితి దాపురించింది.  
– రాజగోపాల్‌ రెడ్డి, భక్తుడు, వేంపల్లె 

ప్రాణాల మీదకు తెచ్చారు 


వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకుందామని కుటుంబంతో కలిసి వస్తే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. టీటీడీ అధికారులు ఏమాత్రం ఏర్పాట్లు చేయలేదు. క్యూలోకి తోసేసి పట్టించుకోలేదు. ఇక పోలీసులైతే చాలా దురుసుగా ప్రవర్తించారు. వారి వ్యవహార శైలే ఇంతమంది ప్రాణాల మీదకు తెచ్చింది. మా కళ్ల ముందే చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడంలో కూడా ఆలస్యం చేశారు.  
కేశవన్, భక్తుడు, మధురై, తమిళనాడు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement